‘పేగు క్యాన్సర్‌తో బాధపడిన అమ్మ చనిపోతే తన శరీరాన్ని ఏం చేయమని చెప్పారంటే..’

ఫొటో సోర్స్, Lucy Owen
- రచయిత, లూసీ ఓవెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరణం గురించి తల్లిదండ్రులతో చర్చించడం ఎవరినైనా ఉద్వేగానికి గురిచేసే అంశం. కానీ, మా అమ్మ ప్యాట్సీ..నాతో ఈ విషయాన్ని మాట్లాడాలనుకుంది.
ఆమె చెప్పింది విని నేను షాకయ్యా. కొన్ని సంవత్సరాల కిందట తాను పేగు క్యాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్న రోజుల్లోనూ.. నేను మా అమ్మ చనిపోవడం అనే మాట గురించి అస్సలు ఆలోచించకపోయేదానిని.
కానీ, తన 86 ఏళ్ల వయసులో, నన్ను పక్కన కూర్చోబెట్టుకుని తాను చనిపోయాక శరీరాన్ని మెడికల్ సైన్స్ కాలేజీకి దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు అమ్మ నాతో చెప్పింది.
ప్రతి ఏడాది తమ శరీరాలను దానం చేసే 1,300 మంది బ్రిటన్ పౌరుల్లో తానూ ఒకరిగా ఉండాలని అమ్మ అనుకుంది. శరీరదాతలు లేనట్లయితే.. కాబోయే డాక్టర్లు తమకు కావాల్సిన వైద్య అనుభవాన్ని పొందలేరని ఆమె అన్నది.
తాను ఇప్పటికే యూనివర్సిటీతో టచ్‌లో ఉన్నట్లు, అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నానని కూడా అమ్మ చెప్పడంతో.. నేను అయోమయానికి, ఆమెపట్ల ఆరాధన భావనకు మధ్యలో ఉండిపోయా.

శరీరాన్ని దానం చేయడం అనే దాని గురించి నాకు ఏ అవగాహనా లేదు. ఆమె చెప్పింది విన్నాక దీని గురించి నా మదిలో చాలా ప్రశ్నలు మెదిలాయి.
ఆమె శరీరాన్ని ఎలా ఉపయోగిస్తారు? తనకు అంత్యక్రియలు జరిపే పరిస్థితి ఉంటుందా? వంటివి. కానీ, అమ్మ ప్యాట్సీ కోహెన్‌కు వీటి మీద పట్టింపు లేదు.
"ఓ పెద్ద రంపంతో నా కాలిని కోసేస్తారేమో. అయినా నాకేమీ కాదుగా" ఆమె తనదైన శైలిలో నాతో చెప్పింది.

నాలుగేళ్ల కిందట తాను పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు.. తనకు సర్జరీ చేసి, చికిత్స అందించినందుకు కృతజ్ఞతగా డాక్టర్లకు తన దేహాన్ని దానం చేయాలని అమ్మ అనుకుంది.
కాబోయే డాక్టర్లకు వారి పరిశోధనలో సాయపడాలనుకున్నట్లుగా తను నాతో చెప్పింది. "వారు(వైద్యులు) లేకపోతే… నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. కృతజ్ఞత తెలపడంలో ఇదొక పద్ధతి" అని నాతో ఆమె అన్నది.
ఒక జర్నలిస్టుగా, ఒక జిజ్ఞాస కలిగినదానిగా.. అమ్మ ఎలాంటి ప్రణాళికలు వేసుకుందో మరింత తెలుసుకోవాలనుకున్నా.
అందుకే.. యూనివర్సిటీలో మానవ దేహాల ఉపయోగానికి సంబంధించి ఓ డాక్యుమెంటరీని తయారు చేశాను.
కార్డిఫ్ యూనివర్సిటీలో దానం చేసిన దేహాలకు ఏం జరుగుతుందనే తెరవెనుక సంఘటనలను చిత్రీకరించడానికి మాకు పర్మిషన్ వచ్చింది.
దాతలతో, వారి కుటుంబీకులతో విద్యార్థులు ఏ విధమైన అనుబంధాన్ని పెంచుకుంటారనే అంశాన్ని మేం గమనించాం.

