మణిపుర్: ఇళ్లకు తిరిగి వెళ్లాలనే ఆశలు ప్రజల్లో అడుగంటుతున్నాయా?-గ్రౌండ్ రిపోర్ట్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన చురాచాంద్‌పుర్‌కు సమీపంలోని ఒక శిబిరం

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన చురాచాంద్‌పుర్‌కు సమీపంలోని ఒక శిబిరం
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్‌లో సెప్టెంబర్ 13న ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, అల్లర్ల కారణంగా నిరాశ్రయులైన ప్రజల గురించి ప్రస్తావించారు.

''నిరాశ్రయులకు వీలైనంత త్వరగా, తగు ప్రదేశంలో పునరావాసం కల్పించడం, శాంతిని నెలకొల్పడంలో మణిపుర్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అందిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను'' అని ప్రసంగంలో ఆయన అన్నారు.

మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురాచాంద్‌పుర్‌లో ప్రధాని ఈ మాట చెప్పారు.

నిరాశ్రయులుగా మారిన మైతేయి, కుకీ కమ్యూనిటీ ప్రజలకు 'తగిన ప్రదేశాలు' ఏంటో ఆయన పేర్కొనలేదు. ఈ తెగలకు చెందిన 60,000 కంటే ఎక్కువ మంది ప్రజలు నిరాశ్రయులుగా మారాయి.

మైతేయి, కుకీ తెగల మధ్య 2023 మే నెలలో హింస చెలరేగిన తర్వాత మణిపుర్‌లో ప్రధాని మోదీ చేసిన తొలి పర్యటన ఇదే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రెండు తెగల మధ్య జరిగిన హింసలో 260 మంది మరణించారని ఈ ఏడాది ఏప్రిల్‌లో హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

హింసాత్మక ఘటనల్లో ఇళ్లు కాలిపోయినవారు, హింసకు భయపడి ఇళ్ల నుంచి పారిపోయిన వారికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాల్లో వసతి కల్పించారు.

2025 ఫిబ్రవరిలో మణిపుర్ ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసినప్పటి నుంచి మణిపుర్, కేంద్రం నియంత్రణలోనే ఉంది. దీనికి ముందు, 2017 నుంచి మణిపుర్‌లో బీజేపీ అధికారంలో ఉంది.

డిసెంబర్ 2025 నాటికి నిరాశ్రయులందరికీ పునరావాసం కల్పించి, సహాయ శిబిరాలను మూసివేసే ప్రణాళికను 2025 జులైలో మణిపుర్ అధికార యంత్రాంగం ప్రకటించింది.

ఈ పథకం అమలుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండగా, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

ఇప్పటివరకు వందల మంది నిరాశ్రయులను శిబిరాల నుంచి సమీపంలోని తాత్కాలిక ఇళ్లకు తరలించామని మణిపుర్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు. ఆయన తన పేరును బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు.

''సహాయక శిబిరాల సంఖ్య ఇప్పుడు 290 నుంచి దాదాపు 260కి తగ్గింది'' అని ఆయన చెప్పారు.

కానీ, హింసకు భయపడి ఇళ్ల నుంచి పారిపోయినవారు తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.

ఫోటోలో వెనుక కనిపిస్తున్న శిబిరంలో హత్ను నివసిస్తున్నారు

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, ఫోటోలో వెనుక కనిపిస్తున్న శిబిరంలో హత్ను నివసిస్తున్నారు

''తిరిగి వెళ్లం''

చురాచాంద్‌పుర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఒక సహాయక శిబిరం ఉంది.

అక్కడ మేం 22 ఏళ్ల హత్ను హౌకిప్‌ను కలిశాం. ఆమె బోటనీ విద్యార్థిని. సామాజిక సంస్థలతో కూడా పని చేస్తున్నారు.

తెగల మధ్య హింసకు ముందు ఆమె ఇంఫాల్ లోయలో చదువుకునేవారు. అక్కడే తిరిగి స్థిరపడాలనుకుంటున్నారా అని ఆమెను మేం అడిగాం.

‘‘మేం ఇళ్లకు తిరిగి వెళ్ళాలి. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ప్రాంతాలు ఇప్పుడు మైతేయి వర్గీయులతో చుట్టుముట్టి ఉన్నాయి. మాకు మా పాలక వర్గం ఏర్పాటైతే, మా పాత ఇళ్లకంటే సురక్షితమైన ప్రదేశాన్ని మా నాయకులు ఏర్పాటు చేయగలరు. అలా చేయడమే మంచిదనిపిస్తుంది'' అని ఆమె చెప్పారు.

