గాజా: హమాస్ ఆధీనంలో ఉన్న 20మంది బందీల విడుదల

ఫొటో సోర్స్, Reuters
హమాస్ ఆధీనంలో ఉన్న 20మంది బందీలు విడుదలయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది.
మొదట ఏడుగురు బందీలను, తర్వాత 13మందిని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ(ఐసీఆర్‌సీ)కి హమాస్ అప్పగించిందని ఇజ్రాయెల్ తెలిపింది.
హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించిన ఏడుగురు బందీలు తొలుత ఇజ్రాయెల్ చేరుకున్నారు. కొందరు బందీల ఫోటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
రెండో దశలో విడుదలయిన 13మందిలో కొందరు బందీలు వీడియో కాల్‌లో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫోటోలు కనిపిస్తున్నాయి.
వారంతా రెండేళ్లగా హమాస్ దగ్గర బందీలుగా ఉన్నారు.


ఫొటో సోర్స్, IDF


అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. టెల్ అవీవ్ శివార్లలోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన పిడికిలి బిగించి నవ్వుతూ కనిపించారు.
ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు.
ఇజ్రాయెల్ బయలుదేరేముందు డోనల్డ్ ట్రంప్ ‘యుద్ధం ముగిసింది’ అని ప్రకటించారు.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేఖరులతో మాట్లాడిన ట్రంప్, కాల్పుల విరమణ కొనసాగుతుందని, గాజాకు త్వరలో శాంతి బోర్డు ఏర్పాటవుతుందని అన్నారు.

హోస్టేజ్ స్క్వేర్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలు
అంతకుముందు టెల్ అవీవ్‌లో ఈ ఉదయం నుంచే ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తమ వారి రాక కోసం బందీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఇజ్రాయెల్ ప్రజలు పెద్ద సంఖ్యలో హోస్టేజ్ స్క్వేర్ దగ్గరకు చేరుకున్నారు.
టెల్ అవీవ్‌లో ఉదయం ఐదుగంటల సమయానికే హోస్టేజ్ స్క్వేర్ దగ్గరకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
బందీల అప్పగింత ఒప్పందంలో భాగంగా 250మంది పాలస్తీనా ఖైదీలను, నిర్బంధంలో ఉన్న 1,700 మంది పాలస్తీనియులను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది.
బందీల కోసం జనం ఎదురుచూస్తున్న ఫోటోను ఓ యూజర్ పోస్టు చేశారు. బందీల కోసం స్క్వేర్ ఎదురుచూస్తోందని పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
హోస్టేజ్ స్క్వేర్ దగ్గర భారీ స్క్రీన్లు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. బందీల విడుదల కోరుతూ కొన్ని నెలలుగా అక్కడ కంటిన్యూగా ర్యాలీలు జరుగుతున్నాయి.
రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ(ఐసీఆర్‌సీ) బందీలను స్పెషల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్క్వాడ్‌కు అప్పగించింది.
ఆ స్క్వాడ్ వారిని దక్షిణ ఇజ్రాయెల్‌లోని మిలటరీ బేస్‌కు తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఈజిప్టులో కీలక చర్చలు
ఆదివారం ఉదయం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్‌వో)నేత హుస్సేన్ అల్ షేక్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యారు. గాజా భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ట్రంప్, బ్లెయిర్ ఇతర భాగస్వాములతో కలిసి గాజా కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పీఎల్‌వో తెలిపింది.
అయితే గాజా వ్యవహారాలను పర్యవేక్షించే బోర్డులో టోనీ బ్లెయిర్ ఉంటారా లేరా అనేదానిపై ఇంకా స్పష్టత లేదని ట్రంప్ అన్నారు.
ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరేముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
యుద్ధాలకు పరిష్కారం వెతకడానికి, శాంతిని నెలకొల్పడానికి తాను కృషి చేశానని ట్రంప్ అన్నారు.
ఇది తాను పరిష్కరించిన ఎనిమిదో యుద్ధం అని, నోబెల్ శాంతి బహుమతి కోసం తానిది చేయడం లేదని, ప్రజల జీవితాలను కాపాడేందుకు చేస్తున్నానని ట్రంప్ చెప్పారు.
ఈజిప్టులో ట్రంప్, ఇతర నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. గాజా శాంతి సదస్సు పేరుతో గాజా యుద్ధం ముగింపు లక్ష్యంగా సాగే ఈ చర్చల్లో పలువురు నేతలు పాల్గొంటారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్-సిసితో ట్రంప్ సమావేశం కానున్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్, జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్‌రిచ్ మెర్జ్, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఈ చర్చలకు హాజరు కానున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తాను కూడా సమావేశంలో పాల్గొంటానని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రాస్ తెలిపారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన కార్యాలయం తెలిపింది.
గాజాకు యూకే రూ. 216 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














