మియన్మార్: పారాగ్లైడర్ల సాయంతో యుద్ధం చేస్తున్న సైన్యం, ఏమిటీ కొత్త వార్ స్ట్రాటజీ?

ఫొటో సోర్స్, Supplied
- రచయిత, యువెట్టె టాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మియన్మార్ చాంగ్ యూ టౌన్‌షిప్‌లోని సెంట్రల్ సాగైంగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి (అక్టోబరు 6) పౌర్ణమి సందర్భంగా జరుపుకునే థడింగ్‌యుట్ పండుగ కోసం దాదాపు 100మంది ఒకచోట చేరారు.
కొంతమంది ఆ కార్యక్రమంలో కొవ్వొత్తులు పట్టుకున్నారు. ఇది పండుగే కాదు..ఆర్మీకి వ్యతిరేకంగా సాగే నిరసన ప్రదర్శన కూడా. 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీ, దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టివేసింది.
ఆ వేడుక కాసేపటికే భయంకరంగా మారింది. మోటర్ పారాగ్లైడర్ పైన ఎగురుతూ అక్కడున్నవారిమీద బాంబులు జారవిడిచింది. ఈ పారాగ్లైడర్‌ను స్థానికంగా పారామోటర్ అని పిలుస్తారు.
ఆ దాడి జరిగింది ఏడు నిమిషాలే అయినప్పటికీ 26మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
''నా శరీరం కింది భాగమంతా తెగిపోయిందనుకున్నా'' అని పండుగ చేసుకునేందుకు అక్కడికి వచ్చిన వారిలో ఒకరైన 30 ఏళ్ల వ్యక్తి రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.
బాంబులు పైనుంచి పడుతున్నప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ఆయన దగ్గరలో ఉన్న నీటి మడుగులో దూకారు. తర్వాత స్నేహితులు ఆయన్ను బయటకు తీసుకొచ్చారు.
''ఇది సామూహిక హత్యాకాండ. వారు బహిరంగంగా ఈ హత్యాకాండకు పాల్పడ్డారు'' అని ఆయన చెప్పారు.
ఆర్మీని వ్యతిరేకించే గ్రూపులను ఓడించేందుకు మియన్మార్ మిలటరీ ఈ ఏడాది ఇలాంటి దాడులు చాలా చేసింది.
తక్కువ సాంకేతికతతో తయారయ్యే ఈ ఆయుధం ప్రమాదకరమైంది. దేశాన్ని తిరిగి నియంత్రణలో తెచ్చుకునేందుకు మిలటరీ ప్రభుత్వం అనుసరిస్తున్న క్రూరమైన వైమానిక దాడుల్లో ఇది ఒకటి.


ఫొటో సోర్స్, PDF
పారామోటర్ అంటే ఏంటి?
పారామోటర్లలో అనేకరకాలున్నాయి. మోటర్‌తో నడిచే పారాగ్లైడర్ నుంచి పైలట్ వేలాడుతూ ఉండే రకం ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ప్రతి పారామోటర్ సగటున 160 కేజీల(350ఎల్‌బీ)లు బరువు మోయగలదు. ఒక పారాట్రూపర్‌తో పాటు చిన్న చిన్న బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కోటి 16 కేజీల బరువుగల 120ఎంఎం బాంబులను ఈ పారాగ్లైడర్లు తీసుకెళ్లగలవని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
చిన్నగా ఉండడం, తక్కువ ఎత్తులో ఎగరగల సామర్థ్యంవల్ల విమానంతో పోలిస్తే లక్ష్యానికి దగ్గరగా వెళ్లి దాడిచేయగలవు. పైలట్లు టార్గెట్లపై చేతులతో బాంబులు వేయగలరు.
జీపీఎస్‌తో ఉండే ఈ పారామోటర్లు వెయ్యి అడుగుల కంటే తక్కువ ఎత్తునుంచి లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలవని నిపుణులు చెబుతున్నారు. ఒక పారామోటర్ సాధారణ ఇంధనంతో మూడుగంటలపాటు ప్రయాణించగలదు.
విమానాలు నడిపే పైలట్లలా పారాట్రూపర్లు సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకోవాల్సిన అవసరంలేదని, కొన్ని రోజుల శిక్షణ సరిపోతుందని మిలటరీ వర్గాలు తెలిపాయి.
