అక్కడ మద్య నిషేధం ఉంది.. కానీ, కల్తీ మద్యం తాగి 35 మంది చనిపోయారు

- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
శకుంతలాదేవి కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆమె భర్త మోహన్ సాహ్ అంత్యక్రియలు గురువారం ఉదయం ముగిశాయి.
శకుంతలాదేవి లాంటి మరికొందరు కల్తీ మద్యం సృష్టించిన విలయానికి బాధితులయ్యారు.
అక్టోబరు 16 నుంచి బిహార్‌లోని సరన్, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం కారణంగా ప్రజలు మరణిస్తున్నారు.
సరన్‌లోని మష్రాఖ్, సివాన్‌లోని భగవాన్‌పూర్ హాట్ బ్లాక్‌లో కొందరు చనిపోయారు.
బిహార్ డీజీపీ అలోక్ రాజ్ ఈ మరణాలకు కారణం కల్తీ మద్యమేనని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 35 మంది మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అలాగే దీనిలో కొన్ని మద్యం మాఫియా పేర్లూ బయటకొచ్చాయని తెలిపారు.
దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని అధికారులను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశించారు.

కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?
శకుంతలాదేవి తన భర్త మోహన్ సాహ్ గురించి చెబుతూ.. “ఆయన రాత్రి మద్యం తాగి వచ్చాడు, తెల్లవారుజామున 3 గంటలకు తనకు ఏదోలా ఉందన్నాడు. ఆ తర్వాత కళ్లు కనిపించడం లేదు అని చెప్పాడు. మేం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, డాక్టర్ పట్నా తీసుకెళ్లమన్నారు. కానీ, దారిలోనే నా భర్త చనిపోయాడు’’ అని తెలిపారు.
అయిదుగురు పిల్లల తండ్రి అయిన మోహన్ సాహ్ తన సంపాదనలో రోజూ కొంత భాగాన్ని మద్యానికి ఖర్చు చేసేవారు.
11వ తరగతి చదివే మోహన్ కుమార్తె ప్రియాంక గ్రామంలో మద్యం సులభంగా దొరుకుతుందని చెప్పారు.
భగవాన్‌పూర్ హాట్‌కు చెందిన సీతాదేవి కొడుకు మనోజ్ పెయింటర్‌గా పని చేస్తున్నారు. మనోజ్ తాగుడు కారణంగా ఇప్పుడు కంటిచూపు కోల్పోయే దశలో ఉన్నారు.
“రాత్రి మద్యం తాగి నిద్రపోయాడు. మధ్యలో లేచి కళ్లు కనిపించడం లేదని చెప్పడం మొదలుపెట్టాడు. మేం డాక్టర్‌ని పిలిపించి, ఇంజెక్షన్ చేయించి, సివాన్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి చికిత్స కోసం పట్నా పంపించారు’’ అని సీతాదేవి చెప్పారు.
‘‘నా కొడుక్కు కంటిచూపు పోతే, వృద్ధులమైన మేం అతని కుటుంబ భారాన్ని మోయాల్సి ఉంటుంది’’ అని సీతాదేవి అన్నారు.

