హీరోహీరోయిన్లు ఇద్దరూ కానిస్టేబుళ్లు.. మరి, సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా?

ఫొటో సోర్స్, Facebook/Varunsandesh
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
వరుణ్‌సందేశ్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత 'కానిస్టేబుల్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాలో ఎలా నటించాడో చూద్దాం.
కథ ఏమంటే.. శంకరపల్లి అనే చిన్న పోలీస్‌స్టేషన్‌లో హీరో ఒక కానిస్టేబుల్. అక్క, బావలతో కలిసి ఉంటాడు.
మేనకోడలంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతూ ఉంటుంది. అదే కాలేజీలో ఎమ్మెల్సీ కొడుకు కూడా ఉంటాడు.
అతని బర్త్‌డే పార్టీ తర్వాత హీరో మేనకోడలు దారుణ హత్యకి గురవుతుంది. ఆ తర్వాత వరుస హత్యలు జరుగుతాయి.
ఆ చిన్న ఊళ్లో ఉన్న సీరియల్ కిల్లర్ ఎవరు? లక్ష్యం ఏంటి? హీరో కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడు? ఇది మిగతా కథ.
నగరాల్లో కాకుండా కథకి పల్లెటూరి నేపథ్యం ఎంచుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
తెలంగాణ యాసతో పాత్రలనీ అర్గానిక్‌గా మలిచాడు. ప్రారంభంలోనే ఇది మర్డర్ మిస్టరీ అనే హింట్ ఇచ్చాడు. తర్వాత రొటీన్‌గా మార్చేసాడు.
వరుణ్ సందేశ్ బాగా నటించినప్పటికీ.. మిగతా పాత్రలనీ తేలిపోవడంతో కథ దారి తప్పింది.
కరోనా తర్వాత కాలం మారింది. ప్రేక్షకుడు మారాడు. ప్రపంచ సినిమా అతని సెల్‌ఫోన్‌లోకి వచ్చేసింది.
ఒక నిమిషం రీల్స్ బోర్ కొడితేనే భరించలేడు. మరి రెండు గంటలు థియేటర్‌లో కూర్చో పెట్టాలంటే చాలా విషయం ఉండాలి.
కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్‌ని నమ్ముకుని సినిమా తీస్తే లాభం లేదు.

హిచ్‌కాక్ సైకో దగ్గర నుంచి అన్ని భాషల్లోనూ కొన్ని వందల మర్డర్ మిస్టరీలు, సైకో కిల్లర్ కథలు వచ్చాయి.
మూల కథ ఒకే విధంగా ఉంటుంది. హత్యలు జరుగుతూ ఉంటాయి.
ప్రేక్షకుడు అనేక మందిని అనుమానిస్తూ ఉంటాడు. చివరికి ఊహకి అందని వ్యక్తి కిల్లర్‌గా ఉంటాడు. అతనికో మానసిక వ్యాధి, లేదా ఏదో గతం.
ఈ కథని ఎన్నిసార్లు చెప్పినా చూస్తారు. కథనంలో బిగువుండాలి. అతి వేగంగా కథ కదలాలి.
లేదంటే, ఎక్కడో చూసిన సీన్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నట్టు అనిపించి విసుగ్గా మారుతుంది. కానిస్టేబుల్‌లో జరిగింది ఇదే.

ఫొటో సోర్స్, Facebook/Varunsandesh
మర్డర్ మిస్టరీల్లో పెద్దగా లాజిక్‌లు అడగరు కానీ, కనీసం కన్విన్సింగ్‌గా ఉండాలి. అది కూడా లేదు. దర్శకుడు తనకి అనువుగా కథ రాసుకుని హత్యలు చూపిస్తూ పోతే ఆసక్తి ఎందుకుంటుంది?
పాత్రలకి ఒక వ్యక్తిత్వం కానీ, సన్నివేశాల్లో బలం కానీ లేదు. తెరమీద కనిపించే సగం మందికి నటన రాదు.
ఉన్నంతలో కెమెరామన్, కాస్త కష్టపడ్డాడు. సూర్యలాంటి మంచి నటుడు ఉన్నా వాడుకోలేదు.
క్లైమాక్స్‌లో సుదీర్ఘ ప్లాష్ బ్యాక్ చిరాగ్గా ఉంది. ఎండ్ టైటిల్స్‌లో కానిస్టేబుల్ మీద పాట ఎందుకో అర్థం కాదు. పైగా సీరియల్ కిల్లర్ మాస్క్ వాడడం అరిగిపోయిన టెక్నిక్.
హీరో కానిస్టేబుల్, హీరోయిన్ లేడీ కానిస్టేబుల్, పల్లెటూరి స్టేషన్ ఈ నేపథ్యంతో ప్రారంభమైనప్పుడు సినిమా బావుండొచ్చనే ఆశ కలిగింది.
వెంటనే ఒక ఐటెం సాంగ్‌తో నీళ్లు చిలకరించారు.
ప్లస్ పాయింట్
వరుణ్ సందేశ్ నటన
మైనస్ పాయింట్
నత్తనడక కథనం
సుదీర్ఘ క్లైమాక్స్ ప్లాష్‌బ్యాక్
మర్డర్ మిస్టరీలు ఎలా తీయకూడదో కానిస్టేబుల్ ఒక ఉదాహరణ.
గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














