వేపుళ్లకు ఏ నూనె వాడకూడదు? 3 ప్రధాన అపోహలేంటి?

వంట నూనె, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, యాస్మిన్ రూఫో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సూపర్ మార్కెట్‌కు వెళ్లి చూస్తే, అక్కడి అల్మారాలలో రకాల నూనె ప్యాకెట్లు, నూనె బాటిళ్లు కనిపిస్తాయి. బడ్జెట్‌‌లో లభించే సన్‌ఫ్లవర్, వెజిటేబుల్ ఆయిల్ నుంచి, ఆరోగ్య ప్రయోజనాలను వాగ్దానం చేసే ఖరీదైన ఆలివ్, అవకాడో, కొబ్బరి నూనెల వరకూ ఉంటాయి.

నూనెలు, కొవ్వులు ఏళ్ల తరబడి పోషకాహార చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నాయి. వాటిలో ఉండే వివిధ రకాల కొవ్వులను పరిశీలించడం ఆ నూనెలు ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది.

అన్ని కొవ్వులు శరీరంలో ఒకేవిధంగా పనిచేయవు. కొన్ని కొలెస్ట్రాల్‌ను పెంచితే, మరికొన్ని దాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొలెస్ట్రాల్ అనేది కాలేయంలో ఉత్పిత్త అయ్యే సహజ కొవ్వు పదార్థం. మనం తినే కొన్ని ఆహార పదార్థాలలో కూడా ఇది ఉంటుంది.చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడల లోపల కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. దీనివల్ల రక్తనాళాలు ఇరుకుగా మారతాయి లేదా పూర్తిగా మూసుకుపోతాయి.

ఏ ఒక్క నూనె కూడా ఆరోగ్యానికి అద్భుతమైన మంత్రదండం కాదని, వంటనూనెలపై సాధారణంగా కొన్ని అపోహలు ఉన్నాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని పాపులేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ నీతా ఫోరూహి బీబీసీ స్లైస్డ్ బ్రెడ్ పాడ్ కాస్ట్ కు చెప్పారు.

వెజిటేబుల్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

1. వంటకు సన్‌ఫ్లవర్, వెజిటబుల్ ఆయిల్ వాడొచ్చా?

రేప్‌సీడ్ నూనె (సాధారణంగా 'వెజిటబుల్ ఆయిల్'గా అమ్మతుంటారు.) సన్‌ఫ్లవర్ నూనెలు తరచుగా ప్రతికూల ప్రచారానికి గురవుతుంటాయి. కొన్ని వర్గాలు ఇవి 'అల్ట్రా-ప్రాసెస్డ్' అని, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) కలిగిస్తాయని, అవి గుండె సంబంధిత ఆరోగ్యానికి హానికరం కావచ్చని చెబుతుంటారు.

కానీ ఇందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.

వాస్తవానికి, ఈ నూనెలలో అనారోగ్యకరమైన శాచురేటెడ్ కొవ్వులు తక్కువ మొత్తం (5 నుంచి 10 శాతం)లో మాత్రమే ఉంటాయి. ఆరోగ్యకరమైన మోనో, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు (ఒమేగా-3, ఒమేగా-6 సహా) మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

ఈ నూనెలు కచ్చితంగా మనకు మంచివి అని ప్రొఫెసర్ నీతా ఫోరూహి చెబుతున్నారు.

''నెయ్యి, వెన్న లేదా లార్డ్ వంటి శాచురేటెడ్ కొవ్వులకు (ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచవచ్చు) బదులుగా ఈ నూనెలు వాడితే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉందని'' అని ఫోరూహి వివరించారు. పైగా సూపర్‌మార్కెట్లలో చౌకగానూ దొరుకుతాయని చెప్పారు.

వనస్పతి

ఫొటో సోర్స్, Getty Images

2. వనస్పతి వాడొచ్చా?

వనస్పతికి చాలా సంవత్సరాలుగా చెడ్డ పేరు ఉంది, అందుకే దాన్ని వాడకూడదని మనలో చాలామంది నమ్ముతారు.

దానికి కారణం, గతంలో గుండె సంబంధిత వ్యాధులతో బలంగా ముడిపడి ఉన్న హానికరమైన ట్రాన్స్‌ఫ్యాట్స్ వీటిలో ఉండేవి. అయితే, ఆధునిక వనస్పతిలో ట్రాన్స్‌ఫ్యాట్స్ దాదాపుగా సున్నా శాతం అని ప్రొఫెసర్ నీతా ఫోరూహి చెప్పారు. ''కాబట్టి, వనస్పతి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమై, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదు'' అని వివరించారు.

