ఇజ్రాయెల్ భూతల దాడులు.. అన్నీ వదిలేసి పిల్లలతో గాజాను వీడుతున్న ప్రజలు

యుద్ధం

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

    • రచయిత, రష్దీ అబులౌఫ్
    • హోదా, గాజా కరస్పాండెంట్, ఇస్తాంబుల్

గాజాను ఆక్రమించుకునే లక్ష్యంలో భాగంగా భూతల దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం నిర్థరించింది. దీంతో వేలాది కుటుంబాలు గాజా నగరాన్ని వీడిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

‘‘ప్రమాదం ఉన్నా ఇంటిని వీడకూడదనే పట్టుదలతో ఉన్నాను. కానీ ఓ ఇజ్రాయెల్ అధికారి నుంచి ఫోన్ కాల్ వచ్చి, ఖాళీ చేయమని ఆదేశించిన తరువాత బయటకు రావాల్సి వచ్చింది’’ అని షేక్ రాడ్వాన్ ప్రాంతానికి చెందిన లీనా అల్-మగ్‌రేబీ (32) అనే ముగ్గురు బిడ్డల తల్లి బీబీసీతో చెప్పారు

"నిరాశ్రయురాలిగా మారిన తర్వాత టెంట్ వేయడానికి నా బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు.

"ఖాన్ యూనిస్ చేరేందుకు మాకు పదిగంటల సమయం పట్టింది. ఆ ప్రయాణానికి 3,500 షెకెల్స్ (దాదాపు 77 వేల రూపాయలు) చెల్లించాం. దారిలో కార్లు, ట్రక్కులు బారులుతీరి కనిపించాయి" అని ఆమె చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హమాస్‌కు గట్టి పట్టు ఉన్న గాజా నగరంపై ''శక్తిమంతమైన ఆపరేషన్'' ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

ప్రజల తరలింపునకు ఇజ్రాయెల్ సైన్యం 'అల్-రషీద్' కోస్తా రహదారిని మాత్రమే వినియోగించేందుకు అనుమతించింది.

దీంతో ఈ మార్గంలో పెద్దఎత్తున రద్దీ ఏర్పడింది. కార్లు, ట్రక్కులు భారీగా బారులు తీరాయి.

వైమానిక దాడులు కొనసాగుతుండటంతో, తాత్కాలికంగా తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్న కుటుంబాలు మధ్యలోనే చిక్కుకుపోయినట్లు పలువురు తెలిపారు.

"ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఖాళీ చేయమంటూ మా నివాసాల వద్ద కరపత్రాలు వదిలాయి. అందుకే నేను పిల్లలతో కలిసి దక్షిణ దిశగా వెళ్లిపోయాను. కానీ నా భర్త మాత్రం ఇంటిని వదిలేందుకు ఇష్టపడలేదు" అని ఐదుగురు పిల్లల తల్లి అయిన నివిన్ ఇమాద్ అల్-దిన్ (38) చెప్పారు.

గాజాను వీడుతున్న పౌరులు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

''పెద్ద ట్రక్కు తీసుకుంటే ఖర్చు భరించే స్తోమత లేక, నా ఫర్నీచర్‌ను నాతో తీసుకువెళ్లలేకపోయాను'' అని ఆమె వివరించారు. ''అన్నీ వదిలేసి వెళ్లడం నా జీవితంలో అత్యంత కఠిన నిర్ణయం'' అని ఆమె చెప్పారు.

వలస ఖర్చులు చాలా మంది నిరాశ్రయుల స్తోమతను మించిపోయాయి.

ప్రస్తుతం ఓ చిన్న ట్రక్కును అద్దెకు తీసుకోవాలంటే సుమారు 3,000 షెకెల్స్ (దాదాపు 66,000 రూపాయలు) ఖర్చవుతోంది. ఐదుగురికి సరిపోయే టెంట్ ఖరీదు సుమారు 4,000 షెకెల్స్ (దాదాపు 88,000 రూపాయలు).

యుద్ధం మొదలైన తర్వాత చాలా కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోవడంతో, కొందరు మైళ్ల దూరం కాలినడకనే వెళుతుండగా, మరికొందరు ముప్పు పొంచిఉన్నా ఇళ్లలోనే ఉండిపోతున్నారు.

మంగళవారం అర్ధరాత్రి నాటికి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా నగరమంతటా భారీ వైమానిక దాడులు జరిపాయి.

ఈ దాడుల్లో, సెంట్రల్ అల్-దారాజ్ ప్రాంతం, పశ్చిమాన బీచ్ శరణార్థ శిబిరం, ఉత్తరాన షేక్ రద్వాన్ ప్రాంతాలపై ప్రత్యేకంగా బాంబులు విసిరారు.

దీనితో పాటు, ఫిరంగులు, డ్రోన్ల కాల్పులు, హెలికాప్టర్ గన్‌షిప్ దాడులు కూడా సాగాయి.

ఇజ్రాయెల్ రక్షణ దళాలు తమ ''తదుపరి దశ'' దాడుల్లో భాగంగా "క్రమంగా" గాజా నగరంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించాయి.

ఈ దశలో పదాతి దళాలు, అలాగే వైమానిక దాడులు కొనసాగుతాయని, రోజురోజుకు మరిన్ని సైనిక దళాలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపాయి.

స్థానికులు అర్ధరాత్రి దాడులను ''నరకం''గా అభివర్ణించారు.

ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన ఘాజీ అల్-అలోల్, ప్రస్తుతం గాజా నైరుతి ప్రాంతం టెల్ అల్-హవాలోని అల్-కుడ్స్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద నిద్రిస్తున్నానని బీబీసీకి తెలిపారు.

"నేను ఇదంతా కోరుకోలేదు" అని ఆయన అన్నారు.

''గంటల తరబడి భయంకరమైన బాంబు దాడులు కొనసాగుతున్నాయి. మా పరిసరాల్లోని అనేక నివాస భవనాలను తునాతునకలు చేసేస్తామని సైన్యం బెదిరిస్తోంది'' అని ఆయన తెలిపారు.

తీరం వెంబడి రాత్రివేళ వలసపోతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

"ఇళ్లన్నీ కూలిపోయి ప్రజలపై పడ్డాయి. చాలామంది మరణించారు. కొందరి జాడ కూడా కనిపించడం లేదు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు" అని సెంట్రల్ గాజాలోని అల్-దారాజ్ ప్రాంతానికి చెందిన సమీ అబూ దలాల్, తెలిపారు.

"ఇజ్రాయెల్ మూడు దిశల నుంచి దాడులు కొనసాగిస్తోంది. భూమిపైన మీద బాంబులు పెట్టిన వాహనాలతో, తీవ్రమైన వైమానిక దాడులు, భారీ కాల్పులతో ఈ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి" అని ఆయన వివరించారు.

ఈ దాడుల మధ్యలో అపాచీ హెలికాప్టర్లు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎగురుతూ నిరంతరం కాల్పులు జరుపుతున్నాయని తెలిపారు.

ఇజ్రాయెల్ దాడుల తీవ్రత నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో, గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ జెనోసైడ్ (జాతి నిర్మూలన) కు పాల్పడుతోందని పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)