పారాట్రూపర్లకు శిక్షణ ఇవ్వడానికి అనేక ఎయిర్ బేస్‌లు, ట్రైనింగ్ స్కూళ్లు ఏర్పాటుచేశారు. ఇలాంటి స్థావరాలున్న ప్రాంతాల్లోనే చాలా దాడులు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువ ఖర్చుతో ఎక్కువ వినియోగం
పారామోటర్ల ధర తక్కువ. నిర్వహించడం తేలిక. బర్మీస్ మిలటరీలో ఇవి ప్రధానంగా ఉండడానికి గల ముఖ్య కారణాలివని మిలటరీ వర్గాలు, రక్షణరంగ సంస్థలు తెలిపాయి.
మియన్మార్ విమానాల విడిభాగాలను ఎక్కువగా తయారుచేసే ప్రభుత్వ రంగ సంస్థ హెవీ ఇండస్ట్రీ నంబర్ 10 ఈ పారామోటర్లును కూడా తయారుచేస్తోందని భావిస్తున్నారు.
ఈ పారామోటర్లలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. తక్కువ ఎత్తుకు ఎగరడం వల్ల భూమిపైనుంచి వాటిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం తేలిక. అందుకే వాటిని ఎక్కువగా రాత్రివేళల్లో ఉపయోగిస్తుంటారు.
పైగా అవి నెమ్మదిగా కదులుతాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగం వరకూ ప్రయాణించగలవని నిపుణులు చెప్పారు.
వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు పారామోటర్లు ఎగరలేవు. అవి ఎగరగలిగే ఎత్తుపై పరిమితి ఉంటుంది. వాటి మోటర్ శబ్దం చాలాపెద్దగా వినిపిస్తుంటుంది. అందుకే అవి వస్తున్న విషయం ప్రజలకు తెలిసిపోతుంది.
‘‘మా ఊరు మీదుగా పారామోటర్ వెళ్తున్నప్పుడు ఇంజిన్ శబ్దం నాకు వినిపించింది'' అని సగైంగ్‌లోని ఓ రెస్క్యూ వర్కర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, PDF
పారామోటర్లతో వరుస దాడులు
సోమవారం జరిగిన దాడి అత్యంత తీవ్రమైనదైనప్పటికీ ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. తిరుగుబాటుదారులకు గట్టి పట్టున్న సెంట్రల్ మియింగ్‌యాన్ జిల్లాలో 2024లో క్రిస్మస్ రోజున తొలిసారి ఇలా పారామోటార్లు ఉపయోగించి దాడులు జరిగాయి.
2025లో ఒక్క జనవరిలోనే టౌంగ్‌థా, పలెట్వా, సాగైంగ్ టౌన్‌షిప్పుల్లో ఇలాంటివి ఎనిమిది దాడులు జరిగాయి. తొమ్మిది మంది చనిపోయారు. గ్లోబల్ మానిటరింగ్ సైట్ ఏసీఎల్ఈడీ ఈ విషయాలు తెలియజేసింది.
నాలుగేళ్లగా సాగుతున్న పోరాటంలో మిలటరీ విమానాల సామర్థ్యం బాగా దెబ్బతిని ఉండొచ్చనీ, వాటికి నష్టం కలిగితే మరమ్మత్తు ఖర్చులు భారీగా ఉండొచ్చనీ, ఈ కారణాల దృష్ట్యా పారామోటర్ల వినియోగం బాగా పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి.
''వాటి ధర తక్కువ. త్వరగా మోహరించే వీలుంటుంది. పైలట్‌కు ఇచ్చే శిక్షణ తక్కువ. డ్రోన్లకు, ఎయిర్ క్రాఫ్ట్‌లకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని అవి భర్తీ చేస్తున్నాయి. డ్రోన్ల కన్నా ఎక్కువ ఎత్తు ఎగరగలవు. ఎక్కువ బరువు మోయగలవు. హెలికాప్టర్లతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువ'' అని బీబీసీతో మియన్మార్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీకి చెందిన మిన్ జావ్ ఓ చెప్పారు.
వనరులు తక్కువగా ఉండడం, విమానాలకు ఎక్కువగా నష్టం జరగడం వంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో వైమానిక దాడుల్లో ఆధిపత్యం సాధించేందుకు మిలటరీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తోందని తెలిపారు.
