రియాద్ కామెడీ ఫెస్టివల్: మహిళలు, సెక్స్, హోమో సెక్సువాలిటీ గురించి జోకులేశారు- ఏమిటీ వివాదం?

ఫొటో సోర్స్, facebook.com/jessicakirson
- రచయిత, నూర్ నంజి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"సెక్సు మీద, భార్యల మీద జోకులు వేస్తున్నారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఇలాంటి కామెడీ అసాధారణ అంశం"
రియాద్‌లోని కామెడీ ఫెస్టివల్‌కు హాజరైన తర్వాత సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఓ మహిళ చేసిన వ్యాఖ్యలివి.
"ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజలు దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అంతకు ముందెన్నడూ ఇక్కడ అలాంటి వాతావరణం చూడలేదు" అని ఆమె అన్నారు.
అమెరికా కామెడీ స్టార్లు డేవ్ స్కిప్పర్, బిల్‌బర్‌ల కామెడీ షోకు హాజరయ్యారు సారా (ఇది ఆమె అసలు పేరు కాదు). సౌదీ అరేబియాలో మావవ హక్కుల పరిస్థితుల గురించి వాళ్లు ఎలాంటి కామెంట్లు చేయలేదని ఆమె చెప్పారు.
సౌదీ అరేబియాలో జనం మానవ హక్కుల లాంటి వాటి గురించి శ్రద్ధ చూపించడం లేదని, అలా చూపిస్తే వాళ్లిక్కడ బతకలేరని ఆమె అన్నారు.


ఫొటో సోర్స్, @Enjoy_Saudi
కమెడియన్లపై విమర్శలు
ఈ కామెడీ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చినందుకు ప్రముఖ కమెడియన్లు జిమ్మీకార్, జాక్ వైట్‌హాల్, కెవిన్ హార్ట్స్, రస్సెల్ పీటర్స్, ఒమిద్ జాలిలి వంటి వారిపై తోటి కళాకారులు విమర్శలు గుప్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైనందుకు క్షమాపణలు చెప్పిన కమెడియన్ జెస్సికా కెర్సన్ తనకు లభించిన ఫీజును మానవ హక్కుల సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
సౌదీ అరేబియాలో మానవహక్కుల పరిస్థితులపై అనేక అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు సౌదీ అరేబియా కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.
కామెడీ ఫెస్టివల్ బ్రహ్మాండంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కమెడియన్లు, ఇతరుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
పురుష కళాకారుల ప్రదర్శనతో గత వారం రియాద్ కామెడీ ఫెస్టివల్ ప్రారంభమైంది.
ఈ వేడుకలకు హాజరైన వారిలో జైన్( భద్రత దృష్ట్యా పేరు మార్చడం జరిగింది) ఒకరు.
కమెడియన్లు షోలో భాగంగా హోమో సెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ల మీద జోకులు వేశారు. ఇందులో ఇంకా చాలా అశ్లీల కంటెంట్ ఉందని జైన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మొదటి పది నిముషాలు పూర్తిగా సెక్స్ గురించేనని ఆమె అన్నారు.
సంప్రదాయవాదాన్ని బలంగా విశ్వసించే సమాజంలో స్వలింగ సంపర్కం నేరంగా భావించే దేశంలో ఇలాంటి జోకులు విని ఆశ్చర్యపోయినట్లు జైన్ వివరించారు.
సౌదీ అరేబియాలో హోమో సెక్సువాలిటీ నేరం. స్వలింగ సంపర్కులకు అక్కడ ఉరిశిక్ష విధిస్తారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
"సౌదీ అరేబియాలోని ఇలాంటి జోకుల్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడి ప్రజలు స్టాండప్ కామెడీని ఎన్నడూ చూడలేదు. అందుకే ఈ రకమైన కంటెంట్ వచ్చింది" అని జైన్ అన్నారు.
"ఈ జోకులకు మంచి స్పందన వచ్చింది. నా ముందు వరసలో కూర్చున్న స్థానిక మహిళలు కమెడియన్ల జోకులకు నవ్వుతున్నారు" అని ఆమె చెప్పారు.
డేవ్ చాపెల్ షో కూడా వివాదాస్పదంగా ఉందని, ఆయన ట్రాన్స్‌జెండర్ల గురించి జోకులు వేశారని సారా చెప్పారు.
