అరట్టై: భారత్‌లో వాట్సాప్‌‌కు పోటీ అనుకుంటున్న ఈ మెసేజింగ్ యాప్ ముందున్న సవాళ్లేంటి?

WhatsApp, Arattai, Social Media, ZOHO, మణి వెంబు, మెటా, ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శర్లీన్ మోలన్, నియాజ్ ఫరూకీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

భారత్‌లో రూపొందించిన ఒక మెసేజింగ్ యాప్, వాట్సాప్ లాంటి దిగ్గజంతో పోటీ పడగలదా?

రెండు వారాలుగా ఇండియన్ టెక్ కంపెనీ జోహో తయారు చేసిన 'అరట్టై' అనే యాప్ వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది.

గత వారం రోజుల్లో తమ యాప్‌కు సంబంధించి 70 లక్షల డౌన్‌లోడ్లు జరిగాయని సంస్థ తెలిపింది. అయితే అవి ఏ తేదీల మధ్య అనేది స్పష్టం చేయలేదు.

అయితే ఆగస్టులో అరట్టై డౌన్‌లోడ్లు 10వేల కంటే తక్కువని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సర్ టవర్ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అరట్టై అంటే తమిళంలో చాటింగ్ అని అర్థం. ఈ యాప్ 2021లో ప్రారంభమైంది. అయితే ఎక్కువ మందికి చేరువ కాలేదు.

భారత్ దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడంతో దేశీయ ఉత్పత్తుల్ని వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఈ యాప్‌ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర కేంద్రమంత్రులు దేశీయ ఉత్పత్తుల్ని కొనాలని కొన్ని వారాలుగా పదేపదే చెబుతున్నారు.

WhatsApp, Arattai, Social Media, ZOHO, మణి వెంబు, మెటా, ఇండియా
ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్‌లో అరట్టై నెలవారీ యాక్టివ్ యూజర్లలో 95 శాతం కంటే ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారని సెన్సర్ టవర్ చెబుతోంది.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అరట్టై గురించి ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ప్రజలంతా "భారత తయారీ యాప్స్ వాడండి" అని సూచించారు.

అప్పటి నుంచి అనేకమంది ఇతర మంత్రులు, వ్యాపారవేత్తలు కూడా అరట్టై గురించి పోస్ట్ చేస్తున్నారు.

"అరట్టై డౌన్‌లోడ్లు హఠాత్తుగా పెరగడానికి ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కచ్చితంగా కారణమే" అని జోహో సంస్థ తెలిపింది.

"కేవలం మూడు రోజుల్లోనే రోజువారీ సైన్ అప్‌లు 3వేల నుంచి మూడున్నర లక్షలకు పెరిగాయి. యూజర్ల పెరుగుదల కోణంలో చెప్పాలంటే ఇది 100 రెట్లు పెరిగినట్లు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది" అని జోహో సీఈఓ మణి వెంబు బీబీసీతో చెప్పారు.

"దేశ ప్రజలు తమ అలవాట్లు, అవసరాలకు ఉపయోగపడే స్వదేశీ ఉత్పత్తి కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అందుకు ఇదే నిదర్శనం" అని ఆయన అన్నారు.

అయితే తమ యాక్టివ్ యూజర్ల గురించిన వివరాలేవీ జోహో సంస్థ వెల్లడించలేదు.

అయితే భారత్‌లో మెటాకు చెందిన వాట్సాప్‌కు నెలవారీగా 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ సంఖ్యకు అరట్టై చాలా దూరంలో ఉందని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో వాట్సాప్ మార్కెట్ చాలా పెద్దది.

ఇది భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది. ప్రజలు పొద్దున్నే గుడ్ మాణింగ్ మెసేజ్‌లు పంపడం నుంచి వ్యాపారాల వరకు...ఈ యాప్ ద్వారానే చేస్తున్నారు.