అయితే సంప్రదాయ విమానాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. ముఖ్యంగా అధునాతన గగనతల రక్షణ వ్యవస్థతో తిరుగుబాటుదారులకు గట్టిపట్టున్న ప్రాంతాల్లో ఇది ఉపయోగపడవని ఐర్రావాడ్డీ వార్తాసంస్థ తెలిపింది.
అందుకే వీటిని తిరుగుబాటుదళాల ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. అక్కడి ప్రజలకు వాటిని కిందినుంచి కూల్చేందుకు కావాల్సిన ఆయుధాలు లేవు.
ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకున్న మార్గం ఎయిర్ రెయిడ్ షెల్టర్లలో దాక్కోవడమే.
అలాంటి బంకరులో ఓ కుటుంబం ఒక రోజు ఆశ్రయం పొందడానికి అయ్యే ఖర్చు 5,00,000క్యాట్లు (దాదాపురూ.21,000) అని సగైంగ్‌కు చెందిన ఒకరు గతంలో బీబీసీతో చెప్పారు. మియన్మార్‌లో ఒక రోజుకు కనీస వేతనం దాదాపు 4,800 క్యాట్‌లు(దాదాపు రూ.200).
భారీగా ఉండే పేలోడ్లతో, ఆధునాతన వ్యవస్థలతో సుదూర లక్ష్యాలను చేరుకోగల గైరోకాప్టర్లతో కూడా మిలటరీ ప్రయోగాలు చేస్తోందని మిన్ జావ్ ఓ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మియన్మార్‌లో పరిస్థితి ఇప్పుడెలా ఉంది?
2021లో మిలటరీ తిరుగుబాటు జరిగినప్పటి నుంచి వేలమందిని చంపేశారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఇది దేశంలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఆర్మీకి, మిలిషీయాకు మధ్య పోరు జరుగుతోంది.
సైనిక ప్రభుత్వం నుంచి తిరుగుబాటు సంస్థలు చాలా భూభాగం స్వాధీనం చేసుకున్నాయి. అయినప్పటికీ ఇటీవల కొన్ని నెలలుగా భారీ వైమానిక దాడులు, బాంబు దాడులతో సైన్యం రక్తం పారిస్తోంది.
మియన్మార్ మిలటరీ ప్రభుత్వానికి చైనా నుంచి మద్దతు ఉందని, ఆయుధాలు అందిస్తోందని థింక్ టాంక్ స్టిమ్సన్ సెంటర్ తెలిపింది. మియన్మార్‌లో తన ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకునేందుకు చైనా ఎక్కువగా జోక్యం చేసుకుంటోందని వెల్లడించింది.
''జుంటాకు చైనా మద్దతు తగ్గకపోగా మరింత పెరిగింది. ఆర్థికవ్యవస్థ అచేతనంగా మారి, మిలటరీ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రభుత్వాన్ని రక్షించేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సైనికపరంగానే బీజింగ్ ఎక్కువ సహకారం అందిస్తోంది. ఆయుధాల అమ్మకం, డ్రోన్ సాంకేతికత, రక్షణరంగంలోకి సాంకేతిక నిపుణులను పంపడం, తిరుగుబాటుదారులు ఉపయోగించే ఆయుధాల ఎగుమతులను ఆపివేయడం వంటివాటితో చైనా సహకరిస్తోంది'' అని స్టిమ్సన్ సెంటర్ థింక్ టాంక్ తన నివేదికలో తెలిపింది.
యూఏవీలు సహా ఇతర ఆయుధాలు ప్రతిపక్షాలకు సరఫరా చేయకుండా తన సరిహద్దుల్లో ఉన్న తిరుగుబాటుదారులపై కూడా చైనా ఒత్తిడి తెస్తోంది. ప్రతిపక్షాలు ఇలాంటి ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడ్డాయి.
రెండువైపులా ఒత్తిడితో తిరుగుబాటుదారులు బలహీనపడ్డారు. అయినప్పటికీ దేశంలో సగభాగంపై వారికి గట్టిపట్టుంది.
ఈ సంక్షోభంతో, పారామోటర్ల వంటి వాటి ప్రయోగంతో సాధారణ ప్రజలు బాధలు పడుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