జలిలి అనే అనే కమెడియన్, సౌదీ సంస్కృతిని అవమానించారని, హిజాబ్, మహిళల డ్రైవింగ్‌లాంటి వాటి గురించి కామెంట్లు చేశారని జైన్ చెప్పారు.
బర్ ఒకింత భయంగా కనిపించినప్పటికీ. ఆయన కామెడీకి తన భార్య, పిల్లలకే పరిమితం చేశారు.
ఈ కామెడీ వేడుకలకు భారీ సంఖ్యలో సౌదీ ప్రజలు, సౌదీలో పని చేసేందుకు వచ్చినవారు, విదేశీ పర్యటకులు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
విమర్శల్ని పట్టించుకోని కమెడియన్లు
కామెడీ ఫెస్టివల్‌లో అనేక అంశాలను పట్టించుకోలేదు. సౌదీ ప్రభుత్వ విధానాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని కార్యక్రమానికి హాజరైన అనేకమంది చెప్పారు.
సౌదీ ప్రభుత్వం తన ప్రతిష్టను పెంచుకోవడానికి కామెడీ ఫెస్టివల్ ఒక ప్రయత్నం అని, కార్యక్రమం ప్రారంభానికి ముందు హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ తెలిపింది.
సౌదీ అరేబియాలో విమర్శకులు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను అన్యాయంగా నిర్బంధిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.
మానవహక్కుల ఉల్లంఘన, భావ ప్రకటనా స్వేచ్ఛ అణచివేతకు వ్యతిరేకంగా రియాద్‌లో ఆందోళన చేస్తున్న వారంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హ్యూమన్ రైట్స్ వాచ్ విజ్ఞప్తి చేసింది.
"ఇప్పటి వరకు కమెడియన్లు ఎవరూ ఈ అంశాలను స్టేజ్ మీదనే కాదు, సోషల్ మీడియాలో మరెక్కడా కూడా లేవనెత్తినట్లు కనిపించలేదు. ఇది చాలా నిరుత్సాహకరంగా ఉంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లో సౌదీ అరేబియాకు చెందిన పరిశోధకురాలు జాయ్ షియా బీబీసీతో చెప్పారు.
సౌదీ అరేబియాలో ప్రదర్శన ఇచ్చేందుకు తనకు వచ్చిన అవకాశాన్ని తిరస్కరించినట్లు కమెడియన్ అట్సుకో ఒకట్సుక 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
ప్రదర్శనలో పాటించాల్సిన నియమావళి గురించి ప్రస్తావిస్తూ ముందుగా తనకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీని ఆమె పోస్ట్ చేశారు. అందులో ప్రదర్శన సమయంలో 'సౌదీ రాజ కుటుంబం లేదా మతం' గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధన ఉంది.
అయితే ఈ అగ్రిమెంట్ పత్రాన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించ లేదు.
కమెడియన్లకు ఇలాంటి నియమావళి ఇవ్వడం చాలా అరుదని బ్రిటిష్ కమెడియన్ రోజీ హోల్ట్ చెప్పారు.
"కొన్ని యూనివర్సిటీ ఫంక్షన్లలో స్వలింగ సంపర్కం, జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించడం గురించి నేను విన్నాను. కానీ ఇలాంటి ఆంక్షలు అసాధారణమైనవి" అని హోల్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, X/Atsuko Okatsuka
రియాద్ కామెడీ ఫెస్టివల్ నిర్వహణ సమయంపైనా విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2న సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య జరిగిన రోజు.
సౌదీ రాజకుటుంబాన్ని విమర్శించే జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిని 2018 అక్టోబర్ 2న వ్యక్తిగత పత్రాలను తీసుకునేందుకు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు వెళ్లినప్పుడు హత్య చేశారు.
ఖషోగ్గీ హత్యకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనుమతి ఇచ్చారని అమెరికా నిఘా నివేదిక చెబుతోంది. అయితే సౌదీ అరేబియా ఈ నివేదికను ఖండించింది.
ఈ హత్యలో తన పాత్ర లేదని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ప్రకటించారు.
