ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందం: ఇది ముందడుగే, కానీ యుద్ధం ముగిసిందని అనుకోవచ్చా?

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
- రచయిత, హ్యూగో బచేగా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈజిప్ట్‌లో సుదీర్ఘ చర్చల తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల అప్పగింత ఒప్పందం కుదిరింది.
రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగించే విషయంలో ఇదొక పెద్ద ముందడుగు.
అయితే, పరిస్థితుల్ని చూస్తుంటే యుద్ధం ముగుస్తుందనే గ్యారంటీ ఏమీ కనిపించడం లేదు.
ఒప్పందం కుదుర్చుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ హమాస్ మీదనే కాకుండా ఇజ్రాయెల్ మీద కూడా ఒత్తిడి తెచ్చారు.
కాల్పుల విరమణ కోసం జరిగిన ప్రయత్నాల్లో గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ట్రంప్ వ్యక్తిగత జోక్యం.

యుద్ధాన్ని ముగించిన వ్యక్తిగా గుర్తింపు కోసం తపిస్తున్న ట్రంప్‌కు ఇది కచ్చితంగా అతి పెద్ద దౌత్య విజయం.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రారంభించింది. హమాస్ దాడిలో 1200 మంది ప్రజలు చనిపోయారు.
ఇందులో ఎక్కువమంది ఇజ్రాయెల్ పౌరులే. 251 మందిని హమాస్ బందీలుగా పట్టుకెళ్లింది.
ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 67వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 18వేల మంది పిల్లలు ఉన్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన వారు ఎక్కువమంది సాధారణ పౌరులేనని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ లెక్కలన్నీ వాస్తవమైనవేనని ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి.
యుద్ధం వల్ల గాజాలో అధిక భాగం ధ్వంసమవడంతో పాటు మానవీయ సంక్షోభం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ ఒత్తిడి పని చేసిందా?
గాజా శాంతి ఒప్పందం ప్రణాళికలో ఆమోదించిన తొలి దశ గురించి అమెరికా అధ్యక్షుడు గత వారం వైట్‌హౌస్‌లో ప్రకటించారు.
అప్పుడు ఆయన పక్కన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఉన్నారు.
గతంలో శాంతి ప్రయత్నాలను నెతన్యాహు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఈసారి నెతన్యాహుపై ట్రంప్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్‌ను దారికి తెచ్చేందుకు అమెరికా అధికారాన్ని ప్రదర్శించడంతో నెతన్యాహు శాంతి ఒప్పందానికి అంగీకరించాల్సి వచ్చింది.
"తుడిచి పెట్టేస్తాం" అని ట్రంప్ హెచ్చరించడంతో హమాస్ కూడా దారి కొచ్చింది.
ట్రంప్ ప్రణాళికను అరబ్, ముస్లిం దేశాలు స్వాగతించాయి.
చర్చల్లో ఖతార్, ఈజిప్ట్, తుర్కియే కూడా కీలక పాత్ర పోషించాయి.
కాల్పుల విరమణ, బందీల విడుదల గాజా శాంతి ప్రణాళికలో ప్రధానమైన అంశాలుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం హమాస్ వద్ద 20 మంది ఇజ్రాయెలీ బందీలు ప్రాణాలతో ఉన్నారు.
వీరిని ఆదివారం నాటికి విడిచిపెట్టే అవకాశం ఉంది.
మరణించిన 28 మంది మృతదేహాలను దశలవారీగా అప్పగించనున్నారు.
ఇజ్రాయెల్ జైళ్ల నుంచి వందల మంది పాలస్తీనియన్లను విడుదల చేయనున్నారు.
గాజాలో కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగుతాయి.
ఈ ప్రాంతంలోకి వచ్చే మానవీయ సాయం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
దోహాలో ఇజ్రాయెల్ వైఫల్యం
సెప్టెంబర్‌లో దోహా చర్చల్లో పాల్గొన్న హమాస్ నాయకుల్ని చంపేందుకు ఇజ్రాయెల్ విఫల యత్నం తర్వాత శాంతి ఒప్పందం కోసం ఆ దేశంపై ఒత్తిడి పెరిగింది.
