నెదర్లాండ్స్: పార్కులో తేనెతుట్టెలకు నిప్పు, 5 లక్షల తేనెటీగలు మృతి

ఫొటో సోర్స్, Almere West Poort Police
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, యూరప్ డిజిటల్ ఎడిటర్
నెదర్లాండ్స్‌లోని సెంట్రల్ సిటీ అల్మెరేలో ఉన్న ఒక పార్కులో తాను పెంచుతున్న 10 తేనెతుట్టెలను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 5 లక్షల తేనెటీగలు చనిపోయినట్లు ఓ డచ్ తేనెటీగల పెంపకం దారుడు చెప్పారు.
ప్రతి తేనెతుట్టెలో 40-60,000 తేనెటీగలకు చెందిన ఒక కాలనీ ఉంటుందని తేనెటీగల పెంపకందారు హరోల్డ్ స్ట్రింగర్ చెప్పారు. ఎవరైనా వీటిని చంపగలరనే ఆలోచనే భయంకరంగా ఉందన్నారు.
''నా 10 తేనెతుట్టెలను కోల్పోవడం చాలా బాధకరంగా ఉంది'' అని ఆయన స్థానిక బ్రాడ్‌కాస్టర్ ఆంరోఫ్ ఫ్లెవోలాండ్‌కు తెలిపారు.
నగరంలోని బీట్రిక్స్‌పార్క్‌లో మంగళవారం సాయంత్రం ఈ దాడి జరిగిన తర్వాత సాక్షులు ముందుకు వచ్చి, ఈ ఘటన వివరాలు తెలియజేయాలని అల్మెరే పోలీసులు కోరారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు అయ్యాయి.
దేశంలో తేనెటీగలకు చెందిన 360 జాతుల్లో సగానికి పైగా అంతరించే ప్రమాదంలో ఉన్నాయని డచ్ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జనాభా తగ్గిపోతుంది.
పార్కులో చెట్లతో నిండిన ప్రాంతంలో ప్యాలెట్లపై (చెక్క ర్యాక్‌లపై) ఉన్న తేనెతుట్టెలకు నిప్పు పెట్టేందుకు యాక్సిలెరెంట్ అనే పదార్థాన్ని వాడినట్లు పోలీసులు తనకు చెప్పారని స్ట్రింగర్ చెప్పారు.

ఈ తేనెటీగల్లో ఏవైనా బతకడం చాలా కష్టమే. తేనెతుట్టెలను దహనం చేసిన వ్యక్తి పట్టుబడతారనే దానిపై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు.
అయితే, తన తోటి తేనెటీగల పెంపకందారు హెలీన్ నీమాన్, డచ్ రేడియోతో మాట్లాడారు. తన వద్ద మూడు తేనెతుట్టెల కాలనీలు ఉన్నాయని, వాటిల్లో ఒకటి ఆయనకు ఇస్తానని తెలిపారు.
తొమ్మిదేళ్లుగా ఈ తేనెటీగలను స్ట్రింగర్ సంరక్షిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో కొత్తగా మళ్లీ మొదట్నుంచి ఈ పార్కులో కొత్త కాలనీని ప్రారంభించాలి. తాను ఎట్టిపరిస్థితుల్లో తేనెటీగలను పెంచుతానన్నారు స్ట్రింగర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