రియాద్ కామెడీ ఫెస్టివల్‌ను విమర్శిస్తున్న అమెరికన్ హాస్యనటుడు మార్క్ మారన్ ఒక స్టాండప్ కామెడీ షోలో 'మొహమ్మద్ బిన్ సల్మాన్'ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
"కామెడీ ఫెస్టివల్‌లో పాల్గొనే వారికి డబ్బులు చెల్లించే వ్యక్తి జమాల్ ఖషోగ్గిని ఎముకలుగా మార్చి సూట్‌కేస్‌లో పెట్టమని చెప్పారు" అని మార్క్ మారన్ అన్నారు.
"కమెడియన్లు రియాద్ వెళ్లి జమాల్ ఖషోగ్గి గురించి మాట్లాడితే అది సముచితమని నేను భావిస్తా. అయితే వాళ్లు అలా చేయలేరు" అని రోజీ హోల్ట్ అన్నారు.
"కమెడియన్లు అధికారంలో ఉన్నవారికి నిజం చెబుతారని పాత సామెత ఒకటి ఉంది" అని ఆమె అన్నారు.
"వారిలో చాలామంది భావ ప్రకటనా స్వేచ్ఛకు బలమైన మద్దతుదారులు. అయితే భావ ప్రకటన స్వేచ్ఛపై నిషేధం ఉన్న సౌదీ అరేబియాలో ప్రదర్శన ఇవ్వడం నైతికంగా ఖండించాల్సిన అంశం" అని రోజీ హోల్ట్ చెప్పారు.
ఈ వేడుకలు పూర్తిగా సౌదీ ప్రభుత్వం కోరిక మేరకు జరుగుతోంది. దీని నిర్వహణ పట్ల తనకు అభ్యంతరాలున్నాయని లాస్‌ఏంజెల్స్‌కు చెందిన కమెడియన్ అలెక్స్ ఫాల్కోన్ అన్నారు.
ఒక దేశంలో ప్రదర్శన ఇవ్వడానికి, ఒక దేశం కోసం ప్రదర్శన ఇవ్వడానికి మధ్య తేడా ఉందని ఆయన అన్నారు.
"డబ్బు చెల్లించి 'ట్రంప్ గొప్పవాడు' అని చెప్పమని అడిగితే నేను చెప్పను" అని ఆయన చెప్పారు.
రియాద్ కామెడీ ఫెస్టివల్ నిర్వహిస్తున్న సౌదీ అరేబియా జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీని బీబీసీ సంప్రదించింది. అయితే ఈ కథనం రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇదే అంశం గురించి బీబీసీ లండన్‌లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది.
కామెడీ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న చాపెల్, జలీలి, బర్, వైట్‌హాల్ కార్ కూడా బీబీసీ ప్రశ్నలకు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Jeremychanphotography/Getty Images
కమెడియన్లకు లక్షల డాలర్ల చెల్లింపు
కామెడీ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చే కమెడియన్లకు చెల్లిస్తున్న ఫీజు కూడా చర్చనీయాంశంగా మారింది.
నిర్వహకులు తనకు భారీ మొత్తం ఇస్తామని చెప్పినట్లు అమెరికన్ హాస్యనటుడు టిమ్ డిల్లాన్ ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
ఈ పాడ్‌కాస్ట్ తర్వాత, టిమ్ డిల్లాన్‌ను జాబితా నుంచి తొలగించారు. ఒకే విభాగానికి తనకు మిలియన్ల డాలర్ల వరకు ఆఫర్ చేశారని టిమ్ అన్నారు.
రియాద్ కామెడీ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తనకు ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు అమెరికన్ స్టార్ షేన్ గిల్లిస్ తెలిపారు.
ఇప్పటి వరకు ప్రదర్శనలు ఇచ్చిన వారు తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేశారని అలెక్స్ ఫాల్గోన్ చెప్పారు.
సౌదీ అరేబియా ఎక్కువగా చమురు ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఈ దేశం కొన్నేళ్లుగా తన సంస్కృతిలో వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది.
సౌదీ ప్రిన్స్ విజన్ 2030 ప్లాన్‌లో భాగంగా పర్యటకం, వినోదం, క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
2034 పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌తో సహా అనేక ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించే హక్కుల్ని సౌదీ అరేబియా గెలుచుకుంది.
రియాద్ కామెడీ ఫెస్టివల్‌లో పాల్గొన్న కమెడియన్లు ఇతర దేశాలు, ఆ దేశ నాయకుల మీద వేసినట్లుగా సౌదీ మీద, సౌదీ నాయకుల మీద జోకులు వేయలేరని జైన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














