గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన తరువాత టీమిండియాలో వచ్చిన మార్పేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రభాత్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రోహిత్ శర్మను వేదిక మీదకు పిలిచారు. రోహిత్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు 2025 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
గౌతమ్ గంభీర్ అప్పటికే టీమ్ ఇండియాకు కోచ్‌గా ఉన్నారు. అయితే రోహిత్ శర్మ ఒక్కసారి కూడా జట్టు విజయంలో గంభీర్ పాత్ర గురించి ప్రస్తావించలేదు. ఆటగాళ్ల మధ్య సమన్వయం, పోరాట స్ఫూర్తి, మానసిక దృఢత్వం, తన ఆట తీరు గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు.
గౌతమ్ గంభీర్ కంటే ముందు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పేరును కూడా ప్రస్తావించిన హిట్‌మ్యాన్ గంభీర్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. ఇది పత్రికలు, ప్రసార సాధనాల్లో హెడ్‌లైన్ అయింది.

కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా టూర్ కోసం సెలక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, ఐదు T20 మ్యాచ్‌లు ఆడనుంది.
వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి చోటు దక్కింది.
అయితే కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు కట్టబెట్టారు.
రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 2023 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకుంది.
అదే జట్టు 2024 టీ ట్వంటీ వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.
ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ, రోహిత్‌కు జట్టులో స్థానం కల్పించి కెప్టెన్సీ ఇవ్వకపోవడం క్రికెట్ అభిమానులను నిరుత్సాహపరిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది.
దీంతో రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లు కూడా దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడాలని గంభీర్ సూచించారు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత 45 రోజులు దాటి జరిగే విదేశీ టూర్లలో ఆడే ఆటగాళ్లతో వారి కుటుంబసభ్యులు 14రోజులకు మించి గడపడానికి వీల్లేదంటూ ఓ నిబంధన తీసుకువచ్చింది.
ఈ నిబంధనను విరాట్ కోహ్లీ బహిరంగంగానే వ్యతిరేకించాడు. ఈ నిర్ణయం తనకు ఏ మాత్రం నచ్చలేదని చెప్పాడు. గౌతమ్ గంభీర్ మాత్రం బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించారు.
ఓ ఇంటర్వ్యూలో ఛటేశ్వర్ పుజారాతో మాట్లాడుతూ "కుటుంబం ముఖ్యమే కానీ మనం విదేశాల్లో మ్యాచ్‌లు గెలిచేందుకు ఉన్నాం. ఇదేమీ హాలిడే కాదు" అని గంభీర్ అన్నారు.
ఆస్ట్రేలియా టూర్ సగంలో ఉండగానే రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి హఠాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు చెప్పారు.
సిరీస్‌కు ముందు ఈ ఆటగాళ్లిద్దరూ తమ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
టెస్ట్ క్రికెట్‌లో10 వేల పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీ ఇంకా 770 పరుగుల దూరంలో ఉన్నాడు.
జరిగిందంతా చూస్తుంటే జట్టులో సీనియర్లు గౌతమ్ గంభీర్ 'గీసిన గీత లోపల' ఉన్నట్లు కనిపించడం లేదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు తన విజన్‌కు సరిపోరని భావించారా?
గౌతమ్ గంభీర్ కోచ్ పదవి దక్కించుకున్న తర్వాత టీమ్ ఇండియా ఎలా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
గంభీర్: ది బాస్
చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ జట్టు గురించి మాట్లాడి, గంభీర్ గురించి ప్రస్తావించని కార్యక్రమానికి జర్నలిస్ట్ అయాజ్ మెమన్ కూడా హాజరయ్యారు.
"ఈ అంశానికి అంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదు. తాను కెప్టెన్, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా తామిద్దరం మొదలు పెట్టిన వ్యూహాలు టీ ట్వంటీ వరల్డ్ కప్, తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో విజయం గురించి రోహిత్ మాట్లాడాడు. అతను కావాలనే గంభీర్ పేరు ప్రస్తావించలేదని నేను అనుకోవడం లేదు" అని మెమన్ చెప్పారు.
రోహిత్ శర్మ, కోహ్లీ ఆస్ట్రేలియా టూర్‌లో ఆడారు. వాళ్లు 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటే, అప్పటి వరకు గంభీర్ కోచ్‌గా ఉంటాడనే విషయాన్ని వాళ్లు గుర్తించాలని మెమెన్ చెప్పారు.
అందుకే వాళ్లిద్దరూ టీమ్‌లో కొనసాగాలంటే గంభీర్‌తో ఒప్పందానికి రావల్సి ఉంటుందని మెమన్ అభిప్రాయపడ్డారు.
ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ నీరు భాటియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
"గౌతం గంభీర్ జట్టుకి బాస్‌గా ఉంటాడని జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ స్పష్టంగా చెప్పింది. కాబట్టి రోహిత్, విరాట్ కోహ్లీ ఈ విషయం గుర్తుంచుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద నిర్ణయాలు
రోహిత్ శర్మను జట్టులోకి తీసుకుని శుభ్‌మన్‌గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడం విచిత్రంగా ఉందని నీరు భాటియా చెప్పారు.
