మల్లోజుల వేణుగోపాల్: 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత

ఫొటో సోర్స్, ANI/ CG KHABAR
మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత లొంగిపోయారు.
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, మరో 60మంది పార్టీ సహచర కార్యకర్తలతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో లొంగిపోయారని ఏఎన్ఐ, పీటీఐ వార్తా సంస్థలు తెలిపాయి.
మావోయిస్టు పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బని అధికార వర్గాలు పేర్కొన్నట్టు ఏఎన్ఐ తెలిపింది.
మావోయిస్టు పార్టీ ఆయుధాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉందని, శాంతిచర్చలు జరపాలని కోరుతూ, అభయ్ పేరుతో గత నెలలో మల్లోజుల వేణుగోపాల్ ఓ లేఖ విడుదల చేశారు.
మావోయిస్టు క్యాడర్ నుంచి మల్లోజుల వేణుగోపాల్ ప్రతిపాదనకు మద్దతు లభించిందని అధికార వర్గాలు చెప్పినట్టు ఏఎన్ఐ తెలిపింది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, CHHATTISGARH POLICE
మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు ముందు ఏం జరిగింది?
మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుపై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పందించారు.
నక్సలిజాన్ని అంతం చేయాలని బస్తర్ ప్రజలు నిర్ణయించుకున్నారని, ఏడాది క్రితం పొలిట్ బ్యూరోలో మహిళా సభ్యురాలు లొంగిపోయారని, ఇవాళ ఆమె భర్త లొంగిపోయారని విజయ్ శర్మ తెలిపారు.
జనజీవనస్రవంతిలో కలిసేవారందరినీ తాము స్వాగతిస్తామని ఆయనన్నారు. మావోయిస్టు పార్టీని విడిచిపెట్టిరానివారితో తమ భద్రతాబలగాలు సరైన రీతిలో స్పందిస్తాయని విజయ్ శర్మ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కనబెడతామని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తరఫున అభయ్ పేరుతో మీడియాకు గత నెలలో ఒక లేఖ విడుదలైంది. కేంద్ర కమిటీకి చెందిన అభయ్ ఈ లేఖ విడుదల చేశారు.
అయితే అభయ్ ప్రతిపాదనకు మావోయిస్టు అగ్రనేతలు, క్యాడర్ మద్దతు ఉందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
అభయ్ లేఖ తర్వాత కొన్నిరోజులకు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మరణించారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.
వారిద్దరూ తెలుగువారే. కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, కాదరి సత్యనారాయణ అలియాస్ కోసా ఇద్దరూ ఒకే రోజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది.
ఆ తర్వాత మావోయిస్టుల నుంచి మళ్లీ చర్చల ప్రతిపాదన రాలేదు.
తాత్కాలికంగా ఆయుధాలు విడిచిపెడతామని, శాంతిచర్చలకు సిద్ధమని పేర్కొంటూ లేఖ విడుదల చేసిన నెలరోజుల్లో మల్లోజుల వేణుగోపాల్ 60మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు.

ఫొటో సోర్స్, Alok Putul
42 మంది సభ్యుల సెంట్రల్ కమిటీలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?
దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది.
ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతాబలగాలు దాడులు చేస్తున్నాయి. ఈ దాడులతో మావోయిస్టు పార్టీ తీవ్ర కష్టాల్లో పడింది.
ఇప్పుడు వారి సంఖ్య 13కు లోపే ఉంది.
ఈ ఒక్క సంవత్సరంలోనే కేంద్ర కమిటీ సభ్యులు ఆరుగురు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు.
గత నెలలో మరో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.
రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి జనవరిలో, పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మేలో, సుధాకర్, గాజర్ల రవి అలియాస్ ఉదయ్ జూన్‌లో, మోడెం బాలకృష్ణ, కట్టారామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, కాదరి సత్యనారాయణ అలియాస్ కోసా సెప్టెంబరులో జరిగిన ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.
కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత గత నెలలో తెలంగాణ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో లొంగిపోయారు.
ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుతో ఆయుధాలు వీడుతున్న మావోయిస్టు సీనియర్ నేతల్లో మరొకరు చేరినట్లయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














