అఫ్గానిస్తాన్: ప్రపంచం చీకటిమయమైందంటున్న ప్రజలు.. అక్కడ ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్ సుప్రీం లీడర్ ఆదేశంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, ల్యాండ్‌లైన్లు సహా అన్ని డిజిటల్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి.
సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం నుంచి అఫ్గానిస్తాన్‌లో దేశీయ, అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు.
ఈ ఆదేశం వల్ల ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకులు, విమానాలు, రోడ్డు రవాణా అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. వైద్య సహాయం, నగదు లావాదేవీలు, ప్రయాణం వంటి సాధారణ అవసరాలకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీబీసీ అఫ్గాన్ తెలిపింది.
ఈ నిర్ణయానికి కారణమేంటో తాలిబాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ షట్‌డౌన్ మరింతకాలం కొనసాగుతుందేమోననే భయాలు ఉన్నాయి.
శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలకు కూడా అంతరాయం ఏర్పడటంతో కాబుల్‌లోని తమ కార్యాలయాలతో సంబంధం కోల్పోయామని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
రేడియో, కొన్ని పరిమిత శాటిలైట్ లింక్‌లపై మాత్రమే ఆధారపడి కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితులు తలెత్తాయని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి.


ఫొటో సోర్స్, Wakil Kohsar/AFP via Getty Images
ఏవి పనిచేస్తున్నాయి, ఏవి చేయడంలేదు?
ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్, మొబైల్ డేటా, మొబైల్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ సేవలు, ల్యాండ్‌లైన్‌లు అన్నీ నిలిచిపోయాయి. దాంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రపంచంతోపాటు ఒకరితో ఒకరు సంబంధాలు కోల్పోయారు.
వార్తలు, సమాచారం కోసం రేడియో, యాంటెనాతో ప్రసారాలు అందించే టెలివిజన్లే దిక్కు అయ్యాయి.
అఫ్గనిస్తాన్‌లోని ఏకైక అంతర్జాతీయ రేడియో ప్రసారకర్త అయిన బీబీసీ అఫ్గాన్ నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా, విదేశాల్లో ఉన్న అఫ్గాన్ ప్రజలు తమ కుటుంబ సభ్యులకు సందేశాలు పంపారు.
స్టార్‌లింక్ వంటి రహస్య శాటిలైట్ కనెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే అవి చట్టవిరుద్ధమైనవి. వాటిని ప్రైవేట్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు.
షట్‌డౌన్ ఎప్పుడు జరిగింది?
సెప్టెంబర్ 29న, ఒక గంట ముందస్తు నోటీసు/గడువు ఇచ్చిన తర్వాత, అఫ్గానిస్తాన్లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు అన్ని ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్షన్లను నిలిపేశారు.
సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం నాటికి అఫ్గానిస్తాన్లో కనెక్టివిటీ సాధారణ స్థాయితో పోల్చితే 1 శాతానికి తక్కువగా పడిపోయింది.

ఫొటో సోర్స్, Atif Aryan/AFP via Getty Images
ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పూర్తిగా బ్లాక్ అవుట్ అయింది.
ఈ బ్లాక్ అవుట్ ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, సాంకేతికలోపం కాదని గ్లోబల్ ఇంటర్‌నెట్ వాచ్‌డాగ్ నెట్‌బ్లాక్స్ ధృవీకరించింది.
ఇంటర్నెట్ సేవల కోసం ఒక భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన టెలికాం పరికరాల పక్కన తాలిబాన్ జెండా ఎగురుతోంది.
అయితే ఇప్పటివరకు, తాలిబాన్ ప్రభుత్వం దీనిగురించి ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. ఇది నిరంతరాయంగా కొనసాగుతుందేమోననే భయాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 16న, బాల్ఖ్, కాందహార్, హెల్మాండ్ వంటి కొన్ని ప్రావిన్స్‌లలో ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్‌ను నిషేధించినప్పుడు, "అనైతికతను నివారించడానికి" సుప్రీం లీడర్ మౌల్వి హైబతుల్లా అఖుంద్‌జాదా ఇలా ఆదేశించారని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు తాలిబాన్ అధికారులు తెలిపారు.