బిష్ణుపూర్‌లో గస్తీ కాస్తున్న భద్రతా దళాలు (2023 జూన్)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిష్ణుపూర్‌లో గస్తీ కాస్తున్న భద్రతా దళాలు (2023 జూన్)

'బఫర్ జోన్' గుండా వెళ్లినప్పుడు..

మేం ఉదయం రాజధాని ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పుర్‌కు బయల్దేరాం. పోలీసులు, పారామిలిటరీ, సైనిక సిబ్బందితో కూడిన చెక్‌పాయింట్‌కు చేరుకునే వరకు మా ప్రయాణం సజావుగానే సాగింది.

ఇప్పుడు 'బఫర్ జోన్లు'గా పిలుస్తున్న ప్రాంతాల్లోనే ఈ చెక్‌పోస్టులన్నీ ఉన్నాయి. బఫర్ జోన్లు అంటే మైతేయి, కుకీ...రెండు తెగల వారూ నివసించని ప్రాంతాలు.

ఇక్కడ కాలిపోయిన ఇళ్లు, దుకాణాల అవశేషాలు, శిథిలమైన భవనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మా గుర్తింపు కార్డులు చూపించి, మా పేర్లను నమోదు చేసుకున్న తర్వాతే మమ్మల్ని ఈ ప్రాంతంగుండా వెళ్ళడానికి అనుమతించారు.

‘‘ ఇక్కడ మీరు చేసే పని ఏంటి?’’ అని భద్రతా సిబ్బందిలో ఒకరిని నేను అడిగాను.

''మైతేయి, కుకీ ప్రజలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు వెళ్లకుండా, ఘర్షణకు దిగకుండా ఉండేందుకు మేం ఇక్కడ ఉన్నాం'' అని ఒక జవాన్ చెప్పారు.

ఇరోమ్ అబుంగ్

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, ఇరోమ్ అబుంగ్

''మా ఇంటిని ఎలా మర్చిపోగలను?''

ఇరోమ్ అబుంగ్, చురాచాంద్‌పుర్‌లో జన్మించారు.

నిరాశ్రయుడిగా మారిన తర్వాత 'బఫర్ జోన్' సమీపంలోని బిష్ణుపూర్‌లో తమ వర్గానికి చెందిన ప్రజలతో కలిసి ఒక సహాయ శిబిరంలో నివసిస్తున్నారు అబుంగ్.

ఆయన మైతేయి వర్గానికి చెందినవారు. హింస మొదలయ్యే వరకు ఆయన కుకీ ప్రాబల్యం ఉన్న చురాచాంద్‌పుర్‌లో ఉంటూ, వ్యాపారం చేసేవారు.

''చురాచాంద్‌పుర్ మట్టి వాసన, వాతావరణాన్ని నేనెప్పటికీ మరువలేను. నా సొంత భూమిలో ఇల్లు కట్టుకున్నాను. అది దెబ్బతింది. కానీ ఆ భూమి ఇప్పటికీ నాదే. నేను దాన్ని ఎప్పటికీ అమ్మను. ఎందుకంటే అక్కడికి తిరిగి వెళ్తానని నాకు తెలుసు. ఈ రెండు వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరగాలి'' అని ఆయన మాతో అన్నారు.

మోనికా

ఫొటో సోర్స్, BBC/SHAAD MIDHAT

ఫొటో క్యాప్షన్, మోనికా

కోపం, నిరాశ

మైతేయి వర్గానికి చెందిన నిరాశ్రయులైన ఇతరుల్ని కూడా మేం కలిశాం. వీరిలో చాలామంది తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు.

కానీ, సలామ్ మోనికాలాంటి కొంతమంది మాత్రం ఆగ్రహంగా ఉన్నారు.

మోనికా చిన్నాన్న, 33 ఏళ్ల అంగోన్ ప్రేమ్‌కుమార్ 2024 జులైలో ఒక శిబిరంలో ఆత్మహత్య చేసుకున్నారు.

(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. ఒకవేళ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, మీరు భారత ప్రభుత్వ జీవన్ ఆస్థ హెల్ప్‌లైన్ 1800 233 3330 నుంచి సహాయం పొందవచ్చు. మీరు మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడాలి.)

