ముత్తాకీ: ఐక్యరాజ్య సమితి నిషేధిత తీవ్రవాది...భారత్‌కు ఎలా వస్తున్నారు?

అప్గానిస్తాన్, తాలిబాన్, అమీర్‌ఖాన్ ముత్తాకీ, భారత ప్రభుత్వం, రష్యా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రధాని భారత పర్యటనలో ఉన్న సమయంలో ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు.

అఫ్గానిస్తాన్ విదేశాంగమంత్రి అమీర్‌ఖాన్ ముత్తాకీ భారత దేశ పర్యటనకు వస్తున్నారు.

ముత్తాకీ భారత్‌లో పర్యటించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ అనుమతి ఇచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముత్తాకీని నిషేధిత టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.

అందుకే ఆయన భారత్‌లో పర్యటించేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవల్సి వచ్చింది.

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబయి వచ్చిన సమయంలోనే ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2021లో అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఒక విదేశాంగమంత్రి తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

భారత పర్యటనలో భాగంగా ముత్తాకీ దేశంలోని కొంతమంది వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. దీని గురించి గత వారం విదేశాంగ వ్యవహారాల శాఖ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రశ్నించినప్పుడు రణధీర్ జైస్వాల్ స్పందించలేదు.

అఫ్గానిస్తాన్, తాలిబాన్, అమీర్‌ఖాన్ ముత్తాకీ, భారత ప్రభుత్వం, రష్యా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన ఏకైక దేశం రష్యా.

అఫ్గాన్ మీడియా ఏమంటోంది?

అఫ్గానిస్తాన్ విదేశాంగమంత్రిగా ముత్తాకీకి పూర్తి స్థాయి ప్రోటోకాల్ ఉంటుందని ‘ది హిందూ’ వార్తా పత్రిక కథనం పేర్కొంది. అధికారులు ఆయనకు ఆతిథ్యం ఇస్తారు.

అక్టోబర్ 10న భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్‌తో ముత్తాకీ దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమవుతారు.

ముత్తాకీ భారత పర్యటనపై అఫ్గాన్ మీడియాలోనూ విస్తృత చర్చ జరుగుతోంది.

పష్తో భాషలో ప్రసారాలు చేసే అము టీవీ అఫ్గానిస్తాన్‌లో కేంద్రంగా నడిచే మీడియా సంస్థ.

"భారత్, రష్యాలో పర్యటనకు సంబంధించి ముత్తాకీ తన నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా నుంచి నిర్దిష్ట సూచనలు అందుకున్నారని తెలిసింది. రెండు దేశాల పర్యటన గురించి మాట్లాడేందుకు కాందహార్ రావాలని ముత్తాకీని అఖుంద్‌జాదా పిలిచారు. అయితే ఆ సమావేశం వివరాలేవీ తెలియలేదు. ముత్తాకీ భారత్‌లో పర్యటించేందుకు భద్రతా మండలి అనుమతి ఇచ్చింది. అయితే రష్యాలో పర్యటన గురించి ఏమీ చెప్పలేదు" అని అము టీవీ తెలిపింది.

"అఖుంజాదాను ముత్తాకీ గత వారం కాందహార్‌లో కలిశారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటున్న అఖుంజాదా, అఫ్గానిస్తాన్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముత్తాఖీ పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఇది రద్దు కావడంతో భారత పర్యటన తెరపైకి వచ్చింది" అని అము టీవీ వెల్లడించింది.

భారత్ చాలాకాలంగా రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌కు మద్దతుదారుగా ఉంది.

తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తోంది.

భద్రతా పరమైన సమస్యలు, పాకిస్తాన్, తాలిబాన్ల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల భారత్ తాలిబాన్ల‌వైపు ఆసక్తి చూపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2025 మేలో ముత్తాఖీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడారని అము టీవీ కథనం తెలిపింది.

భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ఈ ఏడాది జనవరిలో ముత్తాఖీని కలిశారు.

ఇటీవలి కాలంలో అనేకమంది తాలిబాన్ ప్రభుత్వాధికారులు భారత్‌లో పర్యటించారు.

"తాలిబాన్ వైద్య, ఆహార శాఖమంత్రి హందుల్లా జాహిద్ సెప్టెంబర్‌లో భారత్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ కేర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. సెప్టెంబర్‌లో అఫ్గానిస్తాన్‌లో భూకంపం వచ్చినప్పుడు భారత్ సహాయ సామగ్రి పంపించింది. ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ ద్వారా మరికొంత సాయం అఫ్గానిస్తాన్ చేరుకుంది" అని అము టీవీ తెలిపింది.

