'నా కొడుకు ఒళ్లంతా బాంబ్ శకలాలే..'

- రచయిత, బార్బరా ప్లెట్
- హోదా, ఆఫ్రికా కరస్పాండెంట్
సూడాన్‌లోని ఎల్-ఫషేర్ నగరంలోని ఒక శిబిరంలో పడుకుని ఉన్న అబ్దుల్ రహమాన్ చెవులకు ఫిరంగుల మోత వినిపిస్తూనే ఉంది.
కొద్దిరోజుల కిందట జరిగిన ఓ షెల్లింగ్ అటాక్‌లో ఈ 13 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
"నా తల, కాళ్లలో నొప్పిగా ఉంది" అని అతడు దీనంగా చెప్తున్నాడు.
17 నెలలుగా ఎల్-ఫషేర్ నగరం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ గుప్పిట ఉంది. నగరంలోని కీలకమైన సైనిక ప్రాంతాలను కూడా చేజిక్కించుకోవడానికి వారు ముందుకు కదులుతున్నారు.
అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ఆర్ఎస్ఎఫ్, సూడాన్ ఆర్మీకి చెందిన టాప్ కమాండర్ల మధ్య తలెత్తిన విభేదాలతో 2023లో సూడాన్‌లో ఈ ఘర్షణ మొదలైంది.
రాజధానిని కోల్పోయిన తరువాత పారామిలటరీ దళాలు... ఆర్మీకి బలమైన పట్టు ఉన్న పశ్చిమ దార్ఫర్ ప్రాంతంలోని ఎల్- ఫషేర్‌ను ఆక్రమించుకునే దిశగా చర్యలు తీవ్రం చేశాయి.
ఆర్మీ తన అధీనంలో ఉన్న ప్రాంతంపై క్రమంగా పట్టు కోల్పోతూ విమానాశ్రయం చుట్టూ ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైంది.
ఈ నగరంలో ఉన్న లక్షలాది మంది పౌరులకు ప్రతిరోజు ఒక పీడకలగా ఉంటోంది.
ఈ ఆక్రమణ, యుద్ధం కారణంగా కచ్చితమైన సమాచారం పొందడం అతి క్లిష్టమైన ప్రక్రియ. అయితే.. ఎల్- ఫషేర్‌లోని ఫ్రీలాన్స్ జర్నలిస్టులతో కలిసి బీబీసీ అక్కడి ప్రజల జీవనం గురించి తెలుసుకోగలిగింది.
అహ్మద్ "శరీరమంతా బాంబుల ముక్కలతో నిండిపోయింది" అని అతడి తల్లి ఇస్లామ్ అబ్దుల్లా చెప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉంది అని తెలిపారు.
మరోవైపు ఆస్పత్రులు కూడా ఈ దాడుల్లో కాలుతుండడంతో క్షతగాత్రులకు చికిత్స అందే అవకాశాలూ తగ్గిపోయాయి.
అహ్మద్ శరీరంపై గాయాలను చూపించేందుకు అతడి చొక్కాను తొలగించారు తల్లి.
ఎముకల గూడులా కనిపించిన అతని వీపు ఆ నగరంలో ఆకలికి నిదర్శనంగా కనిపిస్తోంది.


‘నా కాలు కుళ్లిపోతోంది’
అక్కడికి సమీపంలో ఉన్న హమీదా అదమ్ అలీ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఆమె కాలికి తీవ్ర గాయం కావడంతో ఎటూ కదలలేకపోతున్నారు.
షెల్లింగ్‌లో గాయపడిన ఆమె అయిదు రోజుల పాటు రోడ్డుపైనే ఉండిపోయారు. ఆ తర్వాత ఆమెను యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి ఆశ్రయమిచ్చే శిబిరంలోకి తరలించారు.
"అప్పుడప్పుడు వాళ్లకు తినడానికి ఏమైనా దొరుకుతుంది. కొన్నిసార్లు వాళ్లు ఏమీ తినకుండానే నిద్ర పోతారు"
"నా కాలు కుళ్లిపోతోంది. అది దుర్వాసన వస్తోంది. నేను లేవలేని స్థితిలో ఉన్నాను" అని చెప్పారామె.
తన పక్కనే పడి ఉన్న మరో మహిళ... షెల్లింగ్‌లో మృతి చెందారని హమీదా బీబీసీతో చెప్పారు. ఇంకా గాయాలతోనే ఉన్న హమీదా... తన పిల్లల భద్రత విషయంలో భయపడుతున్నారు.