శిబిరంలో ఇతర కుటుంబాలతో కలిసి మోనికా కుటుంబం నివసిస్తుంది.

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, శిబిరంలో ఇతర కుటుంబాలతో కలిసి మోనికా కుటుంబం నివసిస్తుంది.

జీవనోపాధి కోల్పోవడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, కుటుంబాన్ని పోషించలేకపోవడం వల్ల చిన్నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మోనికా చెప్పారు.

సంఘర్షణతో ప్రభావితమైన ప్రజలకు మానసిక ఆరోగ్య సహాయాన్ని అందిస్తామని, ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉన్న వారిని గుర్తించి సహాయం చేస్తామని భారత ప్రభుత్వం చెబుతోంది.

''మానసిక ఆరోగ్యం విషయంలో సహాయం కోసం ఇంతకు ముందు కొంతమంది రెండు, మూడుసార్లు వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఎవరూ రాలేదు'' అని మోనికా అన్నారు.

నెమ్‌హోయిచోంగ్ లుంగ్డిమ్‌ కుమారుడు 11 ఏళ్ల ఖైథెసాయి

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, నెమ్‌హోయిచోంగ్ లుంగ్డిమ్‌ కుమారుడు 11 ఏళ్ల ఖైథెసాయి

రెండు వర్గాల ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉన్నప్పటికీ, వారి మధ్య ఉమ్మడిగా ఉన్న విషయాలు ఏంటంటే వారు అనుభవించిన బాధలు, పోరాటాల కథలు.

చురాచాంద్‌పుర్ సహాయ శిబిరంలో మేం నెమ్‌హోయిచోంగ్ లుంగ్డిమ్‌ను కలిశాం. ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచే బాధ్యత ఆమెపై ఉంది.

పిల్లల్లో ఒకరు స్కూలుకు వెళతారు. మరొకరు కంటి సమస్య కారణంగా చదువుకోలేక పోతున్నారు. స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు 11 ఏళ్ల ఖైథెసాయి కంటికి తీవ్ర గాయమైంది.

'' మేం ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాం. కానీ, రాష్ట్రం దాటి బయట ఉన్న ఒక స్పెషలిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టం. బాబు చికిత్సకు దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. నా దగ్గర అంత డబ్బు లేదు. బాబు ఎడమ కన్నుతో చూడలేడు. కుడి కన్ను కూడా నొప్పిగా ఉంటుందని అంటున్నాడు. సరైన చికిత్స చేయించలేకపోయినందుకు వాడు పెద్దయ్యాక నన్ను ద్వేషిస్తాడేమోనని భయంగా ఉంది'' అని లుంగ్డిమ్ బాధపడ్డారు.

మణిపుర్‌లోని శిబిరాల్లో నివసిస్తున్న పిల్లలందరికీ వైద్య సహాయం అందిస్తున్నట్లు పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం పేర్కొంది.

''కొన్నిసార్లు శిబిరాలు నిర్వహించి ఉచిత మందులు ఇస్తారు. కానీ, వారు నా కొడుకుకు ఎప్పుడూ చికిత్స చేయరు. ఏదైనా ఒక అద్భుతం జరిగి నా బిడ్డ కోలుకోవాలని కోరుకుంటున్నా'' అని లుంగ్డిమ్ అన్నారు.

నెమ్‌హోయిచోంగ్ లుంగ్డిమ్‌

ఫొటో సోర్స్, BBC/SHAAD MIDHAT

ఫొటో క్యాప్షన్, నెమ్‌హోయిచోంగ్ లుంగ్డిమ్‌

శిబిరాల పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇంఫాల్‌లోని రాష్ట్ర సచివాలయాన్ని బీబీసీ సందర్శించింది. గవర్నర్ కార్యాలయాన్ని కూడా సంప్రదించింది.

చురాచాంద్‌పుర్, బిష్ణుపూర్ అధికారులను కూడా మెయిల్ ద్వారా సంప్రదించాం. కానీ, ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.

మెరుగైన జీవితం

స్కూలు లేదా కాలేజీ భవనాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల నుంచి ఇటీవలే తాత్కాలిక గృహాలకు వెళ్లిన కుటుంబాలను కూడా మేం కలిశాం. ఈ ఇళ్లలో వంటశాలలు, బాత్రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు ఉన్నాయి.

