ఆంధ్రప్రదేశ్: పోలీసులకు నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కూడా ఉందా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారి ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇటీవల అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఎన్‌డీపీఎస్ చట్టం (NDPS act) కింద కేసులు బుక్ చేసి.. నిందితులు గంజాయి రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన భూములు, బంగారం, ఇళ్ళ సామాన్లు…ఇలా అన్ని ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకే వెళతాయనే హెచ్చరికను పంపుతున్నారు.

"నిందితులు గంజాయి, మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లినా.. గంజాయి వ్యాపారాన్ని వదలడం లేదు. ఇందుకు కారణం ఈ అక్రమ వ్యాపారంలో జైలుకు వెళ్లొచ్చినా… సులభంగా డబ్బు సంపాదించి ఆస్తులు కూడగట్టవచ్చనే దురాశే. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఎన్‌డీపీఎస్ చట్టాన్ని ప్రయోగిస్తోంది" అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు.
గంజాయి రవాణా ద్వారా కూడబెట్టిన ఆస్తులను ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985) ప్రకారం స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.
ఇంతకీ ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు పోలీసులకు ఉందా, ఇలాంటి హక్కు ఇతర నేరాల విషయంలోనూ ఉంటుందా? అసలింతకీ ఎన్‌డీపీఎస్ చట్టం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, UGC
'గంజాయి ఆస్తులు' సీజ్...
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో గంజాయి రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతున్న పోలీసులు సెప్టెంబరు 2025 నాటికి 128 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో 13 మంది ఆస్తులను సీజ్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ రేంజ్ డీఐజీ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం...
గంజాయి రవాణా నేరాలకు పాల్పడుతున్న వారి నుంచి అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఇప్పటివరకు రూ. 4.24 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌పై పలు పోలీసు స్టేషన్లలో గంజాయి రవాణా కేసులున్నాయి. ఎన్నిసార్లు అరెస్టయినా తీరు మార్చుకోలేదు. దీంతోగంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన రూ.34.85 లక్షల విలువైన 5.19 ఎకరాల భూమిని ఎన్‌డీపీఎస్ చట్టం కింద జప్తు చేశారు.
అలాగే అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన గొల్లవల్లి శ్రీను గంజాయి రవాణా ద్వారా సంపాదించిన రూ. 10.34 లక్షల విలువైన 2.25 ఎకరాల భూమిని జప్తు చేశారు.

ఫొటో సోర్స్, UGC
ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే...
నార్కోటిక్ డ్రగ్స్ అంటే శరీరాన్ని మత్తులోకి తీసుకెళ్లేవి, అలాగే సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (Psychotropic substances) అంటే... మనసు, ఆలోచనలు, భావోద్వేగాల మీద నేరుగా ప్రభావం చూపే మత్తు పదార్థాలని ఎన్‌డీపీఎస్ చట్టం చెబుతోంది.
గంజాయి, హెరాయిన్, అఫీమ్ లాంటివి నార్కోటిక్ డ్రగ్స్ కేటగిరిలోకి వస్తే... ఎల్ఎస్‌డీ (LSD), యాంఫెటమైన్స్ (Amphetamines), బార్బిటురేట్స్ (Barbiturates) లాంటివి సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కేటగిరిలోకి వస్తాయి.
ఈ చట్టం ముఖ్య ఉద్దేశం నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ వంటి పదార్థాల ఉత్పత్తి, విక్రయం, రవాణా, వాడకం, అక్రమ వ్యాపారం అన్నింటినీ కట్టడి చేయడం.
ఎవరైనా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి... ఆ వ్యక్తి గంజాయి లేదా మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాంచించిన సొమ్ముతో ఇళ్లు, భూములు, వాహనాలు, వస్తువులు కొన్నట్టు రుజువైతే...వాటిని ఎన్‌డీపీఎస్ చట్టం కింద స్వాధీనం చేసుకుంటారు.
ఇందు కోసం ప్రత్యేకంగా ఎన్‌డీపీఎస్ యాక్ట్‌కు అదనంగా మాదకద్రవ్యాలు, మానసిక వ్యసన పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం, 1988 (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988) ఉంది.
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కేవలం జైలు శిక్షపడటమే కాదు, వారి ఆస్తులను ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.

