రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు, నిరాధారమంటూ తోసిపుచ్చిన ఎలక్షన్ కమిషన్, ఇంకా ఏమందంటే..

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, INDIAN NATIONAL CONGRESS

ఫొటో క్యాప్షన్, విపక్షాలు బలంగా ఉన్న చోట ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు

ఓటర్ల పేర్లను నకిలీ లాగిన్‌ల సాయంతో తొలగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 'ఓట్ల దొంగలను' రక్షిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని పేర్లను డిలీట్ చేశారని (తొలగించారని) అన్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీల ఓట్లను దొంగిలించారని అన్నారు.

ఎన్నికల్లో అక్రమాలు ఎలా జరుగుతున్నాయో దేశంలోని యువతకు చూపించే ప్రయత్నం ఇదంటూ ప్రెజెంటేషన్‌కు ముందు రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్‌పై స్పందించిన ఎన్నికల సంఘం, ఆయన ఆరోపణలు తప్పు, నిరాధారమైనవంటూ తోసిపుచ్చింది. బీజేపీ కూడా రాహుల్ ఆరోపణలను తప్పుబట్టింది.

''ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గురించి నేను ఒక ముఖ్యమైన మాట చెప్పబోతున్నా. ప్రతిపక్ష నేతగా నేను ఈ మాట చెబుతున్నా. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్ రక్షిస్తున్నారని స్పష్టంగా రుజువు చేసే ఆధారాలను నేను చూపించబోతున్నాను. ఇప్పుడు హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది" అని దిల్లీలో ఒక ప్రజెంటేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ విషయంలో కర్ణాటకలోని ఆలంద నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపించారు.

"కర్ణాటకలో ఒక నియోజకవర్గం ఉంది. అక్కడి 6,018 ఓట్లను తొలగించేందుకు ఎవరో ప్రయత్నించారు. 2023 ఎన్నికల సమయంలో ఆలందలో మొత్తం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయో మాకు తెలియదు. అవి 6,018 కంటే చాలా ఎక్కువే అయ్యుంటాయి. కానీ ఈ 6,018 ఓట్లను తొలగిస్తున్నప్పుడు ఒకరు అనుకోకుండా పట్టుబడ్డారు.

అక్కడ ఏం జరిగిందంటే, బూత్ స్థాయి అధికారి ఒకరి తన అంకుల్ ఓటు గల్లంతైనట్లు గమనించారు. ఆ ఓటును ఎవరు తొలగించారని ఆ అధికారి దర్యాప్తు చేయగా, పొరుగు వ్యక్తి ఈ పని చేసినట్లుగా తెలిసింది.

ఇది ఎలా జరిగిందని ఆ పొరుగు వ్యక్తిని అడగగా, తాను ఏ ఓటునూ తొలగించలేదని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి, ఓటు కోల్పోయిన వ్యక్తికి దీని గురించి ఏమీ తెలియదు. ఇక్కడ ఇంకెవరో ఈ వ్యవస్థను హైజాక్ చేసి ఓట్లను తొలగించారు'' అని రాహుల్ గాంధీ వివరించారు.

ఎన్నికల సంఘం

ఫొటో సోర్స్, ECI

ఎన్నికల సంఘం ఏమన్నదంటే...

రాహుల్ గాంధీవి తప్పుడు ఆరోపణలని, నిరాధారమైనవని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేసింది.

''ఒక పౌరుడి ఓటును ఆన్‌లైన్‌లో డిలీట్ చేయడం కుదరదు. ఇది అపోహ. 2023లో ఆలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల పేర్లను తొలగించడానికి కొన్ని విఫల యత్నాలు జరిగాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి స్వయంగా ఎన్నికల సంఘమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది'' అని ట్వీట్‌లో పేర్కొంది.

'రికార్డుల ప్రకారం, 2018లో ఆలంద శాసనసభ నియోజకవర్గం నుంచి సుభాష్ గుట్టేదార్ (బీజేపీ), 2023లో కాంగ్రెస్ నుంచి బి.ఆర్. పాటిల్ గెలుపొందారు' అని ఎన్నికల సంఘం పేర్కొంది.

బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్
ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్

'రాహుల్ బాంబులేవీ పేలవు'

రాహుల్ గాంధీ దేశ ఓటర్లను అవమానిస్తున్నారని బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

''రాహుల్ గాంధీకి అసలు రాజ్యాంగం అర్థమవుతుందా? ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. వాటి గురించి ఆయన ఏమైనా చేశారా? ఆయనకు చట్టాలు, సుప్రీంకోర్టు సూచనలు అర్థం కావు. కేవలం 'రాజ్యాంగం, రాజ్యాంగం' అని అరుస్తుంటారు. అసలు విషయం స్పష్టం.

రాహుల్ గాంధీకి ఓట్లు రాకపోతే మనం ఏం చేయగలం? ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు కొన్ని విలువలు ఉండాలి. దేశ ఓటర్లను అవమానిస్తున్నారు. ప్రజలు ఆయనకు మరోసారి గట్టి సమాధానం ఇస్తారు. ఆయన బాంబులేవీ పేలవు. ఆయన ఎవరినీ నమ్మరు. ఆయన వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నా" అని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

బిహార్‌, ఓటర్ అధికార్ యాత్ర, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్

'అణుబాంబు కంటే పెద్ద హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది'

ఓట్ల దొంగతనానికి సంబంధించిన నిజాలు త్వరలో దేశం ముందుకు రాబోతున్నాయని బిహార్‌లో 'ఓటర్ అధికార్ ర్యాలీ' సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.

''ఓట్ల దొంగతనానికి సంబంధించి ప్రజల ముందు సంచలన ఆధారాలు బయట పెట్టబోతున్నాం. అణుబాంబు కంటే పెద్ద హైడ్రోజన్ బాంబ్ పేలబోతోంది. మహాత్మాగాంధీని చంపిన శక్తులు, ఇప్పుడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, మేం అలా జరగనివ్వం.

బిహార్‌లో అద్భుతమైన స్పందన లభించింది. నల్ల జెండాలు చూపించిన బీజేపీ వాళ్లంతా సరిగ్గా వినండి. అణుబాంబు కంటే హైడ్రోజన్ బాంబు పెద్దది. అది వస్తోంది. ఓట్ల దొంగతనం గురించి దేశానికి తెలియబోతోంది. ఈ హైడ్రోజన్ బాంబు తర్వాత నరేంద్ర మోదీ దేశానికి తన ముఖం చూపించలేరు" అని యాత్ర సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్

'మహారాష్ట్ర, హరియాణాల్లో కూడా ఓట్ల చోరీ'

ఓట్ల చోరీ వ్యవహారంపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ విలేఖరుల సమావేశం నిర్వహించారు. 22 పేజీల వివరాలను మీడియా ముందు ఉంచారు. కర్ణాటక ఓటర్ల జాబితాను చూపిస్తూ ఓటర్ల జాబితాలో అనుమానాస్పద ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.

మహారాష్ట్ర, హరియాణాల్లోనూ బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు.

కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాను స్క్రీన్‌పై చూపిస్తూ, ఇక్కడ లక్ష ఓట్లను దొంగిలించారని రాహుల్ గాంధీ చెప్పారు.

"కర్ణాటకలో మనం 16 సీట్లు గెలవాలి. కానీ 9 సీట్లు మాత్రమే గెలిచాం" అని అన్నారు.

బెంగుళూరు సెంట్రల్ సీటులో కూడా లక్ష ఓట్లు దొంగిలించారని ఆయన ఆరోపించారు.

మహారాష్ట్ర ఎన్నికలకు ముందు 40 లక్షల నకిలీ ఓటర్లను చేర్చారని, హరియాణాలో ఓట్ల దొంగతనం కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు.

ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆయన నిందించారు.

ఎన్నికల సంఘం వంటి సంస్థకు అసలు అస్థిత్వమే లేదని దేశానికి చూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని రాహుల్ అన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

'రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలి'

దీని తర్వాత, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, దిల్లీలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

''ఎన్నికల సంఘం భుజాలపై తుపాకీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అఫిడవిట్ సమర్పించాలి, లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలి'' అని జ్ఞానేష్ కుమార్ అన్నారు.

అయితే, ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు ఈ పత్రికా సమావేశంలో నేరుగా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వలేదని ఆ తర్వాత కాంగ్రెస్ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)