క్రికెట్‌: పురుషుల కంటే ముందే మహిళా క్రికెటర్లు నెలకొల్పిన 10 ప్రపంచ రికార్డులు..

భారత్, మహిళా క్రికెట్, విమెన్ వరల్డ్ కప్, క్రికెట్, రికార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షెఫాలీ వర్మ
    • రచయిత, జాన్వి మూలె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహిళల క్రికెట్... ఇప్పుడిప్పుడే మొదలైందనే అపోహ చాలా మందికి ఉంది. పురుషుల క్రికెట్ కన్నా చాలా వెనుకబడి ఉందని కూడా అనుకుంటారు.

కానీ, 18వ శతాబ్దంలోనే మహిళలు క్రికెట్ ఆడారు.

తొలి మహిళల క్రికెట్ మ్యాచ్ 1745 జులైలో ఇంగ్లండ్‌లో జరిగింది. అయితే, అధికారికంగా తొలి అంతర్జాతీయ మహిళల క్రికెట్ మ్యాచ్ మాత్రం 1934లో జరిగింది.

పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్ కాస్తా నెమ్మదిగా పుంజుకుంది. కానీ, క్రికెట్‌లో చాలా విషయాలు మహిళల క్రికెట్ నుంచే మొదలయ్యాయి.

ముఖ్యంగా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో, పురుషుల కంటే ముందే మహిళలు నెలకొల్పిన రికార్డులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని రికార్డులు భారత మహిళా క్రీడాకారిణుల పేరిట కూడా ఉన్నాయి.

ప్రధాన రికార్డులలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం...

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించింది ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించింది ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్

1.వన్డేలలో తొలి డబుల్ సెంచరీ

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీల ప్రస్తావన వస్తే, చాలామంది సచిన్ తెందూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ పేర్లు చెబుతారు.

కానీ, మొట్టమొదటి డబుల్ సెంచరీ రికార్డు మాత్రం ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ పేరిట ఉంది.

సచిన్ తెందూల్కర్ 2010లో గ్వాలియర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశారు. కానీ, దానికి 13 ఏళ్ల ముందే, 1997లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెలిండా క్లార్క్ డబుల్ సెంచరీ సాధించారు.

1997 మహిళల ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో భాగంగా, డిసెంబర్ 16వ తేదీన ముంబయిలోని ఎంఐజీ క్లబ్ గ్రౌండ్‌లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 బంతుల్లో 229 పరుగులు చేశారు. అందులో 22 ఫోర్లు.

ఆస్ట్రేలియా మహిళల టీమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా మహిళల టీమ్

2.వన్డేలలో 400 పరుగులు

1997 మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లో డెన్మార్క్‌పై బెలిండా క్లార్క్ సాధించిన డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా మహిళా జట్టు మరో రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 412 పరుగులు సాధించింది.

అంతర్జాతీయ స్థాయిలో పురుషుల క్రికెట్ జట్టు కానీ లేదా మహిళల క్రికెట్ జట్టు కానీ అప్పటివరకూ 400 రన్స్ దాటింది లేదు. తొలిసారిగా ఆస్ట్రేలియా మహిళల జట్టు 412 స్కోర్‌తో రికార్డు నెలకొల్పింది.

ఆ తర్వాత తొమ్మిదేళ్లకు కానీ పురుషుల జట్టు ఆ రికార్డును అందుకోలేకపోయింది. 2006లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు 400 పరుగుల మైలురాయిని దాటింది.

19వ శతాబ్దంలోనే ఇంగ్లండ్‌లో మహిళలు క్రికెట్ ఆడారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 19వ శతాబ్దంలోనే ఇంగ్లండ్‌లో మహిళలు క్రికెట్ ఆడారు

3.వన్డే మ్యాచ్‌లో 5 వికెట్లు

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌‌లో, ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా ఓ మహిళా క్రికెటర్ పేరుమీదే ఉంది.

1973 మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ టీనా మెక్‌ఫెర్సన్ ఈ రికార్డు సాధించారు. యంగ్ ఇంగ్లండ్ విమెన్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు.

టీనా రికార్డును నెలకొల్పిన రెండేళ్ల తర్వాత, పురుషుల క్రికెట్‌లో, 1975 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బౌలర్ డెన్నీస్ లిల్లీ ఈ ఫీట్ సాధించారు.

6.ఒకే మ్యాచ్‌లో 6 వికెట్‌కీపింగ్ డిస్మిసల్స్

పురుషుల క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్‌కీపింగ్ డిస్మిసల్స్ చేసిన రికార్డును 2000 సంవత్సరంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ నెలకొల్పారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లను క్యాచ్ లేదా స్టంపింగ్‌ల ద్వారా ఆయన ఔట్ చేశారు.

అంతకు 7 సంవత్సరాల ముందే ఇద్దరు మహిళా వికెట్‌కీపర్లు ఈ ఫీట్ సాధించారు. వారిలో ఒకరు భారత్‌కు చెందిన కల్పనా వెంకటాచార్ కాగా, మరొకరు న్యూజీలాండ్ క్రికెటర్ సారా ఇల్లింగ్‌వర్త్.

