"వాళ్లు అద్భుతమైన కథలు చెబుతున్నారు", పాకిస్తాన్‌‌‌ను ఉద్దేశించి భారత ఎయిర్‌ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలు.. ఇంకా ఏమన్నారంటే..

భారత్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ తొలిసారి 'ధ్వంసమైన పాకిస్తానీ' ఫైటర్ జెట్స్ మోడల్స్ గురించి వెల్లడించింది. (ఫైల్ ఫోటో)

'ఆపరేషన్ సిందూర్'లో భారత్‌ నష్టాల గురించి మనం మాట్లాడకూడదని భారత వాయుసేనకు చెందిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.

''చాలా జెట్లను కూల్చేశామని మేం చెబుతున్నాం, మీరేం చెప్పడం లేదని పాకిస్తాన్ వాళ్లు అంటున్నారు. నేను ఇప్పటికీ ఏం చెప్పడం లేదు. చెప్పను కూడా. మా 15 జెట్లను కూల్చేశారని వారు అనుకుంటే, అలా అనుకోనివ్వండి'' అని అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.

భారత వాయుసేన 93వ వార్షికోత్సవం సందర్భంగా దిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

భారత్‌కు జరిగిన నష్టాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? అని అమర్ ప్రీత్ సింగ్ ప్రశ్నించారు.

''నేనెందుకు దీని గురించి మాట్లాడాలి. అసలేం జరిగిందో, ఎంత నష్టం వచ్చిందో ఈరోజు కూడా నేనేమీ చెప్పడం లేదు. చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే, వారిని తెలుసుకోనివ్వండి. మేం ఏం చేయగలిగామో తెలుసుకోవడానికి లోతుగా పరిశీలిస్తున్నాం. కాబట్టి వారిని కూడా తెలుసుకోనివ్వండి'' అని అన్నారు.

''మన ఎయిర్ బేస్‌లపై ఏదైనా పడినట్లు ఫోటోలేమైనా మీరు చూశారా? పాకిస్తాన్‌కు చెందిన చాలా ఫోటోలను మేం చూపించాం. కానీ, వారు ఒక్క ఫోటోని కూడా చూపించలేకపోయారు. వారు అద్భుతమైన కథలు చెబుతున్నారు'' అని అన్నారు అమర్ ప్రీత్ సింగ్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాకిస్తాన్‌కు జరిగిన నష్టంపై ఆయన ఏమన్నారు?

ఆపరేషన్ సిందూర్ సమయంలో చేసిన వైమానిక దాడుల్లో 4 నుంచి 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లు, ముఖ్యంగా ఎఫ్-16లు ధ్వంసమైనట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు.

పాకిస్తాన్‌కు చెందిన పలు ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని వాయుసేన దాడులు జరిపిందని, ఈ దాడుల్లో రాడార్లు, కమాండ్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్లు, భూఉపరితలం నుంచి గగనతల దాడులు చేసే క్షిపణి వ్యవస్థలు (surface-to-air missile systems) ధ్వంసమైనట్లు తెలిపారు.

ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైనట్లు పేర్కొంటున్న పాకిస్తాన్ యుద్ధ విమానాలకు చెందిన మోడళ్లను అధికారికంగా ధ్రువీకరించడం ఇదే తొలిసారి.

అంతకుముందు, ఆగస్టు 9న బెంగళూరులో 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎం కత్రే మెమోరియల్ లెక్చర్ ఇచ్చారు. ఆ సమయంలో కనీసం ఐదు యుద్ధ విమానాలు, ఒక పెద్ద విమానం ధ్వంసమైనట్లు చెప్పారు. కానీ, ఆ మోడళ్ల వివరాలను పేర్కొనలేదు.

''పాకిస్తాన్ నష్టాల విషయానికొస్తే, చాలా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాం. ఈ దాడుల్లో నాలుగు ప్రాంతాల్లో రాడార్లు నాశనమయ్యాయి. రెండు ప్రాంతాల్లో కమాండ్, కంట్రోల్ సెంటర్లు దెబ్బతిన్నాయి. రెండు రన్‌వేలు, మరో మూడు ప్రాంతాల్లో మూడు హ్యాంగర్లు ధ్వంసమయ్యాయి. ఒక సీ-130 క్లాస్ విమానం, కనీసం 4 నుంచి 5 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు మావద్ద ఆధారాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఎఫ్-16 విమానాలే'' అని అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు.