‘ఇంటికే మద్యం డెలివరీ’
సునర్‌దేవ్ రాయ్ ఇల్లు సీత ఇంటికి కొంత దూరంలో ఉంది. అక్కడ ప్రజలంతా గుమిగూడారు. వాళ్లు సునర్‌దేవ్‌ను కలవడానికి వచ్చారు. ఆయన గురువారమే ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చారు.
“నేను ఒకే ఒక్క పాలిథీన్ తాగాను. అయితే మద్యం కారణంగా కొంతమంది చనిపోవడం ప్రారంభించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి రెండు బాటిళ్ల నీళ్లు తాగించారు. రాత్రంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి ఉదయం పంపించేశారు’’ అని సునర్‌దేవ్ రాయ్ తెలిపారు.
సునర్‌దేవ్ రాయ్ ఇంటి బయట గుమిగూడిన వాళ్లలో ఎక్కువ మంది కూలీలు, వాళ్ల భార్యలు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. “2016లో 400 మిల్లీ లీటర్ల మద్యం 50 రూపాయలకు దొరికేది. ఇప్పుడు రహస్యంగా విక్రయించడం వల్ల 50 రూపాయలకు 100 ఎంఎల్ మాత్రమే వస్తోంది. మద్య నిషేధం అమలు కావడం లేదు. కానీ హోమ్ డెలివరీ ఉంది” అన్నారు.
‘బీబీసీ’ ఆ కల్తీ మద్యాన్ని విక్రయించే పౌచ్‌ను చూసింది, దాని మూతిని కేవలం అలా ముడి వేశారంతే.
“ప్రజలందరూ పని ముగించుకుని వస్తూ నేరుగా ఇంటికి రాకుండా బయట మద్యం తాగి వస్తారు. వద్దంటే కొట్లాడతారు, మా మీద దాడి చేస్తారు’’అని అక్కడున్న కబూతరీ దేవి చెప్పారు.
దక్షిణ్ సాగర్ సుల్తాన్‌పూర్ పంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌడియా పంచాయతీలోని ముసాహర్ తోలాలో దహన సంస్కారాలకు ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కల్తీ మద్యం కారణంగా ఇద్దరు మహిళలు సహా అయిదుగురు మరణించారు.
సివాన్ జిల్లా మేజిస్ట్రేట్ ముకుల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. “మొత్తం 63 మంది ప్రభుత్వ ఆసుపత్రులలో చేరారు. వీరిలో 30 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 13 మందిని చికిత్స కోసం పట్నాకు పంపారు’’ అని తెలిపారు. రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ, గ్రామంలో మద్యం ఎలా లభిస్తుందనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

2022లోనూ మస్రఖ్, భగవాన్‌పూర్‌లో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణించారు.
సరన్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ మాట్లాడుతూ, "మేము ఖాళీ మద్యం పౌచ్‌లోని మద్యాన్ని పరీక్షించగా, అందులో 80 శాతం మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు వెల్లడైంది" అన్నారు.
ఈ విషయమై పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అంకిత్ కుమార్‌తో బీబీసీ మాట్లాడగా, ఆయన.. “మనం ఆల్కహాల్ గురించి మాట్లాడితే, అది ప్రధానంగా మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, కాలేయం దాన్ని గ్రహిస్తుంది, మూత్రపిండాలు మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు పంపుతాయి. కానీ మన శరీరంలో మిథైల్ ఆల్కహాల్‌ను జీర్ణం చేసుకునే ఎంజైమ్‌లు లేవు, దాని కారణంగా 30 నుంచి 40 ఎంఎల్ మన శరీరంలోకి ప్రవేశించినా అది అంధత్వం, మరణానికి కారణం కావచ్చు’’ అని తెలిపారు.
చావులపై రాజకీయాలు
సివాన్, సరన్‌లలో ఈ మరణాల తరువాత, బిహార్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
మద్యం తాగొద్దని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయగా.. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, మద్య నిషేధం ఉన్నా ప్రతి చోటా మద్యం అందుబాటులో ఉందంటే అది హోం శాఖ, ముఖ్యమంత్రి వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.
బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. అయితే రాష్ట్రంలో తరచూ కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు.
రాష్ట్రంలో కల్తీ మద్యానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయల సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నారు.
కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా నిషేధ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరోవైపు, ఇటీవల పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్, “బిహార్‌లో మద్య నిషేధం అమలు కావడం లేదు. ఇది ప్రభుత్వ రికార్డులలో మాత్రమే ఉంది. ప్రతి ఇంట్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి’’ అంటున్నారు.
తమ పార్టీ జన్ సురాజ్ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే హామీ ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














