'క్వాంటమ్ కంప్యూటింగ్'లో పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జినా రన్నార్డ్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్
క్వాంటమ్ మెకానిక్స్‌పై విప్లవాత్మకమైన పరిశోధనకుగానూ జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్.డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వారి పరిశోధనలు అత్యంత శక్తిమంతమైన న్యూ జనరేషన్ కంప్యూటర్లకు మార్గం సుగమం చేస్తున్నాయి.
''మొబైల్ ఫోన్లు, కెమెరాల నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వరకు నేడు మనం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో క్వాంటమ్ మెకానిక్స్ ఆధారం లేకుండా లేనిదేమీ లేదు'' అని నోబెల్ కమిటీ పేర్కొంది.
స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ప్రకటన చేసింది.
తనకు నోబెల్ బహుమతి ప్రకటించడంపై ప్రొఫెసర్ జాన్ క్లార్క్ స్పందిస్తూ, ''ఇది నా జీవితంలో ఒక పెద్ద ఆశ్చర్యం'' అని అన్నారు. యూకేలోని కేంబ్రిడ్జిలో జన్మించిన ఆయన, ప్రస్తుతం బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నారు.
ప్రొఫెసర్ మైఖేల్ హెచ్.డెవోరెట్ ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జన్మించారు. ప్రస్తుతం ఆయన యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.
జాన్ ఎం.మార్టినిస్ శాంటా బార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
నోబెల్ బహుమతి ద్వారా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు మొత్తం 11 మిలియన్ల క్రోనోర్ (సుమారు రూ.10.39 కోట్లు) అందుతుంది.
1980లలో ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు తమ వరుస ప్రయోగాలతో చేసిన విశేషమైన కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ ఆవిష్కరణ అత్యంత ఆశ్చర్యకరం...
''ఇది క్వాంటమ్ కంప్యూటర్ అభివృద్ధికి దారితీసే అంశం. చాలామంది క్వాంటమ్ కంప్యూటింగ్‌పై పనిచేస్తున్నారు. మా ఆవిష్కరణ అనేక విధాలుగా దీనికి మూలాధారం'' అని ప్రొఫెసర్ క్లార్క్ తన అభిప్రాయాన్ని న్యూస్ కాన్ఫరెన్స్‌కు ఫోన్ ద్వారా వినిపించారు.
టన్నెలింగ్ కేవలం సైద్ధాంతిక ప్రపంచంలోనే గాకుండా, వాస్తవ ప్రపంచం (రియల్ వరల్డ్)లోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లలో కూడా జరుగుతుందని వారి పరిశోధన ద్వారా నిరూపితమైంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి శాస్త్రవేత్తలు ఆధునిక క్వాంటమ్ చిప్‌లను రూపొందిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














