ఇరాక్‌కు వెళ్లే షిప్‌‌‌‌‌‌‌‌‌ నుంచి ‘అదృశ్యమైన’ భారతీయ నేవీ క్యాడెట్, ఏమిటీ మిస్సింగ్ మిస్టరీ

క్యాడెట్ మిస్సింగ్

ఫొటో సోర్స్, KARANDEEP'S FAMILY

    • రచయిత, ఆసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాడూన్‌లోని ఒక చిన్న వీధిలో నెలకొన్న నిశ్శబ్దం ఇప్పుడు ఒక కుటుంబం పడే వేదనకు అద్దం పడుతుంది.

ఇప్పటికే ఇరవై రోజులు గడిచిపోయాయి. నరేంద్ర సింగ్ రాణా కుటుంబం ఆందోళన, ఆశ, అనుమానాల మధ్య ఊగిసలాడుతోంది. తమ 22 ఏళ్ల కుమారుడు, మర్చంట్ నేవీ క్యాడెట్ కరణ్‌దీప్ సింగ్ రాణా, సముద్రంలో ఓ నౌక నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.

సెప్టెంబర్ 18న కరణ్‌దీప్ దెహ్రాడూన్‌ నుంచి బయలుదేరాడు. ఇరాక్‌ నుంచి చైనాకు ముడి చమురు తీసుకెళ్తున్న ‘ఎమ్‌టీ ఫ్రంట్ ప్రిన్సెస్’ అనే ఆయిల్ ట్యాంకర్‌లో ఆయన ప్రయాణం ప్రారంభమైంది.

ఈ నౌక మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తోంది. సింగపూర్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ షిప్ మేనేజ్‌మెంట్ (ఈఎస్ఎం) సంస్థ ఈ నౌకను మెయింటెయిన్ చేస్తోంది.

సిబ్బందిని నియమించే, పర్యవేక్షించే బాధ్యత కూడా ఆ సంస్థదే.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ కంపెనీ అందించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 20న శ్రీలంకకు ఆగ్నేయ దిశలో 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పటి నుంచి క్యాడెట్ కరణ్‌దీప్ రాణా అదృశ్యమయ్యారని సమాచారం అందింది.

"దీనిని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం" అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. "సంబంధిత మారీటైమ్ , చట్టపరమైన సంస్థల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నాం" అని కూడా తెలిపింది.

అయితే, రాణా కుటుంబం మాత్రం ఈ వివరణతో సంతృప్తిగా లేదు.

"ఘటనపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం మాకు ఇవ్వలేదు" అని కుటుంబ సభ్యులు అంటున్నారు

క్యాడెట్

కుటుంబ సభ్యుల ఆవేదన

‘‘నా కొడుకు కనిపించడంలేదని తెలిసినప్పుడు కాళ్ల కింద నేల కదిలిపోయినట్లయింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఫోటోలు తీయడానికి డెక్‌కి వెళ్లాడని చెప్పారు. కానీ, తిరిగి రాలేదనన్నారు"

‘‘ముంబయి నుంచి రిషికేశ్ అనే కెప్టెన్ ఈ సమాచారం ఇచ్చారు. కానీ ఆయన మాటల్లోనే విరుద్ధమైన సమాచారం ఉంది. ఒకసారి 'డెక్‌కి వెళ్లాడని', ఒకసారి 'చీఫ్ కుక్ చివరిసారిగా చూశాడని' అన్నారు. కానీ, అసలు ఓడ మీద నుంచి పడిపోవడం సాధ్యమేనా అన్నది నా అనుమానం" అని తండ్రి నరేంద్ర సింగ్ అన్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, ప్రధానమంత్రి కార్యాలయం, హోంశాఖ, విదేశాంగ శాఖలకు నరేంద్ర సింగ్ విజ్ఞప్తులు చేశారు.

"నేనే ముఖ్యమంత్రిని కలిసి వివరించాను. వారంతా హామీలు ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. కంపెనీ నుంచీ గానీ, ప్రభుత్వంనుంచీ గానీ మాకు సరైన సమాధానం రాలేదు," అని ఆయన చెబుతున్నారు.

గోడపై వేలాడుతున్న కుమారుని చిన్ననాటి ఫోటోను చూస్తూ తల్లి శశి రాణా కన్నీరుమున్నీరయ్యారు.

"ఇప్పుడు రాత్రీ పగలూ నాకు ఒకేలా ఉన్నాయి. నా కొడుకు తిరిగి రావాలని ఒక్కటే ప్రార్థన" అని ఆమె అన్నారు.

