బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6, 11న.. జూబ్లీహిల్స్ పోలింగ్ 11న - నవంబర్ 14న లెక్కింపు

ఫొటో సోర్స్, Election Commission of India
బిహార్ శాసనసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివరాలు వెల్లడించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలింగ్, లెక్కింపు తేదీలు ప్రకటించారు.
బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరుగుతుంది.
రెండో దశ పోలింగ్ 11వ తేదీన జరుగుతుంది.
ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు.


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న
బిహార్ ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాలలోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
అందులో భాగంగా తెలంగాణలోని జూబ్లీహిల్స్ స్థానానికీ ఎన్నిక నిర్వహిస్తారు.
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
జూబ్లీహిల్స్ స్థానానికి నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది.
జూబ్లీహిల్స్ స్థానానికి నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 21. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 24.

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లున్నాయని.. అందులో జనరల్ స్థానాలు 203 కాగా ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు 2, ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు 38 ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
ప్రస్తుత ఎన్నికలలో ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు కాగా అందులో 100 ఏళ్లు దాటినవారు 14 వేల మంది, తొలిసారి ఓటు హక్కు పొందినవారు 14 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుత బిహార్ శాసనసభ గడువు నవంబరు 22, 2025న ముగియనుంది. దీంతో అక్కడ నవంబరులోనే ఎన్నికలు నిర్వహించనున్నారు.
కిందటిసారి అంటే 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఇక్కడ ఎన్నికలను అక్టోబరు 28 నుంచి నవంబర్ 7 మధ్యన మూడు దశల్లో నిర్వహించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తొలి అభ్యర్థుల జాబితా ‘ఆప్’ నుంచి..
కాగా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడానికి కొద్ది గంటల ముందు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
నిరుద్యోగం, వలసలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో మొత్తం 243 సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే చెప్పింది.
తొలి విడత జాబితాను 11 మంది పేర్లతో విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
122 సీట్లు ఎవరికొస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావడానికి ఏ పార్టీకి అయినా, కూటమి అయినా 122 సీట్లు సాధించాలి.
ప్రస్తుతం బిహార్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి.
బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ప్రస్తుతం బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 77 మంది, జేడీయూకు 45 మంది, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)(లిబరేషన్)లో 11 మంది ఎమ్మెల్యేలు, హిందుస్తానీ అవాం మోర్చా(సెక్యులర్)లో నలుగురు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా( మార్క్సిస్ట్) నుంచి ఇద్దరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహదుల్ నుండి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ సారి కూడా ఎన్డీఏ, మహా ఘట్‌బంధన్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్డీఏ కూటమిలో ఎవరెవరున్నారు?
జేడీయూ
బీజేపీ
ఎల్‌జేపీ (ఆర్)
హెచ్ఏఎం( సెక్యూలర్)
ఆర్ఎల్ఎం ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మహా ఘట్‌బంధన్‌లో ఎవరెవరున్నారు?
ఆర్‌జేడీ,
కాంగ్రెస్,
సీపీఐ
సీపీఎం
సీపీఐ (ఎంఎల్)
వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)
జేఎంఎం
నేషనల్ ఎల్‌జేపీ ఉన్నాయి.
అసదుద్దీన్ ఒవైసీ కి చెందిన ఏఐఎంఐఎం ఏ కూటమిలోనూ భాగం కాదు. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అయిదుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నలుగురు ఆర్‌జేడీలో చేరారు.

ఫొటో సోర్స్, Getty Images
2020, 2015 ఎన్నికల తరువాత ఏం జరిగింది?
బిహార్‌లో 2020 ఎన్నికలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆగస్టు 2022లో నితీశ్ కుమార్ ఈ కూటమితో తెగతెంపులు చేసుకుని మహా ఘట్‌బంధన్‌తో చేతులు కలిపారు.
బీజేపీ, జేడీయూ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడంతో తాను చావడానికైనా సిద్ధమే కానీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని నితీశ్ కుమార్ చెప్పారు. మరోవైపు నితిశ్‌కుమార్‌కు బీజేపీ ఎన్నటికీ తలుపులు తెరవదని అమిత్ షా కూడా ప్రకటించారు.
కానీ ఆ రాష్ట్ర రాజకీయాలు కొద్దికాలంలోనే మారిపోయాయి.
2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలలో నితీశ్ కుమార్‌ను కీలక నేతగా పరిగణించారు. కానీ 2024 జనవరిలో ఆయన మరోసారి ఎన్డీఏలో చేరి ఆర్జేడీకి దూరం జరిగారు.
అంతకుముందు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ కలిసి పోటీ చేసి గెలిచాయి.కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 2017లో ఆ కూటమి విడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
తేలని సీట్ల పంపకాలు
అటు ఎన్డీఏ కానీ, ఇటు మహా ఘట్‌బంధన్ కానీ సీట్ల పంపకాల సమాచారమేదీ ఇంతవరకు వెల్లడించలేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు కూటములు ప్రతిష్టంభనలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. రెండు కూటములలోని చిన్న పార్టీలు తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని కోరుతున్నాయి.
అయితే నితీశ్ కుమార్ అనారోగ్యంబారిన పడ్డారనే వార్తలతో జేడీయూలో ఆయన వారసుడి గురించిన ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్, చిరాగ్ పాశ్వన్‌లపైనా ఈసారి చాలామంది దృష్టి ఉంది.
సొంత పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్‌ను ఇటీవల 'బీబీసీ' ఇంటర్వ్యూలో.. మీకు ఎన్ని సీట్లు గెలుస్తారనే నమ్మకం ఉందని అడిగితే తన పార్టీ ఉంటే అగ్రభాగాన, లేదంటే అట్టడుగున ఉంటుందని బదులిచ్చారు.
నిరుద్యోగం, వలసలు, విద్యారంగంలోని సమస్యలే ప్రధానంగా ఆయన మొత్తం 243 సీట్లలోనూ తన అభ్యర్థులను బరిలో ఉంచుతానని చెప్పారు.
బిహార్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ కళ్లు తెరిచింది. మూడునెలల కిందట ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమాడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఓ ఫేస్‌బుక్ పోస్టు కారణంగా పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు తేజ్ ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎస్ఐఆర్‌పై వాదోపవాదాలు
కాగా బిహార్ ఎన్నికల సందర్భంగా సీట్ల పంపకాలపై రాజకీయపార్టీల మధ్య చర్చలు సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ప్రస్తుతం బిహార్‌లో మొత్తం ఓటర్లు 7.42 కోట్లమంది.
బిహార్ ఎన్నికలకు కొద్దినెలల ముందు ఎలక్షన్ కమిషన్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించేందుకు ఎస్ఐఆర్ ఓ ప్రక్రియ అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














