హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌: నలుగురు నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్‌.. మార్చురీలోనే మృతదేహాలు - ప్రెస్ రివ్యూ

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులు

దిశ హత్య, అత్యాచారం కేసులో.. హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు నిందితుల మృతదేహాలను తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు గాంధీ మార్చురీలోనే భద్రపరచాలనే హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి మార్చురీ వైద్యులు తగిన జాగ్రత్తలు చేపట్టారని 'సాక్షి' ఓ కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. నలుగురు నిందితుల మృతదేహాలు పాడైపోకుండా ఎంబామింగ్‌ (రసాయనపూత) చేసి ప్రత్యేక ఫ్రీజర్‌ బాక్సుల్లో భద్రపరిచారు. మనిషి మరణించిన 24 గంటల తర్వాత పలు రకాల వైరస్, బాక్టీరియాలు చేరడంతో మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుందని.. అలా జరగకుండా మృతదేహాలను భద్రపరిచే విధానం పూర్వకాలం నుంచే అవలంబిస్తున్నారని పలువురు వైద్యనిపుణులు చెప్తున్నారు.

మృతదేహాలకు ఎంబామింగ్‌ ప్రక్రియలో భాగంగా.. రక్తనాళాల ద్వారా సుమారు రెండు గ్యాలన్ల ఫార్మల్‌ డీహైడ్‌ అనే ద్రావకాన్ని ఎక్కిస్తారు. రక్తనాళాల్లోకి ద్రావకం పంపించేందుకు ప్రత్యేక వైద్యయంత్రాన్ని వినియోగిస్తారు.

ఒకసారి ఎంబామింగ్‌ చేస్తే రెండు వారాల పాటు మృతదేహాలు పాడైపోకుండా ఉంటాయని సంబంధిత వైద్యులు తెలిపారు. ఎంబామింగ్‌ చేయకుండా ఫ్రీజర్‌బాక్స్‌లో పెడితే శీతలానికి గడ్డకట్టుకుపోతాయి తప్పితే తాజాగా ఉండవని వివరించారు.

మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి నివేదికలు అందించినప్పటికీ కోర్టు ఆదేశిస్తే మరోమారు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలుగా మృతదేహాలు తాజాగా ఉండేందుకు ఎంబామింగ్‌ ప్రక్రియ చేపట్టి ఫ్రీజర్‌ బాక్సుల్లో భధ్రపరిచినట్లు సంబంధిత వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, సుమారు 40 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టి మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నారు.

ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య బాధితురాలు

'అత్యాచారం గురించి చెప్పేస్తుందేమోనని.. చంపేశారు': సమత కేసులో అభియోగపత్రం

ఆసిఫాబాద్‌లో 'సమత' మీద అత్యాచారం చేసిన తర్వాత బాధితురాలిని వదిలేస్తే పోలీసులకు పట్టిస్తుందేమో? కేసు అవుతుందేమో? అనే అనుమానంతో నిందితులు ఆమెను దారుణంగా హత్య చేసినట్లు ఆసిఫాబాద్ పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నట్లు 'ఈనాడు' ఓ కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో గత నెల 24న సమత మీద ముగ్గురు నిందితులు అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో పోలీసులు శనివారం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.

బాధితురాలి మీద అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులూ.. ఆ తర్వాత ఆమె తమ విషయం బయటకు చెబుతుందేమోనని అనుమానించారు. ఒక వేళ అదే జరిగితే క్రిమినల్ కేసు అవుతుందని భావించిన వారు ఆమెను హతమార్చటం ఒక్కటే పరిష్కారమనే నిర్ణయానికి వచ్చారు.

వెంటనే నిందితుల్లో ఒకరు వెంట తెచ్చుకున్న 29 సెంటీమీటర్లకు పైగా పొడవున్న కత్తితో ఆమె మీద దాడి చేశారు. తల మీద దాడి చేయటంతో పాటు గొంతు కోయటంతో తీవ్ర రక్తస్రావం కావటంతో సమత అక్కడికక్కడే చనిపోయారు.

అనంతరం ఆమె దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు.. రూ. 200 కూడా తీసుకుని పారిపోయారు. ఈ కేసులో మూడు రోజుల అనంతరం నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు 96 పేజీల నివేదికను సమర్పించారు. మొత్తం 44 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయటంతో పాటు ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికల్ని పొందుపరిచారు.

నిందితులు ముగ్గురు నేరం చేసినపుడు ధరించిన దుస్తులు, వాడిన ఆయుధం, మృతురాలి సెల్‌ఫోన్, రూ. 200 నగదును న్యాయస్థానానికి సమర్పించారు.