ఆరేసి డిస్మిసల్స్‌తో వారిద్దరూ రికార్డు నెలకొల్పారు.

డెన్మార్క్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో కల్పన 5 స్టంపింగ్స్, ఒక క్యాచ్‌తో ఈ ఫీట్ సాధించారు. ఆస్ట్రేలియాపై 4 క్యాచ్‌లు, 2 స్టంపింగ్స్‌తో సారా ఆ ఘనత పొందారు.

ఇంగ్లండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన బెట్టీ విల్సన్

ఫొటో సోర్స్, Cricket Australia/Twitter

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన బెట్టీ విల్సన్

5.ఒకే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, 10 వికెట్లు...

ఒకే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేయడమే కాకుండా 10 వికెట్లు తీసినవారు అంటే.. ఇయాన్ బోథమ్, అలాన్ డేవిడ్‌సన్ గుర్తుకొస్తారు. కానీ, ఆ రికార్డును 1958వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్ నెలకొల్పారు.

ఇంగ్లండ్‌తో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన బెట్టీ విల్సన్, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశారు. అంతేకాదు బ్యాటింగ్‌లో చెలరేగి సెంచరీ సాధించారు.

6.టైగా ముగిసిన తొలి వన్డే మ్యాచ్..

వన్డే క్రికెట్‌లో తొలిసారిగా టై అయిన మ్యాచ్ మహిళల క్రికెట్‌లోనే చోటుచేసుకుంది.

1982 సంవత్సరంలో ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో ఇరు జట్లూ 147 పరుగులే చేశాయి. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో టై అయిన తొలి మ్యాచ్ అదే.

సాజిదా షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాజిదా షా

7.పిన్న వయస్కులైన అంతర్జాతీయ క్రికెటర్

పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ప్లేయర్లు ఎవరంటే, సచిన్ తెందూల్కర్, హసన్ రజా పేర్లు చెబుతారు.

కానీ, ఆ రికార్డు పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సాజిదా షా పేరుతో నమోదైంది. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేసరికి ఆమె వయసు 13 సంవత్సరాలే.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన పిన్న వయస్కురాలైన క్రికెటర్‌గా షెఫాలీ వెర్మ రికార్డు నెలకొల్పారు.

మహిళల క్రికెట్ తొలి ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేస్తున్న ఓ మహిళా క్రికెటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళల క్రికెట్ తొలి ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీసు చేస్తున్న ఓ మహిళా క్రికెటర్

8.తొలి ప్రపంచ కప్, టీ20 మ్యాచ్

పురుషుల క్రికెట్‌లో తొలి వరల్డ్ కప్ 1975లో నిర్వహించారు. అంతకు రెండేళ్ల ముందే, అంటే 1973లోనే మహిళల క్రికెట్ తొలి ప్రపంచ కప్ పోటీలు జరిగాయి.

అంతేకాదు, తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడింది కూడా మహిళల క్రికెట్‌లోనే. 2004, ఆగస్టు 5వ తేదీన ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

పురుషుల క్రికెట్‌లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు 2005 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి.

ఇంగ్లండ్ క్రికెటర్ కేథరిన్ బ్రంట్

ఫొటో సోర్స్, Richard Heathcote/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ క్రికెటర్ కేథరిన్ బ్రంట్

9.పింక్ బాల్ క్రికెట్

టెస్ట్ క్రికెట్‌పై ప్రజల్లో ఆసక్తిని పెంచడానికి, డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లలో 'పింక్ బాల్' వాడకాన్ని ప్రారంభించారు.

అలా పింక్ బాల్‌తో ఆడిన తొలి మ్యాచ్ పురుషుల క్రికెట్‌లో కాదు, ఆ ప్రయోగం మొదలైంది మహిళల క్రికెట్‌లోనే.

2008 సంవత్సరంలో, క్వీన్స్‌లాండ్, వెస్టర్న్ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పింక్ బాల్ ఉపయోగించారు.

పింక్ బాల్‌ను అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లలో వాడడమైతే, 2009 సంవత్సరంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదలైంది.

పురుషుల క్రికెట్‌లో అయితే, 2015లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరిగిన అడిలైడ్ టెస్టులో పింక్ బాల్‌ వాడారు.

10.ఓవరార్మ్ బౌలింగ్...

ఓవరార్మ్ బౌలింగ్‌ను పరిచయం చేసిన ఘనత కూడా 19వ శతాబ్దపు మహిళా క్రికెటర్‌ క్రిస్టినా విల్స్‌కే దక్కుతుంది.

తన స్కర్ట్‌తో ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమె 1805 సంవత్సరంలో ఓవరార్మ్ బౌలింగ్ వేయడం మొదలుపెట్టారు. ఈ ఓవరార్మ్ బౌలింగే ఆధునిక బౌలింగ్ శైలి అభివృద్ధికి నాంది పలికింది.

ఓవర్‌ఆర్మ్ బౌలింగ్ శకాన్నే ఆధునిక క్రికెట్‌కు ప్రారంభంగానూ పరిగణిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)