ఇజ్రాయెల్ దగ్గర ఖైదీలుగా, బందీలుగా ఉన్న వందలమంది పాలస్తీనీయుల విడుదల, బయటికొచ్చాక ఏమన్నారంటే..

పాలస్తీనా ఖైదీలు, బందీలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టామ్ బెన్నెట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్ విడుదల చేసిన వందలమంది పాలస్తీనా ఖైదీలు, డిటెయినీలకు కుటుంబసభ్యులు, బంధువులు ఆనందబాష్పాలతో స్వాగతం పలికారు.

ఇజ్రాయెల్ జైలు నుంచి తమవారు విడుదల కావడంతో వారి కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. విడుదలయిన వారంతా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజాకు చెందినవారు.

ఇజ్రాయెల్ విడుదల చేసిన వారిలో 250 మంది ఖైదీలున్నారు. ఇజ్రాయెలీల హత్యలు, ప్రాణాంతక దాడులు సహా ఇతర నేరాల్లో వారంతా దోషులగా తేలినవారు. ఎలాంటి అభియోగాలు లేకుండా గాజా నుంచి ఇజ్రాయెల్ నిర్బంధంలోకి తీసుకున్న దాదాపు 1,700మంది కూడా విడుదలయ్యారు.

రమల్లాలో రెడ్ క్రాస్ బస్సు నుంచి వీరంతా బయటకు వచ్చారు. సంప్రదాయక స్కార్ఫ్‌లు కప్పుకుని ఉన్న వీరంతా, బలహీనంగా, పాలిపోయి కనిపించారు. కొంతమందికి నడవడం కూడా కష్టంగా ఉంది.

హమాస్ 20 మంది ఇజ్రాయెల్ బందీలను, నలుగురు బందీల మృతదేహాలను అప్పగించినదానికి బదులుగా ఇజ్రాయెల్ వీరందరినీ విడుదల చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాజా, హమాస్, ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.

మీడియాతో మాట్లాడొద్దని ఇజ్రాయెల్ హెచ్చరిక

''ఆయన స్వేచ్ఛగా ఉండబోతున్నారు''అని 48 ఏళ్ల తన కజిన్ రషీద్ ఒమర్ కోసం ఎదురుచూస్తున్న 24 ఏళ్ల అమ్రో అబ్దుల్లా చెప్పారు. 2005లో రషీద్‌ను అరెస్టు చేశారు. హత్య, ఇతర నేరాల్లో దోషిగా నిర్ధరించి ఇజ్రాయెల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

''నాకు శాంతి కావాలి. ఎవరి దురాక్రమణలో చిక్కుకోకుండా, నిబంధనల అడ్డుగోడలేవీ లేకుండా నేను సంతోషంగా, భద్రంగా, ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా'' అని అబ్దుల్లా అన్నారు. ‘‘

దాదాపు 100 మంది ఖైదీలను వెస్ట్‌ బ్యాంక్‌‌కు పంపించినట్టు, కొంతమందిని తూర్పు జెరూసలేంలో విడిచిపెట్టినట్టు, మరికొందరని విడుదలచేయనున్నట్టు తెలిసింది.

ఖైదీలు రమల్లా చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం వంటివి చేయకూడదని విడుదల ప్రక్రియకు ముందే ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. గతంలోనూ జరిగిన ఇలాంటి విడుదల కార్యక్రమాల సందర్భంగా హమాస్ జెండాలు పట్టుకున్న భారీ గుంపులు కనిపించాయి.

ఇజ్రాయెల్ సైన్యం తమను హెచ్చరించిందని చెబుతూ చాలా కుటుంబాలు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు.

గాజా, హమాస్, ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలయినఖైదీలను తీసుకుని ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌కు వచ్చిన బస్సు

ఆస్పత్రి దగ్గర ఉద్విగ్న పరిస్థితులు

గాజా ప్రజలు తమ వాళ్లను తిరిగి కలుసుకునేందుకు ఖాన్ యూనిస్‌లోని నస్సీర్ ఆస్పత్రి దగ్గరకు వచ్చారు. ఈ రీయూనియన్ కోసం ప్రధాన ఆస్పత్రి భవనం పక్కనే ఓ ఫీల్డ్ ఆస్పత్రి దగ్గర ఏర్పాట్లు చేశారు.

