‘చెన్నైలో మనుషుల కంటే ఆరు రెట్లు ఎక్కువైన ఎలుకలు’.. లెప్టోస్పిరోసిస్ కేసులు పెరుగుతున్నాయంటున్న అధికారులు

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images
- రచయిత, నందిని వెల్లస్వామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చెన్నైలోని నుంగంబాక్కమ్‌కు చెందిన విజయలక్ష్మి తన ఫ్రిజ్‌ను శుభ్రపరిచేందుకు దాని కిందనున్న భాగాన్ని ఓపెన్ చేశారు. దానిలోపల ఎలుకను చూసి ఆమె ఆశ్చర్యపోయారు.
ఇంట్లో మిగతా ఏ ప్రాంతంలోనైనా ఎలుకలు కనిపిస్తే ఏదో రకంగా అవి అక్కడికి చేరి ఉంటాయిలే అనుకుంటారు.
కానీ, ఫ్రిజ్ కింద భాగంలో కనీసం దూరేందుకు చోటు లేని సీల్ చేసిన ప్రాంతంలోనూ ఎలుక ఎలా వెళ్లగలిగిందా అని ఆమె ఆశ్చర్యపోయారు.

పట్టుకుందామంటే రెప్పపాటు క్షణంలో పారిపోయే ఎలుకలు చెన్నైలో చాలా ఇళ్లల్లో మనం ఊహించని చోట్లలో దాక్కుంటున్నాయి.
కొందరు ఎలుకను చూస్తే చాలు భయపడతారు. అవి చనిపోయిన తరువాత వచ్చే దుర్వాసన అసలు భరించలేరు.
భయం, దుర్వాసన మాత్రమే కాదు ఎలుకల కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఎలుకల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్య 'లెప్టోస్పిరోసిస్'.
చెన్నైలో ఏటా సగటున 500 నుంచి 660 మంది ఈ వ్యాధికి ప్రభావితులవుతున్నారని చెన్నై కార్పొరేషన్‌కు చెందిన వెక్టార్ కంట్రోల్ యూనిట్ అధికారి సెల్వకుమార్ చెప్పారు.
దోమలు, కీటకాలు, ఎలుకలు వంటి వాటి వల్ల ప్రబలే వ్యాధులను నియంత్రించేందుకు పనిచేసే ప్రత్యేక విభాగమే ఈ యూనిట్.
చెన్నై నగరంలో ఏటా లెప్టోస్పిరోసిస్ కేసులు పెరుగుతున్నాయని.. ఎలుకల సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సెల్వకుమార్ చెప్పారు.
''చెన్నైలో కొన్ని ప్రాంతాలే ఎలుకలకు హాట్‌స్పాట్లుగా ఉన్నాయని మేం చెప్పలేం. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినవసరం ఉంది'' అని తెలిపారు.
ఈ ఏడాది చెన్నైలో లెప్టోస్పిరోసిస్ కేసులు 600 కంటే ఎక్కువ నమోదయ్యాయని సెల్వకుమార్ చెప్పారు.
ఎలుకలు సాధారణంగా కలుగుల్లో నివసిస్తుంటాయి. వర్షాకాలంలో అలాంటి కలుగుల్లోకి నీరు చేరినప్పుడు అవి బయటికి వచ్చి, పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాయి.
''అందుకే వర్షాకాలంలో లెప్టోస్పిరోసిస్ కేసులు పెరుగుతాయి'' అని సెల్వకుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
లెప్టోస్పిరోసిస్ లక్షణాలేంటి?
లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఈ బ్యాక్టీరియాను ఎలుకల్లో గుర్తించవచ్చు.
ఎలుకల మల, మూత్రాలు మనం తాగే నీటిలో, తినే ఆహారంలో కలిసినప్పుడు లెప్టోస్పిరా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధి లక్షణాల గురించి ఎపిడెమియాలజిస్ట్ విజయలక్ష్మి వివరించారు.
''లెప్టోస్పిరోసిస్ వల్ల జ్వరం తప్ప పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ ఇది ముదిరినప్పుడు కిడ్నీ, కాలేయ సమస్యలు, మెదడువాపు వ్యాధి వస్తుంది'' అని తెలిపారు.
''లెప్టోస్పిరోసిస్ వ్యాధితో చెన్నై నుంచి వచ్చే వారికి పెద్దగా సీరియస్ ప్రమాదాలేమీ కనిపించడం లేదు. ఎందుకంటే, ఎన్నో ఏళ్లుగా చెన్నైలో ఈ వ్యాధి సాధారణమైపోయింది. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని వీరు పొందారు. అంత ఎక్కువగా సీరియస్ కావడం లేదు. కానీ, చెన్నై కాకుండా ఇతర ప్రాంతాలవారు దీని బారిన పడినప్పుడు వారిలో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి'' అని తెలిపారు.
జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు, అలసట కూడా ఉంటాయి. ఆ తర్వాత రక్తస్రావం, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం, గందరగోళానికి గురవడం జరుగుతుంటుంది. చాలా రోజులుగా జ్వరం ఉంటున్నప్పుడు పేషెంట్లు లెప్టోస్పిరోసిస్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటారు.
ఎలుకల వల్ల లెప్టోస్పిరోసిస్ ఇన్‌ఫెక్షన్ మాత్రమే కాక, ఫుడ్ పాయిజనింగ్, పాస్టురెల్లా వంటి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తుంటాయని డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు.
