పవర్ జనరేషన్: కరెంటు ఉత్పత్తిలో బొగ్గు ఆధిపత్యాన్ని అధిగమించిన పునరుత్పాదక ఇంధనాలు..ఏ దేశం ఎక్కువగా తయారు చేస్తోందంటే...

చైనా, అమెరికా, భారత్, ప్రత్యాామ్నాయ ఇంధన వనరులు, విద్యుదుత్పత్తి, సోలార్ పవర్, విండ్ పవర్, బొగ్గు, సహజవాయువు

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, జస్టిన్ రౌలట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో పునరుత్పాదక ఇంధన వనరులు (రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్) బొగ్గు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌కన్నా ఎక్కువ విద్యుత్‌ను అందించాయి.

ఇదొక చరిత్రాత్మక పరిణామం. గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంక్ ఎంబర్ విడుదల చేసిన తాజా డేటా ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ డిమాండ్‌ను సౌర,పవన విద్యుత్‌తో వందశాతం తీర్చగలుగుతున్నారు. దీంతో విద్యుదుత్పత్తిలో బొగ్గు, గ్యాస్ వాడకం స్వల్పంగా తగ్గింది.

అయితే, అంతర్జాతీయంగా ఈ పరిస్థితి మిశ్రమంగా ఉందని ఎంబర్ చెబుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రత్యేకించి చైనా, ఈ పునరుత్పాదక ఇంధనం విషయంలో ముందుంది.

సంపన్న దేశాలైన అమెరికా, యూరోపియన్ దేశాలు మాత్రం విద్యుత్ ఉత్పత్తిలో గతంలో కంటే ఎక్కువగా శిలాజ ఇంధనాలపై ఆధారపడుతున్నాయి.

భూతాపం పెరగడంలో బొగ్గు పాత్ర ఎక్కువగా ఉంది. 2024 వరకు ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పత్తి కోసం బొగ్గు వినియోగమే అగ్రస్థానంలో ఉన్న వనరు.

50 ఏళ్లుగా ఈ పరిస్థితి ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ చెబుతోంది.

చైనా, అమెరికా, భారత్, ప్రత్యాామ్నాయ ఇంధన వనరులు, విద్యుదుత్పత్తి, సోలార్ పవర్, విండ్ పవర్, బొగ్గు, సహజవాయువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా, యూరప్ దేశాల్లో విద్యుదుత్పత్తికి ఇప్పటికీ బొగ్గు ప్రధాన వనరుగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే పర్యావరణ హిత ఇంధన వనరులైన సౌర శక్తి, పవన విద్యుత్ ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాల కంటే ముందుంది.

చైనాలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడంతో పాటు విద్యుత్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడం వీలైంది. శిలాజ ఇంధనాల వాడకం 2శాతం తగ్గింది.

భారత్‌లో విద్యుత్ కోసం డిమాండ్‌ వృద్ధి తక్కువగా ఉంది. దీనికి అనుగుణంగా నూతన సౌర, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరిగింది.

భారత్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు, సహజవాయువు వాడకం తగ్గింది.

అయితే అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది.

అమెరికాలో పునరుత్పాదక ఇంధన శక్తి పెరిగిన దాని కంటే ఎక్కువగా విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోంది.

దీంతో అగ్రరాజ్యం అవసరమైనంత కరెంట్ కోసం శిలాజ ఇంధనంపై ఆధారపడాల్సి వస్తోంది.

యూరప్‌లో పవన, జల విద్యుదుత్పత్తి సామర్థ్యం బలహీనంగా ఉండటంతో బొగ్గు, సహజవాయువు వాడకం పెరుగుతోంది.

అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రత్యేకంగా విడుదల చేసిన నివేదిక, ఈ దశాబ్దంలో అమెరికాలో పునరుత్పాదక శక్తి వృద్ధిపై అంచనాలను సగానికి తగ్గించింది. అమెరికాలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ గతేడాది అంచనా వేసింది. ఇందులో ఎక్కువ భాగం సౌర, పవన శక్తి ఉంటుందని భావించింది.

అయితే దాన్ని ప్రస్తుతం 250 గిగావాట్లకు తగ్గించింది.

