పాకిస్తాన్: గాజా విషయంలో ట్రంప్ ప్లాన్‌కు మద్దతిచ్చి ఇరుకున పడిందా?

ఇజ్రాయెల్, పాలస్తీనా, పాకిస్తాన్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

గాజాపై ట్రంప్ శాంతి ప్రణాళికకు మద్దతిస్తూ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం పాక్ ప్రజలకు రుచించడం లేదు.

పాకిస్తాన్ మాజీ రాయబారులు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడింది.

గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళిక, ముస్లిం దేశాలు ఇచ్చిన డాక్యుమెంట్‌ భిన్నంగా ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్ చెప్పారు.

"ముసాయిదాలో ఉన్న 20 పాయింట్లు, ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన 20 పాయింట్లు వేర్వేరుగా ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను" అని ఆయన అన్నారు.

అయితే ట్రంప్ తన 20 పాయింట్ల ప్రణాళికను వెల్లడించడానికి ముందే పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దానికి మద్దతు ప్రకటించారు. గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గాజా శాంతి ప్రణాళిక విషయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఫీల్డ్ మార్షల్‌ తనకు మద్దతు ప్రకటించారని సెప్టెంబర్ 30న డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

ట్రంప్ ప్రకటన చేయడానికి ముందే షాబాజ్ షరీఫ్, పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ వైట్‌హౌస్‌లో ఆయనతో సమావేశమయ్యారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, పాకిస్తాన్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో షాబాజ్ షరీఫ్ ట్రంప్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

పాకిస్తాన్‌లో వ్యతిరేకత

ట్రంప్ ప్రతిపాదిత గాజా శాంతి ప్రణాళికకు పాకిస్తాన్‌ మద్దతివ్వడం దీర్ఘకాలంగా ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరికి భిన్నంగా ఉందని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి చెప్పారు.

"పాకిస్తాన్‌లో ప్రజల స్పందన వ్యతిరేకంగా ఉంది" అని మలిహా లోధి జర్మన్ వార్తా సంస్థ డీడబ్ల్యూతో చెప్పారు.

‘‘ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అస్పష్టంగా ఉంది. అది అనేక రూపాల్లో ఇజ్రాయెల్‌కు మేలు చేసేలా ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమణను ఆపడంలో ఈ ప్రణాళికకు చిత్తశుద్ధి లేదు. అందుకే ఇక్కడి ప్రజలు, రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి" అని ఆమె చెప్పారు.

ట్రంప్ చెబుతున్న 20 పాయింట్లలో 15వ పాయింట్ ప్రకారం గాజా సంరక్షణతో పాటు అక్కడి పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్)‌ను మోహరించాలి.

పాకిస్తాన్, ఇజ్రాయెల్

ఇలాంటి పరిస్థితుల మధ్య పాకిస్తాన్‌లో ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా ఐఎస్ఎఫ్ కోసం తన సైన్యాన్ని పంపిస్తుందా? సైన్యాన్ని పంపించాలని కోరితే పాక్ ఏం చేస్తుంది? లాంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

"పాకిస్తాన్ ఇక్కడే అప్రమత్తంగా వ్యవహరించాలని అనుకుంటున్నాను. ప్రత్యేకించి సైన్యాన్ని పంపాలని కోరినప్పుడు" అని మలిహా లోధి చెప్పారు.

"హమాస్‌ ఆయుధాలను ధ్వంసం చేసే పని ఐఎస్ఎఫ్‌కు అప్పగించినా లేదా గాజాలో శాంతిభద్రతలను రక్షించే విషయంలో ఇజ్రాయెల్‌తో కలిసి పని చేయాలని చెప్పినా అది పాకిస్తాన్ ప్రజలకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఆమె వివరించారు.

