ఐబెక్స్ బ్రిగేడ్: మంచు చరియల్లో చిక్కుకున్న 46 మందిని కాపాడిన భారత ఆర్మీ ప్రత్యేక దళం

ఫొటో సోర్స్, @suryacommand
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా, మాణా గ్రామం సమీపంలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 46 మందిని రెస్క్యూ బృందం రక్షించగలిగింది.
ఫిబ్రవరి 28న ఉదయం 7.15 గంటలకు మాణా గ్రామం సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) శిబిరంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో 54 మంది కార్మికులు శిబిరంలో ఉన్నారు.
సమాచారం అందిన వెంటనే, భారత సైన్యానికి చెందిన ఐబెక్స్ బ్రిగేడ్ (ఐబీఈఎక్స్) రంగంలోకి దిగింది. ఉదయం 8 గంటల నుంచే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.


ఫొటో సోర్స్, @suryacommand/File
ఏంటీ ఐబెక్స్ బ్రిగేడ్ ?
ఐబెక్స్ బ్రిగేడ్ భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళం. దీనికి ఐబెక్స్ జాతికి చెందిన 'పర్వత మేక' (మౌంటైన్ గోట్) పేరు పెట్టారు. నిటారుగా ఉన్న పదునైన కొండలను ఎక్కడంలో ఈ మౌంటైన్ గోట్‌కు నైపుణ్యం ఉంది. ఇది మైనస్ 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఐబెక్స్ బ్రిగేడ్‌కు చాలా అనుభవం ఉంది. ఇది పర్వత ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఎంత ఎత్తులోనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆపరేషన్లు నిర్వహించేలా శిక్షణ పొందింది.
ఈ బ్రిగేడ్‌లోని సైనికులకు 9 వేల నుంచి 15 వేల అడుగుల ఎత్తైన ప్రాంతాల్లోనూ సులభంగా ఆపరేషన్లు నిర్వహించేలా శిక్షణ ఇస్తారు. భారీగా మంచు కురుస్తున్న సమయంలో కూడా వారికి కఠినమైన శిక్షణ సాగుతుంది.
"ఐబెక్స్ బ్రిగేడ్ భారత సైన్యానికి చెందిన ప్రత్యేక పర్వత దళం. ఇది అత్యంత ఎత్తులో, వెళ్లేందుకు వీల్లేని చోట కూడా రెస్క్యూ చేసేలా పూర్తిగా శిక్షణ పొందింది. ఎలాంటి పరిస్థితిలోనైనా మిలటరీ ఆపరేషన్ చేపట్టగలదు" అని కల్నల్ మనీష్ ఓజా (రిటైర్డ్) చెప్పారు.
చైనాకు దగ్గరగా ఉండే ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ సరిహద్దు వద్ద ఈ ఐబెక్స్ బ్రిగేడ్ పనిచేస్తుంది. ఎత్తైన ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడంలో దీనికి నైపుణ్యం ఉంది.

ఫొటో సోర్స్, PRO (Defence) Dehradun
'దారి మూతపడింది'
"ప్రతి భారత సైనికుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందుతాడు" అని భారత సైన్యం ఉత్తరాఖండ్ ప్రతినిధి కల్నల్ మనీష్ శ్రీవాస్తవ అన్నారు.
మాణా సమీపంలో మంచు చరియలు విరిగిపడిన సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం వేగంగా చర్యలు చేపట్టింది. ఒక యూనిట్ అప్పటికే ఆ ప్రాంతంలో మోహరించింది, మరొక యూనిట్ నుంచి దాదాపు 170 మంది సైనికులు సంఘటన జరిగిన అరగంటలోపు సహాయక చర్యలకు ఉపక్రమించారు.
భారత వైమానిక దళం సమన్వయంతో జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహకారంతో సహాయ, రెస్క్యూ కార్యకలాపాలు వేగంగా జరిగాయి.
15 కిలోమీటర్ల వరకు రహదారి పూర్తిగా మూతపడిందని కల్నల్ మనీష్ శ్రీవాస్తవ చెప్పారు. దీంతో హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఫొటో సోర్స్, PRO (Defence) Dehradun
ఐదు సవాళ్లు..
మంచు చరియలు విరిగిపడిన తర్వాత చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఐబెక్స్ బ్రిగేడ్ ప్రధానంగా ఐదు సవాళ్లను ఎదుర్కొంది.
వాతావరణం: హిమపాతం తర్వాత వాతావరణం చాలా దారుణంగా ఉంది. బలమైన గాలుల మధ్య వర్షంతో పాటు మంచు కురుస్తోంది. దీని కారణంగా, శిబిరంలో చిక్కుకున్న వ్యక్తులను వెతకడంలో ఇబ్బంది ఏర్పడింది.
కనిపించకపోవడం: మాణా గ్రామం నుంచి జోషిమఠ్‌కు 15 కి.మీ రోడ్డు మూతపడింది. వాతావరణం అనువుగా లేకపోవడంతో ఏదీ సరిగ్గా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రయాణంలోనూ ఆటంకాలు ఎదురయ్యాయి.
హైపోథెర్మియా: హిమపాతంలో చిక్కుకున్న కార్మికులు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, వారు చాలా గంటలు మంచు కిందే ఉన్నారు. దీంతో వారిలో అల్పోష్ణస్థితి (హైపోథెర్మియా) ఎక్కువైంది.
హైపోథెర్మియా అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. ఇందులో శరీర ఉష్ణోగ్రత 35°C కంటే తక్కువకు పడిపోతుంది. దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. హృదయ స్పందన సక్రమంగా ఉండదు.
వనరులు: హిమపాతం కారణంగా రహదారి మూసుకుపోయింది. సహాయక చర్యలను వేగంగా నిర్వహించడానికి కావాల్సిన వనరులు సమయానికి అందుబాటులో లేవు.
కమ్యూనికేషన్: మంచుచరియలు విరిగిపడిన తర్వాత వర్షం, మంచు కారణంగా కమ్యూనికేషన్ పెద్ద సవాలుగా మారింది. కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో సంఘటన స్థలం, బేస్‌ల మధ్య సమన్వయం కష్టమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














