బిహార్ ఎన్నికలు: నితీశ్ వారసుడిపై చర్చ, తేజ్ ప్రతాప్ కొత్త పార్టీ.. ఈ సారి ఎన్నికలు ఎలా ఉండనున్నాయి?

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, పత్రాలను వెరిఫై చేస్తున్న బూత్-స్థాయి అధికారులు

బిహార్ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సీట్ల పంపకాలపై రాజకీయపార్టీల మధ్య చర్చలు సాగుతున్న వేళ ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ప్రస్తుతం బిహార్‌లో మొత్తం ఓటర్లు 7.42 కోట్లమంది.

బిహార్ ఎన్నికలకు కొద్దినెలల ముందు ఎలక్షన్ కమిషన్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించేందుకు ఎస్ఐఆర్ ఓ ప్రక్రియ అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఇక ఎన్నికల సంఘం మరికొద్దిరోజులల బిహార్ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బిహార్‌ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి?

ప్రస్తుత బిహార్ శాసనసభ గడువు నవంబరు 22, 2025న ముగియనుంది. దీంతో అక్కడ నవంబరులోనే ఎన్నికలు జరగనున్నాయి.

కిందటిసారి అంటే 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఇక్కడ ఎన్నికలను అక్టోబరు 28 నుంచి నవంబర్ 7 మధ్యన మూడు దశల్లో నిర్వహించారు.

కరోనా సమయంలో జరిగిన ప్రధాన ఎన్నికలు ఇవే. కరోనాను దృష్టిలో పెట్టుకుని తదనుగుణమైన నిబంధనలను అమలు చేశారు.

నితిష్ కుమార్, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, నితిష్ కుమార్

2020 తరువాత ఏం జరిగింది?

బిహార్‌లో 2020 ఎన్నికలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆగస్టు 2022లో నితీశ్ కుమార్ ఈ కూటమితో తెగతెంపులు చేసుకుని మహాఘట్ బంధన్‌తో చేతులు కలిపారు.

బీజేపీ, జేడీయూ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడంతో తాను చావడానికైనా సిద్ధమే కానీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని నితీశ్ కుమార్ చెప్పారు. మరోపక్క నితిశ్‌కుమార్‌కు బీజేపీ ఎన్నటికీ తలుపులు తెరవదని అమిత్ షా కూడా ప్రకటించారు.

కానీ రాజకీయాలలో ఏదీ పరమసత్యం కాకపోవడంతో మరోసారి పరిస్థితులు మారిపోయాయి.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి ఏర్పాటుకు జరిగిన ప్రయత్నాలలో నితీశ్ కుమార్‌ను కీలక నేతగా పరిగణించారు. కానీ 2024 జనవరిలో ఆయన మరోసారి ఎన్డీఏలో చేరి ఆర్జేడీకి దూరం జరిగారు.

గతంలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జెడీయూ, ఆర్జేడీ కలిసి పోటీ చేసి గెలిచాయి.కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 2017లో ఈ కూటమి విడిపోయింది.

బిహార్ ఎన్నికలు

ఇప్పుడు బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావడానికి ఏ పార్టీకి అయినా, కూటమికి అయినా 122 సీట్లు సాధించాలి.

ప్రస్తుతం బిహార్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో జెడీయూ, బీజేపీ భాగస్వామ్యులుగా ఉన్నాయి.

బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

ప్రస్తుతం బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 77 మంది, జేడీయూకు 45 మంది, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)(లిబరేషన్)లో 11 మంది ఎమ్మెల్యేలు, హిందుస్తానీ అవాం మోర్చా(సెక్యులర్)లో 4 మంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా( మార్క్సిస్ట్) నుంచి ఇద్దరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇద్దరు, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహదుల్ నుండి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

నితిష్ కుమార్

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఈ సారి కూడా ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఎన్డీఏ కూటమిలో

  • జేడీయూ
  • బీజేపీ
  • ఎల్‌జేపీ (ఆర్)
  • హెచ్ఏఎం( సెక్యూలర్)
  • ఆర్ఎల్ఎం ఉన్నాయి.

