ఆసియా కప్ ట్రోఫీ భారత్‌కు అప్పగించేందుకు మొహ్సిన్ నఖ్వీ షరతు, ఏమిటది?

భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహ్సిన్ నఖ్వీ

ఆసియా కప్ ముగిసింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ తొమ్మిదోసారి ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

మ్యాచ్ జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. ఈ టోర్నమెంట్ చుట్టూ నెలకొన్న వివాదం మాత్రం ఇంకా సద్దుమణగలేదు.

ఆదివారం రాత్రి జరిగిన ఆసియా కప్ 2025 ముగింపు వేడుకలోని సన్నివేశం, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది.

దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్‌లో.. గెలుపొందిన జట్టు ట్రోఫీని తీసుకోకుండా మైదానం నుంచి బయటికి వచ్చేయడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.

దీంతో, సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్‌ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి (బీసీసీఐకు) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ క్షమాపణ చెప్పినట్లు భారత మీడియాలో పలు కథనాలు వచ్చాయి.

అయితే, ఈ కథనాలను మొహ్సిన్ నఖ్వీ ఖండించారు.

ఆసియా కప్ ట్రోఫీని టీమిండియా తన నుంచి తీసుకోకపోతే, దాన్ని భారత్‌కు ఇచ్చేది లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ పునరుద్ఘాటించారు.

'' ఏసీసీ అధ్యక్షుడిగా ఆరోజు నేను ట్రోఫీని ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాను. ఇప్పటికీ నేను సిద్ధమే. వారికి నిజంగా కావాలనుకుంటే, వారు ఏసీసీ కార్యాలయానికి రావొచ్చు. నా దగ్గరి నుంచి తీసుకోవచ్చు'' అని నఖ్వీ ఎక్స్‌లో రాసినట్లు ఇస్లామాబాద్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి ఫర్హత్ జావెద్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'నేను క్షమాపణ చెప్పను'

తాజాగా జరిగిన ఏసీసీ సమావేశం తర్వాత నఖ్వీ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. నఖ్వీ నేతృత్వంలో మంగళవారం దుబాయ్‌లో ఈ సమావేశం జరిగింది.

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ ట్రెజరర్ ఆశిష్ షెలార్ వర్చ్యువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సూర్యకుమార్ యాదవ్ జట్టు ట్రోఫీని తీసుకుంటుందా? గెలుపొందిన జట్టు పతకాలను స్వీకరిస్తుందా? అనే దానిపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) చైర్మన్ అయిన నఖ్వీ, ఆ దేశ హోం మంత్రిగా కూడా ఉన్నారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

భారత మీడియాలో వస్తోన్న కథనాలను మొహ్సిన్ నఖ్వీ కొట్టిపారేశారు.

''భారత మీడియా నిజాలతో కాదు, అబద్ధాలతో నడుస్తోంది. నేను ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నా. నేనేమీ తప్పు చేయలేదు. బీసీసీఐకి నేను క్షమాపణ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పేది లేదు'' అని నఖ్వీ ఎక్స్‌లో రాశారు.

'' ఈ కట్టుకథలు కేవలం చౌకబారు ప్రచారం తప్ప మరోటి కాదు. వాటి ఏకైక ఉద్దేశం ప్రజలను తప్పుదారిపట్టించడమే. దురదృష్టవశాత్తూ, భారత్ తరచూ క్రికెట్‌‌లోకి రాజకీయాలను లాగుతోంది. క్రీడాస్ఫూర్తిని ఇది దెబ్బతీస్తోంది'' అని రాశారు.

మొహ్సిన్ నఖ్వీ, భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, screenshot

ఎవరీ మొహ్సిన్ నఖ్వీ?

నఖ్వీ ప్రస్తుతం మూడు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా, ఆ దేశ హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ 1978లో లాహోర్‌లో జన్మించారు. ఆయన కుటుంబానికి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఝాంగ్ నగరంతో అనుబంధం ఉంది.