వెన్న (బటర్) కూడా మెనూ నుంచి పూర్తిగా తీసేయక్కరలేదు. ''మీరు వెన్నను ఇష్టపడితే, తప్పకుండా తినవచ్చు'' అని ఫోరూహి చెబుతున్నారు.

వంట కోసం మీరు వనస్పతి, వెన్న రెండింటినీ ఉపయోగించవచ్చు. కానీ వాటిని తక్కువ శాచురేటెడ్ కొవ్వులు ఉండే నూనెకు బదులుగా వాడాలని ఫోరూహి సూచిస్తున్నారు.

శాచురేటెడ్ కొవ్వుల వినియోగాన్ని కేలరీలలో 10 శాతం కంటే తక్కువగా ఉంచాలని యూకే ఆరోగ్య మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇందుకోసం వంటలో వెన్నకు బదులుగా నూనెను ఉపయోగించడం మేలు.

ఆలివ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

3.వేపుళ్లకు ఏ నూనె బెస్ట్

నూనెను ఎక్కువగా వేడిచేస్తే దాని లక్షణం మారిపోతుంది. దీనివల్ల కొన్నినూనెలు వేపుళ్ళకు పనికిరావు.

ఉదాహరణకు, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, తక్కువ ఉష్ణోగ్రతను (స్మోక్‌పాయింట్) తట్టుకునే దాని లక్షణం వల్ల డీప్ ఫ్రైలకు బదులుగా సలాడ్ డ్రెస్సింగ్‌లకు లేదా ఆహారంపై చిలకరించడానికి బాగుంటుంది.

నూనెలో కొవ్వులు విచ్ఛిన్నం కావడం మొదలై, హానికరమైన పదార్థాలు విడుదలయ్యే ఉష్ణోగ్రతను 'స్మోక్ పాయింట్' అంటారు. ఈ పదార్థాల కారణంగా నూనె చేదుగా, అసహ్యకరమైన రుచితో ఉంటుంది.

అడుగు తక్కువగా ఉండే పాత్రలో వేయించడానికి (షాలో ఫ్రైయింగ్) బేసిక్ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తానని రెస్టారెంట్ యజమాని టిమ్ హేవార్డ్ చెబుతున్నారు.

చిప్స్ లేదా పిండిలో ముంచిన చేపలను బాగా వేయించడానికి (డీప్ ఫ్రై) వెజిటేబుల్ లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్తమమైనవి. ఎందుకంటే, అవి ఎక్కువ వేడిని తట్టుకోగలవు.

నూనెలను వాటి స్మోక్ పాయింట్ కంటే ఎక్కువగా వేడి చేసినప్పుడు కేవలం రుచి లేదా పోషక విలువ మాత్రమే కోల్పోదు, విషపూరిత పదార్థాలు కూడా విడుదలవుతాయి.

వంట నూనెలు

ఫొటో సోర్స్, Getty Images

ఏ నూనె ఏ వంటకు వాడాలి?

రోజువారీ వంట కోసం: సన్‌ఫ్లవర్ లేదా రాప్‌సీడ్ ఆయిల్ తక్కువ ధరతో ఆరోగ్యకరమైనవి, పలురకాలుగా ఉపయోగపడతాయి. మీరు బేసిక్ ఆలివ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.

సలాడ్స్, ఫినిషింగ్ డిషెస్ కోసం: ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది.

డీప్ ఫ్రై చేయడానికి: వెజిటేబుల్ లేదా సన్‌ఫ్లవర్ వంటి ఎక్కువ వేడి చేసినా తట్టుకునే నూనెకే కట్టుబడి ఉండండి.

రుచి వైవిధ్యం కోసం: ఆలివ్ ఆయిల్‌తో సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు లేకపోయినా మీకు రుచి నచ్చితే, చల్లని వంటకాలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవకాడో నూనె ఉపయోగించవచ్చు.

మొత్తంమీద, ఏ ఆయిల్ బాటిల్ కొనాలో అని అతిగా ఆలోచించడం కంటే, మీ మొత్తం డైట్‌ను పరిశీలించడం మంచిదని ప్రొఫెసర్ ఫోరూహి సలహా ఇస్తున్నారు.

''రుచి, ధరను దృష్టిలో ఉంచుకొని మీకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే విధంగా వివిధ రకాల నూనెలతో ప్రయోగాలు చేయాలని నేను సిఫార్సు చేస్తాను'' అని ఫోరూహి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)