పుస్తకాల్లో చదివినదానికంటే, అనాటమీ సెంటర్‌లో దేహాలను పరిశీలించడం ద్వారా వైద్య విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారు.
"నిజమైన అనాటమీని స్పృశించడానికి, అనుభూతి చెందడానికి వారికి ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు" అని కార్డిఫ్ యూనివర్సిటీలో అనాటమీ టీమ్ లీడ్ డాక్టర్ హన్నా షా అన్నారు.
త్రీడీ స్క్రీన్లపై మానవ దేహాలను చూపిస్తూ వైద్య విద్యను బోధించే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో.. అనాటమీలో నిజమైన దేహాలను ఉపయోగించే విధానం తగ్గుతోంది.

ఫొటో సోర్స్, Angela Gillson
‘‘మనం ఊహించినదానికన్నా మన శరీరం వాస్తవంలో భిన్నంగా ఉంటుంది’’ అని కార్డిఫ్ యూనివర్సిటీలోని 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఫ్రేయా గిల్సన్ అన్నారు.
"దాతల శరీరాలను ఉపయోగించి నేర్చుకోవడం చాలా మంచి విషయం. వారే మా మొదటి పేషెంట్లు. వారే మా నిశ్శబ్ద గురువులు కాబట్టి.. వారితో అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలి" అని ఆమె అన్నారు.
తమ దేహాన్ని దానం చేసినట్లు హామీ ఇచ్చినవారు చనిపోగానే, వారి దేహాన్ని సాధ్యమైనంత తొందరగా కార్డిఫ్ యూనివర్సిటీలోని అనాటమీ సెంటర్‌కు తీసుకువస్తారు.
ఆ దేహాలను ఇక్కడ భద్రపరుస్తారు. దాతలు అంతకు ముందు ఇచ్చిన సమ్మతి ఆధారంగా .. వారి శరీర భాగాలను తొలగించి వాటిని బోధన కోసం ఉపయోగిస్తారు. మూడేళ్ల వరకు దాతల దేహాలు ఈ కేంద్రంలో ఉంటాయి.
అనాటమీ సెంటర్ నుంచి ఆ దేహాలను బయటికి పంపించాల్సిన సమయం వచ్చినప్పుడు యూనివర్సిటీ వాటిని శవపేటికలో ఉంచి, వాటిని సేకరించే ఫ్యునరల్ డైరెక్టర్‌కు అప్పగిస్తుంది.
అప్పుడు దాతల కుటుంబాలు వారిని ఖననం చేయాలా లేక దహనం చేయాలా అనేది నిర్ణయిస్తాయి. అంత్యక్రియల ఖర్చులను యూనివర్సిటీయే భరిస్తుంది.

ఫొటో సోర్స్, Carol Endersby
గత కొన్నేళ్లుగా యూకేలో శరీరాన్ని దానం చేయాలనుకునే వారి సంఖ్య తగ్గుతోంది. కార్డిఫ్ యూనివర్సిటీలో.. గతంతో పోలిస్తే 2020 నుంచి బాడీ డొనేషన్లలో 50శాతం తగ్గుదల కనిపించింది. చనిపోయాక తమ శరీరాన్ని దానం చేస్తామంటూ 2024లో 154 మంది ముందుకు వచ్చారు.
అయితే, అందరూ తమ దేహాలను దానం చేయలేరు. అలా దానం చేయాలనుకున్నవారు ముందుగా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పాలని యూనివర్సిటీలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Patsy Cohen
మా అమ్మకు వీడ్కోలు చెప్పాల్సి రావడం నాకు బాధాకరమైన విషయం. అయితే.. ఆమె చివరి కోరికను నేను తెలుసుకున్నానే సంతోషం కూడా నాకు ఉంటుంది.
‘‘నా శరీరం వృథాగా పోవాలని నేను అనుకోను. మంచి కోసం ఉపయోగపడాలని, ఒక ఉత్తమమైన వైద్యుడిని తయారు చేయడంలో సాయపడాలని అనుకుంటాను" అని అమ్మ ప్యాట్సీ తన స్టైల్‌లో నాతో చెప్పింది.
అమ్మ ఒక మార్పును కోరుకోవడం నాకు నిజంగా సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే ఆమె నా మీద కూడా ప్రభావం చూపింది. నేను నా శరీరాన్ని చనిపోయాక దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నానంటే, దానికి కారణం ఆమే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














