ప్రకృతిఒడిలో గడిపితే వచ్చే 4 ప్రయోజనాలు ఏమిటో తెలుసా, అలా పార్కులో ఓ 20 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యాస్మిన్ రూఫో
- హోదా, బీబీసీ న్యూస్
ఏదైనా పార్కులోనో, అటవీ ప్రాంతంలోనో అలా కొద్దిసేపు నడిస్తే, మీకు ప్రశాంతంగా అనిపించిందా? అయితే, అది కేవలం మీ అనుభూతి మాత్రమే కాదు, అది సైన్స్ కూడా.
ప్రకృతిలో అలా కాసేపు నడిస్తే శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయి తగ్గడం, బీపీ తగ్గడం, మీ పేగు ఆరోగ్యం మెరుగుపడడం వంటి గణనీయమైన మార్పులు జరుగుతాయి.
అందుకోసం మీరు గంటల తరబడి నడవాల్సిన పనేమీ లేదు.కేవలం 20 నిమిషాల నడక సరిపోతుంది. భోజన విరామ సమయంలో అలా పార్కు వరకూ నడిచివెళ్లి, బల్లమీద కూర్చుని ఒక శాండ్‌విచ్ తినేసి రావడం కూడా మీ శరీరానికి, మెదడుకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రకృతితో గడపడం వల్ల నాలుగు మార్గాల్లో మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, అవేంటో చూద్దాం.


పచ్చని చెట్లను చూసినప్పుడు, చెట్ల నుంచి వెలువడే సువాసనను పీల్చుకున్నప్పుడు, చెట్ల నుంచి రాలిపడే ఆకుల శబ్దాలు, పక్షుల కిలకిలారావాలు విన్నప్పుడు.. మనకు తెలియకుండానే శరీరంలో జరిగే ప్రక్రియలను నియంత్రించే నాడీవ్యవస్థ తక్షణమే స్పందిస్తుంది.
దగ్గరలోని పార్కుకు వెళ్లినప్పుడు కూడా ఇలా జరగొచ్చు.
"రక్తపోటు తగ్గడం, హృదయ స్పందన రేటులో మార్పులు, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం వంటి మార్పులను మేం గమనించాం, ఇవన్నీ మానసిక ప్రశాంతతతో ముడిపడి ఉన్నాయి" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బయోడైవర్సిటీ ప్రొఫెసర్ బరోనెస్ కేథీ విల్లిస్ బీబీసీ రేడియో 4 కార్యక్రమం పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ అన్నారు.
దాదాపు 20,000 మంది పాల్గొన్న ఒక యూకే అధ్యయనంలో.. వారానికి కనీసం 120 నిమిషాలు ప్రకృతిలో గడిపిన వారు ఆరోగ్యపరంగానూ, మానసికంగానూ ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
ప్రకృతితో సమయం గడపడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయనేందుకు ఆధారాలు కూడా బలంగానే ఉన్నాయి. కొన్నిచోట్ల, ప్రజలను ప్రకృతితో అనుసంధానించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధానమైన "గ్రీన్ సోషల్ ప్రిస్క్రైబింగ్"ను కూడా పరీక్షించారు.
(గ్రీన్ సోషల్ ప్రిస్క్రైబింగ్ ఒక ఆరోగ్య సంరక్షణ విధానం. ఇందులో డాక్టర్లు లేదా ఆరోగ్య నిపుణులు ప్రకృతితో మమేకమయ్యే కార్యకలాపాలను సూచిస్తారు.)

ఈ విశ్రాంతి ప్రక్రియలో మీ హార్మోన్ల వ్యవస్థ కూడా భాగస్వామి అవుతుంది.
పచ్చదనం మధ్య కొంత సమయం గడపడం మన ఎండోక్రైన్ సిస్టమ్(ఇది హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథుల వ్యవస్థ)ను ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల కార్టిసాల్, అడ్రినలైన్ అనే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. మనం ఒత్తిడికి లేదా ఆందోళనకు గురైన సమయంలో సాధారణంగా వీటి స్థాయులు పెరుగుతాయి.
"హోటల్ గదిలో ఉంటూ మూడురోజుల పాటు హినోకి నూనె(జపనీస్ తైలం) పీల్చిన వారి శరీరంలో అడ్రినలైన్ హార్మోన్ స్థాయి గణనీయంగా తగ్గింది. అదే సమయంలో, వారి రక్తంలో నేచురల్ కిల్లర్ సెల్స్ (రోగ నిరోధక కణాలు) సంఖ్య పెద్దసంఖ్యలో పెరిగినట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు." దీనికి కారణం వారు ఆ వాసన ద్వారా ప్రకృతితో మమేకమైన అనుభూతి చెందడమే.
నేచురల్ కిల్లర్ సెల్స్ అంటే, శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లను ఎదుర్కొనే కణాలు. హినోకి నూనె వాసన పీల్చుకున్న రెండు వారాల తర్వాత కూడా వారి శరీరంలో నేచురల్ కిల్లర్ సెల్స్ గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రకృతి "ప్రశాంతత అవసరమైనప్పుడు ప్రశాంతతను, శక్తి అవసరమైనప్పుడు శక్తిని అందిస్తుంది" అని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌కు చెందిన ప్రొఫెసర్ మింగ్ కువో బీబీసీతో చెప్పారు.
"వారాంతంలో మూడు రోజులపాటు ప్రకృతిలో ఉండడం వైరస్‌లపై పోరాడడంలో భారీ ప్రభావం చూపుతుంది. నెల రోజుల తర్వాత కూడా ఇది సాధారణ స్థాయి కంటే 24 శాతం అధికంగా ఉంటుంది."
ప్రకృతిలో తక్కువ సమయమే గడిపినప్పటికీ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే చిన్నచిన్న మార్పులు కనిపిస్తున్నాయని.. అవి స్వల్ప మార్పులే అయినప్పటికీ స్థిరమైనవని చెప్పారు.

