ఆంధ్రప్రదేశ్‌: నకిలీ మద్యం కేసు ఏంటి? జయచంద్రారెడ్డి ఎవరు?

నకిలీ మద్యం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

నకిలీ మద్యం కేసు ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్‌ జయచంద్రారెడ్డిని, ఆయన ప్రధాన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడును ఆ పార్టీ సస్పెండ్ చేసింది.

అక్టోబర్ 3న ఎక్సైజ్ అధికారులు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. దాదాపు కోటీ 75 లక్షల రూపాయల విలువగల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

40 స్పిరిట్ క్యాన్లతోపాటూ, సరఫరాకు సిద్ధంగా ఉన్న 17,224 మద్యం బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు, వివిధ బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లు, మూతలను కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

''జయచంద్రా రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరూ కూడా ఈ కేసులో ఉన్నారు. మొత్తం 21 మంది పైన కేసు నమోదు చేశాం. ఇప్పటివరకూ 13 మందిని అరెస్ట్ చేశాం. గతంలో వీరిపైన ఇలాంటి కేసులు ఏమీ లేవు'' అని బీబీసీతో రాయచోటి ఎక్సైజ్ అధికారి జితేంద్ర చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమవుతున్న ఈ నకిలీ మద్యం కేసు ఏంటి? ఇందులో ఎవరెవరున్నారు? ఇప్పటివరకు ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నకిలీ మద్యం కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుతో జయచంద్రారెడ్డి ( మధ్యలో)-:ఫైల్ ఫోటో

మొత్తం 23 మంది నిందితులు

నకిలీ మద్యం కేసులో 17వ ముద్దాయి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నట్టు తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరులో దిగగానే అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు.

ఈ కేసులో విజయవాడకు చెందిన జనార్దన్ రావు ఏ1కాగా, ఆయన అనుచరుడు కట్టా రాజు ఏ2 నిందితుడు.

వారు ములకలచెరువులోని ఒ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు ఇటీవల దాడులు చేసిన పోలీసులు గుర్తించారు.

అక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బాట్లింగ్ యూనిట్‌లో ప్రాసెస్ చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.

ఆ మద్యాన్ని ప్రముఖ బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో వేలాది క్వార్టర్ బాటిళ్లలో నింపినట్టు కనుగొన్నారు.

జనార్దన్‌ రావు 2012 నుంచి మద్యం వ్యాపారం చేస్తున్నారు. తర్వాత వ్యాపారంలో పోటీ పెరగడంతో 2021 వరకూ ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన, నకిలీ మద్యం తయారు చేయడం ప్రారంభించారని ఎక్సైజ్ అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

నకిలీ మద్యం కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జగన్ బర్త్ డే కేక్ కటింగ్ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి(మధ్యలో నీలిరంగు షర్ట్)

హైదరాబాద్ నిజాంపేటలో ఒక గది అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తరలించడం ప్రారంభించారని, ఎవరికీ అనుమానం రాకుండా ఆ డబ్బాలపై ఫినాల్ అని స్టిక్కర్ వేసేవారని ఎక్సైజ్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఉంది.

టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు స్నేహితుడు. ఆయన 2025లో ములకలచెరువులో మద్యం వ్యాపారం ప్రారంభించారు. జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారని తెలిసి జనార్ధన్ రావు అక్కడికి వెళ్లారు.

ఆయన రువాండాలో ఉన్న సమయంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు జరిగాయి. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం సూత్రధారి జనార్దనే అని ఎక్సైజ్ పోలీసుల రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది.

నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి ఏ17 కాగా, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి ఏ18.

వారితోపాటు నకిలీ మద్యం తయారీ కోసం అవసరమైన స్పిరిట్, లేబుళ్లు, బాటిళ్లు లాంటివి సరఫరా చేసిన రవి, శ్రీనివాసరెడ్డి, చైతన్యబాబు, బెంగళూరుకు చెందిన బాలాజీ, సుదర్శన్, అకౌంటెంట్ అన్బరసు, మద్యం సరఫరా చేసిన వాహనం డ్రైవర్ అష్రఫ్, సుదర్శన్‌లను కూడా నిందితులుగా చేర్చారు.

జనార్దన్ రావు దక్షిణాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్న విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఆయన్ను గన్నవరం ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఈనెల 17 వరకు ఆయనకు రిమాండ్ విధించింది.

నకిలీ మద్యం, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, జయచంద్రారెడ్డికి ఆఫ్రికా దేశాల్లో మద్యం వ్యాపారం ఉంది.

ఎవరినీ ఉపేక్షించం- కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో నకిలీ మద్యం విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారని, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకోవాలని చెప్పారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

తంబళ్లపల్లెలో దొరికిన నకిలీ మద్యం వెనుక జయచంద్రారెడ్డి ఉన్నారని తెలియగానే పార్టీ పరంగా చర్యలు తీసుకున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు.

''ఈ విషయాలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఇందులో జయచంద్రారెడ్డి అనే టీడీపీ నాయకుడు ఉన్నట్లు తెలిసిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. అక్కడ ఏం జరుగుతోందో నిఘా పెట్టాల్సిన అవసరం అధికారులపైన ఉంది. అందుకే ఎస్‌హెచ్ఓను కూడా సస్పెండ్ చేశాం'' అని మంత్రి అన్నారు.