ఆ డ్రోన్లు ఇచ్చిందెవరు?
ఇటీవలి వారాల్లో ఆర్ఎస్ఎఫ్ పట్టు పెంచుకుంది. ఓ ప్రాంతంలో తమ ఫైటర్లు ఉన్నట్లుగా చూపించే ఫుటేజ్‌ను ఆర్ఎస్ఎఫ్ విడుదల చేసింది. ఆ ప్రాంతం ఆర్మీ సాయుధ దళాల ప్రధాన కార్యాలయమని బీబీసీ గుర్తించింది.
అక్కడికి సమీపంలోనే సూడాన్ ఆర్మీకి చెందిన 6వ ఇన్ ఫ్యాంట్రీ డివిజన్ సహా ఇతర స్థావరాలు ఉన్నాయి. ఈ 6వ ఇన్ ఫ్యాంట్రీ కోసం ఆర్మీ ఇంకా పోరాడుతోంది.
కొద్దిరోజుల క్రితం ఆర్మీ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఎయిర్ డ్రాప్స్ ద్వారా వచ్చిన అత్యవసర వస్తువులను తమ సైనికులు ఆహ్వానిస్తున్నట్లు అందులో ఉంది.
అయితే.. మీడియాలో మాత్రం ఎల్-ఫషేర్‌లో ఆర్ఎస్ఎఫ్ ఫైటర్లు కీలకమైన విజయం సాధించి, సెలబ్రేట్ చేసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి.
ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని భంగపాట్లు ఎదురైన తర్వత.. ఎల్- ఫషేర్ నగరాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం ఆర్ఎస్ఎఫ్‌కు ఈ అంతర్యుద్ధంలో వ్యూహాత్మకమైన ముందడుగని సూడాన్ విశ్లేషకులు ఖోలూద్ ఖైర్ బీబీసీకి చెప్పారు.
ఇది లిబియాలోకి వారి ప్రవేశానికి సులభతరం చేయడమే గాక, దక్షిణ సూడాన్ నుంచి ఈజిప్ట్‌లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న పశ్చిమ సరిహద్దుపై వారి నియంత్రణను పెంచుతుందని తెలిపారు.
"దక్షిణ లిబియా నుంచి మరింత ఇంధనాన్ని, మరిన్ని ఆయుధాలను ఆర్ఎస్ఎఫ్ తీసుకురాగలదు. అలాగే, సరిహద్దు ప్రాంతం నుంచి దార్ఫుర్ వరకు వారి రవాణాను రక్షించుకోగలదు" అని చెప్పారు.
"ఎల్- ఫషేర్ ప్రాంతం నుంచి, ఆర్ఎస్ఎఫ్ మళ్లీ కోర్డోఫాన్ ప్రాంతం, రాజధాని ప్రాంతాలపైకి దాడి చేయగలదు. కాబట్టి.. ఇది సైనికపరంగా ఆర్ఎస్ఎఫ్ ను మరింత బలమైనదిగా మార్చుతుంది"
ఆర్మీ తరుఫున జాయింట్ ఫోర్సెస్ అని పిలిచే స్థానిక సాయుధ గ్రూపులకు కూడా ఇది భారీ ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
"జాయింట్ ఫోర్సెస్‌కు ఇది తమ హోమ్ ల్యాండ్ కోసం చేస్తున్న పోరాటం" అని ఖైర్ పేర్కొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి అందినవిగా ఆరోపిస్తున్న భీకరమైన డ్రోన్ల సాయతో ఆర్ఎస్ఎఫ్ ఈ పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది.
ఐక్యరాజ్యసమితి నిపుణులు సహా వార్ మానిటర్స్ ఇందుకు సంబంధించిన ఆధారాలను గుర్తించినప్పటికీ ఈ ఆరోపణలను యూఏఈ ఖండిస్తోంది.
ఈ డ్రోన్లు దాడి చేస్తున్న దృశ్యాలు ఓ మిలటరీ ప్రాంతానికి దగ్గర్లో జరిగినట్లుగా బీబీసీ గుర్తించింది.

క్షణక్షణం భయంభయం...
గత నెలలో ఓ మసీదులో ఉదయం ప్రార్థనలు జరుపుతున్న సమయంలో 75 మందికిపైగా మరణించారు.
ఈ దాడి ఆర్ఎస్ఎఫ్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చినప్పటికీ.. దీనికి ఆ సంస్థ బహిరంగంగా బాధ్యత వహించలేదు.
ఆ సమయంలో చనిపోయిన వారి మీద కప్పేందుకు కావాల్సిన గుడ్డలు కూడా వారి బంధువులకు లభించలేదు.
"అతని మెదడు బయటకు వచ్చింది"
తన చిన్న కుమారుడిని ఓ పెద్ద సామూహిక సమాధిలో ఖననం చేసినట్లు సమహ్ అబ్దుల్లా హుస్సేన్ తెలిపారు. అంతకు ఒకరోజు ముందే అతడు చనిపోగా, అతడి సోదరుడికి గాయలయ్యాయి. ఓ పాఠశాల ప్రాంగణంలో శరణార్థిగా ఉండగా వారిపై షెల్ దాడి జరిగింది.
"అతని తలకు దెబ్బతగిలింది. అతని మెదడు బయటకు వచ్చింది" అని కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు.
గత ఏడాది కాలంలో లక్షలాది మంది మంది ఎల్-ఫషేర్‌ను వదిలి పారిపోయారు. వారు అలా పారిపోతున్న క్రమంలో వారిపై దాడి జరిగి, వారిని దోచుకుని, చంపేశారని అక్కడి వారు చెప్పారు.
ఈ నగరాన్ని ఆక్రమించుకుంటే.. మరిన్ని దాడులు జరుగుతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
యుద్ధ నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంస్థలను చూపిస్తున్నప్పటికీ.. తాము స్థానిక జాగ్వా కమ్యూనిటీ వంటి సమూహాలను లక్యంగా చేసుకోలేదని పారామిలటరీ చెప్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