ఫొటో సోర్స్, UGC
ఆస్తులను ఎలా సీజ్ చేస్తారు?
- డ్రగ్స్ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో ఆస్తులు కొన్నట్లయితే...
- ఆ ఆస్తులు ఆ వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో ఉన్నప్పుడు...
- డ్రగ్స్ రవాణా, నిల్వ కోసం వాహనాలు, ఇళ్లు, గోదాములు ఉపయోగించినప్పుడు
- డ్రగ్స్ ఉత్పత్తి చేసే లాబొరేటరీలు, ఫ్యాక్టరీలు ఉన్నట్లయితే...
- డ్రగ్స్ అమ్మకాలు, రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులేనని పోలీసులు నిర్ధరించి...తాత్కలికంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటారు.
ఆ తర్వాత ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికారికి తెలియజేస్తారు . ఆ అధికారి డ్రగ్స్ ద్వారా సంపాదించిన సొమ్ములతోనే ఆ వ్యక్తి ఆస్తులు కొన్నారని కోర్టులో నిరూపిస్తే ఆ ఆస్తి శాశ్వతంగా ప్రభుత్వ స్వాధీనమైపోతుంది.
ఇలా సీజ్ చేసే అధికారం కేసును బట్టి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసు, కస్టమ్స్, సీబీఐ వంటి సంస్థలకు ఉంటుంది.
ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68ఏ-68జెడ్ (Chapter VA) సెక్షన్ల కింద ఈ ఆస్తుల స్వాధీనం చేసుకుంటారు. ఇవి
- 68A: ఎవరి ఆస్తులు సీజ్ చేయవచ్చో చెప్తుంది.
- 68B: "అక్రమంగా సంపాదించిన ఆస్తి" అంటే డ్రగ్స్ డబ్బుతో కొన్న ఆస్తులను నిర్వచిస్తుంది.
- 68C: అలాంటి ఆస్తులను ఫ్రీజ్/సీజ్ చేయవచ్చు.
- 68E, 68F: విచారణ అధికారికి సీజ్ చేసే అధికారం
- 68I: కోర్టులో ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికారి ఆ ఆస్తులను మాదక ద్రవ్యాల డబ్బుతో కొన్నారని నిరూపిస్తే ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది.
- 68K, 68L: ఆస్తులు తాత్కాలికంగా వాడరాదు, అమ్మరాదు అని స్టే ఇవ్వడం.
- 68Z: మాదక ద్రవ్యాల ద్వారా కొన్న ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వ స్వాధీనం
ఎన్‌డీపీఎస్ యాక్టే కాదు.. ఐటీ యాక్ట్, బినామీ యాక్ట్, మనీ లాండరింగ్, యూఏపీఏ వంటి చట్టాలలో కూడా నేరస్తుల ఆస్తులను సీజ్ చేస్తారు.
నేరం ద్వారా సంపాదించిన ఆస్తిని ప్రభుత్వ ఖజానానికి చేర్చడమే ఈ ఆస్తుల సీజ్ వెనుక ఉన్న ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ఒడిశా వ్యాపారుల పెట్టుబడితో...
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా నుంచి కొందరు వ్యాపారులు ఇంకా గంజాయి సాగును చేయిస్తున్నారని పోలీసులు బీబీసీతో చెప్పారు.
అందుకే ఒడిశా పోలీసులతో కలిసి వీరిని నియంత్రించేందుకు కార్యక్రమాలు రూపొందించామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ బీబీసీతో అన్నారు.
"కొందరు తెర వెనుక ఉండి డబ్బు పెట్టుబడిగా పెడుతూ.. గిరిజన యువకులకు డబ్బులు ఆశ చూసి గంజాయి రవాణాకు వాడుకుంటున్నారు. గంజాయి సాగు నుంచి ఇతర పంటల వైపు గిరిజన రైతులను మళ్లించేందుకు పోలీసులు చేపట్టిన 'పరివర్తన' కార్యక్రమం, మారుమూల ప్రాంతాలలోని గంజాయి తోటలను గుర్తించే డ్రోన్ల నిఘాతో ఇటు గిరిజన, అటు మైదాన ప్రాంతాలలో గంజాయి తోటలు, గంజాయి నిల్వలను గుర్తించి ధ్వంసం చేశాం. అలాగే గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాం" ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు.
"అయితే, ఇంకా కొందరు డబ్బు ఆశతో గంజాయి రవాణానే మార్గంగా ఎంచుకుంటున్నారు. అటువంటి వారిని హెచ్చరించినా పట్టించుకోకపోతే... ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాం" అని తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
అధికారులు ఏమన్నారంటే...
'' ఎన్‌డీపీఎస్ చట్టం కొత్తగా తీసుకు వచ్చిందేమీ కాదు. 1985 నుంచి అమల్లో ఉంది. అప్పటి నుంచి ఈ ఆస్తులను సీజ్ చేసే యాక్ట్ ఉంది'' అని పోలీసులు తెలిపారు.
"గంజాయి రవాణాలో సంపాదన ఎక్కువగా ఉండటంతో ఎన్నిసార్లు పట్టుబడినా మళ్లీ అదే పని చేస్తున్నారు. 2021-22లో 7,515 ఎకరాల్లో సాగు జరిగేది. అయితే, 2024-25లో ఇది 93 ఎకరాలకు కట్టడి చేయగలిగాం. రైతులకు అవగాహన కల్పించడం, ఎన్‌డీపీఎస్ చట్టం రింద కఠినమైన కేసులు నమోదు చేయడం, డ్రోన్, శాటిలైట్ సర్వే ద్వారా సాగును గుర్తించి, నాశనం చేయడంతోనే ఇది సాధ్యమైంది" అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.
"అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో టోల్‌గేట్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచాం. గంజాయి సాగు, వ్యాపారం వీడిన వారికి ప్రత్యామ్నాయ పనులు కల్పిస్తున్నాం. యువతకు ఉపాధి అవకాశమున్న వృత్తులలో శిక్షణ ఇస్తున్నాం. గంజాయి, మాదకద్రవ్యాల కేసుల్లో ఉన్న వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కఠినంగా అమలు చేస్తున్నాం" అని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు.

