చింపాంజీల జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేసిన జేన్ గుడ్ ఆల్ మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైయా డేవిస్
- హోదా, బీబీసీ న్యూస్
చింపాంజీలపై పరిశోధనలు చేసిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణురాలు, ప్రకృతి పరిరక్షకురాలు, 91ఏళ్ల డేమ్ జేన్ గుడ్ ఆల్ మరణించారు.
మానవులు, చింపాంజీలకు ఎంత దగ్గరి సంబంధం ఉందో తెలుసుకోవడానికి ఆమె పరిశోధనలు సహాయపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పరిరక్షణ ప్రాజెక్టుల కోసం కూడా ఆమె అవిశ్రాంతంగా పనిచేశారు.
కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న సమయంలో డాక్టర్ గుడ్ ఆల్ సహజ మరణం చెందినట్టుగా జేన్ గుడ్ ఆల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.
ఆమె చేసిన ఆవిష్కరణలు "సైన్స్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి", ఆమె " మన ప్రకృతిని రక్షించేందుకు, పునరుద్ధరించేందుకు అహర్నిశలు కృషి చేశారు"అని పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
డిగ్రీ లేకపోయినా పీహెచ్‌డీ
1934లో జన్మించి, లండన్‌లో పెరిగిన డాక్టర్ గుడ్ ఆల్ , ది స్టోరీ ఆఫ్ డాక్టర్ డూలిటిల్, టార్జాన్ వంటి పుస్తకాలు చదివిన తర్వాత జంతువుల పట్ల ఆకర్షితులయ్యారని చెప్పారు.
ఆమె ఇరవైల మధ్యలో కెన్యాలోని ఒక స్నేహితుడి పొలంలో ఉన్నప్పుడు ప్రముఖ జంతు అధ్యయన ప్రొఫెసర్ లూయిస్ లీకీని కలిశారు. జేన్ గుడ్‌ఆల్‌కు విద్యార్హతలు లేకపోయినప్పటికీ, ఆమె సామర్థ్యాన్ని చూసి 1960లో టాంజానియా అడవుల్లో పరిశోధన చేయడానికి లికీ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చారు.
కర్రను ఉపయోగించి చెదపురుగుల దిబ్బను తవ్వుతున్న చింపాంజీకి డేవిడ్ గ్రేబియర్డ్ అని పేరు పెట్టారు.
అప్పటి వరకు, మనుషులు మాత్రమే అలా చేయగలిగేవారని భావించారు. కానీ ఆమె పరిశోధనలు సంప్రదాయ ఆలోచనలను సవాల్ చేశాయి. పరిణామ శాస్త్ర భవిష్యత్తును రూపొందించాయి.
ఆమె రచనలు ప్రముఖ జర్నల్స్, పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 1965 లో ఆమె నేషనల్ జియోగ్రాఫిక్ ముఖచిత్రాన్ని తయారు చేశారు. ప్రైమేట్స్(చింపాంజీలు, గోరిల్లాలు, ఒరంగుటాన్ వంటి చేతులు ఉపయోగించగలిగిన జీవులు) భావోద్వేగ, సామాజిక జీవితాలను ప్రపంచానికి పరిచయం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎగతాళి చేసిన పురుష శాస్త్రవేత్తలు
చింపాంజీలు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉంటాయని, తమ నివాసం కోసం యుద్ధంలో కూడా పాల్గొంటాయని ఆమె వెల్లడించారు. ఓర్సన్ వెల్లెస్ చిత్రించిన టెలివిజన్ డాక్యుమెంటరీలో చింపాజీ పిల్లలతో ఆడుకుంటూ, సరదాగా కుస్తీ పడుతూ కనిపించారామె.
చింపాంజీలతో సన్నిహితంగా ఉండటం, వాటికి పేర్లు పెట్టడం, వాటిని "నా స్నేహితులు" అని పిలవడాన్ని చూసిన కొంతమంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా పురుషులు ఎగతాళి చేసేవారు. డిగ్రీ లేనప్పటికీ తన పరిశీలనల ఆధారంగా పిహెచ్‌డీ పూర్తి చేసి శాస్త్ర ప్రపంచంలో గుర్తింపు పొందారు జేన్.
ఈ రంగంలో తన అనుభవాల తర్వాత ఆమె క్రియాశీలక కార్యకర్తగా మారి, జంతుప్రదర్శనశాలల్లో లేదా వైద్య పరిశోధన కోసం బంధించిన చింపాంజీలను విడిపించడానికి కృషి చేశారు. తరువాత, వాతావరణ మార్పులపై ప్రజలను చైతన్యపరిచారు.
"మనం పెద్ద ప్రళయంలో ఉన్నాం. ప్రకృతిని పునరుద్ధరించడం, ఉన్న అడవులను రక్షించడం కోసం ఎంత పని చేస్తే అంత మంచిది" అని 2024లో ఆమె బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరంతరం ప్రయాాణాల్లోనే
డాక్టర్ గుడ్ ఆల్ 1977లో స్థాపించిన జేన్ గుడ్ ఆల్ ఇనిస్టిట్యూట్ చింపాంజీలను రక్షించడానికి పనిచేస్తుంది. జంతువులు, పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉన్న ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది.
డాక్టర్ గుడ్‌ఆల్ 2003లో డేమ్ బిరుదును పొందారు . 2025 లో యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందుకున్నారు.
ఆమె తన పని కోసం నిరంతరం ప్రయాణిస్తూనే ఉండేవారు. 2022లో టైమ్స్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, 1986 నుంచి మూడు వారాల మించి ఎప్పుడూ ఒకే మంచంపై నిద్రపోలేదని చెప్పారు.
డాక్టర్ గుడ్ ఆల్ మరణించే వరకు పనిచేస్తూనే ఉన్నారు. వారం క్రితం న్యూయార్క్‌లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అక్టోబర్ 3న కాలిఫోర్నియాలో జరిగే కార్యక్రమంలో ఆమె మళ్ళీ ప్రసంగించాల్సి ఉంది. ఇప్పటికే ఆ కార్యక్రమానికి సంబంధించిన టికెట్స్ కూడా అమ్ముడయ్యాయి.
జేన్ గుడ్‌ఆల్ మృతికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ప్రపంచ వ్యాప్తంగా పలువురు సంతాపం తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