లైంగిక హింస

ఆయేషా మీరా ఖనన దేహానికి సీబీఐ రీపోస్టుమార్టం

ఆయేషామీరా ఖనన దేహానికి సీబీఐ అధికారులు రీ పోస్టుమార్టం నిర్వహించారని.. శనివారం ఉదయం మొదలైన ఈ ప్రక్రియ సుమారు పది గంటలపాటు కొనసాగిందని.. 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. సీబీఐ అధికారులు ఆయేషా తండ్రి, మతపెద్దల సమక్షంలో.. ప్రతి అంశాన్నీ వీడియోలో చిత్రీకరిస్తూ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు. ఇందు కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యులు, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు, తమిళనాడు, కేరళ నుంచి డీఎన్‌ఏ నిపుణులు గుంటూరు జిల్లా తెనాలికి వచ్చారు. సీబీఐ ఎస్పీ విమలాదిత్య ఆధ్వర్యంలో చెన్నై, విశాఖ, హైదరాబాద్‌ నుంచి సీబీఐ సిబ్బంది శనివారం తెల్లవారుజామున తెనాలి చేరుకున్నారు.

ఆయేషా తలపై తగిలిన గాయాన్ని నిర్ధారించుకునే కీలక అంశాన్ని నివృత్తి చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. సమాధి నుంచి ఆయేషా ఎముక భాగాలు కొన్ని, వెంట్రుకలు, మూడు భాగాలుగా విడిపోయిన పుర్రెతోపాటు, అవసరమవుతుందనుకున్న మరికొన్ని భాగాలను జాగ్రత్తగా ప్యాక్‌ చేసుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ కేసులో ఇవే కీలకం కానున్నాయని ఆయేషా తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు.

అయేషా కేసులో అప్పట్లో పోలీసులు కోర్టుకు అందించిన ఆయేషా డీఎన్‌ఏ రిపోర్టుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేశారు. కేసు విచారణ జరిపిన పోలీసులు.. ఆయేషా నుదురు భాగంలో బలంగా కొట్టడం వల్లే చనిపోయిందని, రెండు ఆయుధాలను ఉపయోగించరనే వివరాలను పేర్కొన్నా, ఆయేషా తల్లి షంషద్‌ బేగం అప్పుడే అనుమానాలు వ్యక్తంచేశారు.

కుమార్తె మరణ వార్త తెలుసుకున్న ఆమె హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో గోడపై రక్తపు మరకలున్నాయని, తలను గోడకు కొట్టటం వల్ల చనిపోయిందని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికితోడు ఆయుధాలు కూడా ఉపయోగించారని, వీటికి సంబంధించిన ఆధారాలన్నీ అప్పుడే మాయం చేసేందుకు ప్రయత్నించారని, తాను చూసిన గంట తర్వాత వాటిని కడిగేశారని ఆరోపిస్తూ వచ్చారు.

ఆమె సీబీఐ అధికారులకూ ఇదే వివరించారు. మహిళా కోర్టులో విచారణ జరిపిన అనంతరం, ఈ కేసుకు సంబంధించిన రికార్డులు మొత్తం ధ్వంసం చేయటం, ఆధారాలు సీబీఐకి లభించే పరిస్థితి లేకపోవటంతో వారు ఇప్పుడు.. 'పుర్రెపై దెబ్బ' అంశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. కేవలం తలపైనే కాకుండా మెడ భాగంలోనూ దెబ్బలు ఉన్నాయని ఫొటోల్లో కనిపించినా, ఎఫ్‌ఐఆర్‌లో చూపలేదని ఆయేషా తరపు న్యాయవాది శ్రీనివాస్‌ గతంలోనే వాదిస్తూ వచ్చారు.

ముస్లింల ఆనవాయితీ ప్రకారం ఒకసారి ఖననం చేసిన దేహాన్ని తవ్వటం నిషిద్ధమైనప్పటికీ, ఈ కేసులో దోషులను గుర్తించేందుకు సహకరిస్తామని చెప్పిన ఆయేషా తల్లిదండ్రులు సంషద్‌బేగం, ఇక్బాల్‌ బాషా రీపోస్టుమార్టంకు అంగీకరించారు.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

పౌరసత్వ చట్టంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్

మూడు ముస్లిం దేశాల నుండి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారని ‘ఆంధ్రభూమి’ ఒక కథనంలో తెలిపింది.

అలాగే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మోయిత్రితో పాటు పలువురు శనివారం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేశారు.

మూడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పిస్తూ రాజ్యాంగంలో సవరణలు చేయడం ఆర్టికల్ 14, 21కి విరుద్దమని ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు చేసిన వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దీనిని కొట్టివేయాలని పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును కోరారు.

కేంద్ర ప్రభుత్వం 1985లో కుదుర్చుకున్న అస్సాం ఒప్పందం, పౌరసత్వ చట్టం 1955లోని 6ఏ సెక్షన్‌కు కొత్త చట్టం విరుద్దమని ఆసు (ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) తమ పిటిషన్‌లో వాదించింది.

ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని జైరాం రమేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)