కాంతార చాప్టర్ 1 అంచనాలను అందుకుందా, రిషబ్ శెట్టి మ్యాజిక్ రిపీట్ అయిందా?

ఫొటో సోర్స్, X/hombalefilms
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దానికి 'ప్రీక్వెల్'గా కాంతార చాప్టర్ -1 రిలీజైంది. అంచనాలు విపరీతంగా ఉన్న ఈ సినిమా ఎలా ఉందంటే...
కాంతారలో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో అక్కడే చాప్టర్ 1 ప్రారంభమవుతుంది.
కాంతార ప్రాంత గొప్పతనం, గుళిగ ఉగ్రరూపం, ఈశ్వరుని పూదోట విశిష్టత, గతంలో వరాహ రూపంలోని పంజుర్లి ఈసారి పులి రూపంలో కనిపించడం, ఇలా రకరకాల ఫాంటసీ అంశాలతో నడుస్తుంది.

కథ ఏమంటే..
కొన్ని శతాబ్దాల క్రితం కదంబ రాజవంశీకులు బాంగ్ర రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు.
రాజు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య), ఆయన తండ్రి రాజశేఖరుడు (జయరాం), చెల్లి కనకావతి (రుక్మిణి వసంత్).
ఈ రాజ్యం వాళ్లెవరూ కాంతార అడవిలోకి అడుగుపెట్టరు. అక్కడి గిరిజన తెగలు చాలా శక్తిమంతమైనవి.
వాళ్ల నాయకుడు బెర్మి (రిషబ్ శెట్టి). అతను ఓ పవిత్ర బావిలో దొరికిన దైవ పుత్రుడు. కొన్ని శక్తులు ఆయన్ను కాపాడుతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Hombale Films/facebook
దేవుడి విగ్రహం కోసం అదే అడవిలోని ఇంకో తెగ కాంతార తెగతో యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఒకరోజు కులశేఖరుడు కాంతార అడవికి వేటకి వస్తాడు.
దీంతో ఆగ్రహం చెందిన బెర్మి తన జనంతో బాంగ్ర రాజ్యానికి వెళ్తాడు. అక్కడ బానిసలుగా ఉన్న తన తెగవారిని చూస్తాడు.
సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని గమనించి బందరు రేవుని స్వాధీనం చేసుకుంటాడు.
పగబట్టిన రాజు ప్రతీకారంతో ఏం చేస్తాడు? దైవిక శక్తిగా హీరో ఎలా రూపాంతరం చెందాడు? అనేది మిగతా కథ.

ఫొటో సోర్స్, X/hombalefilms
కాంతార సినిమాలో జమీందారుకి, పేద ప్రజలకి మధ్య భూమికి సంబంధించిన ఘర్షణ ఉంటుంది.
జమీందారుకి అనుచరుడిగా ఉన్న హీరో , చివరికి మోసాన్ని గ్రహించి ఉగ్రగుళిగగా మారి తిరగబడతాడు.
ఇదే కథని రాజ్యానికి, గిరిజన తెగకి సంఘర్షణగా మారిస్తే చాప్టర్-1 అవుతుంది.
రాజుకి ఈశ్వరుని పూదోట మీద ఆధిపత్యం కావాలి. కానీ, అక్కడ అడుగుపెడితే తెగలు ఊరుకోవు.
కాంతారలో భూమి, కులం , వెనుకబాటుతనం, అటవీ అధికారుల దౌర్జన్యంతో పాటు దైవానికి సంబంధించిన ఫిలాసఫికల్ జర్నీ ఉంటుంది.
అంతర్లీనంగా తండ్రీకొడుకుల ఎమోషన్. సున్నితమైన ప్రేమ కథ ఉంటాయి.
చాప్టర్-1లో లోపించింది ఇదే.
హీరో, హీరోయిన్, మహారాజు, ఆయన తండ్రి పాత్రలు తప్ప ఇంకే కేరెక్టర్ రిజిస్టర్ కాదు.
ఫస్టాఫ్ అంతా గజిబిజిగా ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి గానీ టేకాఫ్ జరగదు.
ప్రారంభంలో ఉన్న వాయిస్ ఓవర్‌లో గంభీరత్వం లేదు.
కథ సరళంగా లేకపోయే సరికి స్క్రీన్ మీద ఏం జరుగుతోందో అర్థం కాదు.

ఫొటో సోర్స్, X/rukmini
సెకండాఫ్..
సెకండాఫ్‌కి సినిమా నిలదొక్కుకుంటుంది. కథ ఎటుపోతోందో తెలుస్తుంది.
విషయం ఏమంటే.. కాంతార గ్రాఫిక్స్‌తో హిట్ కాలేదు. కథ, కథనంలో బలం ఉంది.
చాప్టర్ -1లో కథ, కథనాలు గాలికి వదిలి కేవలం యాక్షన్, గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డారు.
రిషబ్ పూనకం సన్నివేశాలు బావున్నాయి కానీ, ఆ మ్యాజిక్ రెండోసారి రిపీట్ అవుతుందని ఆశించడం అత్యాశ.
చూసిన సీన్స్ మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది.
గజిబిజి కథనం, నత్తనడక, కేరెక్టర్లకి రౌండప్ లేకపోవడం ఇవన్నీ మినహాయిస్తే.. విజువల్‌గా, నేపథ్య సంగీతంలోనూ ఒక అద్భుతాన్ని సృష్టించారు.
అరవింద్ ఎస్ కశ్యప్ కెమెరా వర్క్, అజనీష్ బీజీఎం ప్రత్యేకంగా అభినందించాలి.
రిషబ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రుక్మిణి వసంత్ నటన సింప్లీ సూపర్బ్. డిఫరెంట్‌షేడ్స్ కళ్లతోనే పలికించారు.
జయరాం, గుల్షన్ దేవయ్యలు కూడా ఓకే.
కాంతారలోని కామెడీ టీం అంతా ఉంది కానీ, ఒక్కచోట కూడా నవ్వించలేకపోవడం విశేషం.

ఫొటో సోర్స్, X/rukmini
రచయిత, దర్శకుడైన రిషబ్ సినిమా అంతా తానే కనపడాలని అనుకోవడమే మైనస్.
కాంతారలో విలన్ బలంగా ఉన్నాడు. అడుగడుగునా అతని క్రూరత్వం, ఆలోచనలు తెలుస్తుంటాయి.
అందుకే హీరో హైలైట్ అయ్యాడు.
చాప్టర్ -1లో హీరోకి వచ్చే ఇబ్బందులన్నీ ఫోర్స్‌డ్‌గా ఉన్నాయి.
ఎలాగూ దేవుడు కాపాడతాడనే క్లారిటీ ఉంది కాబట్టి ప్రేక్షకుడికి పెద్దగా థ్రిల్ కలగదు.
ప్లస్ పాయింట్
1. రిషబ్, రుక్మిణి నటన
2. కెమెరా, సంగీతం, గ్రాఫిక్స్
3. క్లైమాక్స్
మైనస్ పాయింట్
1. ఫస్టాఫ్
2. బోర్ కామెడీ
3. అస్పష్టమైన కథ , కథనాలు
చివరిగా.. అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు.
గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