భారత వాయుసేనకు చెందిన అధునాతన దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ (భూఉపరితలం నుంచి గగనతల దాడులు చేసే క్షిపణులు) పాకిస్తాన్‌ను తమ సొంత భూభాగంలో కూడా నిర్దిష్ట దూరాల్లో పనిచేయకుండా అడ్డుకున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు.

''మేం ఇటీవల కొనుగోలు చేసిన లాంగ్-రేంజ్ ఎస్ఏఎం సిస్టమ్‌ను రంగంలోకి దించాం. పాకిస్తాన్‌ ఉపరితలంలో కూడా వారిని పర్యవేక్షించేందుకు ఇది మాకు ఉపయోగపడుతుంది. 300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా మనం ఛేదించినట్లు చరిత్రలో నమోదవుతుంది'' అని అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.

భారత్-పాకిస్తాన్ ఘర్షణ తర్వాత మాట్లాడిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆపరేషన్ సిందూర్‌ను 'యుద్ధ చర్యగా' పేర్కొన్నారు. ప్రతీకారం గురించి మాట్లాడారు.

పాకిస్తాన్ ప్రతీకార ఆపరేషన్ బన్యాన్ ఉన్ మర్సోస్‌లో 26 భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. వాటిల్లో పఠాన్‌కోట్, అంబాలా, ఉధంపూర్, శ్రీనగర్, బఠిండా, ఆదంపూర్, అవంతీపూర్, సూరత్‌గఢ్, సిర్సాలు ఉన్నట్లు పేర్కొంది.

డజన్ల కొద్దీ డ్రోన్లు భారత రాజధాని దిల్లీతో సహా పలు భారతీయ నగరాలపై చక్కర్లు కొట్టినట్లు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది.

నగ్రోటాలోని బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజ్ సైట్‌పై, ఆదంపూర్‌లోని ఎస్-400 రక్షణ వ్యవస్థపై విజయవంతంగా దాడి జరిపినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు.

పాకిస్తాన్ వాదనపై ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రఫెల్‌ కూలిపోయినట్లు ఆయన అంగీకరించలేదు.

సీడీఎస్ అనిల్ చౌహాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీడీఎస్ అనిల్ చౌహాన్

భారత్‌ నష్టంపై ఏం చెప్పారు?

భారత్‌కు జరిగిన నష్టం గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పేర్కొనలేదు. కానీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని కోల్పోయినట్లు సీనియర్ సైనిక అధికారులు గతంలో అంగీకరించారు. దీన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించలేదు, ఖండించలేదు.

పాకిస్తాన్‌తో జరిగిన సైనిక ఘర్షణలో భారత ఫైటర్ జెట్లు కూలిపోయాయా? అనే ప్రశ్నలకు మే నెలలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పందించారు.

బ్లూమ్‌బర్గ్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జనరల్ అనిల్ చౌహాన్, '' జెట్ విమానాలు కూలిపోయాయా లేదా అనేది ముఖ్యం కాదు, వాటిని ఎందుకు కూల్చారు అనేది ముఖ్యం అని నేను అనుకుంటున్నాను'' అని అన్నారు.

అయితే, ఎన్ని విమానాలు కూలిపోయాయి అనే దానిపై సీడీఎస్ ఎలాంటి వివరాలను అందించలేదు.

ఆరు విమానాలను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చెబుతోన్న వాదనను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.

షాంగ్రి-లా సమావేశంలో పాల్గొనేందుకు సీడీఎస్ అనిల్ చౌహాన్ సింగపూర్ వెళ్లారు. అక్కడే ఆయన బ్లూమ్‌బర్గ్‌ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఎయిర్ ఫోర్స్ కొన్ని విమానాలను కోల్పోయిందని ఇండోనేషియాలో భారత రాయబార కార్యాలయంలో పనిచేసే ఇండియా డిఫెన్స్ అటాచీగా ఉన్న కెప్టెన్ శివ్ కుమార్ చెప్పారు. జూన్‌‌లో జరిగిన ఒక సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'అనాలసిస్ ఆఫ్ ఇండియా-పాకిస్తాన్ ఎయిర్ వార్(భారత్-పాకిస్తాన్ వైమానిక యుద్ధానికి చెందిన విశ్లేషణ)', 'ఇండోనేషియా ఫోర్‌కాస్ట్ స్ట్రాటజీస్ ఇన్ ఎయిర్ పవర్(వైమానిక శక్తిలో ఇండోనేషియా అంచనా వ్యూహాలు)'పై జకార్తాలోని ఓ యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు జూన్ 10న ఆయన హాజరయ్యారు.

రాజకీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల కారణంగా నెలకొన్న అడ్డంకులతో, ఆపరేషన్ చేపట్టిన తొలి దశలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం ఎలాంటి దాడులు చేపట్టలేకపోయిందని ఇండియన్ డిఫెన్స్ అటాచీ ఆ సెమినార్‌లో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పారు.

''కానీ, నష్టం జరిగిన తర్వాత, మా వ్యూహాలను మార్చుకున్నాం. సైనిక స్థావరాల వైపుకి కదిలాం. అప్పుడు శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థలను తొలుత ధ్వంసం చేశాం. భూతల క్షిపణులను వాడుతూ దాడులు చేయగలిగాం. బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించాం'' అని తెలిపారు.

ఆయన ప్రకటన సందర్భానికి అనుగుణంగా లేదని, మీడియా దాన్ని తప్పుగా పేర్కొందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

ఆ తర్వాత జులైలో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భారత రఫేల్ జెట్లను పాకిస్తాన్ కూల్చేసిందా? అని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ''టెర్రరిస్టులు దాగి ఉన్న స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందా? ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా? మన సోదరీమణుల నుదుటన కుంకుమను తుడిచివేసిన టెర్రరిస్టులను ఏరివేశామా? అని వారు అడగాలి. అప్పుడు మేం అవునని సమాధానం చెబుతాం. మన సైనికులకు ఏమైనా జరిగిందా? అంటే నో. పెద్ద విషయాలపై దృష్టి పెట్టాలి. చిన్న విషయాలపై కాదు. లేదంటే పెద్ద విషయాలపై, మన సైనికుల గౌరవంపై దృష్టిని సారించలేం'' అని అన్నారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Newsweek

ఫొటో క్యాప్షన్, జైశంకర్

ఐక్యరాజ్యసమితిలో భారత్ వర్సెస్ పాకిస్తాన్

సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ''తూర్పు సరిహద్దులో శత్రువు రెచ్చగొట్టడంపై పాకిస్తాన్ స్పందించింది. పహల్గాం దాడిపై నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని మేం భారత్‌కు ఆఫర్ చేశాం'' అని అన్నారు.

పహల్గాం దాడిని భారత్ రాజకీయంగా వాడుకుంటోందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఆరోపించారు.

''భారత్‌తో జరిగిన యుద్ధంలో మేం గెలిచాం. మాకు శాంతి కావాలి. ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలపై భారత్‌తో సమగ్రమైన, సమర్థవంతమైన చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది'' అని చెప్పారు.

ఐక్యరాజ్యసమితిలోని భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ తన 'రైట్ టూ రిప్లై'(జవాబు ఇచ్చే హక్కు)ను ఉపయోగించుకుని పాకిస్తాన్ ప్రధాని ప్రసంగానికి బదులిచ్చారు.

''ధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు కూడా ఒక విజయమైతే, పాకిస్తాన్‌ దానిని ఆస్వాదించవచ్చు'' అని ఆమె అన్నారు.

'' టెర్రరిజంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూ.. దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ దాచిపెట్టిన విషయం మర్చిపోవద్దు'' అని చెప్పారు.

భారత్ తరఫున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రసంగించారు.

తన ప్రసంగంలో పహల్గాం దాడిని, టెర్రరిజాన్ని ప్రస్తావించారు.

తన మొత్తం ప్రసంగంలో పాకిస్తాన్ పేరును విదేశాంగ మంత్రి ప్రస్తావించలేదు.

కానీ, తన వ్యాఖ్యల ద్వారా పాకిస్తాన్‌ను ఎత్తిచూపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)