తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకుండా, వారికి భారత్ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోంది...దీనివల్ల ప్రయోజనం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్షుల్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు 2021లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత చైనా తన సంబంధాలను పెంచుకోవడం ప్రారంభించింది, కానీ నాలుగేళ్ల తర్వాత.. భారత్ ఇప్పుడు అదే పనిచేస్తోంది.
గత రెండేళ్లలో తాలిబాన్లతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయి. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన టెర్రరిస్టుల జాబితాలో ముత్తాకీ కూడా ఉన్నారు.

శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముత్తాకీ పాల్గొన్నారు.
ఈ చర్చలను "ప్రాంతీయ స్థిరత్వం దిశగా ముందడుగు" అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభివర్ణించారు. అలాగే, ముత్తాకీ భారత్‌ను ‘‘సన్నిహిత మిత్రుడు’’అని సంబోధించారు, భారతీయ కంపెనీలను అఫ్గాన్‌కు ఆహ్వానించారు.
ఇదే సమావేశంలో, కాబూల్‌లోని భారత టెక్నికల్ మిషన్‌ను రాయబార కార్యాలయంగా మార్చనున్నట్లు జైశంకర్ ప్రకటించారు. 2021లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, కాబూల్‌లోని తన రాయబార కార్యాలయాన్ని భారత్ మూసివేసింది.
ప్రపంచంలోని చాలా ఇతర దేశాల మాదిరిగానే, భారత్ కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన ఏకైక దేశం రష్యా.

భారత్ - అఫ్గానిస్తాన్ ఉమ్మడి ప్రయోజనాలు
తాలిబాన్లు తొలిసారి అఫ్గానిస్తాన్‌లో 1990లలో అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ అక్కడి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు.
కానీ, 2021లో తాలిబాన్లు తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, అఫ్గాన్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయిన తర్వాత, ఆ దేశంతో భారత్ ఒక ఆచరణాత్మక విధానాన్ని అవలంబించింది. పరిమిత సంబంధాలను పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, అఫ్గానిస్తాన్‌కు ఉమ్మడి ప్రయోజనాలు చేకూర్చే అంశాలు చాలానే ఉన్నాయి.
ప్రధానంగా టెర్రరిజంపై పోరుపై దృష్టి పెట్టినట్లు తమ ఉమ్మడి ప్రకటనలో భారత్, అఫ్గానిస్తాన్ స్పష్టం చేశాయి.
ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్(ఐసిస్ -కే)ను కేవలం అఫ్గానిస్తాన్‌కు మాత్రమే కాకుండా ప్రాంతీ శాంతికి ముప్పుగా తాలిబాన్లు పరిగణిస్తున్నారు. భారత్ కూడా అనేక అంతర్జాతీయ వేదికలపై టెర్రరిజానికి వ్యతిరేకంగా గళమెత్తుతోంది.
అఫ్గాన్ భూభాగం ఎలాంటి భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడకూడదని భారత్ కోరుకుంటుంటే.. ఐసిస్ -కే వంటి సంస్థలను బలహీనపరచాలని తాలిబాన్ ఆశిస్తోంది.
ముత్తాకీ పర్యటనను భారత్, అఫ్గాన్ భవిష్యత్ సంబంధాలకు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రిటైర్డ్ ప్రొఫెసర్, మాజీ డీన్ అనురాధ చినోయ్.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ముత్తాకీని ఆహ్వానించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా. తాలిబాన్లతో చర్చలు జరగకపోతే, ఈ ప్రాంతంలో (దక్షిణాసియా) అస్థిరత పెరగొచ్చు. ఎందుకంటే, ట్రంప్ పదేపదే బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అఫ్గాన్ కూడా భారత్‌కు మద్దతునిచ్చింది. అందువల్ల, చర్చల వల్ల ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి" అన్నారు.
అయితే, భారత్ - అఫ్గాన్ దగ్గరవుతుండడంపై అఫ్గాన్‌లోని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్ జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ ఎక్స్‌లో ఇలా రాశారు.
"ఒక అఫ్గానీగా.. ఇక్కడ చేసిన ఎన్నో పనుల విషయంలో భారత్‌ను అభిమానిస్తా. అఫ్గానిస్తాన్‌లో సల్మా డ్యాం, పార్లమెంట్, రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టింది. కానీ, తాలిబాన్లతో సాధారణ సంబంధాలు ఏర్పరుచుకునే విషయంలో మాత్రం నేను మోసపోయినట్లు భావిస్తున్నా. తాలిబాన్లది చట్టవిరుద్ధమైన ప్రభుత్వం. మా దేశాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిని అడ్డుకోవాలి" అని ఆయన రాశారు.
మరో పోస్టులో హబీబ్ ఖాన్ ఇలా రాశారు, "భారతీయులు పాకిస్తాన్‌ను ద్వేషిస్తారు, అఫ్గాన్లు మరింత ద్వేషిస్తారు. కానీ, ఆత్మాహుతి దాడుల ద్వారా అధికారం చేజిక్కించుకుని, మహిళల విద్యను నిషేధించిన పాకిస్తాన్ అనుకూల తాలిబాన్లను భారత్ స్నేహితుడిగా భావించి ఆహ్వానించడం తప్పుగా సూచిస్తోంది. ఇది భారతదేశాన్ని చరిత్రలో చెడువైపు నిలబెడుతుంది."