క్యాడెట్ మిస్సింగ్

ఫొటో సోర్స్, KARANDEEP'S FAMILY

సోదరి ప్రయత్నాలు

కరణ్‌దీప్ సోదరి సిమ్రన్, తన సోదరుడి కోసం అన్ని స్థాయిల అధికారులకు లేఖలు రాస్తున్నారు

‘‘నా తండ్రికి సాయంత్రం 5.45కి లైఫ్‌బోట్ దగ్గర చివరిసారిగా చూశామని కెప్టెన్ చెప్పారు. కానీ, 5 గంటల తర్వాత డెక్‌కి ఎవరినీ అనుమతించరట. మరి ఆయన అక్కడికి ఎలా వెళ్లారు? డెక్‌పై కెమెరా, షూ దొరికాయని చెప్పారు. అవి మాత్రమే దొరికాయనడం మాకు ఆందోళనకరంగా ఉంది. నా తమ్ముడి భద్రత కంపెనీ బాధ్యత. విధి నిర్వహణలో ఉన్న ఒక క్యాడెట్ ఎలా అదృశ్యమవుతాడు?" అని ఆమె ప్రశ్నించారు.

"సెప్టెంబర్ 17న నాకు వాయిస్ మెసేజ్ పంపాడు. చాలా పని ఉందని, కెప్టెన్ ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారని, కొందరు సిబ్బంది తనను ఇష్టపడట్లేదని చెప్పాడు. తాను ఒక్కడినే ముగ్గురు నలుగురు చేసే పనిని చేస్తున్నట్టు అనిపిస్తోందని అన్నాడు" అని సిమ్రన్ చెప్పారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ, డీజీ షిప్పింగ్, ఎమ్ఆర్‌సీసీ కొలంబో, చైనా, సింగపూర్, శ్రీలంక రాయబార కార్యాలయాలకు కూడా ఈమెయిళ్లు పంపారు సిమ్రన్.

"లండన్‌లోని ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్‌ (ఐటీఎఫ్)కి కూడా రాశాను. ఆ తర్వాత నుంచి కొంత స్పందన రావడం మొదలైంది" అని సిమ్రన్ అన్నారు.

కంపెనీ ఏం చెప్పింది?

ఎగ్జిక్యూటివ్ షిప్ మేనేజ్‌మెంట్ (ఈఎస్ఎం) అక్టోబర్ 10న ప్రకటన విడుదల చేసింది.

‘‘క్యాడెట్ ‌కరణ్‌దీప్ రాణా కనిపించకపోవడాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నాం. సమాచారం అందిన వెంటనే సముద్ర, వైమానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం" అని తెలిపింది.

కంపెనీ అందించిన వివరాల ప్రకారం, శ్రీలంక అధికారుల సహకారంతో రెండు వాణిజ్య నౌకలు, హెలికాప్టర్లు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కానీ 96 గంటల గాలింపు తర్వాత కూడా కరణ్‌దీప్ ఆచూకీ దొరకలేదు.

ఈఎస్ఎం ప్రతినిధులు సెప్టెంబర్ 24న దిల్లీలో కుటుంబాన్ని కలిసి మాట్లాడారని సంస్థ తెలిపింది.

విచారణ తర్వాత ఒక నివేదికను చేస్తున్నట్లు పేర్కొంది. ఆ నివేదికను ఫ్లాగ్ స్టేట్, డీజీ షిప్పింగ్ (ఇండియా), ఐటీఎఫ్, చైనాలో భారత రాయబారికి అందజేస్తామని, కుటుంబానికి కూడా ఒక కాపీని ఇస్తామని చెప్పింది.

"ఇలాంటి సమయాల్లో ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తాయి. కానీ నిజాలు అధికారిక మార్గాల ద్వారానే వెల్లడిస్తాం" అని సంస్థ తెలిపింది.

క్యాడెట్ రాణా

ఫొటో సోర్స్, KARANDEEP'S FAMILY

"నా కొడుకు ఎక్కడో జీవించే ఉంటాడని నమ్ముతున్నా. కానీ మాకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికీ అతని మాటలు మా చెవుల్లో వినిపిస్తున్నాయి’’ అని నరేంద్ర సింగ్ రాణా అన్నారు.

"నా కుమారుడు బతికే ఉంటే అతన్ని వెనక్కి తీసుకురండి. లేదంటే నిజం చెప్పండి. నా బిడ్డకి ఏం జరిగిందో తెలుసుకోవాలన్నదే నా కోరిక" అని శశి అన్నారు

ప్రతి ఉదయం సిమ్రన్ ఒక మెయిల్ రాసి దానికి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.

‘‘ఏదో ఒకరోజు శుభవార్త వస్తుందని నా ఆశ. నా తమ్ముడికి న్యాయం జరగాలి. అతనికేం జరిగిందో ప్రపంచానికి తెలియాలి" అని సిమ్రన్ అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)