భారత్‌లో జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై తాలిబన్లు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ శుక్రవారం(అక్టోబరు 10) న్యూదిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి తమను ఆహ్వానించలేదని పలువురు మహిళా జర్నలిస్టులు చెప్పారు. ఇది ఏమాత్రం ఆమోదనీయం కాదని వారు నిరసన వ్యక్తం చేశారు .
గురువారం భారత్ కు చేరుకున్నముత్తాకీ శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు .
అఫ్గానిస్తాన్‌లో 2021లో తాలిబాన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత భారత్‌లో జరుగుతున్న తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇది.
న్యూదిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ముత్తాకీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తమను అనుమతించలేదని పలువురు మహిళా జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పబ్లిక్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హఫీజ్ జియా అహ్మద్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఫోటోను చూస్తే , ఆ కాన్ఫరెన్స్‌లో మహిళా జర్నలిస్టులు ఎవరూ లేరని స్పష్టం చేస్తోంది.
అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం గతంలో పెద్దఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన, బాలికల విద్యపై ఆంక్షలు విధించిందనే ఆరోపణలు వచ్చాయి, బాలికా విద్యను తాలిబాన్లు ఇస్లామ్‌కు వ్యతిరేకమని భావిస్తారు.


ఫొటో సోర్స్, @HafizZiaAhmad
ప్రతిపక్షాల విమర్శలు
అఫ్గాన్ విదేశాంగమంత్రి ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మహిళా జర్నలిస్టులకు అనుమతి లేకపోవడంపై భారత్‌లోని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నలు లేవనెత్తాయి.
కాంగ్రెస్ ఎంపీ, మాజీ హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ పి.చిదంబరం ఇన్ స్టాగ్రామ్ లో "తాలిబాన్లతో చర్చలు జరపడానికి భౌగోళిక రాజకీయ కారణాలను నేను అర్థం చేసుకున్నాను, కానీ వారి వివక్షతో కూడిన మూఢవిశ్వాలసాలను అంగీకరించడం హాస్యాస్పదంగా ఉంది. తాలిబాన్ల ప్రెస్‌కాన్ఫరెన్స్‌కుమహిళా జర్నలిస్టులకు అనుమతి లేకపోవడంనిరాశపరిచింది'' అని రాశారు. ఈ పోస్టును కార్తీ చిదంబరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు కూడా ట్యాగ్ చేశారు.
''భారత గడ్డపై మహిళా జర్నలిస్టులను అనుమతించకుండా కేవలం పురుష జర్నలిస్టులతోనే మీడియా సమావేశాన్ని నిర్వహించుకోవడానికి తాలిబాన్ విదేశాంగమంత్రి అమీర్ ముత్తాకీని భారత ప్రభుత్వం ఎలా అనుమతించింది? ఇదిపూర్తి అధికారిక ప్రోటోకాల్‌తో ఎలా జరగగలిగింది? జైశంకర్ దీనికి ఎలా అంగీకరించగలిగారు? దీనికి మన మగ జర్నలిస్టులు కూడా వెన్నెముక లేకుండా ఎలా హాజరు కాగలిగారు''? అని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటుగా రాశారు.

