దోహాలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు

దోహా

ఫొటో సోర్స్, Reuters

హమాస్ సీనియర్ నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసింది.

హమాస్ తరఫున చర్చల్లో భాగస్వాములైన సంప్రదింపుల బృందాన్ని ఈ దాడిలో లక్ష్యంగా చేసుకున్నారని హమాస్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

ఈ బృందం దోహాలో ఉంది. అయితే, ఈ ఏడాది జూలై నుంచి ఇజ్రాయెల్‌తో ఈ బృందం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపలేదు.

తాము కచ్చితమైన దాడులు చేశామని, 2023 అక్టోబరు 7 నాటి మారణహోమానికి ప్రత్యక్షంగా కారణమైనవారిని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది.

"హమాస్ అగ్ర నాయకులపై ఇవాళ తీసుకున్న చర్య పూర్తిగా ఇజ్రాయెల్‌ది. దీనిని ప్రారంభించింది, నిర్వహించింది ఇజ్రాయెల్. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహిస్తుంది" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలయింది.

‘‘ ఉగ్రవాదులకు ప్రపంచంలో ఎక్కడా రక్షణ వ్యవస్థ లేదని, ఎప్పటికీ ఉండబోదని ఇవాళ దోహాలో జరిగిన దాడి నిరూపిస్తుంది" అని ఇజ్రాయెల్ ఫార్ రైట్ నాయకుడు, ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోడ్రిచ్ అన్నారు. ఈ దాడిని సరైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

తీవ్రంగా స్పందించిన ఖతార్

ఇజ్రాయెల్ దాడిని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. హమాస్ రాజకీయనేతలుండే భవనాలపై ఇజ్రాయెల్ పిరికిపంద దాడి చేసిందని ఖతార్ ఆరోపించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దోహా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇజ్రాయెల్ సైన్యం ఏం చెప్పింది?

దాడి తర్వాత, ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, దాడులు ఎక్కడ జరిగాయో చెప్పలేదు.

‘‘ హమాస్ సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్, ఐఎస్ఏ ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఏళ్లుగా, హమాస్ సభ్యులు ఆ సంస్థ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. అక్టోబర్ 7 నాటి క్రూరమైన హత్యలకి వారిది ప్రత్యక్ష బాధ్యత. ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ప్రణాళిక వేసి అమలు చేస్తున్నారు" అని ఐడిఎఫ్ Xలో రాసింది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఎంతమంది చనిపోయారనేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ ఫోటోల్లో భవనాలు ధ్వంసమైనట్టుగా కనిపిస్తున్నాయి.

సాధారణ ప్రజలకు ఎక్కువ హానీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఆయుధాలు, నిఘా సమాచారం కూడా ఉందని ఇజ్రాయెల్ సైన్యం అదే పోస్టులో తెలిపింది.

‘‘అక్టోబర్ 7 నాటి మారణహోమానికి కారణమైన వారిని ఓడించడానికి ఐడీఎఫ్, ఐఎస్ఏ ఇదే స్థాయిలో పనిచేస్తాయి’’ అని చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)