విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ.. ఏఐ హబ్‌తో ఏం జరగనుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
అక్టోబర్ 14న దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ఇతర గూగుల్ ఉన్నతస్థాయి ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లో దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్‌కు సంబంధించిన ప్రణాళికలను పంచుకునేందుకు ప్రధాని మోదీతో మాట్లాడానని, ఈ ఏఐ హబ్ ఓ కీలక మైలురాయిగా నిలవనుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.
ఈ హబ్‌లో గిగావాట్ - స్కేల్ కంప్యూట్ కెపాసిటీ, ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వే ఉన్నాయని వివరించారు. భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు.
డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు.
"ఈ గిగా సెంటర్ ఏర్పాటు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఈ ఏఐ హబ్ బలమైన శక్తిగా పనిచేస్తుంది. దీనిద్వారా ప్రజలందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రానుంది. డిజిటల్ ఎకానమీకి మరింత ఊపునిస్తుంది. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానం మరింత సుస్థిరమవుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు.


ఫొటో సోర్స్, X/@ncbn
వచ్చే ఐదేళ్లలో 1500 కోట్ల డాలర్లు
ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖలో వచ్చే ఐదేళ్లల్లో 1500 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1.33 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ చెప్పారు.
భారత దేశానికే కాదు, విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని ఆయన తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ–కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని కురియన్ చెప్పారు.
అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని ఆయన స్పష్టంచేశారు. జెమినీ–ఏఐతో పాటు గూగుల్ ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని తెలిపారు.
కాగా, ఈ డేటాసెంటర్ విశాఖను భారత ఏఐ ట్రాన్సఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుందని ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కార్యదర్శి కాటంనేని భాస్కర్ బీబీసీతో అన్నారు.
''విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేథ (ఏఐ) వ్యవస్థను అమలు చేసి, భారత్‌లో ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయనుంది. ఈ ఏఐ హబ్‌లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయ పరిచి విశాఖను భారతదేశ ఏఐ ట్రాన్సఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు'' అని కాటంనేని భాస్కర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?
''ఈ ప్రాజెక్టు రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నాం. 2026 మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి, 2028 జూలై నాటికి పనులు పూర్తిచేసి కార్యకలాపాలు ప్రారంభించాలని రైడెన్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలో 2028–2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్‌డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాం '' అని ఐటీ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి బీబీసీతో అన్నారు.
''గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఏడాదికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందనీ, మొత్తంగా ఐదేళ్లలో సుమారు రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందని అంచనా వేస్తున్నాం'' అని ఆ ప్రభుత్వ ఉన్నతాధికారి అన్నారు.
ఎస్‌ఐపీబీ ఆమోదం
ఈ ప్రాజెక్ట్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం ఆమోదం పొందింది.
ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ప్లగ్–అండ్–ప్లే మౌలిక వసతులను ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆ సమావేశంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రైడెన్ కంపెనీ ఎక్కడిది?
అమెరికాకి చెందిన గూగుల్ అనుబంధ సంస్థగా సింగపూర్‌కు చెందిన రైడెన్ ఏపీఏసీ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ 'రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'లో మెజారిటీ వాటాదారుగా ఉంది.
రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కి టైలర్ మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. భూములు లీజు, విద్యుత్ రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు కలిపి మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను రైడెన్‌కు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆ సంస్థకు 480 ఎకరాలను రాయితీ ధరపై కేటాయించనుంది.
ఉమ్మడి విశాఖ జిల్లా అడవివరంలో 120, తర్లువాడలో 200, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్‌లో 160 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూముల విలువలో 25 శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీకరించింది.
అలాగే డేటా సెంటర్‌కి అవసరమైన నీటి కోసం చెల్లించాల్సిన చార్జీల్లో 10 ఏళ్లపాటు 25 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక డేటా సెంటర్‌కి వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కి రూపాయి చొప్పున 15 ఏళ్ల పాటు రాయితీని అందివ్వనున్నట్టు తెలిపింది.

విశాఖలోనే ఎందుకు?
"గూగుల్ డేటా మొత్తం ఇప్పటివరకు అమెరికాలోనే స్టోర్ అవుతోంది. గూగుల్‌కి సంబందించిన సర్వర్ అమెరికాలోనే ఉంటుంది. దీంతో భారత దేశానికి సంబంధించిన సర్వర్ ఇక్కడే ఉండాలని కేంద్రప్రభుత్వం గతంలో కోరింది. ఆ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్‌ను భారత్‌లో పెట్టాలని నిర్ణయించి ఆ మేరకు ఇప్పుడు విశాఖ వస్తోంది'' అని విశాఖ రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ నరేష్ బీబీసీతో అన్నారు.
"ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సీకేబుల్ అవసరం, విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ–కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది. వైజాగ్ తీరప్రాంత నగరం కావడంతో అండర్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లతో అనుసంధానం అయ్యేందుకు చాలా సులభం. విశాఖలో ఏర్పాటయ్యే డేటా సెంటర్‌కి సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది హై–స్పీడ్ గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది, డేటా ట్రాన్స్‌ఫర్ లేటెన్సీ తగ్గిస్తుంది. ఇప్పటికే మెటా కంపెనీ తన 'వాటర్‌వర్త్' అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ కింద ముంబయి, విశాఖ నగరాలను కేబుల్స్ ల్యాండింగ్ సైట్లుగా ఎంచుకుంది'' అని నరేష్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నీటి సమస్యపై..
వాస్తవానికి డేటా సెంటర్ నడిచేందుకు ఎక్కువ మోతాదులో విద్యుత్, మంచి నీరు అవసరమవుతాయి.
అత్యధిక స్థాయిలో విద్యుత్, మంచినీటి వినియోగంతో పాటు సెంటర్‌లో వినియోగించే సిస్టమ్స్ ఉత్పత్తి చేసే వేడి వల్ల పర్యావరణ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై సాఫ్ట్‌వేర్ నిపుణుల వాదన మరోలా ఉంది.
"ఈ డేటా సెంటర్ రన్ అయ్యేందుకు 1 గిగా వాట్ పవర్ కావాలి. అయితే రాష్ట్రంలో సోలార్ పవర్, విండ్‌పవర్ ఎక్కువ అందుబాటులో ఉండటంతో విద్యుత్ సమస్య రాదని భావిస్తున్నాం. ఇక మంచినీటి కొరత రాకుండా సముద్రం ఉండటంతో డీశాలినేషన్ ద్వారా మంచినీటి సరఫరా చేసుకోవచ్చు. అలాగే పోలవరం కంప్లీట్ అయితే 5 టీఎంసీల నీళ్లు విశాఖకు వస్తాయి. వాటిలో కొంత కేటాయించొచ్చు. డేటా సెంటర్ కొండ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో అంత వేడి ఉత్పత్తి కాకపోవచ్చు'' అని ఓ నరేష్‌తో పాటు విశాఖకు చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్యా ప్రసాదరెడ్డి బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, https://x.com/naralokesh/status
ఇంకా విశాఖకు ఏమేం వస్తున్నాయంటే..
విశాఖలో సిఫీ సంస్థకు చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ లాండింగ్ స్టేషన్‌కు అక్టోబర్ 12వ తేదీన ఐటీ శాఖ మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు.
విశాఖలో 1000 మెగా వాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్( టీసీఎస్) సంస్థ ముందుకొస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే 'యాక్సెంచర్, కాగ్నిజెంట్ సంస్థలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని' మంత్రి లోకేష్ ఇటీవల వెల్లడించారు.
భౌగోళిక, ఆర్థిక, టెక్నికల్, విధానపరమైన అంశాలతోపాటు ఇన్‌ఫ్రా ఆధారంగా చాలా కంపెనీలు తమ డేటా సెంటర్ డెస్టినేషన్ పాయింట్‌గా విశాఖను ఎంచుకుంటున్నాయని లోకేష్ తెలిపారు. ఈ డేటా సెంటర్లు వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్నాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/Gudivada Amarnath
కాలుష్యంపై ప్రభుత్వం మాట్లాడకపోవడం అన్యాయం: గుడివాడ అమర్నాథ్
"చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలా ఎంవోయూలు చేయడం రివాజు. ఇలాంటివి ఎన్ని చూసుంటాం. ఇది కూడా అంతే. వచ్చినప్పుడే వచ్చింది అనుకోవాలి'' అని వైసీపీ నేత, గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.
ఈ డేటా సెంటర్ల నుంచి వచ్చే విపరీతమైన కాలుష్యంపై ప్రపంచమంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపై ప్రభుత్వం మాట్లాడకపోవడం అన్యాయమని అమర్నాథ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