అంతర్జాతీయంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ట్రంప్ ప్రభుత్వ విధానాలు, అమెరికా- చైనా మధ్య ఘర్షణ వాతావరణం చూపిస్తున్న ప్రభావాన్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విశ్లేషణ ప్రతిబింభిస్తోంది.

చైనాలో పర్యావరణ హిత టెక్నాలజీ ఎగుమతులు పెరుగుతుంటే అమెరికా మాత్రం ప్రపంచ దేశాలు చమురు, సహజవాయు కొనుగోళ్లను పెంచే దిశగా ప్రోత్సహిస్తోంది.

చైనా, అమెరికా, భారత్, ప్రత్యాామ్నాయ ఇంధన వనరులు, విద్యుదుత్పత్తి, సోలార్ పవర్, విండ్ పవర్, బొగ్గు, సహజవాయువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో ఓ కొండ మీద ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు

కీలక మలుపు

ప్రాంతీయంగా ఎలాంటి విభేలున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి కీలకమైన మలుపు అని ఎంబర్ చెబుతోంది.

"పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా క్లీన్ పవర్ ఉత్పత్తి కూడా పెరగడం మార్పు ప్రారంభమైందని చెప్పడానికి సూచిక" అని ఎంబర్ సీనియర్ అనలిస్ట్ మల్‌గోర్జట వియోట్రోస్ మోట్యాకా చెప్పారు.

విద్యుత్ కోసం పెరిగిన డిమాండ్‌ను అందుకోవడంలో సోలార్ పవర్ వాటా 83శాతంగా ఉంది. గత మూడేళ్ల నుంచి వరుసగా ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ అతి పెద్ద ఇంధన వనరుగా మారింది.

సౌర విద్యుదుత్పత్తి అధికంగా (58శాతం) ప్రస్తుతం వెనుకబడిన దేశాల్లో జరుగుతోంది. కొన్నేళ్లుగా ఈ దేశాల్లో సోలార్ పవర్ జనరేషన్ భారీ స్థాయిలో జరుగుతోంది.

దీని వల్ల ఖర్చులు కూడా తగ్గాయి.

1975 నుంచి సౌర విద్యుత్ ధరలు ఆశ్చర్యకరంగా 99.9 శాతం తగ్గాయి. గ్రిడ్ల ద్వారా విద్యుత్ సరఫరా ఖరీదైన చోట, ఆధారపడేందుకు వీలు కాని చోట సోలార్ విద్యుత్ చాలా చౌకైనదని, ఏడాది లోపే ఒక దేశంలో డిమాండ్‌ను భర్తీ చేస్తుందని ఎంబర్ చెబుతోంది.

ఉదాహరణకు పాకిస్తాన్‌ను తీసుకుంటే, 2024లో 17 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్న సోలార్ ప్యానళ్లను ఆ దేశం దిగుమతి చేసుకుంది. ఇది అంతకు ముందు ఏడాది పోలిస్తే రెట్టింపు. అంతే కాక ఆ దేశ ప్రస్తుత విద్యుదుత్పత్తిలో మూడో వంతుకు సమానం.

చైనా, అమెరికా, భారత్, ప్రత్యాామ్నాయ ఇంధన వనరులు, విద్యుదుత్పత్తి, సోలార్ పవర్, విండ్ పవర్, బొగ్గు, సహజవాయువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికన్ దేశాల్లో సోలార్ ప్యానెళ్ల దిగుమతి ఏటేటా పెరుగుతోంది.

ఆఫ్రికాలోనూ సోలార్ బూమ్ కనిపిస్తోంది. సోలార్ ప్యానళ్ల దిగుమతులు ఏటా 60శాతం పెరుగుతున్నాయి. బొగ్గును అధికంగా ఉపయోగించే సౌతాఫ్రికా, సోలార్ విద్యుదుత్పత్తి విషయంలో ముందుంది. 1.7 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంతో నైజీరియా, ఈజిప్టు కంటే ముందుంది. నైజీరియా ఉత్పత్తి చేస్తున్న సౌర విద్యుత్ యూరప్‌లోని 18 లక్షల ఇళ్లకు అవసరమైన విద్యుత్‌తో సమానం.

