డ్రోన్ బెటాలియన్: భారత ఆర్మీ మరింత పవర్‌ఫుల్ కానుందా?

భారత సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షకీల్ అఖ్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భవిష్యత్ అవసరాలకు సన్నద్ధం కావడంలో భాగంగా భారత సైన్యం ప్రత్యేక 'డ్రోన్ బెటాలియన్లను' సిద్ధం చేయాలని నిర్ణయించింది.

సైన్యానికి చెందిన ఆర్టిలరీ, ఇన్ఫేంట్రీ, ఆర్మ్‌డ్ డివిజన్లలో ఒక్కో డ్రోన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

ఈ కొత్త యూనిట్లను ప్రత్యేకంగా, పూర్తిగా డ్రోన్ కార్యకలాపాల కోసమే వాడనున్నారు.

దీనికోసం డ్రోన్ల కార్యకలాపాలపై ఆర్మీ అధికారులకు ఉన్నత స్థాయి శిక్షణను ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు.

జులై 26న 'కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా 30 లైట్ కమాండో బెటాలియన్లను, అన్ని ఆయుధాలు, డ్రోన్ వంటి పరికరాలతో కూడిన రుద్రా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ‘చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్’ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియన్ డ్రోన్ బెటాలియన్ ఏం చేస్తుంది?

భారత సైన్యాన్ని ఆధునికీకరించి, త్రివిధ దళాలతో కోర్డినేట్ చేసుకునే సమగ్ర ప్రణాళికలో భాగంగా డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటవుతుంది.

డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసే విషయంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు రక్షణ విశ్లేషకులు రాహుల్ బేదీ చెప్పారు.

''ఆపరేషన్ సిందూర్ తర్వాత, డ్రోన్లను కూడా యుద్ధ యూనిట్లుగా సైన్యంలో చేర్చడం భారత ఆర్మీ సమగ్ర వ్యూహంగా మారింది. గత పదేళ్లలో ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలలో అంటే.. యుక్రెయిన్-రష్యా యుద్ధమైనా, అజర్‌బైజాన్‌లో యుద్ధమైనా, ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలోనైనా.. డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగించారు'' అని రాహుల్ బేదీ చెప్పారు.

''డ్రోన్ల మరో ప్రత్యేకత ఏంటంటే.. అవి మిగతా యుద్ధ పరికరాలతో పోల్చినప్పుడు చాలా చౌకగా లభిస్తాయి. వందల కోట్ల విలువైన అధునాతన ట్యాంకులను ధ్వంసం చేసేందుకు కూడా వీటిని వాడొచ్చు. చౌకైన, అత్యంత సమర్థమైన ఆయుధాలుగా ఇవి ఉపయోగపడతాయి'' అని బేదీ తెలిపారు.

భారత సైన్యం ప్రస్తుతం డ్రోన్ల కోసంప్రత్యేక బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తోందని బేదీ అన్నారు.

ఈ బ్రిగేడ్‌లో 25 నుంచి 100 మంది సైనికులు ఉంటారు. సాంకేతిక నిపుణులకు మాత్రమే డ్రోన్లను ఆపరేట్ చేసే బాధ్యతను అప్పగిస్తారు.

''రెండు రకాల డ్రోన్లు ఉంటాయి. ఒకటి దాడిచేసే డ్రోన్ (అటాక్ డ్రోన్), మరొకటి నిఘా డ్రోన్. నిఘా డ్రోన్ సమాచారాన్ని సేకరించేందుకు రహస్యంగా ఆకాశంలో తిరుగుతుంటుంది. టార్గెట్ ఎక్కడుందనేదిని చూసి.. అటాక్ డ్రోన్‌కు సంకేతాలు పంపుతుంది. అప్పుడు అటాక్ డ్రోన్ ఒక్కటే అయినా.. లేదంటే మరో 20 నుంచి 25 డ్రోన్లతో కలిసి కానీ లక్ష్యంపై దాడి చేస్తుంది'' అని తెలిపారు.

భారత సైన్యం

ఫొటో సోర్స్, Corbis via Getty Images

డ్రోన్లను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి షార్ట్-రేంజ్ డ్రోన్లు. అంటే 20 నుంచి 50 కిలోమీటర్ల వ్యవధిలో వీటిని ఆపరేట్ చేస్తారు.

మిగతా రెండు మీడియం, హైఎండ్ డ్రోన్లు. ఇవి ఎక్కువ దూరాలకు ప్రయాణించి దాడులు చేయగలుగుతాయి.

భారత్ ఇలాంటి 31 డ్రోన్లను 3.5 బిలియన్ డాలర్లతో (రూ.30,652 కోట్లతో) అమెరికా నుంచి కొనుగోలు చేసింది.

1990ల చివరి నుంచే భారత్ డ్రోన్లను కొనడం మొదలుపెట్టింది.

