అభిషేక్ శర్మకు కారు ఇచ్చారు కానీ..

abhishek sharma

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభిషేక్ శర్మ
    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మ్యాచ్‌లు – 7

పరుగులు – 314

నగటు – 44.85

స్ట్రైక్ రేట్ – 200

అత్యధిక స్కోర్ – 75

ఫోర్లు – 32

సిక్సర్లు - 19

2025 ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ రికార్డ్ ఇది..

ఫైనల్ మ్యాచ్‌లో తప్ప ప్రతి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ టీమ్ ఇండియాకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు.

టోర్నీలో ఆయన ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ సాధించి పెట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కానీ ఈ రోజు అభిషేక్ శర్మ గురించి కాకుండా.. ఆయనకు బహుమతిగా లభించిన కారు గురించి మాట్లాడుకుందాం.

ఆయనకు బహుమతిగా ఖరీదైన కారు వచ్చింది.. అభిషేక్ శర్మ ఆ కారుతో దుబయిలో ఫొటో కూడా దిగాడు. కానీ... ఆ కారును అభిషేక్ భారత్‌లో నడిపే అవకాశం మాత్రం లేదు.

ఎందుకో తెలుసా?

abhishek sharma

ఫొటో సోర్స్, ANI

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు ఆ కారేమిటో తెలుసుకోవాలి.

ఆసియా కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ గెలిచిన అభిషేక్‌కు చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ తయారు చేసిన హవల్ హెచ్9 కారు బహూకరించారు.

చైనా మార్కెట్లో దీని ధర సుమారు $29,000 నుంచి $33,000 వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో సుమారు రూ. 30 లక్షలు ఉంటుంది.

కానీ అభిషేక్ శర్మ దీనిని భారతదేశానికి తీసుకురాలేరని వాహనరంగ నిపుణులు చెప్తున్నారు. అందుకు ప్రధాన కారణం అది 'లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్'(ఎల్‌హెచ్‌డీ) కారు కావడమే.

లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లకు స్టీరింగ్ ఎడమ వైపు ఉంటుంది. భారతీయ రోడ్లపై ఇలాంటి కార్లు తిప్పడానికి సాధారణంగా అనుమతి లేదు.

భారతదేశంలోని అన్ని వాహనాలకు స్టీరింగ్ కుడి వైపున ఉంటుంది. ఇలాంటి పద్ధతిని రైట్ హ్యాండ్ స్టీరింగ్ కంట్రోల్ అంటారు.

'న్యూస్ 24' కథనం ప్రకారం.. ఆసియా కప్ తరువాత అభిషేక్ స్వదేశానికి తిరిగి వచ్చాడు కానీ ఆయన కారు మాత్రం రాలేదు.

ఇంతకీ కొన్ని దేశాలలో వాహనాలను రోడ్డుకు ఎడమ వైపు ఎందుకు నడుపుతారు? మరికొన్ని దేశాలలో వాహనాలను రోడ్డుకు కుడివైపునే ఎందుకు నడుపుతారు? స్టీరింగ్ కూడా అందుకు అనుగుణంగానే ఎందుకు ఉంటుంది?

car

ఫొటో సోర్స్, Getty Images

ఎల్‌హెచ్‌టీ, ఆర్‌హెచ్‌టీ అంటే ఏమిటి?

ఒకే రోడ్డులో రెండు దిశల్లో వాహనాలు ప్రయాణించే అవసరాల కోసం ఇలా రోడ్డుకు ఒక వైపు నుంచే వాహనం నడపాలన్న నిబంధన ఉంటుంది. అయితే, ఎడమ వైపు నడపాలా.. కుడి వైపు నడపాలా అనేది ఆయా దేశాల నిబంధనలను అనుసరించి ఉంటుంది.

లెఫ్ట్ హ్యాండ్ ట్రాఫిక్ (ఎల్‌హెచ్‌టీ), రైట్ హ్యాండ్ ట్రాఫిక్(ఆర్‌హెచ్‌టీ) అనేదాన్ని బట్టి స్టీరింగ్ అమరిక కూడా ఉంటుంది.

ఎల్‌హెచ్‌టీ విధానం ఉన్న దేశాలలో వాహనాలు రోడ్డుకు ఎడమ వైపే నడపాలి. ఆర్‌హెచ్‌టీ విధానం అమలులో ఉన్న చోట రోడ్డుకు కుడివైపే వాహనాలు నడపాలి.

వాహనాలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు కూడా దీన్ని అనుసరించే ఉంటాయి.