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్లు అఫ్గాన్ పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు దాటింది. కానీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా ఇంకా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది.
2021కి ముందు భారత్ దాదాపు 3 బిలియన్ డాలర్ల సాయంతో అఫ్గానిస్తాన్‌లో ఆనకట్టలు, రోడ్లు, ఆస్పత్రులు, పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులను చేపట్టింది. ఈ ప్రాజెక్టులను కొనసాగించడానికి తాలిబాన్లకు మరింత ఆర్థిక సాయం అవసరం.
భారత్, అఫ్గాన్ మధ్యనున్న 'బలమైన సాంస్కృతిక సంబంధాలు' కేవలం అధికార మార్పిడి వల్ల పెద్దగా ప్రభావితమయ్యే అవకాశం లేదని భారత మాజీ రాయబారి అనిల్ త్రిగుణాయత్ అభిప్రాయపడ్డారు.
అనిల్ త్రిగుణాయత్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ, "భారత్ దృష్టిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. చారిత్రకపరంగా, సాంస్కృతికపరంగా అఫ్గానిస్తాన్ భారత్‌కు సన్నిహిత భాగస్వామిగా ఉంది. తాలిబాన్లకు కూడా భారత్ అంటే గౌరవముంది. ప్రభుత్వాలు మారి ఉండొచ్చు, కానీ సామాన్య పౌరుల్లో భారత్ - అఫ్గానిస్తాన్ బంధం ఎప్పుడూ బలంగానే ఉంది. ఇది భారత్ నిజమైన బలం" అన్నారు.
భారత్ ప్రధానంగా ఆందోళన చెందేది తాలిబాన్ల గురించి కాదు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న, పాకిస్తాన్ మద్దతు కలిగిన టెర్రరిస్ట్ గ్రూపుల గురించి అని త్రిగుణాయత్ అన్నారు.
"తమ భూభాగం నుంచి ఎలాంటి భారత వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని తాలిబాన్ ప్రభుత్వం ఇప్పటికే భారత్‌కు స్పష్టమైన హామీ ఇచ్చింది. గతంలో ఇలా జరగలేదు, కానీ ఇప్పుడు వారి వైఖరి చాలా స్పష్టంగా ఉంది. తాలిబాన్లు పుల్వామా దాడిని కూడా ఖండించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు."
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) అఫ్గానిస్తాన్‌లో తన పరిధిని విస్తరిస్తోంది. అయితే, అఫ్గానిస్తాన్‌పై చైనా, లేదా పాకిస్తాన్ అధిపత్యం పెరగడాన్ని భారత్ కోరుకోదు.
తాలిబాన్లు కూడా ఒకే దేశంపై ఆధారపడకూడదని భావిస్తున్నారు, కాబట్టి వారు భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశం కోసం చూస్తున్నారు.

'పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ'
ముత్తాకీ పర్యటన "పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ" అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని పరోక్షంగా గుర్తించడంలో కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
"ఇది భారత్ - తాలిబాన్ సంబంధాల్లో కొత్తదశకు నాంది పలుకుతోంది, రెండుదేశాల వ్యూహాత్మక ప్రయోజనాలకు సంబంధించి ఆచరణాత్మక సహకారాన్ని నొక్కిచెబుతోంది" అని ఆయన రాశారు.
భారత్ - పాకిస్తాన్, పాకిస్తాన్ - తాలిబాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్న సందర్భంలో ఈ పర్యటన జరుగుతోంది.
బీబీసీ న్యూస్ హిందీ ప్రోగ్రామ్ 'దిన్ భర్ - పూరా దిన్ పూరీ ఖబర్'లో.. అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్‌కు చెందిన హర్ష్ వి.పంత్ మాట్లాడుతూ, "పాకిస్తాన్‌తో సంబంధాలు దిగజారడం.. తాలిబాన్లు ఇతర అవకాశాల వైపు చూసేందుకు, తమ మనుగడ ఇకపై పాకిస్తాన్‌పై ఆధారపడి లేదని నిరూపించుకునేందుకు అవకాశాన్నిస్తుంది. పాకిస్తాన్‌పై ఆధారపడడం నుంచి బయటపడి, అఫ్గానిస్తాన్ తనకు తాను స్వతంత్ర దేశంగా నిలదొక్కుకుంటోంది" అన్నారు.
తాలిబాన్లను ఒకప్పుడు పాకిస్తాన్‌కు "వ్యూహాత్మక మిత్రుడి"గా భావించేవారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఆ రెండింటి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్‌లో వైమానిక దాడులు కూడా చేసింది, ఈ దాడులను తాలిబాన్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ముత్తాకీ పర్యటనను భారత్‌కు లభించిన ఒక అవకాశంగా చూస్తున్నారు దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు మైకేల్ కుగెల్‌మన్.
మైఖేల్ కుగెల్‌మాన్ ఎక్స్‌లో ఇలా రాశారు, "భారత్, తాలిబాన్ సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన క్రమంగా సాధారణ స్థితికి వస్తుండడం ఆచరణాత్మకమైన, సరళతర భారత విదేశాంగ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా, పాకిస్తాన్-తాలిబాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దౌత్యపరంగా వినియోగించుకునేందుకు కూడా భారత్‌కు వీలుచిక్కుతుంది"

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ముందున్న సవాళ్లేంటి?
ఇటీవలి కాలంలో భారత్ ఆచరణాత్మక విధానాన్ని అవలంబిస్తూ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది, అయితే ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం అంత సులువు కాదు.
దీనివల్ల.. భారత్‌కు రాజకీయంగా, భద్రత, ఆర్థికపరంగా అంతర్జాతీయ స్థాయిలో సమస్యలను సృష్టించే ఎన్నో సవాళ్లున్నాయి.
భారత్ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఈ పరిస్థితిలో దౌత్యపరమైన సమతుల్యత అవసరం. భారత్ చర్చలను కొనసాగించాలని కోరుకుంటోంది, కానీ అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు గుర్తింపు ఇవ్వదు.
తాలిబాన్ల పాలనలో మానవ హక్కులు, మహిళల విద్య వంటి విషయాలు ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి. తాలిబాన్ ప్రభుత్వం మహిళల హక్కులను గౌరవిస్తుందని, కానీ అది అఫ్గాన్ సంస్కృతి, ఇస్లామిక్ చట్టాలకు లోబడి ఉంటుందని తాలిబాన్ అంటోంది.
పశ్చిమ దేశాలు కూడా తాలిబాన్ పాలనను నిశితంగా గమనిస్తున్నాయి. భారత్ తాలిబాన్లకు సన్నిహితంగా ఉంటే అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
"భారత్ ఉన్నపళంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించదు, కానీ చర్చలు ఆగకూడదు. తాలిబాన్ ప్రభుత్వం మహిళల హక్కులను పూర్తిగా హరించిందన్నది నిజం. పశ్చిమ దేశాలు తాలిబాన్లపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయి, కానీ ఒత్తిడి చేయడం ద్వారా ఏమీ సాధించలేమని భారత్‌కు తెలుసు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఏళ్ల తరబడి ఉంది, కానీ మహిళా స్వేచ్ఛ ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని స్పష్టంగా కనపడుతోంది" అని అనురాధ చినోయ్ అన్నారు.
ది హిందూ న్యూస్ పేపర్ డిప్లొమాటిక్ ఎఫైర్స్ ఎడిటర్ సుహాసిని హైదర్ "ఇక్కడ అన్నింటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే.. కాబూల్‌లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిస్తే, మరి తాలిబాన్ రాయబారిని కూడా భారత్ దిల్లీకి ఆహ్వానిస్తుందా? అఫ్గాన్ రిపబ్లిక్ జెండా స్థానంలో నలుపు, తెలుపు రంగు తాలిబాన్ జెండా ఎగురుతుందా? తాలిబాన్ అధికారులు రాయబార కార్యాలయంలో పనిచేస్తారా? రష్యా మాదిరిగానే భారత్ కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తుందా?" అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