ఫొటో సోర్స్, @HafizZiaAhmad
మహిళా జర్నలిస్టులు ఏం చెప్పారు?
చాలామంది మహిళాజర్నలిస్టులు ఇది ''ఆమోదనీయం కాదు'' అని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లింగ వివక్ష ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా తాలిబన్లు మహిళలను విస్మరించడం, అఫ్గనిస్తాన్‌లో మహిళల పరిస్థితిపై వారి ఆలోచనను మరింత స్పష్టం చేస్తోందని కొందరు చెప్పారు.
ముత్తాకీ విలేకరుల సమావేశానికి ఏ మహిళా జర్నలిస్టును ఆహ్వానించలేదని విదేశాంగ వ్యవహారాలను కవర్ చేసే జర్నలిస్ట్ స్మితా శర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ఎక్స్ లో తెలిపారు.
"విదేశాంగ మంత్రి జైశంకర్, ముత్తాకీ మధ్య చర్చల తర్వాత చేసిన ప్రారంభ ప్రకటనలో అఫ్గానిస్తాన్‌లో బాలికలు, మహిళల భయంకరమైన దుస్థితి గురించి ఒక్క మాటకూడా ప్రస్తావించలేదు. మహిళలు సాధించే విజయాలను చూసి గర్వించే దేశం భద్రతా కారణాలరీత్యా ముత్తాకీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఇవీ నేటి అంతర్జాతీయ రాజకీయాలు'' అంటూ స్మితాశర్మ పోస్టు చేశారు.
స్మితా శర్మ పోస్టును రీపోస్ట్ చేస్తూ జర్నలిస్టు నిరుపమ సుబ్రమణియన్ "మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై పురుష జర్నలిస్టులు తమ నిరసనను తెలపలేదా?" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సమావేశ వివరాలను మీడియా ప్రచురించవద్దు’
''న్యూదిల్లీలోని అఫ్గానిస్తాన్ రాయబార కార్యాలయంలో ఆదేశ తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఈ విలేకరుల సమావేశానికి ఒక్క మహిళా జర్నలిస్టును కూడా అనుమతించలేదు. నేను రాయబార కార్యాలయ గేటు వద్ద భద్రతా సిబ్బందితో ఈ సమస్యను లేవనెత్తాను, కాని వారు నా మాట వినలేదు. " అని ఎన్‌డీటీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్ రాశారు.
కౌల్‌కు మద్దతుగా స్వతంత్ర జర్నలిస్టు అర్పణ్ రాయ్ కూడా ''ప్రెస్ కాన్ఫరెన్స్‌కు మహిళాజర్నలిస్టులను అనుమతించేలా ప్రయత్నించిన ఒకరిద్దరు జర్నలిస్టులలో ఆదిత్యా రాజ్ కౌల్ కూడా ఒకరు. మహిళాజర్నలిస్టులను ఎలా అనుమతించరని ప్రశ్నించారు. పైగా మహిళా జర్నలిస్టులందరూ తమను తాము పూర్తిగా కప్పుకున్న వస్త్రధారణతోనే ఉన్న తరువాత కూడా ఇలా ఎలా చేస్తారు అన్నారు. కానీ వీటినేవీ తాలిబాన్లు పట్టించుకోలేదు'' అని రాశారు.
ఇదిలా ఉండగా, ది హిందూ వార్తాపత్రిక డిప్లొమాటిక్ అఫైర్స్ ఎడిటర్ సుహాసిని హైదర్ స్మితా శర్మ పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ, "ప్రభుత్వం పూర్తి అధికారిక ప్రోటోకాల్ తో తాలిబాన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇంతకంటే విడ్డూరమైన విషయం ఏమిటంటే , మహిళలపై తాలిబాన్లు చూపుతున్న అసహ్యకరమైన చట్టవిరుద్ధమైన వివక్షను భారతదేశానికికూడా తీసుకురావడానికి తాలిబాన్ విదేశాంగ మంత్రిని అనుమతించారు.'' అని రాశారు.
జర్నలిస్టు గీతా మోహన్ ఇలా రాశారు, "అఫ్గాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించలేదు. ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని రాశారు
హిందూ గ్రూప్ డైరెక్టర్ మాలిని పార్థసారథి దిల్లీలోజరుగుతున్న తాలిబన్ల విదేశాంగ మంత్రి సమావేశాల వివరాలను మీడియా కూడా ప్రచురించకూడదు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడే ధైర్యం లేదా?''
'మహిళా జర్నలిస్టులను అనుమతించని కారణంగా పురుషజర్నలిస్టులందరూ ఆ సమావేశాన్ని బహిష్కరించి ఉండాల్సింది'' అని ది హిందూ డిప్యూటీ ఎడిటర్ విజేతా సింగ్ రాశారు.
కాలమిస్ట్ రచయిత్రి స్వాతి చతుర్వేది "మొదట మీరు అనాగరిక తాలిబన్లను మన దేశంలోకి అనుమతించడం ద్వారా భారత నేలను అపవిత్రం చేస్తారు, ఆపైన మహిళలపై వారి లింగ-వివక్ష చట్టాలను అమలు చేయడానికి సంతోషంగా వారిని అనుమతిస్తారు. మహిళా జర్నలిస్టులను ప్రెస్‌కాన్ఫరెన్స్‌లకు హాజరు కాకుండా నిరోధించే బదులు, మీరు వారికి లింగ సమానత్వంపై పాఠాలు నేర్పించాలి. మన ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడే ధైర్యం మీకు లేదా?'' అని ప్రశ్నించారు.
చరిత్రకారుడు రుచికా శర్మ "ఇది భారతదేశం, అఫ్గానిస్తాన్ కాదు! భారతదేశ గడ్డపై జరుగుతున్న తాలిబాన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడానికి వారికెంత ధైర్యం? భారత ప్రభుత్వానికి ఏమైంది? అని రాశారు.
తాలిబన్లపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి , మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అనేక మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు బయటపడుతూనే ఉన్నాయి.
12 ఏళ్లు పైబడిన బాలికల చదువుపై నిషేధం విధించినప్పటి నుంచి, బాహ్య ప్రపంచంతో సంబంధాలకు తమకు ఇంటర్నెట్ మాత్రమే ఏకైక మార్గంగా మారిందని అంతకుముందు, అఫ్గన్ మహిళలు బీబీసీకి చెప్పారు.
అఫ్గానిస్తాన్‌లో మహిళల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. గత సంవత్సరం, మహిళా రచయితల పుస్తకాలను విశ్వవిద్యాలయాల నుంచి తొలగించారు.
పాఠశాలలకు హాజరు కావడంపై నిషేధం విధించడాన్ని "విద్యా హక్కును క్రమబద్ధంగా ఉల్లంఘించడం" అని ది అఫ్గన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అభివర్ణించింది.

ఫొటో సోర్స్, ani
తాలిబాన్ ప్రభుత్వం ఇచ్చిన వివరణేంటి?
అయితే ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సభ్యులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జై తకెల్ ఖండించారు. ఎవరినీ వెనక్కి పంపలేదని అన్నారు. "రాయబార కార్యాలయం దగ్గరకు వచ్చిన జర్నలిస్టులందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాం'' అని చెప్పారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై స్పందించింది. "అప్గానిస్తాన్ రాయబార కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాకు ఎలాంటి పాత్రా లేదు" అని పేర్కొంది.
అయితే ఈ విలేఖరుల సమావేశానికి మహిళలను ఆహ్వానించలేదని తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన ఒకరు అంగీకరించారు.
"సరైన సమన్వయం లేకపోవడం వల్ల, మహిళా జర్నలిస్టులను ఆహ్వానించలేదు. దిల్లీలో తదుపరి సమావేశం జరిగితే, వారిని కచ్చితంగా ఆహ్వానిస్తాం" అని బీబీసీతో చెప్పారు.
మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం లేకపోవడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. "విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసినా, చేయకపోయినా, ఇలాంటి వివక్షతో కూడిన మినహాయింపులు నిరంతరాయంగా కొనసాగడానికి అనుమతించడం చాలా ఆందోళనకరం" అని ఆ సంస్థ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