రైతులు ఏం చెబుతున్నారు?
అల్లూరి జిల్లాలో గంజాయి పండిస్తున్న చాలా గ్రామాల్లోని పరిస్థితిని బీబీసీ పలుమార్లు కథనాలు ప్రసారం చేసింది. పోలీసుల పరివర్తన కార్యక్రమం వరితో పాటు ఇతర పంటలు రైతులు పండించుకుంటూ...గంజాయి సాగుకు దూరంగా ఉంటున్నారనే వార్తలను చూపించింది.
బీబీసీ 2021లో గంజాయి పండిస్తున్న అల్లూరి జిల్లాలోని చింతపల్లి మండలం గాలిపాడు గ్రామానికి వెళ్లినప్పుడు.. ''గంజాయి సాగు ద్వారా లక్షకి ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుంటే మేమేందుకు సంపాదించకూడదు" అని అక్కడి గిరిజన రైతులు అన్నారు.
ఆ తర్వాత మూడేళ్లకు 2024లో అదే గ్రామానికి వెళ్లినప్పుడు.. ''గంజాయి కేసుల్లో చిక్కుకుంటే సంపాదించిందంతా కోర్టు ఖర్చులకే అయిపోతుంది. పైగా అప్పులు అయిపోవడంతో పాటు సమాజంలో పరువు పోతోంది. అందుకే గంజాయి సాగు చేయడం మానేశాం, వరి పండించుకుంటున్నాం. ఇదే బాగుంది" అని చెప్పారు.
గిరిజన రైతులు చెప్పినట్లు 2021లో గంజాయి పండిన గ్రామాలను మళ్లీ 2024లో చూసినప్పుడు... ఆ గ్రామాల్లో ఎక్కడా గంజాయి తోటలు కనిపించలేదు. అన్నీ వరి పొలాలే కనిపించాయి.

ఫొటో సోర్స్, Anitha Vangalapudi/facebook
‘గాంజా ఫ్రీ స్టేట్‌గా ఏపీ’
గంజాయికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలతో రానున్న రోజుల్లో ఏపీని గాంజా ఫ్రీ స్టేట్‌గా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
"ఏడాది కాలంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగాం. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కఠినంగా అమలు చేస్తున్నాం. గంజాయి కంటే వేరే పంటలు పండిస్తే అంతకు మించి డబ్బులొస్తాయని చెప్పి 40 లక్షల ప్రత్యామ్నాయ మొక్కలను పంపిణీ చేశాం. గతంలో వేలాది ఎకరాల్లో ఉండే గంజాయి తోటలను దాదాపు లేకుండా చేశాం" అని హోంమంత్రి అనిత చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