కొన్ని చిన్న చిన్న ఆఫ్రికన్ దేశాలు సౌర విద్యుదుత్పత్తిలో మెరుగైన ప్రగతి సాధించాయి. అల్జీరియాలో సౌర ఫలకాల దిగుమతులు 33 రెట్లు, జాంబియాలో 8 రెట్లు, బోట్సువానాలో 7 రెట్లు పెరిగాయి.

అయితే మరి కొన్ని దేశాలలో సౌర విద్యుదుత్పత్తి వాడకం ఊహించని సమస్యలకు కారణం అవుతోంది.

అఫ్గానిస్తాన్‌లో సోలార్ పవర్‌తో నడిచే నీటి పంపులు విపరీతంగా నీటిని తోడేస్తూ ఉండటంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ సమస్య పెద్దది కావచ్చనే ఆందోళన పెరుగుతోంది.

రానున్న ఐదు నుంచి పదేళ్లలో కొన్ని ప్రాంతాల్లో నీరు పూర్తిగా అడుగంటి పోతుందని దీని వల్ల లక్షల మంది జీవితాలు ప్రభావితం అవుతాయని డాక్టర్ డేవిడ్ మన్స్‌ఫీల్డ్ అండ్ శాటిలైడ్ డేటా సంస్థ అల్సిస్ అధ్యయనం చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 'సన్ బెల్ట్' 'విండ్ బెల్ట్'లో ఉన్న దేశాలు వివిధ రకాలైన ఇంధన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బ్రిటన్‌కు చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్స్ కమిషన్ చైర్ పర్సన్ అడైర్ టర్నర్ చెప్పారు.

చైనా, అమెరికా, భారత్, ప్రత్యాామ్నాయ ఇంధన వనరులు, విద్యుదుత్పత్తి, సోలార్ పవర్, విండ్ పవర్, బొగ్గు, సహజవాయువు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెళ్ల తయారీలో చైనా వాటా 60శాతానికి పైనే

సన్‌బెల్ట్‌లో ఉన్న ఏషియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ దేశాలకు పగటిపూట ఎయిర్ కండిషనర్లు నడపడానికి అధిక మొత్తంలో విద్యుత్ అవసరం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు పగటి పూట విద్యుత్ నిల్వ చేసుకుని రాత్రి పూట ఉపయోగించుకోగల బ్యాటరీలను వాడటం ద్వారా ఈ దేశాలు తమ ఇంధన వ్యయాన్ని తక్షణం తగ్గించుకోగలవు.

విండ్ బెల్ట్‌లో ఉన్న బ్రిటన్ లాంటి దేశాలకు కఠినమైన అడ్డంకులు ఉన్నాయి. గత దశాబ్ధంలో సోలార్ ప్యానెళ్ల ధరలు మూడు రెట్లు తగ్గాయి. విండ్ టర్బైన్ల ధరలు అస్సలు తగ్గలేదు.

వడ్డీ రేట్లు పెరగడంతో రుణాలు తీసుకుని పవన విద్యుదుత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేయడం కొన్నేళ్లుగా భారంగా మారింది.

సరఫరా సమతుల్యత కూడా కష్టం. శీతాకాలంలో చలి గాలుల వల్ల విండ్ టర్బైన్లను నడపడం కష్టం. ఈ సమయంలో అవసరమైన విద్యుత్‌ను కేవలం బ్యాటరీల ద్వారా అందించడం వీలు కాని పని. దీంతో విండ్ పవర్ ఖరీదైన వ్యవహారంగా మారింది.

అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే, క్లీన్ టెక్ ఇండస్ట్రీస్ విషయంలో చైనా ఆధిపత్యం తిరుగులేనిదని ఎంబర్ తాజాగా విడుదల చేసిన డేటా చెబుతోంది.

2025 ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు లాంటి క్లీన్ టెక్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 26 శాతం, బ్యాటరీల వాటా 23శాతం. చైనాలో సోలార్ ప్యానెళ్ల ఎగుమతుల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల ఎగుమతుల విలువ రెండు రెట్ల కంటే కంటే ఎక్కువగా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)