బంగారం ధరలు మరింత పెరుగుతాయా, తగ్గుతాయా, ఇప్పుడు కొనడం మంచిదేనా?

బంగారం కొనుగోలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం ధర రూ.1,21,000 దాటింది. రానున్న నెలల్లో బంగారం ధర పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫోర్బ్స్ ఇండియా వివరాల ప్రకారం, 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400 ఉంది. ఈ ధర 2010 నాటికి రూ.20,728కి పెరిగింది. 2020నాటికి రూ.50,151 అయింది.

ఆ తర్వాత, గత ఐదేళ్లలోనే 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ధోరణి ఎంతకాలం కొనసాగుతుంది, సమీప భవిష్యత్తులో ఈ ధరలు తగ్గుముఖం పడతాయా? అంటే...

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం డిమాండును పరిశీలిస్తే, ఈ ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగదని నిపుణులు భావిస్తున్నారు.

2026 సగం గడిచేసరికి, బంగారం ధరలు మరో 6 శాతం పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది.

బంగారం దుకాణం

ఫొటో సోర్స్, Getty Images

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

బంగారం ధరలు త్వరితగతిన పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ముఖ్య కారణం ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కొనసాగుతున్న సైనిక సంఘర్షణలు, పలు దేశాల్లో ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.గత ధోరణులను పరిశీలిస్తే, బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ నష్టాన్ని కలిగించే అంశంగా లేదు.

ఎకనామిక్ టైమ్స్ వివరాల ప్రకారం, గత 20 ఏళ్లలో బంగారం ధరలు పడిపోయిన క్యాలెండర్ సంవత్సరాలు నాలుగు మాత్రమే. ఫలితంగా పెట్టుబడిదారులకు కొంత నష్టం వాటిల్లింది. అయితే, ఈ నష్టాలు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యాయి.

ఉదాహరణకు, 2013లో బంగారం ధరలు 4.50 శాతం తగ్గాయి. 2014లో 7.9 శాతం, 2015లో 6.65 శాతం, 2021లో 4.21 శాతం తగ్గాయి.

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం ఏర్పడి, సుంకాల అనిశ్చితి గరిష్ట స్థాయికి చేరినప్పుడు బంగారంపై పెట్టుబడి పెరగడం అనివార్యమవుతుంది.

మార్కెట్ విశ్లేషకుడు అసిఫ్ ఇక్బాల్ ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీతో మాట్లాడినప్పుడు, ప్రస్తుత పరిస్థితులలో చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని రిస్క్-ప్రొటెక్షన్ స్ట్రాటజీగా భావిస్తున్నారని చెప్పారు. స్టాక్ మార్కెట్‌లో నష్టాలు వస్తాయని భయపడిన వారు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపిస్తున్నారు.

ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక కారణమైతే, రష్యా-యుక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు మరో కారణమని అసిఫ్ ఇక్బాల్ వివరించారు.

ఈపరిస్థితులలో, ప్రపంచంలో జరుగుతున్న సంఘర్షణలు బంగారం ధరలను కూడా ప్రభావితం చేశాయి.

బంగారం కొనుగోలు

ఫొటో సోర్స్, Getty Images

బంగారంపై మొగ్గు భారతదేశంలోనే ఎక్కువ...

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు తమ ఆదాయంలో సగటున 2 నుంచి 3 శాతాన్ని బంగారం రూపంలో దాచుకుంటున్నారు. భారతదేశంలో ఈ వాటా 16 శాతం వరకూ ఉంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలును పెంచడం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.

డోనల్డ్ ట్రంప్ హయాంలో సుంకాలపై పెరుగుతున్న అనిశ్చితి, ప్రపంచ మార్కెట్లలో కొనసాగుతున్న గందరగోళం నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, కేంద్ర బ్యాంకులు గత ఆగస్టు నెలలో తమవద్దనున్న బంగారం నిల్వలకు నికరంగా మరో 15 టన్నుల బంగారాన్ని జోడించాయి.

గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్ట్ ప్రకారం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే పెట్టుబడి దారులు బంగారం వైపు మొగ్గు చూపిస్తారు. ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడి పెట్టడం పెరిగినప్పుడు, ధర కూడా పెరుగుతుంది.

బంగారం బిస్కెట్

ఫొటో సోర్స్, Reuters

డీ-డాలరైజేషన్ కూడా ఒక కారణమే...

ఏదైనా ఒక దేశం డాలర్ నుంచి దూరమైనా లేదా దాన్ని దూరం పెట్టినా, దాన్ని డీ-డాలరైజేషన్ అంటారని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ దేశాలు ఎక్కువగా తమ విదేశీ మారక నిల్వలలో డాలర్లును, యూఎస్ బాండ్లను ఉంచుకుంటాయి. ముడిచమురు, ఇతర వస్తువుల దిగుమతులకు డాలర్ల రూపంలో చెల్లిస్తాయి. కాబట్టి, ఈ వీటి నిల్వను నిరంతరం పెంచుకుంటాయి.

డాలర్ విషయంలో ఈ ధోరణి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది.