WhatsApp, Arattai, Social Media, ZOHO, మణి వెంబు, మెటా, ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020లో మొదలైన కూ యాప్‌ను ఎక్స్‌కు దీటుగా భావించారు. అయితే అది 2024లో మూతపడింది.

అరట్టైలోనూ వాట్సాప్ తరహా ఫీచర్లు ఉన్నాయి. మెసేజ్‌లు పంపుకోవడంతో పాటు వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

రెండు యాప్‌ల్లోనూ బిజినెస్ టూల్స్ ఉన్నాయి. వాట్సాప్ మాదిరిగానే తమ యాప్ కూడా లో ఎండ్ ఫోన్లలో ఇంటర్నెట్ స్లోగా ఉన్నా కూడా పని చేస్తుందని జోహో చెబుతోంది.

సోషల్ మీడియాలో అరట్టైపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీని డిజైన్, ఇంటర్‌ఫేస్ తమకు నచ్చిందని చెబుతున్నారు.

వాడేటప్పుడు ఇది వాట్సాప్‌కు సరిసమానంగా పని చేస్తుందని మరికొందరు చెబుతున్నారు.

అనేకమంది ఇది భారత్‌లో తయారైన యాప్ అని, అందరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో తయారైన యాప్‌లలో అరట్టై మొదటిదేమీ కాదు.

గతంలో భారత్‌లోనే తయారైన కూ, మోజ్ వంటి యాప్‌లు ఎక్స్, టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భావించారు. 2020లో భారత్ ప్రభుత్వం టిక్‌టాక్ సహా మరికొన్ని చైనీస్ యాప్‌లపై నిషేధం విధించినప్పుడు ఇవి ప్రత్యామ్నాయంగా కనిపించాయి.

అయితే అవి అంతగా విజయవంతం కాలేదు.

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించిన షేర్‌చాట్ తొలినాళ్లలో ఉన్న వేగాన్ని కొనసాగించలేక చతికిలపడింది.

WhatsApp, Arattai, Social Media, ZOHO, మణి వెంబు, మెటా, ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సమాచార గోప్యత విషయంలో మెటా లాంటి సంస్థలకు ప్రభుత్వాలతో పోరాడేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయి.

వాట్సాప్‌ యూజర్‌ బేస్‌ను అధిగమించడం అరట్టైకు కష్టం కావచ్చని దిల్లీకి చెందిన టెక్నాలజీ విశ్లేషకుడు ప్రశాంతో కె రాయ్ చెప్పారు.

ప్రత్యేకించి మెటాకు చెందిన ఈ సోషల్ ప్లాట్‌ఫామ్‌ను భారీ సంఖ్యలో బిజినెస్‌ల కోసం, ప్రభుత్వ సేవల కోసం ఉపయోగిస్తున్నారు.

అరట్టై విజయం ఎక్కువమందికి చేరువకావడం మీద కాకుండా, వాళ్లందర్నీ నిలుపుకోవడం మీద ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఇది కేవలం జాతీయవాదం అనే సెంటిమెంట్‌తో సాధ్యం కాదు.

"అరట్టై బావున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది యూజర్లు వాడుతున్న యాప్‌ను అధిగమించడం దాదాపు అసాధ్యం" అని రాయ్ చెప్పారు

అరట్టైలో డేటా ప్రైవసీపైనా కొంతమంది సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ యాప్‌లో వీడియో కాల్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ మెసేజ్‌లకు ఈ ఫీచర్ అమలు కావడం లేదు.

"భద్రతాపరమైన అంశాలను చూపిస్తూ యూజర్లు పంపిస్తున్న మెసేజ్‌లను చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోతే ఇది చాలా తేలికవుతుంది" అని భారత్‌లో టెక్ పాలసీ మీద రిపోర్టింగ్ చేసే వెబ్ పోర్టల్ మీడియానామా మేనేజింగ్ ఎడిటర్ శశిధర్ చెప్పారు.

దీని వల్ల ప్రజల వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు.