ఉదాహరణకు, లెఫ్ట్ హ్యాండ్ ట్రాఫిక్ ఉన్న దేశాలలో.. అంటే, భారత్ వంటి కొన్ని దేశాలలో ముందు వెళ్తున్న వాహనాన్ని దాటాలంటే కుడివైపు నుంచి దాటాలి.

కానీ, చైనా, రష్యా, జర్మనీ వంటి కొన్ని దేశాలలో వాహనాలను రోడ్లకు కుడివైపున నడుపుతారు. అంటే అక్కడ ఆర్‌హెచ్‌టీ అమలులో ఉన్నట్లు. అలాంటి చోట ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ వాహనానికి ఎడమ వైపు నుంచి దాటాలి.

ఇది భారతదేశంలోని రహదారులపై పాటించే విధానానికి పూర్తిగా వ్యతిరేకం.

ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ రెండు తరహా విధానాలు.. అంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, రైట్ హ్యాండ్ డ్రైవ్.. రెండూ కలిసి అమలులో ఉండవు. ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది.

traffic

ఫొటో సోర్స్, Getty Images

ఈ పద్ధతులు ఎలా మొదలయ్యాయి?

రోడ్లపై వాహనాలు వెళ్లడానికి సంబంధించిన పద్ధతులలో బ్రిటన్, బ్రిటిష్ సామ్రాజ్యం కీలక పాత్ర పోషించాయి.

'బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించడం ప్రారంభించినప్పుడు వారితో పాటు ఆ దేశానికి చెందిన కార్లు కూడా ఆయా దేశాలకు వెళ్లాయి. బ్రిటిషర్లు పాటించే డ్రైవింగ్ నియమాలే ఆయా దేశాలలో అనుసరించడం ప్రారంభమైంది' అని 'ఆస్క్‌కార్‌గురు' ఫౌండర్, ఎడిటర్ అయిన అమిత్ ఖరే బీబీసీ హిందీతో చెప్పారు.

'ఆ కారణంగానే బ్రిటిషర్లు పాలించిన అనేక దేశాలలో ఆ దేశం తరహాలోనే లెఫ్ట్ హ్యాండ్ ట్రాఫిక్ అనుసరిస్తున్నారు. అక్కడ తిరిగే కార్లు, ఇతర వాహనాలకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. హాంకాంగ్, భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, థాయిలాండ్, ఇండోనేసియాల్లో ఇంగ్లండ్ తరహాలో ఇదే విధానం ఉంటుంది' అని ఖరే చెప్పారు.

'బ్రిటిషర్ల పాలన లేని అనేక దేశాలలో రైట్ హ్యాండ్ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ కార్లు, ఇతర వాహనాలకు స్టీరింగ్ ఎడమ వైపు ఉంటుంది' అని ఖరే చెప్పారు.

car manufacturing

ఫొటో సోర్స్, Getty Images

మోటార్ వాహనాల చట్టం ఏం చెప్తోంది?

అయితే.. భారత్‌లో కొన్ని మినహాయింపుల మేరకు ఎడమవైపు స్టీరింగ్ ఉన్న వాహనాలను అనుమతిస్తారు.

'హెచ్‌టీ ఆటో' కథనం ప్రకారం.. ఏదైనా విదేశీ కంపెనీ కానీ, స్వదేశీ కంపెనీ కానీ 'రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్'(ఆర్ అండ్ డీ) కోసం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వాహనం తేవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కారణాలు సహేతుకమైతే ప్రభుత్వం అనుమతులిస్తుంది.

ఇలాంటి సందర్భాలలోనే కాకుండా రైట్ హ్యాండ్ ట్రాఫిక్ ఉండే దేశాలకు సంబంధించిన నాయకులు భారత్‌కు వచ్చినప్పుడు, వారితో పాటు వారి వాహనాలను కూడా తీసుకొస్తే వాటికి తాత్కాలికంగా అనుమతిస్తారు. అమెరికా అధ్యక్షుడు వంటివారు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.

అలాంటి సందర్భాలలో ఆ వాహనాలు భారతదేశ రోడ్లపై నడిపేటప్పుడు అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు.

ఇక.. దేశంలో కొందరు రాజకుటుంబీకుల వద్ద ఉన్న కొన్ని పాత వాహనాలకు కూడా ఎడమ వైపు స్టీరింగ్ ఉంటుంది. ఇవి కేవలంలో ప్రదర్శనలలో ఉంచుతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)