ప్రకృతి వాసన పీల్చడం .. చూడడం, వినడం మాదిరిగానే శక్తివంతమైనది.
చెట్లు, నేల నుంచి వచ్చే సువాసనలు సేంద్రీయ సమ్మేళనాలతో నిండి ఉంటాయి. "మీరు వాటిని పీల్చుకున్నప్పుడు, వాటిలోని కొన్ని కణాలు మీ రక్తప్రవాహంలోకి చేరతాయి"
పైన్ చెట్లు అందుకు ఉత్తమ ఉదాహరణ అని విల్లిస్ చెప్పారు. పైన్ చెట్ల అడవిలో కేవలం 90 సెకన్లలోనే ప్రశాంతత లభిస్తుందని, దాని ప్రభావం 10 నిమిషాల పాటు ఉంటుందన్నారు.
ప్రకృతిలో ఉంటే ప్రశాంతత కలుగుతుందనే భావన కేవలం మన మనసునుంచి పుట్టిన అనుభూతిగా మీరు భావించవచ్చు, కానీ వాసనలను గుర్తుపెట్టుకోగలిగే సామర్థ్యం లేని శిశువుల గదుల్లోకి నిమ్మపండు వాసన కలిగించే లిమోనెన్‌ను పంపినప్పుడు వారు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మరో అధ్యయనంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రకృతి మీ మనసును శాంతపరచడంతో పాటు ఈ నేల, మొక్కలు మంచి బ్యాక్టీరియాతో నిండివుండడం వల్ల.. అది మీ శరీరంలోని మైక్రోబయోమ్(సూక్ష్మజీవులు)ను కూడా మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది.
"అవి మనం డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రోబయోటిక్స్, లేదా పానీయాల్లో ఉండే మంచి బ్యాక్టీరియా రకాలే" అని విల్లిస్ వివరించారు.
‘‘మొక్కల నుంచి విడుదలయ్యే సహజ రసాయనాలు
ప్రొఫెసర్ మింగ్ కువో మన ఆరోగ్యంపై ప్రకృతిలోని వాతావరణ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కొన్ని మొక్కలు విడుదలచేసే వాసనలను పీల్చితే మన మూడ్ మెరుగయ్యే అవకాశం ఉందని, మొక్కలు పైటాన్‌సైడ్స్ అనే జీవాణు నిరోధక రసాయనాలను విడుదల చేస్తాయని, ఇవి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడంలోనూ, బ్యాక్టిరీయా, వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయని ఆమె చెప్పారు.
ఒక ఇన్ఫెక్షన్ శాస్త్రవేత్తగా, "రోగనిరోధక వ్యవస్థకు చక్కిలిగింతలు పెట్టే" ఓ సానుకూల సవాల్‌గా ప్రకృతిని తాను చూస్తానని డాక్టర్ క్రిస్ వాన్ తుల్లెకెన్ చెప్పారు.
ఆయన తన పిల్లలను మట్టిలో ఆడుకోనిస్తారు. అలా వారి ముక్కు లేదా నోటి ద్వారా అది వారి రోగనిరోధక వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రకృతిని మీ దగ్గరకు చేర్చుకోండి..
అయితే, ఉన్నపళంగా అందరూ అడవిలోకి వెళ్లలేరు. కానీ, ఇక్కడ శుభవార్త ఏంటంటే.. మీరలా చేయాల్సిన అవసరం లేదు.
ఇంట్లోనే ప్రకృతికి దగ్గరగా ఉండేలా చేసుకునే చిన్నచిన్న ఏర్పాట్లు కూడా ప్రభావం చూపుతాయని విల్లిస్ అంటున్నారు.
దృశ్యాల ద్వారా.. అంటే తెలుపు లేదా పసుపు గులాబీ వంటి పూలు చూడడం మెదడుపై ప్రశాంతమైన ప్రభావం చూపుతుందని తేలింది.
ఇక వాసన విషయానికొస్తే, ప్రశాంతతకు ఉపయోగపడే పినీన్ వంటి నూనెలతో కూడిన డిఫ్యూజర్‌ను ఉపయోగించవచ్చు.
ఇవన్నీ విఫలమైనా.. అందమైన అడవి ఫోటో కూడా సాయపడుతుంది.
మీ ల్యాప్‌టాప్‌లో ప్రకృతి చిత్రాలను చూడడం లేదా ఆకుపచ్చ రంగును చూడడం వల్ల ప్రశాంతతతో పాటు ఒత్తిడిని తగ్గించే తరంగాలను ప్రేరేపించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
"ప్రతి చిన్న విషయం ఉపయోగపడుతుందనిపిస్తుంది" అని ప్రొఫెసర్ మింగ్ కువో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