ఇజ్రాయెల్ నుంచి హార్పీ, హెరోప్, హెరోన్ శ్రేణి డ్రోన్లను భారత్ కొనుగోలు చేసింది.

వీటిని ఆపరేషన్ సిందూర్‌లో వాడింది. భారత్ కూడా సొంతంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది.

లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోని సైనికులకు యుద్ధ సామగ్రిని, సరకులను రవాణా చేసేందుకు ప్రస్తుతం డ్రోన్లను వినియోగిస్తోంది.

డ్రోన్ టెక్నాలజీలో మూడు దేశాలు అత్యంత పురోగతిలో ఉన్నాయి. అందులో ఒకటి ఇజ్రాయెల్. ఈ దేశం అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేసింది.

రెండో దేశం అమెరికా.. ఈ డ్రోన్లపై పట్టు సాధించింది. ఇక మూడోది చైనా. డ్రోన్ల రంగంలో చైనా చాలా వేగంగా దూసుకెళ్తోంది.

తుర్కియేలో తయారైన సోనాగర్ డ్రోన్లు

ఫొటో సోర్స్, ASISGUARD.COM

'భవిష్యత్ యుద్ధాల్లో మనుషుల అవసరం తగ్గుతుంది'

భారత్-పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలో చైనా, తుర్కియేల నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లను పాకిస్తాన్ వాడింది.

హైటెక్ డ్రోన్ వార్ ఫేర్ ప్రస్తుతం పెరుగుతోంది.

గతంలో పదాతి దళ యుద్ధాలు జరిగేవని, తూటాలు పేల్చుకునేవారని రక్షణ విశ్లేషకులు రాహుల్ బేదీ బీబీసీతో అన్నారు. దీన్ని కాంటాక్ట్ వార్‌ఫేర్ అనేవారు.

'' ప్రస్తుతం ఇదంతా ముగుస్తోంది. ఇప్పుడు ఈ పనిని మెషిన్లకు అప్పజెబుతున్నారు. కంప్యూటర్ల సాయంతో నడిచే పైలట్ లేని ఫైటర్ ప్లేన్లు తయారవుతున్నాయి'' అని చెప్పారు.

'' లక్ష్యాన్ని గురి చూసి కొట్టే సమయంలో పైలట్ తప్పు చేయొచ్చు. అయితే, ఈ మెషిన్ల వల్ల తప్పు జరిగే అవకాశం చాలా తక్కువ'' అని తెలిపారు.

భవిష్యత్ యుద్ధాల్లో మనుషుల అవసరం తగ్గుతుందని, మెషిన్ల అవసరం పెరుగుతుందని అన్నారు.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

'24 గంటల పాటు పర్యవేక్షించే శాటిలైట్ వ్యవస్థ కావాలి'

భారత్ తన సైన్యం కోసం డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉండదని రక్షణ విశ్లేషకులు, మిలటరీ ఎఫైర్స్ మ్యాగజీన్ 'ఫోర్స్' ఎడిటర్ ప్రవీణ్ సాహ్ని అన్నారు.

24 గంటల పాటు భూభాగంపై ఏం జరుగుతుందో కన్నేసే ఒక సమర్థ ఉపగ్రహ వ్యవస్థ భారత్‌కు సొంతంగా లేనంతవరకు, ఈ డ్రోన్లు అంత సమర్థంగా పనిచేయలేవని చెప్పారు.

''ఆపరేషన్ సిందూర్‌ తర్వాత నెలకొన్న పరిస్థితిలో చైనా శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పాకిస్తాన్ 24 గంటల పాటు భారత భూభాగంపై నిఘా వేయడం చూశాం. అంటే, భారత సైనిక కార్యకలాపాలను పాకిస్తాన్ నిత్యం గమనించింది '' అని తెలిపారు.

యుద్ధ క్షేత్రం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం డ్రోన్లకు చాలా ముఖ్యమని చెప్పారు ప్రవీణ్.

24 గంటల పాటు ఎక్కడ ఏం జరుగుతుందో పర్యవేక్షించే వ్యవస్థ లేకపోతే, ఈ యూనిట్లు ప్రయోజనకరంగా ఉండవని ప్రవీణ్ సాహ్ని అన్నారు.

'' డ్రోన్లు అవసరం లేదని నేను అనడం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని తెలిపారు.

శాటిలైట్ ద్వారా యుద్ధక్షేత్రాన్ని 24 గంటల పాటు పర్యవేక్షించే వ్యవస్థ భారత ఆర్మీకి కావాలని అన్నారు. ఇది ప్రస్తుతం చైనా సహాయంతో పాకిస్తాన్‌కు అందుబాటులో ఉంది.

సరిహద్దులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు భారత ఆర్మీ ప్రస్తుతం యూఏవీలను (అన్‌మాన్డ్ ఏరియల్ వెహికిల్ ) వాడుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)