ఇజ్రాయెల్ చర్యపై ఐక్యరాజ్య సమితితో పాటు మిత్రదేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని ట్రంప్ బృందం అవకాశంగా తీసుకుంది.
నోబెల్ శాంతి బహుమతి విషయంలో తన కోరికను ట్రంప్ బహిరంగానే వెలిబుచ్చారు. శుక్రవారం ఈ అవార్డును ప్రకటించనున్నారు.
శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత "ఇది చరిత్రాత్మక, అపూర్వ సంఘటన. బలమైన, శాశ్వతమైన శాంతి కోసం మొదటి అడుగు" అని సోషల్ మీడియాలో తనదైన శైలిలో సందేశాలను పోస్ట్ చేశారు.
నిస్సందేహంగా, ఇదొక ముఖ్యమైన పరిణామం.
అయితే ఈ ఒప్పందం వల్ల గాజాలో శాంతియుత పరిస్థితులకు హామీ దొరకడం లేదు. ఎందుకంటే ఒప్పందంలో కీలక అంశాలు సిద్ధం కాలేదు.
ఈ కీలక అంశాలలో ఇజ్రాయెల్ కోరుతున్నట్లుగా హమాస్ నిరాయుధీకరణ, గాజా పరిపాలన ఎవరికి అప్పగిస్తారు? గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు ఎప్పటిలోగా వైదొలగుతాయి లాంటి అంశాలున్నాయి.
అర్ధరాత్రి శాంతి ఒప్పందం గురించి ప్రకటన వచ్చిన తర్వాత గాజాలో పాలస్తీనియన్లు సంబరాలు చేసుకున్నారు. తమ కష్టాలు తీరిపోతాయని వారు భావిస్తున్నారు.
టెల్ అవీవ్‌లోనూ హోస్టేజెస్ స్క్వేర్ వద్దకు ప్రజలు చేరుకున్నారు.
బందీలను వదిలేస్తే చర్చల్లో బేరమాడే శక్తిని కోల్పోతామని హమాస్‌కు తెలుసు.
వారిని విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయకుండా హామీ ఇవ్వాలని హమాస్ డిమాండ్ చేస్తోంది.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
ఇజ్రాయెల్ తీరుపై హమాస్ సందేహాలు వ్యక్తం చేయడానికి కారణాలున్నాయి.
మార్చ్‌లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వైమానిక దాడులతో విరుచుకు పడింది.
యుద్ధంతో విసిగిపోయిన ఇజ్రాయెల్ ప్రజలు దీన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. యుద్ధం వల్ల తమకు జరిగిన నష్టం, ప్రపంచంలో తాము ఒంటరిగా మిగిలామనే వాస్తవాన్ని ఇజ్రాయెలీలు తెలుసుకుంటున్నారు.
ఇజ్రాయెల్ తిరిగి యుద్ధం చేయాలనే ఒత్తిడి ఇంటా బయటా తక్కువగానే ఉంది.
అయితే నెతన్యాహుకు రాజకీయంగా అడ్డంకులు ఎదురు కావచ్చు. ఎందుకంటే ఆయన అతివాద జాతీయవాదులైన మంత్రుల మద్దతు మీద ఆధారపడుతున్నారు. హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ అంశం నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితికి దారి తీస్తుందని అనేకమంది అనుమానిస్తున్నారు.
2026 అక్టోబర్ చివరి నాటికి ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రోజులు గడిచాక, హమాస్‌తో శాంతి ఒప్పందం కారణంగా నెతన్యాహు ప్రభుత్వం కూలిపోతుందనేది పెద్ద సమస్య కాకపోవచ్చు.
హమాస్ మీద "పూర్తి విజయం" సాధిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఆయన కుదుర్చుకునే ఒప్పందం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించానని చెప్పుకునే విధంగా ఉండాలి.
"శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు దౌత్య పరమైన, జాతీయ, నైతిక విజయం" అని నెతన్యాహు చెప్పారు.
హమాస్ మాదిరిగా ఇది యుద్ధానికి ముగింపు అని ఆయన చెప్పలేదనేది గమనార్హం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