"ఇంటర్నేషనల్ ‌స్టెబిలైజేషన్ ఫోర్స్ గురించి పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. నిరాయుధీకరణలో ఐఎస్ఎఫ్‌ పాత్ర ఉంటుందా? దాని పాత్ర ఏంటో స్పష్టం చేయాలి" అని పాకిస్తాన్‌ వార్తా పత్రిక డాన్‌లో మలిహా లోధి రాశారు.

"గాజా సరిహద్దుల్ని రక్షించేందుకు ఇజ్రాయెల్, ఈజిప్ట్‌తో కలిసి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఆర్మ్‌డ్‌ ఫోర్స్ పని చేస్తుందని ట్రంప్ ప్రణాళిక చెబుతోంది. ఐఎస్ఎఫ్‌లో చేరే ముందు పాకిస్తాన్ ఈ విషయాన్ని గుర్తించాలి. అంతే కాకుండా ఈ ప్రణాళికలోనే గాజాలోకి ఆయుధాలు రాకుండా అడ్డుకోవాలని ఉంది" అని ఆమె ఆ కథనంలో పేర్కొన్నారు.

జమాతే ఇస్లామీ హెచ్చరిక

ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను జమాతే ఇస్లామీ బహిరంగంగానే వ్యతిరేకించింది. ట్రంప్ ప్రకటన గాజాలో మళ్లీ వలస పాలన ఏర్పాటు చేసేలా ఉందని జమాతే ఇస్లామీకి చెందిన ఆమిర్ హఫీజ్ నయీముర్ రెహమాన్ చెప్పారు.

ఇజ్రాయెల్‌ను గుర్తించే విషయంలో పాకిస్తాన్ ఒక్క అడుగు ముందుకు వేసినా దాన్ని ప్రతి దశలోనూ వ్యతిరేకిస్తామని రెహమాన్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

"మొహమ్మద్ అలీ జిన్నా సిద్ధాంతం, 25 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే అది ఇజ్రాయెల్‌కు మద్దతుగా పాలస్తీనీయుల రక్తంతో బేరమాడినట్లుగా భావించాల్సి వస్తుంది" అని రెహమాన్ లాహోర్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

మరోవైపు జమాతే ఉలేమా-ఇ-ఇస్లాం(ఫజల్) నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ కూడా ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను వ్యతిరేకించారు.

దీని వల్ల పాలస్తీనాకు గుర్తింపు దక్కదని, జెరూసలేంకు విముక్తి లభించదని, ఇజ్రాయెల్ విస్తరణ మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, పాకిస్తాన్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ ప్రణాళికను మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీ కూడా వ్యతిరేకించింది.

దీని గురించి పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ సమాచార కార్యదర్శి షేక్ వఖాస్ అక్రమ్ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

"జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా, సిరియన్ గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ అంతర్భాగంగా గుర్తించడం ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, అంతర్జాతీయ విధానాలను ఉల్లంఘించడమే" అని ఆయన అందులో రాశారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, పాకిస్తాన్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా భారత్ సంబంధాలు క్షీణించాక, వాషింగ్టన్‌కు దగ్గరయ్యేందుకు పాక్ పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పాక్ పాలకులు ట్రంప్‌కు సాగిల పడ్డారా?

పాకిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వం ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పనులు చేస్తోంది. దీని వల్ల పాకిస్తాన్‌లో రాజకీయంగా అలజడి చెలరేగుతోంది.

గాజాలో ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సమకూరుస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించింది.

ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు షాబాజ్ షరీఫ్ లేదా పాకిస్తాన్ సైన్యం అన్ని రకాల హద్దుల్ని దాటేసిందని పాకిస్తాన్‌కు చెందిన రక్షణ రంగ విశ్లేషకురాలు అయేషా సిద్ధికా చెప్పారు.

"పాలస్తీనీయుల విషయంలో పాకిస్తానీయులు అరబ్ ముస్లింల కంటే దృఢంగా ఉన్నారు. పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వమైనా సరే, ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపినట్లు కనిపించినా సరే, అది అధికారంలో ఉండటం కష్టమే" అని ఆమె చెప్పారు.

ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు యూఏఈ, మొరాకో, సూడాన్, బహ్రెయిన్ అబ్రహం ఒప్పందాల ద్వారా ఇజ్రాయెల్‌ను గుర్తించేలా చేశారు. ఈజిప్ట్ 1979లో, జోర్డాన్ 1994లో ఇజ్రాయెల్‌ను గుర్తించాయి.

అయితే ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ దూకుడుగానే స్పందించేది. అక్కడున్న పార్టీలు, ప్రభుత్వాలు ఈ దూకుడును ఎన్నికల్లో వాడుకునేవి.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తర్వాత పాకిస్తాన్ ప్రాధాన్యత పెరిగిందని చెబుతున్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా, పాకిస్తాన్, అమెరికా, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2005 సెప్టెంబర్ 1న పాకిస్తాన్, ఇజ్రాయెల్ విదేశాంగమంత్రులు ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యారు.

ఇజ్రాయెల్ గురించి స్పష్టత లేదా?

ఇజ్రాయెల్- ఇరాన్ విషయంలో పాకిస్తాన్, ఇరాన్‌కు దూరంగా ఉండాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.

అయితే ఇరాన్ మాత్రం పాకిస్తాన్ తనతోనే ఉండాలని కోరుకుంటోంది.

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో పాకిస్తాన్ అమెరికా వైపు ఉంది. అది ఇరాన్‌కు మద్దతివ్వడం కష్టం కావచ్చు.

ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్‌కు ఎలాంటి వివాదాలు లేవు. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించేందుకు ఇస్లామాబాద్ ఇష్టపడటం లేదు. అరబ్ దేశాలతో మతపరంగా సన్నిహితమయ్యేందుకు ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను పాకిస్తాన్ పావులా వాడుకుంటోంది.

అయితే అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు దగ్గరవుతున్నాయి. అలాంటప్పుడు ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి పాకిస్తాన్‌కు సమస్య ఏంటి?

ఈ ప్రశ్నకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్ విషయంలో మొహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన విధానమే ఆమోదయోగ్యమని ఆయన 2020లోనే స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తే అమెరికాతో ఇస్లామాబాద్ సంబంధాలు మరింత బలపడతాయని అనేక మంది వాదిస్తున్నారు. అయితే సగటు పాకిస్తానీయులలో ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత వీధుల్లో ఎప్పుడూ బహిర్గతం అవుతూనే ఉంటుంది.

ఇజ్రాయెల్ పాలస్తీనా ఒక ఒప్పందానికి వస్తే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ గతంలో చెప్పారు.

2005లో నాటి పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖుర్షీద్ కసూరీ, ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి సిలన్వన్ షాలోమ్‌లు ఇస్తాంబుల్‌లో భేటీ అయ్యారు.

ఈ భేటీని తుర్కియే ప్రస్తుత్ అధ్యక్షుడు ఎర్దోవాన్ ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఈ భేటీపై పాకిస్తాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇజ్రాయెల్

"మా చర్చలు చాలా ముఖ్యమైనవి. పాకిస్తాన్‌తోనే కాదు, మొత్తం ముస్లిం ప్రపంచంతో సంబంధాల విషయంలో ఈ సమావేశం చాలా కీలకమైనది. మేము పాకిస్తాన్‌తో పాటు అరబ్ దేశాలతోనూ సత్సంబంధాలు కోరుకుంటున్నాం" అని ఖుర్షీద్ కసూరీతో సమావేశం తర్వాత సిల్వన్ షాలోమ్ చెప్పారు.

పాకిస్తానీలు చాలామంది ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూస్తున్నా ఇజ్రాయెల్‌లో అలాంటిదేమీ కనిపించదు.

2018లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భారత్‌లో పర్యటించారు.

ఈ పర్యటన సమయంలో ఆయన ఇజ్రాయెల్‌ పాకిస్తాన్‌కు శత్రువు కాదని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)