అంబేడ్కర్ కోనసీమ జిల్లా: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఆరుగురి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం, పేలుడికి కారణమేంటి?

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

ఫొటో సోర్స్, Screen shot/UGC

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

రాయవరం మండలం కొమర పాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో బాణసంచా తయారీ చేస్తుండగా.. పేలుడు సంభవించి ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి బీబీసీకి చెప్పారు.

మరికొందరికి తీవ్రగాయాలైనట్లు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పేలుడు ఘటనపై రామచంద్రాపురం ఆర్డిఓ అఖిల బీబీసీతో మాట్లాడారు.

ఆరుగురు చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఆమె బీబీసీతో చెప్పారు.

ఈ నలుగురిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఈ ముగ్గురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నామని.. మరొకరిని ట్రస్టు ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు పదార్థాల విస్ఫోటనం వల్లనే ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ఆర్డిఓ తెలిపారు.

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

ఫొటో సోర్స్, UGC

మృతుల్లో మహిళలు

మొత్తం ఆరుగురు మృతుల్లో ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

యజమాని వెలుగుబంటి సత్యనారాయణ (55) తోపాటు పాకా అరుణ, చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పి. శేషారత్నంగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

పేలుడుకు కారణమేంటి?

ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

పేలుడు తీవ్రతకు ఈ తయారీ కేంద్రానికి సమీపంలో ఉన్న రిటైల్ షాపు కూడా ధ్వంసం అయిందని అధికారులు తెలిపారు.

జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.

పేలుడు పదార్థాల మిశ్రమంలో జరిగిన పొరపాటు వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారి పార్థసారధి బీబీసీకి తెలిపారు.

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

ఫొటో సోర్స్, UGC

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

అధికారులతో మాట్లాడిన సీఎం

అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరావతి నుంచి అధికారులతో మాట్లాడి, వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.

‘‘అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం’’ అని చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఈ అగ్నిప్రమాదం ఘటనపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)