"ఇది కాందహార్ నుంచి వచ్చిన నిర్ణయం, దీన్ని రద్దు చేయలేం" కానీ ఇది సరికాదు అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ అధికారులు తెలిపారు.
ఈ షట్‌డౌన్ ప్రభావం ఎంత?
అఫ్గానిస్తాన్లో స్థానిక, అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి.
అలాగే బ్యాంకులు, ఎలక్ట్రానిక్ ఐడీ సిస్టమ్స్, పాస్‌పోర్ట్ కార్యాలయాలవంటివి హై-స్పీడ్ ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడవి సరిగా పనిచేయడంలేదు.
"ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా అన్ని ఫ్లైట్లను తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాజా సమాచారం అందిస్తాం" అని అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్లలో ఒకటైన కామ్ ఎయిర్ సంస్థ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Wakil Kohsar/AFP via Getty Images
రాజధానిలోని బ్యాంకులు తెరిచి ఉన్నప్పటికీ, చాలా రద్దీగా ఉన్నాయి. పరిమిత నగదు మాత్రమే అందుబాటుతో ఉండడంతో ప్రజలు నగదు కోసం బారులు తీరారు.
హవాలా లావాదేవీలు, లేదా విదేశాల నుంచి వచ్చే డబ్బు, అఫ్గానిస్తాన్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. ఇవి పూర్తిగా నిలిచిపోగా, విదేశాల్లో నివసించేవారి నుంచి నెలవారీ సహాయం పొందే వేల కుటుంబాలపై ప్రభావం పడుతోంది.
కాబుల్‌లోని కొన్ని రెమిటెన్స్ సెంటర్లు, ఇంటర్‌నెట్ లేదా ఫోన్ కనెక్షన్ లేకపోవడం వల్ల పనులు జరగడంలేదని, పేమెంట్స్ పంపడం లేదా అందుకోలేకపోతున్నామని హెల్మాండ్‌లోని మనీ చేంజర్లు బీబీసీతో అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో వీసాల జారీ కూడా రద్దయిందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
విదేశాల్లో వైద్య చికిత్స కోసం వెళ్తున్న రోగులకు ఇది పెద్ద సమస్యగా మారింది. క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేకంగా అందించే 24 గంటల అత్యవసర వీసాలు జారీచేసే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (మెడికల్ వీసా) సేవలు కూడా నిలిచిపోయాయి.
ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ రోజుకు సుమారు 100 మెడికల్ వీసాలు జారీ చేస్తుంది.
అఫ్గాన్‌లో చాలామంది మహిళలు, యువతుల కోసం ఆన్‌లైన్ విద్య ఒక జీవనరేఖగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదికూడా నిలిచిపోవడంతో మహిళా విద్యార్థులు ఎక్కువగా అవస్థ పడుతున్నారు.
తనకు ఆన్‌లైన్ విద్య తప్ప మరే మార్గం లేదని ఒక విశ్వవిద్యాలయ మాజీ విద్యార్థి చెప్పారు.
"ప్రపంచమంతా చీకటిమయమైనట్టు ఉంది" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Wakil Kohsar/AFP via Getty Images
తాలిబాన్ ప్రభుత్వం ఇప్పటివరకు షట్‌డౌన్‌పై అధికారికంగా స్పందించలేదు.
ఈ బ్లాక్‌అవుట్ ఎప్పటివరకు కొనసాగుతుందో, ఇంటర్ నెట్ సేవలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయో, లేదో తెలియకపోవడం వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
కాబుల్ పరిపాలన నేతృత్వంలోని ఒక కమిటీ మొబైల్ కమ్యూనికేషన్ తిరిగి ప్రారంభించడానికి ఇతర మార్గాలను పరిశీలిస్తోందని, కానీ ఫైబర్-ఆప్టిక్ పై నిషేధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కమిటీ ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్ కోసం ఫైర్‌వాల్స్ వాడకం గురించి కూడా పరిశీలిస్తోంది. దీని ద్వారా ప్రతికూల లేదా హానికరమైన కంటెంట్‌ను అడ్డుకోవడం సాధ్యం అవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