అయితే, ఇటీవల కాలంలో అమెరికా విధానాలు డాలర్‌పై అనేక దేశాలలో ఆందోళనలను రేకెత్తించాయి. అమెరికా 2015, 2016 సంవత్సరాలలో రష్యాపై వివిధ ఆంక్షలు విధించిన తర్వాత, కొన్ని దేశాలు డాలర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బంగారమే మూలధనం

భారతదేశం సహా ఆసియా దేశాలలో బంగారాన్ని మూలధనంగా భావిస్తారు. బంగారం కొనుగోలు అనేది చాలాకాలంగా భారతీయ సంస్కృతిలో భాగమైంది. పండుగలు, వివాహాలు వంటి శుభకార్యాలకు బంగారం కొనడం భారతీయులకు ముఖ్యమైన పని. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారతదేశమే.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ ప్రజలు కూడా అదే రీతిలో బంగారం కొనుగోలు చేస్తున్నారా లేదా ఈ వేగం కొంచెం తగ్గిందా అనే సందేహం మీకు తలెత్తవచ్చు.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి సురీందర్ మెహతా మాట్లాడుతూ, ఆభరణాల అమ్మకాలు 27 శాతం తగ్గినప్పటికీ, బంగారం నాణేలు, బులియన్ అమ్మకాలు పెరిగాయని చెప్పారు. ప్రజలు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలుచేస్తున్నారని, అదీ పెద్ద నగరాలలో కంటే పట్టణాలు, చిన్న నగరాలలోనే ఎక్కువగా లావాదేవీలు సాగుతున్నాయని వెల్లడించారు.

ఈ దీపావళికి బంగారం విక్రయాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సురీందర్ మెహతా స్పందిస్తూ, 'గతంతో పోలిస్తే ఈ దీపావళికి రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు జరుగుతాయని భావిస్తున్నాను' అని బదులిచ్చారు.

ఆభరణాల మార్పిడి ధోరణి కూడా ప్రజలలో పెరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానంగా, ''పాత ఆభరణాలను నూతన, ట్రెండీ ఆభరణాలతో మార్పిడి చేసుకునే మార్కెట్ ఇప్పుడు దాదాపు 30 శాతానికి చేరింది. బంగారం ధర పెరిగితే ప్రజలు తక్కువ క్యారెట్ బంగారం కొనుగోలు చేయడానికి దారితీస్తుందని చాలామంది అనుకోవచ్చు. కానీ, అది వాస్తవం కాదు. ఇప్పటికీ చాలామంది 22 క్యారెట్ ఆభరణాలకే మొగ్గు చూపిస్తారు'' అని సురీందర్ మెహతా చెప్పారు.

బంగారం నగలతో యువతి

ఫొటో సోర్స్, Getty Images

బంగారంపై పరిమితి ఉందా?

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, నిబంధనల ప్రకారం పారదర్శకమైన వనరుల (క్లీన్ సోర్సెస్) నుంచి పొందిన బంగారం, ఆభరణాలైతే పరిమితి ఏమీ లేదు.

ఏ వ్యక్తి అయినా తన ఆదాయాన్ని బట్టి ఎంత మొత్తానికైనా బంగారం కొనవచ్చు లేదా తన వద్ద ఉంచుకోవచ్చు. ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు లేదా తనిఖీ చేసినప్పుడు వాటికి తగిన బిల్లులు, రసీదులు లేదా చట్టబద్ధమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ప్రకారం, ఆదాయపన్ను శాఖకు వెల్లడించిన ఆదాయం, వ్యవసాయంపై రాబడి తదితర మినహాయింపు ఆదాయం, చట్టబద్దమైన పొదుపులు, వారసత్వ ఆస్తి వంటి స్పష్టమైన అర్హత కలిగిన ఆర్థిక వనరులతో బంగారం కొనుగోలు చేస్తే దానిపై పన్ను విధించరు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం, మహిళలు వివాహమైనవారైతే 500 గ్రాములు, అవివాహితులైతే 250 గ్రాముల వరకూ బంగారం కలిగిఉండవచ్చు. పురుషులెవరైనా 100 గ్రాముల వరకూ బంగారం కలిగి ఉండొచ్చు.

బంగారం నగలు

ఫొటో సోర్స్, Getty Images

విదేశాల నుంచి ఎంతబంగారం తేవచ్చు?

ఒక దేశానికి మరో దేశానికి, అక్కడి పరిస్థితులను బట్టి బంగారం ధరలు మారుతూ ఉంటాయి.

ఉదాహరణకు, ఒక దేశ కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వల పరిణామం, యూఎస్ డాలర్ బలం, బంగారం సరఫరా, డిమాండును ప్రభావితం చేసే అంశాలు. స్థానిక పన్నులు కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

ఫోర్బ్స్ ప్రకారం, మన దేశం సహా పలు దేశాలతో పోలిస్తే, బంగారం బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, దుబాయ్, అమెరికా, పెరూ దేశాలతో చౌకగా ఉంటుంది.

ఆయా దేశాలలో ఎక్కడైనా బంగారం కొనుగోలు చేసి మన దేశానికి తీసుకురావడానికి పరిమితులు ఉన్నాయి.

కస్టమ్స్ సుంకం లేకుండా 20 గ్రాముల వరకూ పురుష ప్రయాణికులు తీసుకురావచ్చు. అయితే, ఆ బంగారం విలువ రూ.50,000 మించకూడదు, అదీ ఆభరణాల రూపంలో మాత్రమే ఉండాలి.

మహిళా ప్రయాణికులైతే ఈ పరిమితి 40 గ్రాములు, రూ.1,00,000 వరకూ ఉంది.

అంతకంటే ఎక్కువ బంగారం తీసుకొస్తే, అందుకు తగ్గట్లుగా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)