మహాఘట్ బంధన్‌లోె

  • ఆర్‌జేడీ,
  • కాంగ్రెస్,
  • సీపీఐ
  • సీపీఎం
  • సీపీఐ (ఎంఎల్)
  • వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)
  • జేఎంఎం
  • నేషనల్ ఎల్‌జేపీ ఉన్నాయి.

అసదుద్దీన్ ఒవైసీ కి చెందిన ఏఐఎంఐఎం ఏ కూటమిలోనూ భాగం కాదు. 2020 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నలుగురు ఆర్‌జేడీలో చేరారు.

రాహుల్ గాంధీ, కూటమి బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

సీట్ల పంపకంపై ప్రతిష్ఠంభన

అటు ఎన్డీఏ కానీ, ఇటు మహాఘట్ బంధన్ కానీ సీట్ల పంపకాల సమాచారమేదీ వెల్లడించ లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు కూటములు ప్రతిష్ఠంభనలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇరు కూటములలోని చిన్న పార్టీలు తమకు ‘‘గౌరవప్రదమైన సీట్లు’’ కోరుతున్నాయి.

అయితే నితీశ్ కుమార్ అనారోగ్యంబారిన పడ్డారనే వార్తలతో జేడీయూలో ఆయన వారసుడి గురించిన ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్, చిరాగ్ పాశ్వన్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఈ సారి ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశాలు.

నితీశ్ కుమార్ నుంచి విడిపోయిన తర్వాత సొంత పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్‌ను బీబీసీ ఇంటర్వ్యూలో మీకు ఎన్ని సీట్లు గెలుస్తారనే నమ్మకం ఉందని అడిగితే తన పార్టీ ఉంటే అగ్రభాగాన, లేదంటే అట్టడుగున ఉంటుందని బదులిచ్చారు.

నిరుద్యోగం, వలసలు, విద్యారంగంలోని సమస్యలే ఆలంబనగా ఆయన మొత్తం 243 సీట్లలోనూ తన అభ్యర్థులను నిలబెట్టనున్నారు.

బిహార్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ కళ్లు తెరిచింది. మూడునెలల కిందట ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమాడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఓ ఫేస్‌బుక్ పోస్టు కారణంగా పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు తేజ్ ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.

బిహార్ మొదటి ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, http://postagestamps.gov.in/

ఫొటో క్యాప్షన్, బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సిన్హా జ్ఞాపకార్థం 2016లో ప్రభుత్వం తపాలాబిళ్లను విడుదల చేసింది.

తొలి సీఎం ఎవరంటే..

రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపామని, యువతకు ఉద్యోగాలు కల్పించామని, మహిళలకు, యువతులకు అనేక పథకాలు ప్రారంభించామంటూ ఎన్డీఏ ప్రచారం చేస్తోంది.

మరోపక్క ఉద్యోగాలు, పేపర్ లీక్, ఎస్ఐఆర్ తదితర విషయాలపై ఎన్డీఏను మహాఘట్ బంధన్ నిలదీస్తోంది. యువతకు ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇస్తోంది. ఉపాధి కల్పిస్తామని చెబుతోంది.

తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ అధికార యాత్ర’లో రాహుల్ గాంధీ పదేపదే ‘ఓట్లచోరీ’ అంశాన్ని లేవనెత్తారు.

బిహార్‌లో మొట్టమొదటిసారి 1952లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

అప్పటి నుంచి రాష్ట్రంలో 17 సార్లు ఎన్నికలు జరిగాయి.

2005 ఫిబ్రవరి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ అక్టోబరు నెలలో ఎన్నికలు నిర్వహించారు.

స్వాతంత్య్రం తర్వాత జరిగిన మొదటి 1951 ఎన్నికలలో అనేక పార్టీలు పోటీ చేశాయి, కానీ ఆ సమయంలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ.

ఆఎన్నికలలో, కాంగ్రెస్ 322 సీట్లలో 239 సీట్లు గెలుచుకుంది.

1957 ఎన్నికలలో కాంగ్రెస్ 312 సీట్లలో 210 గెలుచుకుంది.

1962 ఎన్నికల్లో 318 సీట్లలో కాంగ్రెస్ 185 సీట్లను గెలుచుకుంది. స్వతంత్ర పార్టీ 50 స్థానాలు గెలుచుకుంది.

శ్రీ కృష్ణ సిన్హా బిహార్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)