అఫ్గాన్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు, 50మంది పాకిస్తాన్ సైనికులు మరణించారన్న అఫ్గానిస్తాన్

భారీ కాల్పులు

ఫొటో సోర్స్, Elke Scholiers/Getty

పాకిస్తాన్, అప్గానిస్తాన్ సరిహద్దుల్లో శనివారం రాత్రి పొద్దుపోయాక కాల్పులు జరిగాయి. ఈ వారం కాబూల్‌లో జరిగిన భారీ పేలుళ్ల తరువాత, తాలిబాన్ దళాలు పాకిస్తాన్ పోస్టులపై దాడి చేసినప్పుడు ఈ కాల్పులు మొదలయ్యాయి.

పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా తీసుకున్న చర్యల్లో 50 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.

ఆదివారం కాబూల్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, 'ప్రతీకార చర్య'లో భాగంగా 20 పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, అయితే పోరాటం ముగిసిన తర్వాత తిరిగి అప్పగించామని చెప్పారు .

జబీహుల్లా ముజాహిద్ ప్రకటనపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ అఫ్గానిస్తాన్ చర్యకు సమర్థవంతమైన స్పందన ఇచ్చినట్లు హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ శనివారం రాత్రి పేర్కొన్నారు.

ఘర్షణల్లో తొమ్మిది మంది తాలిబాన్ సైనికులు మరణించారని, 20 మందికి పైగా గాయపడ్డారని అధికార ప్రతినిధి ధృవీకరించారు.

ఐసిస్ అధిపతి పాకిస్తాన్ లో ఉన్నారని, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో ఈ సంస్థ ఇప్పటికీ చురుకుగా ఉందని జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఐసిస్‌ను నిర్మూలించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఐసిస్ శిక్షణా కేంద్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన ఏ దేశానికి వ్యతిరేకం కాదని, దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండకూడదని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అఫ్గానిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఇటీవల సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాలపై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు తాలిబాన్ల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

పాకిస్తాన్‌లోని సైనిక వర్గాలు ఈ ఆపరేషన్ ను ధృవీకరించాయని బీబీసీ ఉర్దూ తెలిపింది. అలాగే అఫ్గానిస్తాన్ దాడులకు గట్టిగా స్పందించినట్టు, అనేక పోస్టులను ధ్వంసం చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించిందని, కాబూల్ సహా రెండు ప్రదేశాలలో వైమానిక దాడులకు పాల్పడిందని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆరోపించింది.

దీనివల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లయితే, పర్యవసానాలకు పాకిస్తాన్ సైన్యమే బాధ్యత వహించాల్సి వస్తుందని తాలిబాన్ల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అఫ్గానిస్తాన్ బోర్డర్‌లో కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్ తూర్పు కునార్ ప్రావిన్స్‌లోని డ్యూరాండ్ లైన్ వెంబడి, పక్టియా, దక్షిణ హెల్మండ్ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై శనివారం రాత్రి దాడులు జరిగాయని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాబూల్ లోని బీబీసీకి తెలిపింది.

తాలిబాన్ దళాలు తేలిక నుంచి భారీ ఆయుధాలతో దాడి చేశాయని, ఇది ఇరుపక్షాల మధ్య తీవ్రమైన పోరాటానికి దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి చెప్పారు.

అఫ్గానిస్తాన్ నుంచి జరిగిన దాడులను పాకిస్తాన్ సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి. బలూచిస్థాన్ లోని అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రల్, బారామ్ చాహ్ వంటి ప్రదేశాలపై ఎలాంటి కవ్వింపులు లేకపోయినా తాలిబాన్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపాయి.

సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ లోని కుర్రం జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారి బీబీసీ ఉర్దూ ప్రతినిధి అజీజుల్లా ఖాన్ తో మాట్లాడుతూ, ఇరువైపులా భారీ ఆయుధాలతో కాల్పులు జరుగుతున్నాయని, ఇప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)