కొన్ని మృతదేహాలు ఖననం తరువాత చాలాకాలం పాడవకుండా అలాగే ఉంటాయి ఎందుకు?

మృతదేహం, కుళ్లిపోవడం, మతం, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆర్చి అతంద్రిలా
    • హోదా, బీబీసీ న్యూస్ బంగ్లా

ఎవరైనా మరణించినప్పుడు ఒక్కోసారి వెంటనే అంత్యక్రియలు నిర్వహించలేకపోవచ్చు.. అలాంటి సందర్భాల్లో మృతదేహం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

గతంలో, వేసవికాలంలో ఎవరైనా చనిపోయినప్పుడు మృతదేహాన్ని గోనెపట్టాలతో కప్పేవారు. ఇప్పుడు మృతదేహాలను పాడవకుండా చల్లగా ఉంచేందుకు ఫ్రీజర్ బాక్స్‌లలో ఉంచుతున్నారు.

మృతదేహాలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచుతారు, అందువల్ల శరీరం కుళ్లిపోకుండా ఉంటుంది.

చనిపోయిన తర్వాత సైన్స్ ప్రకారం శరీరంలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. శరీరం కుళ్లిపోవడానికి ఇదే ప్రధాన కారణం. సాధారణంగా మరణించిన 12 గంటల తర్వాత నుంచి శరీరం పాడవడం మొదలవుతుంది.

అయితే చాలా సందర్భాల్లో స్మశానవాటికలో పాతిపెట్టినప్పటికీ, మృతదేహాలు చాలాకాలం కుళ్లిపోకుండా ఉంటాయి.

పాత సమాధులను తవ్వుతున్నప్పుడు, అలాంటి మృతదేహాలు సంవత్సరాల తర్వాత కూడా దాదాపు అలాగే ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో మృతదేహాలు సహజంగా పాడవకపోవడానికి అనేక కారణాలుంటాయి.

దీనికి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా రెండు కారణాలను చెబుతున్నారు. వీటిలో ఒకటి మమ్మిఫికేషన్. ఇంకొకటి ఎడిపోసీర్.. అంటే మృతదేహం చుట్టూ మైనం లాంటి పొర ఏర్పడటం. శరీరాన్ని కుళ్లిపోకుండా చేస్తుంది ఈ పొర.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మృతదేహం, కుళ్లిపోవడం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎడారి ప్రాంతాల్లో చాలా మృతదేహాలు పాడవకుండా ఉంటాయి.

గాలి పొడిగా, తేమ చాలా తక్కువగా, ఉష్ణోగ్రత వేడిగా ఉండే వాతావరణంలో మృతదేహాన్ని ఉంచినప్పుడు, శరీరంలోని నీరు త్వరగా ఎండిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు శరీరంలో బ్యాక్టీరియా పెరగదు. మృతదేహం అదే స్థితిలో ఉండిపోతుంది.

ఈ ప్రక్రియను మమ్మిఫికేషన్ అంటారని సర్ సలీమ్ ఉల్లాహ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ నజ్మున్ నాహర్ రోజీ చెప్పారు.

ఈ ప్రక్రియ ఉద్దేశం మృతదేహాన్ని సంరక్షించడం. ఈ పద్ధతిలో ఎడారి ప్రాంతాల్లోని చాలా మృతదేహాలు మమ్మీలుగా మారి చాలా సంవత్సరాలు అదే స్థితిలో ఉంటాయి.

పొడి ఇసుక నేల ఉన్న ప్రాంతాలలో కూడా ఇలాంటి సహజ ప్రక్రియల ద్వారా మృతదేహాలను మమ్మిఫై చేయడం సాధ్యమవుతుంది.

అయితే, బంగ్లాదేశ్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం గాలి, నేలలో అధిక తేమ కారణంగా ఇలా జరగదు.

మృతదేహం, కుళ్లిపోవడం, మతం, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మృతదేహం పాడవడంపై వాతావరణ మార్పుల ప్రభావం చాలా ఉంటుంది.

మైనం లాంటి కవచం

ఎడిపోజెనిక్ లేదా ఎడిపోస్ టిష్యూ అనేది ప్రాథమికంగా ఒక ప్రత్యేక రకమైన సబ్బును పోలి ఉండే మైనపు పదార్థం. ఇది శరీరంలోని కొవ్వును తొలగించడానికి బదులుగా దానిని సంరక్షించడానికి ఉపయోగపడుతుంది.

ఎడిపోసైట్‌ల నిర్మాణం, క్షీణత రెండూ పర్యావరణంపై ఆధారపడి ఉంటాయని అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన తెలిపింది.

ఒకసారి అడపసోరియం ఏర్పడితే, అది వందల సంవత్సరాలు ఉండిపోతుంది.

''ఎడిపోసీర్ ఏర్పడటం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణ ఉష్ణోగ్రత, వాతావరణం, ఆహారపు అలవాట్లు, మృతదేహాన్ని ఎలా ఖననం చేశారు, చనిపోయిన వ్యక్తి శారీరక స్థితి వంటివి'' అని నాహర్ రోజీ చెప్పారు.

"తేమతో కూడిన వాతావరణంలో లేదా తడి ప్రదేశాలలో మృతదేహాలు తెల్లగా కనిపిస్తాయి. వాటిని చూస్తే, వాటిపై కొంత పూత పూసినట్టే అనిపిస్తుంది. నీటితో రసాయన ప్రక్రియ కారణంగా శరీరంలోని కొవ్వు భాగం మృతదేహం చుట్టూ జిడ్డుగల మైనం లాంటి కవచాన్ని ఏర్పరుస్తుంది" అని డాక్టర్ నాహర్ రోజీ బీబీసీతో చెప్పారు.

