గాజా ఒప్పందంలో 'తొలి దశ' ఏం చెబుతోంది, హమాస్ ఆయుధాలు విడిచిపెడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
తాను ప్రతిపాదించిన గాజా శాంతి ఒప్పందంలోని తొలి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు. ఇది యుద్ధం శాశ్వతంగా ముగిసే దిశగా పడిన ముందడుగు అని ఆయన తెలిపారు.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని సాయుధులు దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి సుమారు 1,200 మందిని చంపి, 251 మందిని బందీలుగా తీసుకెళ్లిన రెండేళ్ల రెండురోజుల తరువాత ఈ అంగీకారం కుదిరింది.
హమాస్ చేసిన దాడి గాజాలో దాడులకు ఇజ్రాయెల్ సైన్యాన్ని పురిగొల్పింది. ఫలితంగా 67,100 మందికి పైగా చనిపోయినట్లు ఆ ప్రాంతానికి చెందిన హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఈ నేపథ్యంలో శాంతి ఒప్పంద అంగీకారం గురించి మనకు ఏం తెలుసు, ఇంకా ఏ విషయాల్లో అస్పష్టత ఉంది?

ఏం ప్రకటించారు?
ఈజిప్ట్‌లో మూడు రోజుల పాటు తీవ్ర పరోక్ష చర్చలు జరిగిన తర్వాత, ఇజ్రాయెల్, హమాస్ ‘‘ శాంతి ఒప్పందం తొలి దశపై సంతకం చేశాయని ’’అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
''అంటే దీని అర్థం బందీలందరినీ అతి త్వరలోనే విడుదల చేస్తారు. ఇజ్రాయెల్ తన దళాలను అంగీకరించిన హద్దుల వరకు ఉపసంహరించుకుంటుంది. ఇది బలమైన, స్థిరమైన శాశ్వత శాంతివైపు వేసిన మొదటి అడుగు అవుతుంది" అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
అన్ని పార్టీలను తాము సమంగా చూస్తామని చెప్పారు.
గాజా శాంతి ఒప్పందం తొలి దశకు కుదిరిన ఒప్పందాన్ని "ఇజ్రాయెల్‌కు మహత్తరమైన రోజు"గా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు.
ఈ ఒప్పందాన్ని ఆమోదించడానికి, ఇజ్రాయెల్ బందీలను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి గురువారం తన ప్రభుత్వం సమావేశమవుతుందని ఆయన అన్నారు.
48 మంది బందీలు ఇంకా గాజాలో ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. వారిలో 20 మంది వరకు బతికే ఉండి ఉంటారని భావిస్తోంది.
ఈ ప్రకటనను ధ్రువీకరించిన హమాస్, "గాజాలో యుద్ధాన్ని ముగించడం", ''ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడం", '' మానవతా సహాయం ప్రవేశానికి అనుమతి'', ''ఇజ్రాయెల్ జైళ్లలో పాలస్తీనియన్ల కోసం బందీల మార్పిడి అమలు'' జరుగుతుందని తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్యవర్తులు నేరుగా ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ఈ చర్చలకు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియేకు చెందిన సీనియర్ అధికారులు మధ్యవర్తిత్వం వహించారు.

ఫొటో సోర్స్, Reuters
తర్వాత ఏం జరుగుతుంది?
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ ఒప్పందంపై గురువారం ఓటింగ్ నిర్వహించనుంది.
''మంత్రులు కనుక ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదిస్తే, అంగీకరించిన హద్దుల వరకు గాజా నుంచి తన దళాలను ఇజ్రాయెల్ కచ్చితంగా ఉపసంహరించుకోవాలి'' అని బీబీసీ యూఎస్ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌కు వైట్‌హౌస్ సీనియర్ అధికారులు చెప్పారు.
24 గంటల్లో ఈ ఉపసంహరణ జరగాల్సి ఉంటుందని తెలిపారు. దీని తరువాత 72 గంటల గడువు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో హమాస్ తన వద్ద సజీవంగా ఉన్న బందీలను విడుదల చేయాలని చెప్పారు. బందీల విడుదల సోమవారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మనకు తెలియని విషయాలు
ఇప్పటి వరకు ప్రకటించినవి ట్రంప్ గత వారం విడుదల చేసిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో కొంత భాగమే. ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ ఆమోదించగా.. హమాస్ కొన్నింటిన్నే అంగీకరించింది.
ఈ ప్రకటనల్లో ఇరు వర్గాలు ఒక పరిష్కారానికి రాని కొన్ని క్లిష్టమైన అంశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ట్రంప్ ప్రణాళికలో కీలక అంశం – హమాస్‌ను నిరాయుధీకరణ చేయడం. దీనిపై ఎలాంటి వివరాలు లేవు. హమాస్ గతంలో ఆయుధాలను విడిచిపెట్టడానికి తిరస్కరించింది. పాలస్తీనా దేశం ఏర్పాటైనప్పుడే తాము ఇలా చేస్తామని హమాస్ తెలిపింది.