అఫ్గానిస్తాన్, తాలిబాన్, అమీర్‌ఖాన్ ముత్తాఖీ, భారత ప్రభుత్వం, రష్యా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముత్తాఖీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమవుతారు.

ప్రధాన కారణం పాకిస్తానేనా?

ముత్తాఖీ భారత పర్యటనలో ప్రధాన అంశం భారత దేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడమేనని అఫ్గానిస్తాన్‌కు చెందిన ఇంగ్లీష్ న్యూస్‌ వెబ్‌సైట్ టోలో న్యూస్ అక్టోబర్ 4న ప్రచురించిన కథనంలో రాసింది.

"ఇప్పటికిప్పుడు భారత దేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తుందని నేను అనుకోవడం లేదు" అని టోలో న్యూస్‌కు చెప్పారు రాజకీయ విశ్లేషకుడు సయ్యద్ అక్బర్ సియాల్ వార్దక్.

"భారత్ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ముందు అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

"ఇటీవల భారత్- అఫ్గానిస్తాన్ సంబంధాల్లో అనేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల్ని మరింత విస్తరించేందుకు ఈ పర్యటన దోహద పడుతుందని భావిస్తున్నారు" అని టోలో న్యూస్ రాసింది.

"భారత్- అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనే దానిలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించడమే. దీన్ని భారత్ అవకాశంగా మార్చుకుంటోంది" అని టోలో న్యూస్‌తో అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకుడు వాహిద్ ఫఖీరి చెప్పారు.

తాలిబాన్లు అధికారం చేపట్టి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది రష్యా మాత్రమే. పాకిస్తాన్ సహా మరే దేశం కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు.

"కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని విస్తరించే అంశం గురించి చర్చించవచ్చు. పూర్తిస్థాయి రాయబారి నియామించవచ్చు. ఇది జరిగితే, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సమాచార మార్పిడి జరుగుతుంది" అని టోలో న్యూస్ అక్టోబర్ 5న ప్రచురించిన కథనంలో తెలిపింది.

"భారత ప్రభుత్వం తాలిబాన్లను గుర్తిస్తే, ఇది ఈ దిశగా మరికొన్ని దేశాలను ప్రోత్సహించ వచ్చు. అయితే మిగతా దేశాలు భారత్ బాటలో నడవాలని ఏమీ లేదు. ఏ దేశమైనా సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుంది" అని టోలో న్యూస్‌తో రాజకీయ విశ్లేషకుడు అజీజ్ మర్రి చెప్పారు.

అప్గానిస్తాన్, తాలిబాన్, అమీర్‌ఖాన్ ముత్తాఖీ, భారత ప్రభుత్వం, రష్యా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ జనవరిలో ముత్తాఖీని కలిశారు.

మాస్కో ఫార్మాట్ సమావేశం

రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ నిర్వహించిన మాస్కో ఫార్మాట్ సంప్రదింపుల్లో పది దేశాలు పాల్గొన్నాయి. రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చైనా, ఇరాన్, మధ్య ఆసియా దేశాలు మాస్కో ఫార్మాట్ సమావేశానికి హాజరయ్యాయి. అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రత్యేక రాయబారి మొహమ్మద్ సాదిఖ్‌, అఫ్గానిస్తాన్ విదేశాంగమంత్రి ముత్తాఖీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి విడుదల చేసిన ఫోటోలో ముత్తాఖీ తాలిబాన్ల తెలుపు-నలుపు జెండా వద్ద కూర్చున్నారు.

బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అదుపులోకి తీసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనను మాస్కో ఫార్మాట్ సంయుక్త ప్రకటన ఖండించింది.

బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి ప్రస్తావించకపోయినప్పటికీ, "అఫ్గానిస్తాన్‌, దాని పొరుగు దేశాల్లో సైన్యాన్ని మోహరించే ప్రయత్నం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

తాలిబాన్ల విషయంలో భారత్ వైఖరిని అఫ్గాన్లు వ్యతిరేకిస్తున్నారు.

"డియర్ ఇండియా, తాలిబాన్ అధికారులకు ఆతిథ్యం ఇవ్వడం అఫ్గానిస్తాన్‌కు ద్రోహం చేయడమే. అది స్కూలుకు వెళ్లలేకపోతున్న బాలికలకు చెంపపెట్టు లాంటిది. మహిళల్ని అణచివేసి, వారిపట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వపు మాయలో పడకండి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇంతకంటే మెరుగ్గా వ్యవహరించగలదు" అని అఫ్గాన్ జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)