చెన్నైలో లెప్టోస్పిరోసిస్ కేసులు పెరుగుతుండటంతో.. తమిళనాడు రాష్ట్ర రాజధానిలో ఎన్ని ఎలుకలు ఉండి ఉండొచ్చు? అనే ప్రశ్న తలెత్తుతోంది.
మురుగునీటి ట్యాంకులు, కాలువలు, గుంతల్లో ఎలుకలు నివసిస్తాయి కనుక వీటిని లెక్కించడం అసాధ్యమే.
అయితే, వెక్టార్ కంట్రోల్ డివిజన్ అధికారి సెల్వకుమార్ చెన్నైలో సుమారు ఎన్ని ఎలుకలు ఉన్నాయో అంచనావేశారు.
''చెన్నైలో మనుషులు, ఎలుకల జనాభా సుమారు 1:6 నిష్ఫత్తిలో ఉంది. అంటే ఒక మనిషికి, ఆరు ఎలుకలు ఉన్నాయన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే, చెన్నైలో సుమారు 80 లక్షల మంది జనాభా ఉంటే, ఎలుకలు 4.8 కోట్లు ఉన్నాయి'' అని అంచనావేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుకలు, ఇతర జంతువులను పట్టుకునే ప్రైవేట్ కంపెనీల వద్దకు ఎలుకల గురించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని వారు చెబుతున్నారు.
అలాంటి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కలియమ్మాళ్‌తో మేం మాట్లాడినప్పుడు.. ''చెన్నైలో ఎలుకలు పెరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. వాటి కోసం విషపూరిత ఆహారం లేదా రసాయనాలు చల్లడం ఇంట్లో పిల్లలకు ప్రమాదకరం. ఎలుకలు వచ్చే కలుగులను మేం పూర్తిగా మూసివేసి, 'గమ్ ప్యాడ్'తో వాటిని పట్టుకుంటాం'' అని చెప్పారు.
అయితే, ఇన్‌ఫెక్షన్లు నగరంలో అకస్మాత్తుగా పెరగలేదని చెన్నై కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ జగదీసన్ చెప్పారు.
''సీజన్లతో పాటు ఇవి పెరిగాయి. ఆందోళనకర స్థాయికి ఇవి పెరగలేదు. అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ వ్యాధిని గుర్తించి, చికిత్స ఇచ్చి, నియంత్రించాలి. అదే వెక్టార్ కంట్రోల్ యూనిట్ చేస్తోంది'' అని జగదీసన్ తెలిపారు.
ఎలుకలు తరచూ మనం చెత్తలో పడేసిన ఆహార వ్యర్థాలను తినేందుకు మన పరిసర ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఎలుకల నియంత్రణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుకలను నియంత్రించేందుకు ఏం చేయాలి?
''ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదు వచ్చినప్పుడు, ముందస్తు చర్యలు తీసుకుంటారు. మెరీనా బీచ్‌లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎలుకల నియంత్రణ చర్యలు తీసుకుంటారు. ఎలుకల కోసం విషపూరిత కేకులను ఆ ప్రాంతాల్లో పెడతారు''
''కానీ, ఇవి సరిపోవడం లేదు. దోమలు, వీధి కుక్కల నియంత్రణకు ప్రస్తుతం ఎలాంటి ప్రాధాన్యమిస్తున్నామో, అలాంటి ప్రాధాన్యమే ఎలుకల నియంత్రణకు ఇవ్వాలి'' అని సెల్వకుమార్ చెప్పారు.
ఎలుకల కోసం ప్రత్యేకంగా 'రాడెంట్ కంట్రోల్ యూనిట్' (ఎలుకల నియంత్రణ విభాగం) ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- మీ ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలాలను చెత్తవేసేందుకు వాడకూడదు.
- మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- ఇంటి చుట్టూ ఎక్కడా కూడా గుంతలు, కలుగులు ఉండకూడదు. కేబుల్ లైన్స్ లేదా పైప్‌లైన్లలో గ్యాప్‌లు ఉండకూడదు. ఎలుకలు ఇంట్లోకి రావడానికి ఎలాంటి అవకాశం ఉండకూడదు.
కేవలం చెన్నైలోనే కాక హైదరాబాద్, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఎలుకల సమస్య, అవి కరవడం వల్ల ప్రజలకు వస్తోన్న ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బ్రిటన్‌లో కూడా పలు నగరాల్లో ప్రజలు ఎలుకల వల్ల కలిగే అంటువ్యాధులతో బాధపడుతున్నట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది.
బ్రిటన్‌లో కోటి నుంచి 1.2 కోట్ల ఎలుకలు ఉన్నట్లు అంచనా.
2023 నుంచి ఈ ఏడాది మధ్య వరకు బ్రిటన్‌లో ఎలుకల వల్ల కలిగే అంటువ్యాధుల కేసులు 5 లక్షలు నమోదయ్యాయి.
ఎలుకలు సమస్య మాత్రమే కాదు
ఎలుకలు ప్రజలకు పెద్ద తలనొప్పిగా ఉంటున్నప్పటికీ, ఇవి ప్రకృతికి మంచి సేవలను అందిస్తున్నాయని డచ్ సైంటిస్ట్ పాట్రిక్ జాన్సెన్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా చెట్లు, మొక్కల జాతులను వ్యాప్తి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














