గాజా పీస్ ప్లాన్: తొలిదశ ఒప్పందంపై ఇరువర్గాలు సంతకం చేశాయని ప్రకటించిన ట్రంప్

డోెనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్, హమాస్‌లు అమెరికా ప్రతిపాదిత గాజా శాంతి ప్రణాళిక (పీస్‌ ప్లాన్) మొదటి దశ ఒప్పందంపై సంతకం చేశాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

" అంటే దీని అర్థం బందీలందరినీ అతి త్వరలోనే విడుదల చేస్తారు. ఇజ్రాయెల్ తన దళాలను అంగీకరించిన హద్దుల వరకు ఉపసంహరించుకుంటుంది. ఇది బలమైన, స్థిరమైన శాశ్వత శాంతివైపు వేసిన మొదటి అడుగు అవుతుంది" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

"ఇది అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, దాని పొరుగు దేశాలన్నింటికీ ముఖ్యమైన, చరిత్రాత్మక దినం" అని ట్రంప్ రాశారు.

ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించినందుకు ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు అమెరికా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఇజ్రాయెల్ స్పందన ఏంటి?

గాజా శాంతి ఒప్పందం మొదటి దశకు కుదిరిన ఒప్పందాన్ని "ఇజ్రాయెల్‌కు మహత్తర దినం"గా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు.

ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి, ఇజ్రాయెల్ బందీలను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి గురువారం తన ప్రభుత్వం సమావేశమవుతుందని ఆయన అన్నారు.

"ప్రణాళిక తొలి దశ ఆమోదంతో, మన బందీలందరినీ ఇంటికి తీసుకువస్తారు. ఇది ఇజ్రాయెల్‌కు దౌత్యపరమైన విజయం, జాతీయ, నైతిక విజయం" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు .

"స్నేహితుడు, అధ్యక్షుడు ట్రంప్ అవిశ్రాంత కృషి కారణంగా మనం ఈ కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం" అని ఆయన రాశారు.

"అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం, భాగస్వామ్యం, ఇజ్రాయెల్ భద్రత, మన బందీల స్వేచ్ఛ పట్ల అచంచలమైన నిబద్ధతకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ఆయన రాశారు.

నరేంద్ర మోదీ, షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఎక్స్‌ ద్వారా స్పందించారు.

ప్రధాని మోదీ హర్షం

"అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది ప్రధానమంత్రి నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని కూడా సూచిస్తుంది" అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు .

"బందీల విడుదల, మరింత మానవీయ సహాయం అందించడం ద్వారా గాజా ప్రజలకు ఊరట కలిగించాలని ఆశిస్తున్నాం" అని భారత ప్రధాని మోదీ ఎక్స్‌లో రాశారు.

ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అవకాశమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అన్నారు.

"చర్చల ప్రక్రియ అంతటా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం ప్రపంచ శాంతి పట్ల ఆయన అచంచలమైన నిబద్ధతను చూపిస్తుంది" అని పాకిస్తాన్ ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఖతార్, ఈజిప్ట్, తుర్కియే ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

డోనల్డ్ ట్రంప్, ఆంటోనియో గుటెర్రెస్

ఫొటో సోర్స్, Chip Somodevilla/Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, ఆంటోనియో గుటెర్రెస్‌

పూర్తి మద్దతు: ఐక్యరాజ్యసమితి

గాజాలో కాల్పుల విరమణకు, బందీలను విడుదలకు ఒప్పందం కుదరడాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు.

"దీన్ని సాధ్యం చేసిన అమెరికా, ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలా దౌత్య ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. ఒప్పందంలోని నిబంధనలను పూర్తిగా పాటించాలని ఇరు పక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని గుటెర్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు .

"బందీలుగా ఉన్న వారందరినీ గౌరవప్రదంగా విడుదల చేయాలి. శాశ్వత కాల్పుల విరమణను నిర్ధరించాలి. యుద్ధం వెంటనే ఆగిపోవాలి" అని ఆయన రాశారు.

గాజాకు తక్షణ మానవతా సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం అమలుకు ఐక్యరాజ్యసమితి పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

గాజా పీస్ ప్లాన్‌ పై బీబీసీ ప్రతినిధి లైస్ డ్యూసెట్ విశ్లేషణ

‘‘ఇది అన్నింటి కంటే ముఖ్యమైన ఓ మానవీయ సందర్భం. గాజా వీధుల్లో రాత్రి పూట ఉప్పొంగిన సంతోషాలు, టెల్ అవీవ్ హోస్టేజెస్ స్క్వేర్‌లో ఆనందోత్సాహాలు ఇందులోని తొలి దశ విజయం ఓ కథగా చెబుతోంది.

గురువారం జరిగే చర్చలు కొలిక్కి వచ్చి, అంతా సమసిపోతే… ఇజ్రాయెల్ బందీలు తిరిగి వారి ఇంటికి రావడం మొదలవుతుంది. అలాగే పాలస్తీనా ఖైదీలు కూడా వారింటి బాట పడతారు. గాజాలో తుపాకులు మూగబోతాయి. మరింత సహాయం ఆ ప్రాంతానికి చేరుతుంది. ఇక ఇదే తమ చివరి రోజేమో అనే భయతో నివసించడాన్ని పాలస్తీనీయులు మానేస్తారు.

ఇదో చేదుతీపి కలగలిసిన సందర్భం. అయితే ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ఒప్పందం.. గత ఏడాది మే నెలలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించినదాని కంటే భిన్నమైనది కాదనే అసంతృప్తి కూడా ఉంది. ఇజ్రాయెల్- పాలస్తీనా దశాబ్దాలుగా కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే ఇందులోనూ ఎడతెగని కొన్ని హెచ్చరికలూ ఉన్నాయి.

కానీ, ఇదో కీలకమైన పరిణామం.

దీన్ని కేవలం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాత్రమే చేయగలరు. ఇదే విషయాన్ని వారు చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు, కమాండర్-ఇన్-చీఫ్ మాత్రమే ఈ ఒప్పందాన్ని కడదాకా పూర్తి చేయడానికి తన రాజకీయ మిత్రుడు, వ్యక్తిగత స్నేహితుడు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురాగలరు. అరబ్ నేతలతో ఆయనకున్న బలమైన భాగస్వామ్యం, అలాగే తుర్కియేతో ఉన్న అనుబంధం…బలహీనమైన హమాస్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చింది.

ఇది ప్రారంభం మాత్రమే. అంతం కాదు. ఇది కాల్పుల విరమణ తప్ప శాంతి ఒప్పందం కాదు. గాజాలో హమాస్ తుపాకుల పాలన నుంచి ఇజ్రాయెల్ సైన్యం విస్తరణ పరిధి వరకు వివిధ అంశాలపై ఉన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. కానీ, ఇదో ఉత్సవ సందర్భం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)