డ్యూరాండ్ రేఖ: బ్రిటిషర్లు గీసిన ఈ సరిహద్దు రేఖ గురించి పాకిస్తాన్, అఫ్గాన్ మధ్య వివాదమేంటి, తరచూ ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో శనివారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి.
ఈ ఘర్షణల్లో 23 మంది తమ సైనికులు చనిపోగా, 29 మందికి గాయాలయ్యాయని, 200 మందికిపైగా తాలిబాన్ మద్దతుదారులను చంపేశామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది.
అయితే, ఈ ఘర్షణల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడినట్లు తాలిబాన్లు చెబుతున్నారు. తమ సిబ్బంది 9 మంది చనిపోయారని, 20 మందికిపైగా గాయాలపాలయ్యారని కూడా చెప్పారు.
శనివారం రాత్రి బోర్డర్ వెంబడి అనేక చోట్ల తీవ్ర ఘర్షణలు జరిగాయని ఇరుదేశాల భద్రతాధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
అఫ్గాన్ అనూహ్యంగా చేసిన షెల్లింగ్‌కు పూర్తిస్థాయిలో బదులిచ్చినట్లు పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. బోర్డర్ వెంబడి ఆరుకంటే ఎక్కువ ప్రదేశాల్లో కాల్పులు జరిగినట్లు వారు వెల్లడించారు.

పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడులు, ఫిరంగి దాడులతో పాటు భూతల దాడులు నిర్వహించింది. తాలిబాన్ ఔట్‌పోస్టులు, క్యాంపులు, వాటి అనుబంధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
పాకిస్తాన్‌లోని 20 బోర్డర్ పోస్టులను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని, ఘర్షణల అనంతరం తిరిగి అప్పగించినట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.
అయితే, భారీస్థాయిలో ప్రతీకారదాడులు చేశామని, అనేక అఫ్గాన్ పోస్టులను ధ్వంసం చేసి వాటిని తాత్కాలికంగా ఆధీనంలోకి తీసుకున్నామని పాకిస్తాన్ భద్రతాధికారులు కూడా చెబుతున్నారు.
గతవారం కాబూల్‌లో జరిగిన భారీ పేలుళ్ల నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్ బోర్డర్ పోస్టులపై చేసిన దాడుల అనంతరం ఈ ఘర్షణలు జరిగాయి.
ఈ పేలుళ్లకు పాకిస్తాన్‌ను కారణంగా చెబుతూ, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆ దేశ ఆర్మీని హెచ్చరిస్తూ తాలిబాన్ రక్షణ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాబూల్‌లో బీబీసీకి చెప్పిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడులు జరిగాయి. అఫ్గానిస్తాన్ తూర్పున ఉన్న కునార్ ప్రావిన్స్, ఖోస్ట్, పక్తియా, దక్షిణ హెల్మండ్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.

ఫొటో సోర్స్, MOHSEN KARIMI/AFP via Getty
అఫ్గాన్ - పాకిస్తాన్ వివాదం
అఫ్గాన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్టు గ్రూపులను తక్షణమే నిర్మూలించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లను డిమాండ్ చేసింది.
ఇలాంటి దాడులు ఇంకా కొనసాగితే ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ తెలిపింది. అయితే, ఈ వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఐసిస్ సంస్థ అధిపతి పాకిస్తాన్‌లో ఉన్నారని, ఆ సంస్థ ఖైబర్ పంఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని తాలిబాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ బోర్డర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఖతార్ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలు, దౌత్య విధానాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించింది.
మొత్తంగా, ఈ ఘర్షణల్లో ఒకపేరు పదేపదే వినిపిస్తోంది. అదే డ్యూరాండ్ లైన్.
అసలేమిటీ డ్యూరాండ్ లైన్? దీని కారణంగా అఫ్గాన్, పాకిస్తాన్ మధ్య తరచూ ఉద్రిక్తతలు ఎందుకు తలెత్తుతున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డ్యూరాండ్ లైన్‌పై వివాదం
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ను వేరేచేసే సరిహద్దును డ్యూరాండ్ లైన్ అంటారు.
కాకపోతే, ఈ సరిహద్దు రేఖపై అఫ్గానిస్తాన్‌కు అభ్యంతరాలున్నాయి. ఈ రేఖను ఆ దేశం అంగీకరించదు. పాకిస్తాన్ దీనిని డ్యూరాండ్ లైన్ అని కాకుండా, అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. అదే పేరుతో పిలుస్తుంది. ఈ సరిహద్దుకు అంతర్జాతీయ గుర్తింపు ఉందనేది ఆ దేశపు వాదన.
1893లో బ్రిటిష్ ప్రభుత్వం, అప్పటి భారతదేశ వాయువ్య ప్రాంతాలపై పట్టు కోసం అఫ్గానిస్తాన్‌తో 2,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖను గీసింది.
అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరాండ్, అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. అయితే, అఫ్గానిస్తాన్ పాలకులెవరికీ డ్యూరాండ్ రేఖపై ఏకాభిప్రాయం లేదు. అఫ్గానీలు దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణించరు.
1923 నాటి రాజు అమానుల్లా నుంచి నేటి వరకు డ్యూరాండ్ లైన్‌పై ఇదే అభిప్రాయం ఉంది.
1947లో పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత కొంతమంది అఫ్గాన్ పాలకులు డ్యూరాండ్ లైన్ చట్టబద్ధతను ప్రశ్నించారు కూడా.
అయితే, దీనిపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరితో ఉంది. 2022లో మేజర్ జనరల్ ఇఫ్తికార్ మాట్లాడుతూ, "మేం దీనిని డ్యూరాండ్ రేఖ అని పిలవం. ఇది పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు. దీనిని ప్రపంచం గుర్తించింది" అని అన్నారు.
2021లో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న అనంతరం, 2022లో ఇరుదేశాల మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం మరోసారి చెలరేగింది.
దీనితోపాటు తాలిబాన్ ఫైటర్లు ఇరుదేశాల సరిహద్దులో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కంచెను చాలాచోట్ల తొలగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