''ఇది చాలా మంచి అనుభూతి. సంతోషంగా ఉంది. ఇది ఆనందకరమైన రోజు'' అని 50 ఏళ్ల ముహమ్మద్ హసన్ సయీద్ దావూద్ బీబీసీతో చెప్పారు. తన కొడుకు కోసం ఆయన అక్కడకు చేరుకున్నారు. చెక్‌పాయింట్ దగ్గర ఇజ్రాయెల్ బలగాలు తన కొడుకును అరెస్టు చేశాయని ఆయన చెప్పారు.

''యుద్ధం, మరణాలు, గాయపడడం, గాజా విధ్వంసం ఉన్నప్పటికీ మా వాళ్లు విడుదలవుతున్న రోజును జాతీయ సెలవుగా భావిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.

ఖలీల్ ముహమ్మద్ అబ్దుల్‌రహ్మాన్ అల్-ఖత్రూస్ కూడా తన కొడుకును తీసుకెళ్లడానికి అక్కడకు వచ్చారు. మూడు నెలల కిందట తన కొడుకును నిర్బంధంలోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.

''ఇక్కడ సంతోషం, బాధ రెండూ ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.

''వారి విడుదల కోసం ఎదురుచూస్తూ మేం ఇక్కడకు వచ్చాం. వాళ్లు పదిగంటలకు వస్తారనుకున్నాం. ఇప్పుడు 12గంటలు దాటింది. మేం వారి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం'' అని విడుదల ముందు ఖత్రూస్ వ్యాఖ్యానించారు.

గాజా, హమాస్, ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖాన్ యూనిస్‌లో గాజా ప్రజలు

ఇజ్రాయెల్ జైళ్లలో చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు

విడుదలవుతున్నవారిలో గాయపడ్డవారు, అనారోగ్యంతో ఉన్నవారెవరైనా ఉంటే చికిత్స అందించేందుకు వీలుగా రమల్లాలో పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీ అంబులెన్స్‌లు ఏర్పాటుచేసింది.

''కొందరు ఏడుస్తున్నారు. కొందరు మౌనంగా ఉన్నారు. తమ వారి విడుదల కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల భావోద్వేగం కనిపిస్తోంది'' అని రెడ్ క్రీసెంట్‌కి చెందిన 23 ఏళ్ల వలంటీర్ నర్స్ చెప్పారు.

''పాలస్తీనాలోని ప్రజలందరికీ ఇది చాలా అంటే చాలా భావోద్వేగ సమయం''అని అన్నారు.

రమల్లాలో ఇప్పుడు విడుదలయిన ఖైదీలను ఇటీవల జైలులో బాగా కొట్టారని అనేకమంది వైద్యులు, కుటుంబ సభ్యులు చెప్పారు.

ఇజ్రాయెలీ జైలులో ఇలా చేయడంపై వచ్చిన ఆరోపణలను బీబీసీ వెరిఫై చేయలేదు. అయితే పాలస్తీనా ఖైదీలకు చాలినంత ఆహారం అందించడం లేదని గత నెలలో ఇజ్రాయెల్ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.

ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న పాలస్తీనియన్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారని గతంలో బీబీసీ కూడా రిపోర్టు చేసింది.

గాజా, హమాస్, ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ జైళ్లలో చిత్రహింసలు పెట్టారని కుటుంబ సభ్యులు చెప్పారు.

‘ఎన్నో బాధల తర్వాత...’

చాలా తీవ్రమైన స్థాయిలో తమ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాలస్తీనా ఖైదీల క్లబ్‌కు చెందిన 26 ఏళ్ల అయా ష్రైత్ అన్నారు.

గత ఏడాది చాలామంది ఖైదీలను ఉద్దేశపూర్వకంగా ఆకలితో అలమటించేలా, అనార్యోగానికి గురయ్యేలా చేశారని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆకలి బాధతో వారి శరీరాలు బలహీనపడిపోయాయని, వారిని బాగా కొట్టారని ఆమె తెలిపారు.

''కానీ ఇవాళ మాకో ఆశ కలిగింది. పరిస్థితులతో సంబంధం లేకుండా స్వేచ్ఛకు అవకాశం ఉంటుందని అనిపిస్తోంది'' అని అయా ష్రైత్ తెలిపారు.

గాజా యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం మొదటిదశలో భాగంగా పరస్పర మార్పిడి విధానంలో బందీలు, ఖైదీలను విడుదల చేస్తున్నారు.

శుక్రవారం(అక్టోబరు 10)న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా తరువాతి దశల్లో సంప్రదింపులు జరగాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)