అయితే తాము టెక్స్ట్ క్స్ట్ మెసేజ్‌లకు కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ జోడించేందుకు ప్రయత్నిస్తున్నామని అరట్టై చెబుతోంది.

"మొదట మేము మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ జోడించిన తర్వాతనే యాప్ లాంచ్ చేయాలని భావించాం. అయితే ఇది రెండునెలల్లో పూర్తి చేస్తాం" అని మణి వెంబు చెప్పారు.

"ఈ యాప్‌లో మరికొన్ని ఫీచర్లు వీలైనంత త్వరగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం" అని ఆయన అన్నారు.

వాట్సాప్‌లో మెసేజ్‌లు, వీడియో కాల్స్‌కు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంది. అయితే దాని పాలసీ ప్రకారం వాట్సాప్ తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రభుత్వం చట్టపరమైన కారణాల దృష్ట్యా అడిగినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది.

WhatsApp, Arattai, Social Media, ZOHO, మణి వెంబు, మెటా, ఇండియా

ఫొటో సోర్స్, x.com/arattai

ఫొటో క్యాప్షన్, ప్లే స్టోర్‌లో అరట్టై డౌన్‌లోడ్లు కోటి దాటినట్లు సంస్థ ప్రకటించింది.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు సమర్పించాలని భారత దేశపు ఇంటర్నెట్ చట్టాలు చెబుతున్నాయి.

అయితే అంతర్జాతీయ సంస్థల నుంచి డాటా తీసుకోవటం కొంత కష్టమే కాకుండా ఎక్కువ టైమ్ పట్టే అవకాశం ఉంది.

ప్రభుత్వాలు వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు రూపొందించిన చట్టాలపై ఆర్థికంగా, చట్టబద్దంగా పోరాడేందుకు మెటా, ఎక్స్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల దగ్గర ఆర్థికంగా బలం ఉంది.

సోషల్ మీడియాలో కంటెంట్‌ను నియంత్రించాలంటూ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ రూల్స్‌కు వ్యతిరేకంగా 2021లో వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది. ఈ డిజిటల్ రూల్స్ వాట్సాప్ వ్యక్తిగత రక్షణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని తెలిపింది.

కంటెంట్‌ను తొలగించడం లేదా బ్లాక్ చేసేందుకు కేంద్రప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించడంపై ఎక్స్ కూడా కోర్టును ఆశ్రయించింది.

యూజర్ల వివరాలు కావాలని ప్రభుత్వం అడిగితే అరట్టై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలదా? యూజర్ల ప్రైవసీ ప్రమాదంలో పడదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

‘‘యూజర్ల వ్యక్తిగత గోప్యత, వారి వివరాలను ప్రభుత్వంతో షేర్ చేసుకునే విషయంలో జోహో పాలసీ గురించి స్పష్టత రానంత వరకు అరట్టైను ఉపయోగించడాన్ని ఎక్కువ మంది సేఫ్‌గా భావించలేరు" అని టెక్ చట్టాల నిపుణుడు రాహుల్ మత్తన్ చెప్పారు.

జోహో ప్రభుత్వానికి సానుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే కేంద్రమంత్రులు ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నారు. సమాచార మార్పిడి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే, చట్టాల ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తే, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించేశక్తి ఒక స్టార్టప్‌ దగ్గర ఉండకపోవచ్చు" అని రాయ్ అభిప్రాయపడ్డారు.

ఈ అంశాల గురించి అడిగినప్పుడు మణి వెంబు "యూజర్లు తాము పోస్ట్ చేసే డేటాపై నియంత్రణతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నియమావళి చెబుతోంది" అని అన్నారు.

"ఒకసారి పూర్తి స్థాయిలో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ అమల్లోకి వస్తే, యూజర్ల సంభాషణలు, సందేశాలు మాకు కూడా అందుబాటులో ఉండవు. చట్టపరమైన అంశాలకు సంబంధించి మేము పారదర్శకంగా ఉంటాం" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)