నకిలీ మద్యం, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నకిలీ మద్యం కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు అధికారులు.

'వైసీపీ నుంచి వచ్చిన కోవర్టు'

అయితే నకిలీ మద్యం వ్యవహారం బయటకొచ్చిన తరువాత తెలుగుదేశం, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ కేసులో నిందితులుగా పట్టుబడ్డ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తమ పార్టీ వాళ్లు కాదని, వైసీపీ నుంచి వచ్చిన కోవర్టులని, స్లీపర్ సెల్స్ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన.. 'మా పార్టీలో ఉన్నవారిపై ఆరోపణలు రాగానే వారిని సస్పెండ్ చేశాం. ఈరోజు మద్యం కేసులో ఇరుక్కున్న వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, నారాయణస్వామిలను వైసీపీ నుంచి సస్పెండ్ చేయగలరా?' అని ప్రశ్నించారు.

నకిలీ మద్యం, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వైసీపీతో అనుబంధం ఉన్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఎడమ చివర), తదితరులతో జయచంద్రారెడ్డి (కుడి చివర)

సీబీఐ దర్యాప్తు చేయాలి: మిథున్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ వివిధ జిల్లాల్లో నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చిందని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు.

‘‘తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ ఫ్యాక్టరీ పెట్టి తెలుగుదేశం నాయకులు నకిలీ మద్యం తయారు చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ నాయకులు వెంటనే ఆయన పెద్దిరెడ్డి కోవర్టు, వైసీపీ నుంచి వచ్చారు అని మాట్లాడుతున్నారు’’ అని మిథున్ రెడ్డి అన్నారు.

నకిలీ మద్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన మిథున్ రెడ్డి, ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు.

నకిలీ మద్యం కేసు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుతో జయచంద్రారెడ్డి ( ఎడమ నుంచి రెండో వ్యక్తి-ఫైల్ ఫోటో)

ఇంతకీ ఎవరీ జయచంద్రారెడ్డి?

దాసరిపల్లి జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు మండలం కదిరినాధునికోట గ్రామానికి చెందినవారని ఆ నియోజకవర్గానికే చెందిన జర్నలిస్ట్ మొబీద్ చెప్పారు.

'ఇంజినీరింగ్ చదివిన జయచంద్రారెడ్డి బెంగళూరులోని ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2013లో తన బంధువు ఒకరు అప్పటికే దక్షిణాఫ్రికాలో లిక్కర్ కంపెనీలను స్థాపించి ఆర్థికంగా స్థిరపడి ఉండడంతో జయచంద్రారెడ్డి కూడా అక్కడకు వెళ్లి ఆయనకు తోడుగా ఉన్నారు. ఆఫ్రికాలోని 8 దేశాల్లో లిక్కర్ ఫ్యాక్టరీలను నెలకొల్పారు' అని మొబీద్ చెప్పారు.

జయచంద్రారెడ్డి సమర్పించిన అఫిడవిట్‌ను బీబీసీ పరిశీలించింది.

ఆ అఫిడవిట్‌లో జయచంద్రారెడ్డికి ఆఫ్రికా దేశాల్లో ఉన్న మద్యం డిస్టిలరీలు వివరాలు కనిపించాయి.

సెంట్రల్ ఆఫ్రికాలోని అంగోలాలో బ్రిగేడ్ కమర్షియో ఇండస్ట్రియాలో రూ. 6. 44 లక్షలు, పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టులో రిట్కో డిస్టిలరీలో రూ. 12.34 లక్షలు, పశ్చిమ ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలోని రిట్కో డిస్టిలరీలో రూ.10.76 లక్షలు, సెంట్రల్ ఆఫ్రికాలోని కామెరూన్‌లో ఉన్న రిట్కో డిస్టిలరీలో రూ. 24.13 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు వివరాలున్నాయి.

తర్వాత జయచంద్రారెడ్డి ములకలచెరువులో స్థిరపడ్డారని మొబీద్ వివరించారు.

‘‘జయచంద్రారెడ్డి ఆర్థికంగా బలపడి ములకలచెరువులో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, దేవాలయాలకు ఆర్థిక సాయం వంటివి చేస్తూ పెద్దిరెడ్డి కుటుంబానికి చేరువయ్యారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా పెద్దిరెడ్డిని కలుస్తూ జగన్ బర్తడేలకు కేక్ కట్ చేయడం లాంటివి చేసేవారు'' అని మొబీద్ తెలిపారు.

నకిలీ మద్యం, టీడీపీ, వైసీపీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం పట్టుకున్నారు.

రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించారు. అనంతరం టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి తంబళ్లపల్లె టికెట్ దక్కించుకున్నారు.

పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.

అనంతరం ఆయన్ను తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.

అయితే నకిలీ మద్యం కేసులో తనపై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్న జయచంద్రారెడ్డి, నాలుగు రోజుల కిందట ఒక వీడియో విడుదల చేశారు.

''కల్తీ మద్యం విషయమై పార్టీ అధిష్ఠానం నాకు, కట్టా సురేంద్రకు కూడా ఏదైనా సంబంధం ఉందా అనే ఉద్దేశంతో సస్పెండ్ చేసింది. అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యం. నేను ఏ తప్పు చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తాను'' అని అందులో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)