''మేం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాము. గతంలో, శిబిరం మొత్తానికి ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌లో వంట చేసుకునేవాళ్లం. ఇప్పుడు మాకు ప్రత్యేక వంటగది ఉంది. ఇక్కడ ప్రైవసీ కూడా ఎక్కువ'' అని సాషా అనే మహిళ చెప్పారు.

చురాచాంద్‌పుర్‌లో కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇళ్లు

ఫొటో సోర్స్, SHAAD MIDHAT/BBC

ఫొటో క్యాప్షన్, చురాచాంద్‌పుర్‌లో కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇళ్లు

సాషా ఒకప్పుడు బెంగళూరులో పనిచేశారు. మైతేయి ప్రాబల్య ప్రాంతానికి దగ్గర్లో ఉన్న తమ పాత ఇంటికి తిరిగి వెళ్లగలనని అనుకుంటున్నారా అని మేం సాషాను అడిగాం.

''ఇప్పుడు నాకు ఆ ప్రదేశం ఇష్టం లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పలేను. కానీ అక్కడికి తిరిగి వెళ్లడం గురించి ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు'' అని సాషా అన్నారు.

తాత్కాలిక ఆశ్రయాలు, సహాయ శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచిత రేషన్, విద్యుత్ అందిస్తోంది. కానీ, జీవనోపాధి గురించి అర్థం కావట్లేదని చాలామంది మాతో అన్నారు.

ఇంఫాల్ రోడ్లపై ట్రాఫిక్

ఫొటో సోర్స్, BBC/SHAAD MIDHAT

ఫొటో క్యాప్షన్, ఇంఫాల్ రోడ్లపై ట్రాఫిక్

పరిస్థితులు మారాయా?

ఇంఫాల్ లేదా చురాచాంద్‌పుర్ మార్కెట్లలో నడుస్తున్నప్పుడు లేదా హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హింస, వర్గ విభేదాలకు సంబంధించిన సంకేతాలు పెద్దగా కనిపించట్లేదు.

మార్కెట్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు, నగరాల్లో ప్రజల కదలికలు ప్రస్తుతం సాధారణంగానే కనిపిస్తోంది.

భయంతో బలవంతంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారిని పాత ఇళ్లకు తిరిగి పంపించే బదులు, వారు ఇప్పుడు ఉన్నచోటే పునరావాసం కల్పిస్తారా? దీన్ని పరిగణలోకి తీసుకుంటారా?

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్కే నిమాయి సింగ్ దీనికి సమాధానం ఇచ్చారు.

''రెండువర్గాలకు చెందిన నిరాశ్రయులైన ప్రజలకు వారి సొంత కమ్యూనిటీ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తే అది 'జాతి ప్రక్షాళన (కమ్యూనిటీ క్లీన్సింగ్)'కు మద్దతు ఇచ్చినట్లే అవుతుంది. సాధారణ స్థితి, శాంతిని తీసుకురావడానికి నిరాశ్రయులైన వారికి, వారి పాత ఇళ్లలోనే పునరావాసం కల్పించడం చాలా ముఖ్యం. ఇది కష్టం. కానీ ఈ చిన్న అడుగు వేయడం ద్వారా 10 లేదా 15 ఏళ్లలో మళ్లీ నమ్మకం బలపడుతుంది'' అని ఆయన వివరించారు.

నిరాశ్రయుల కోసం సుమారు 7,000 కొత్త ఇళ్లు నిర్మిస్తున్నట్లు తన ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం రూ. 3,500 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు.

ఆర్కే నిమాయి

ఫొటో సోర్స్, BBC/SHAAD MIDHAT

ఫొటో క్యాప్షన్, ఆర్కే నిమాయి

‘‘ప్రజలు తమ పాత ఇళ్లకు తిరిగి రావడాన్ని సురక్షితమని భావించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మణిపుర్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి బీబీసీకి చెప్పారు.

ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ ప్రక్రియ ఎంతవరకు విజయవంతం అవుతుంది?

తిరిగి తమ ఇళ్లకు రావాలని అనుకునే ప్రజల్లో ప్రభుత్వం ఎంతవరకు నమ్మకాన్ని కలిగిస్తుందనే దానిపై దీని సమాధానం ఆధారపడి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)