సైనికుల డ్రెస్సులో వచ్చి జైలుపై దాడి చేసిన మిలిటెంట్లు...ఆ తర్వాత ఏం జరిగింది?

అల్-షబాద్ ఉగ్రవాదుల దాడి

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, వెడేలీ చిబెలుషి, మొహముద్ అబ్దిసమద్

సోమాలియా రాజధానిలోని అత్యంత భద్రత కలిగిన ఓ కారాగారంపై దాడి సందర్భంగా ఏడుగురు అల్-షాబాద్ మిలిటెంట్లను చంపేసినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

శనివారం సాయంత్రం మొగదిషు ప్రాంతంలోని అల్-షాబాద్ మిలిటెంట్లు బందీలుగా ఉండే గోడ్కా జిలికోవ్ నిర్బంధ కేంద్రం నుంచి భారీ ఎత్తున పేలుడు, గన్ ఫైర్ శబ్దాలు వినిపించాయి.

ఈ కేంద్రం నుంచి "అందరు ముస్లిం ఖైదీలను" తాము విడుదల చేసినట్లు అల్- షాబాద్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నట్లు కూడా పేర్కొంది.

సైనికుల దుస్తులు ధరించిన మిలిటెంట్లు కారాగారంలోకి ప్రవేశించారని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ సోనా లైవ్ ఆదివారంనాడు తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే... ఈ ఘటనలో భద్రతా బలగాలకు చెందినవారు ఎంతమంది మరణించారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదుగానీ, "నేలకొరిగిన వీరుల" కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొంది.

అదే సమయంలో అల్-షాబాద్ సంస్థ కూడా ఎంతమంది తమ అనుచరులు మరణించారనే విషయాన్ని చెప్పలేదు.

ఈ దాడి స్థానిక కాలమానం ప్రకారం(13:40 జీఎంటీ) సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో మొదలైంది.

అధ్యక్ష భవనం సమీపంలో, అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో..

ఈ గోడ్కా జిలికోవ్ కేంద్రం మొగదిషు నగరం మధ్యలో సోమాలియా అధ్యక్ష భవనం ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. దీన్ని సోమాలియా నేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ(నిసా) పర్యవేక్షిస్తుంది.

ఇక్కడ అల్- షాబాద్ మిలిటెంట్లతో పాటు, హై-ప్రొఫైల్ ఖైదీలను నిర్బంధంలో ఉంచుతారు.

నిర్బంధ కేంద్రంపై మిలిటెంట్లు జరిపిన ఈ దాడి నిసాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

అలాగే... రాజధాని ప్రాంతంలోని అత్యంత భద్రత కలిగిన వాటిల్లో ఒకటైన ఈ కేంద్రంలో ఉగ్రవాదులు ఎలా ప్రవేశించగలిగారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అల్-ఖైదాకు అల్- షాబాద్ అనుబంధ సంస్థ. దాదాపు 20 ఏళ్లుగా ఈ సంస్థ సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కార్యకలాపాలకు పాల్పడుతోంది.

మొగదిషులో చాలా ఏళ్లుగా మూసి ఉన్నకీలకమైన రోడ్లను శనివారం ఈ దాడి జరగడానికి కొన్ని గంటలముందు ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.

నగరంలో ఇటీవల భద్రతాప్రమాణాలు పెరిగాయని చెబుతూ ప్రభుత్వం వీటిని తెరిచింది. అంతలోనే ఈ ఘటన జరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)