''ఈ రకమైనది తయారైతే, ఆ మృతదేహం చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. కుళ్లిపోదు'' అని ఆమె తెలిపారు.

అలాంటి మృతదేహాన్ని అనేక దశాబ్దాల పాటు భద్రపరచవచ్చని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన మరో పరిశోధనలో తేలింది.

మృతదేహం, కుళ్లిపోవడం, మతం, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

‘భారత్ లాంటి వాతావరణంలో మృతదేహం తొందరగా పాడవుతుంది.. అయినప్పటికీ’

ఎడిపోసీర్‌కు సంబంధించిన మరో మూడు అంశాలను ఇందులో ప్రస్తావించారు.

  • మొదటిది హైడ్రాక్సీ కొవ్వు ఆమ్లాలు ఏర్పడటం
  • రెండోది మృతదేహాన్ని ఉంచిన వాతావరణంలో నీటి శాతం ఎక్కువగా ఉండడం
  • మూడోది ఆక్సిజన్ లేకపోవడం

మృతదేహాలను లోతుగా పూడ్చిపెట్టినప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి పాడవకుండా ఉండడానికి ఇవే కారణమని నిపుణులు అంటున్నారు.

శరీరంలో వివిధ లోహాలు, ఆర్సెనిక్ వంటివి ఉండటం వల్ల శరీరం కుళ్లిపోయే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందని డాక్టర్ రోజీ చెప్పారు.

ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో మాజీ ఫోరెన్సిక్ నిపుణులు అయిన డాక్టర్ కబీర్ సోహెల్, ఎడిపోసిస్ ప్రక్రియను భిన్నంగా వివరిస్తున్నారు.

"శరీరంలో కొవ్వు గట్టిపడటం వల్ల, కుళ్లిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మక్రిములు ప్రభావం చూపలేకపోతాయి. ఇలాంటప్పుడు శరీర నిర్మాణం చాలాకాలం పాటు అలాగే ఉంటుంది. ముఖం కూడా అలాగే ఉంటుంది. మృతదేహాన్ని చాలా కాలం క్రితం ఖననం చేశారని చెబుతారు గానీ అది ఇప్పటికీ మునుపటి స్థితిలోనే ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఢాకా విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ మిజానూర్ రెహమాన్ కూడా శరీరంలో కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటే, ఇలా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

స్మశాన వాటిక వద్ద గాలి ఉంటే లేదా మొక్కలు సులభంగా పెరగని బీడు భూమి ఉంటే లేదా నేల ఇసుకతో ఉంటే, కొన్ని సందర్భాల్లో శరీరం కుళ్లిపోయే ప్రక్రియ నెమ్మదిగా ఉండవచ్చని ఆయన అన్నారు.

"బంగ్లాదేశ్ లాంటి వాతావరణంలో, ఆరు నుంచి పన్నెండు రోజుల్లో శరీరం చర్మం వదులుగా మారి రాలిపోవడం కనిపిస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు" అని రెహమాన్ అన్నారు.

బంగ్లాదేశ్ విషయానికొస్తే, శీతాకాలంలో పొడి వాతావరణం కొవ్వు కణజాలం కుళ్లిపోవడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించవచ్చు. అయితే, భారత ఉపఖండంలోని వాతావరణం సాధారణంగా వేగంగా కుళ్లిపోవడానికి అనుకూలంగా ఉంటుంది.

మృతదేహం, కుళ్లిపోవడం, మతం, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

రసాయన ప్రభావాలు

కొన్ని సందర్భాల్లో మృతదేహాలను భద్రపరచాల్సి ఉంటుందని, ఫార్మాలిన్ వంటి వివిధ రసాయనాలను దీని కోసం ఉపయోగిస్తారని డాక్టర్ సోహైల్ వివరించారు.

అలాంటి రసాయనాలతో పూత పూసిన శరీరాలను చాలా కాలం పాటు భద్రపరచవచ్చు.

విదేశాలలో మరణిస్తే మృతదేహాన్ని స్వదేశానికి తిరిగి పంపాల్సివచ్చినప్పుడో మరేదైనా కారణం చేతనో దానిని భద్రపరచాల్సిన అవసరం ఉంటే, అలాంటి సందర్భంలో ఎంబామింగ్ చేస్తారని డాక్టర్ సొహైల్ చెప్పారు.

ఫార్మల్డిహైడ్, మిథనాల్, కొన్ని ఇతర రసాయనాలు ఇందుకోసం ఉపయోగిస్తారు.

ఖననం చేసిన తర్వాత కూడా, రసాయనాల కారణంగా మృతదేహాలు చాలా కాలం పాటు అదే స్థితిలో ఉంటాయి.

ఇది కాకుండా, నేలలో కొన్ని రసాయనాలు ఉండటం వల్ల కూడా ఇది జరగొచ్చు.

లోహాలు లేదా ఖనిజాలు, ఆమ్లత్వం వంటి నేల రసాయన లక్షణాలు, కుళ్లిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించడం వల్ల మృతదేహం పాడవడం అంత తొందరగా జరగదని జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌లోని ఒక వ్యాసం చెబుతోంది.

కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు కూడా మృతదేహాలపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, హిమాలయాలలో మరణించే వ్యక్తుల మృతదేహాలు చాలా రోజులపాటు పాడవ్వవు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)