గాజా భవిష్యత్తు పాలనకు సంబంధించిన అంశం కూడా కీలకం. ట్రంప్ శాంతి ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో హమాస్‌కు గాజా పాలనలో ఎటువంటి పాత్రా ఉండదు. పాలస్తీనా అథారిటీకి అధికారం అప్పగించడానికి ముందు గాజాను తాత్కాలికంగా రాజకీయ లక్ష్యాలు లేని టెక్నోక్రాట్స్‌తో కూడిన పాలస్తీనా కమిటీ పాలించాలని ట్రంప్ ప్రతిపాదించారు.
ట్రంప్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటికీ, గత వారం బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనా అథారిటీ ప్రమేయానికి ఒప్పుకున్నట్లు కనిపించలేదు.
గాజాలో యూదుల సెటిల్‌మెంట్లను పునర్ నిర్మించాలని కోరుకునే నెతనాహ్యు అధికారిక కూటమిలోని చాలామంది అతివాదులు దీన్ని నిరాకరించే అవకాశం ఉంది.
దీనికి స్పందించిన హమాస్, గాజా పాలనలో తమకు కొంత చోటు ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
గాజాలో బందీల విడుదలకు మార్పిడిగా ఇజ్రాయెల్ విడుదల చేసే పాలస్తీనా ఖైదీల తుది జాబితా ఇంకా హమాస్‌కు అందలేదని పాలస్తీనాకు చెందిన ఒకరు బీబీసీకి చెప్పారు.
20 సూత్రాల ప్రణాళికలో 250 మంది జీవిత ఖైదీలను, 2023 అక్టోబర్ 7 తర్వాత అదుపులోకి తీసుకున్న 1,700 మంది గాజా ఖైదీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఎవరేమన్నారు?
ఇజ్రాయెల్ బందీల బంధువులు ఈ ఒప్పందాన్ని స్వాగతించారు.
''మై చైల్డ్, నువ్వు ఇంటికి వచ్చేస్తున్నావు'' అని గాజాలో బందీగా ఉన్న నిర్మోద్ చోహెన్ తల్లి పోస్ట్ చేశారు.
ఈ ప్రకటన తర్వాత గాజాలో ఆనందోత్సవాలు మొదలయ్యాయి.
''ఈ కాల్పుల విరమణకు, రక్తపాతానికి, చావులకు ముగింపు పలికినందుకు దేవుడికి ధన్యవాదాలు'' అని ఖాన్ యూనిస్‌లోని అబ్దుల్ మజీద్ అబ్డ్ రబ్బో అనే వ్యక్తి అన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
''నేనొక్కడినే సంతోషంగా లేను. ఈ కాల్పుల విరమణ, రక్తపాతం ముగింపుతో గాజా స్ట్రిప్‌లోని వారందరూ, అరబ్ ప్రజలందరూ, ప్రపంచమంతా సంతోషంగా ఉంది'' అని తెలిపారు.
ఈ ఒప్పందానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు.
'' ఈ బాధలు కచ్చితంగా ముగిసిపోవాలి'' అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ఈ డీల్ పూర్తిగా అమలయ్యేందుకు, మానవతా సహాయాలను పెంచేందుకు, గాజాలో పునర్నిర్మాణ ప్రయత్నాలకు యూఎన్ మద్దతు ఇవ్వనుందని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ కూడా ఈ వార్తలను స్వాగతించారు. ''ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ముఖ్యంగా గత రెండేళ్లుగా భరించలేని బాధలను అనుభవిస్తోన్న బందీలకు, వారి కుటుంబాలకు, గాజాలోని పౌరులకు ఉపశమనం కలిగించే క్షణం'' అని అన్నారు.
ఈ ఒప్పందాన్ని శాంతి నెలకొల్పడానికి అత్యంత అవసరమైన చర్యగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ అభివర్ణించారు. ఈ ప్రణాళికలోని నియమ, నిబంధనలను గౌరవించాలని ఇరు పక్షాలను కోరారు.
అమెరికాలోని చట్టసభ్యులు మాత్రం చాలా జాగ్రత్తగా ఆశావాద కోణంలో మాట్లాడారు.
''ఇది తొలి అడుగు. దీనికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి. అప్పుడే ఈ యుద్ధం శాశ్వత ముగింపుకు దారితీస్తుంది'' అని డెమొక్రటిక్ సెనేటర్ క్రిస్ కూన్స్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇది స్వాగతించదగ్గ ఒప్పందమని సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్ రిపబ్లికన్ జేమ్స్ రిష్ చెప్పారు. ఈ ఒప్పంద వివరాలను తెలుసుకునేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు.
(రష్దీ అబులౌఫ్, లూసీ మాన్నింగ్ అందించిన సమాచారంతో)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