క్రెసెంట్ మోడల్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తరువాత లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల (జీసీ)లో చదివారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, పైచదువుల కోసం అమెరికాలోని ఒహాయో యూనివర్సిటీకి వెళ్లారు.

అమెరికాలో జర్నలిజం చేసి, ఆ తర్వాత అమెరికన్ న్యూస్ చానల్ సీఎన్ఎన్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెక్ అందిస్తున్న మొహ్సిన్ నఖ్వీ.

జర్నలిజంలోకి ప్రవేశం

అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా చానల్ సీఎన్ఎన్‌ వార్తలు కవర్ చేయడానికి నఖ్వీని పాకిస్తాన్‌కు రిపోర్టర్‌గా పంపింది. చిన్న వయసులోనే ప్రమోషన్ సంపాదించి, ఆ చానల్ దక్షిణాసియా రీజియన్ హెడ్ అయ్యారు నఖ్వీ.

అది 9/11 దాడుల తర్వాత కాలం.. అమెరికా నేతృత్వంలోని విదేశీ దళాలు అఫ్గానిస్తాన్‌‌లోకి ప్రవేశించాయి. అప్పుడు మొహ్సిన్ నఖ్వీ సీఎన్ఎన్‌‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకున్నారు.

ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 2009 వరకు సీఎన్ఎన్‌తో పనిచేశారు.

ఆ తరువాత, సిటీ న్యూస్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. జర్నలిజంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటికి ఆయనకు కేవలం 31 ఏళ్లే.

సయ్యద్ మొహ్సిన్ నఖ్వీ కుటుంబానికి ఒక ప్రైవేట్ చానల్ ఉండటంతో పాటు, దేశ రాజకీయాల్లోని ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. పీపుల్స్ పార్టీ నాయకుడు, పాకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నఖ్వీ చాలా సన్నిహితుడిగా చెబుతారు.

భారత్, పాకిస్తాన్, క్రికెట్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్ తర్వాత ఏం జరిగింది?

విజయం తర్వాత వెంటనే జరగాల్సిన అవార్డు ప్రదాన కార్యక్రమం దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది. ప్రసార సమయంలో, న్యూజీలాండ్ మాజీ ఆల్‌రౌండర్ సైమన్ డౌల్ భారత జట్టు ఈ ట్రోఫీని తీసుకోబోదని ప్రకటించాడు.

తరువాత, భారత ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ధ్రువీకరించారు.

దీంతో గెలిచిన జట్టు వేదికపైకి రాలేదు. కెప్టెన్‌ ట్రోఫీని అందుకోలేదు.

తిలక్ వర్మ (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్), అభిషేక్ శర్మ (మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్), కుల్దీప్ యాదవ్ తమ వ్యక్తిగత అవార్డులను స్వీకరించేందుకు వేదికపైకి వచ్చారు. కానీ, వారు మొహ్సిన్ నఖ్వీని పట్టించుకోలేదు.

వేదికపై ఉన్న ఏకైక వ్యక్తి మొహ్సిన్ నఖ్వీ. ఆయన భారత ఆటగాళ్లు స్టేజ్ మీదకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

ఏసీసీ, స్టేడియం మేనేజ్‌మెంట్ గెలిచిన జట్టుకు ట్రోఫీని ఎవరు ప్రదానం చేయాలో నిర్ణయించడానికి ప్రయత్నిస్తుండగానే, ఈ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా నిలిపివేసిన నిర్వాహకులు, ట్రోఫీని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

భారత జట్టు ట్రోఫీని తీసుకోలేదు. కానీ, మైదానంలో ఉన్న ఆటగాళ్లు తమదైన శైలిలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

''ఒక గొప్ప ఫైనల్‌ను చూడటానికి ఉత్సుకతతో ఉన్నా, గెలిచిన జట్టుకు ట్రోఫీని అందజేయడానికి ఎదురుచూస్తున్నా'' అని ఫైనల్‌కు ఒక రోజు ముందు మొహ్సిన్ నఖ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఏడాది మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల తర్వాత.. రెండు దేశాల జట్లు తలపడింది ఆసియా కప్‌‌ టోర్నమెంట్‌లోనే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)