రోహిత్, విరాట్ కోహ్లీతో సమన్వయం కోసం టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి గిల్‌కు మరింత మద్దతు అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో టీ ట్వంటీలు, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు ఆసియా కప్‌లో చోటు దక్కకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది చాలా దారుణమనేది నీరూ భాటియా అభిప్రాయం.
"భారత్ ఆసియా కప్ గెలిచి ఉండవచ్చు. అయితే ఒక్కసారి జట్టును చూడండి. ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో ఏదో లోపించినట్లు కనిపించింది. అలాంటి గొప్ప ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కకపోవడం మిస్టరీగా ఉంది" అని ఆమె అన్నారు.
శ్రేయస్ అయ్యర్ కావాలనే వెనక్కి తగ్గి ఉండవచ్చని అయాజ్ మెమన్ భావిస్తున్నారు
"ఆస్ట్రేలియా టూర్‌కు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను జట్టులోకి తిరిగి వచ్చాడు. కాబట్టి దీని వెనుక వివాదం ఏమీ లేదు" అని మెమన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గంభీర్ విజన్
ఆస్ట్రేయాలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడానికి ముందు ఇండియా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ మీద టెస్ట్ సిరీస్‌ను కూడ 0-3 తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సీనియర్ ఆటగాళ్లు విఫలమయ్యారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్ట్ క్రికెట్‌లో సరిగ్గా ఆడలేక పోతున్నారు. టెస్ట్ క్రికెట్ నుంటి రిటైర్ అవ్వాలన్న వారి నిర్ణయం సముచితమేనని అయాజ్ మెమన్ అభిప్రాయపడ్డారు.
రోహిత్, కోహ్లీ నిర్ణయం వెనుక గంభీర్ ఉన్నాడనే వాదనను ఆయన తోసిపుచ్చారు.
అయితే తన విజన్‌లో సీనియర్ ఆటగాళ్లు సరిపోరని గంభీర్ భావిస్తున్నారని నీరు భాటియా చెబుతున్నారు.
"గౌతం గంభీర్ భవిష్యత్ జట్టును తీర్చిదిద్దాలి. 2027 వరల్డ్ కప్ కోసం ఆయనకు యువకులతో కూడిన చట్టు కావాలి. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు స్థానం లేదు" అని ఆమె అన్నారు.
గంభీర్ కోచ్ అయిన తర్వాత T20, వన్డేల్లో భారత ఆట తీరు మెరుగుపడింది. టెస్ట్ మ్యాచ్‌లలో సాధారణంగా ఉంది.
గంభీర్ కోచ్ అయిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆడిన 15 టెస్ట్ మ్యాచ్‌లలో 5 మాత్రమే గెలిచింది. 8 మ్యాచ్‌లలో ఓడిపోయింది.
టీ ట్వంటీల విషయానికొస్తే 20మ్యాచ్‌లు గెలిచింది. రెంటిలో ఓడిపోయింది. 11 వన్డేలు ఆడి 8 మ్యాచ్‌లలో గెలిచింది.
భారత్ గెలిచిన ఐదు టెస్టుల్లో రెండు టెస్టులు ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌తో ఆడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌ల్లో ఆడలేదు.
"గంభీర్ యువకుల్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్లలో పోరాట స్ఫూర్తి నింపుతున్నారు" అని నీరూ భాటియా చెప్పారు.
గంభీర్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా ఉన్నారు. గంభీర్‌తో పోలిస్తే ద్రవిడ్ వైఖరి పూర్తిగా భిన్నమైనది. ద్రవిడ్ ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ద్రవిడ్ ,రోహిత్ శర్మ భాగస్వామ్యంలో జట్టు అనేక విజయాలు సాధించింది.
"ఏదైనా ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. జట్టు సాధించే విజయాలే కోచ్ ప్రతిభకు కొలమానం" అని అయాజ్ మెమన్ చెప్పారు.
ఆయన గంభీర్‌కు ఒక సలహా ఇచ్చారు.
"గంభీర్ చాలా తక్కువగా నవ్వుతారు. ఆయన్ని చూస్తే 'ఆయన నవ్వరు. ఎవర్నీ నవ్వనివ్వరు' అనిపిస్తుంది. బహుశా ఆయన బాక్స్‌లో కూర్చుని పెద్దగా నవ్వుతూ ఉండవచ్చు. ఎందుకంటే మనం దాన్ని చూడలేం" అని అయాజ్ చెప్పారు.
అయాజ్ మెమన్ ఇంకో మాట కూడా అన్నారు. అదేంటంటే
"గంభీర్, మీ గాంభీర్యాన్ని కాస్త తగ్గించుకోండి" అని.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














